సభలు సరే, సందేశం ఏమిటి? | what's the message of World Telugu Conference ? | Sakshi
Sakshi News home page

సభలు సరే, సందేశం ఏమిటి?

Published Sun, Dec 17 2017 12:56 AM | Last Updated on Sun, Dec 17 2017 12:56 AM

what's the message of World Telugu Conference ? - Sakshi

త్రికాలమ్‌
ప్రభుత్వం సంకల్పిస్తే అసాధ్యం ఏముంటుంది? ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) అభీష్టం మేరకు ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ప్రారంభమైనాయి. అద్భుతమైన ప్రసంగాలతో, ఆకట్టుకునే లేజర్‌షోతో వీనుల విందుగా, కన్నుల పండువగా శుక్రవారం సాయంత్రం తెలుగు భాషాభిమానులు మురిసిపోయారు. హైదరాబాద్‌ నగరంలో తెలుగు జయకేతనం ఎగురవేశారు.

తెలుగు భాష స్వతంత్ర భారత స్వరూప స్వభావాలను నిర్దేశించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు తెలుగువారికి సొంత రాష్ట్రం లేదు. మద్రాసు రాష్ట్రం లోనే తమిళులూ, కన్నడిగులూ, మలయాళీలతో సహజీవనం చేసేవారు. మరి కొందరు నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థానంలో కన్నడిగులూ, మరాఠీలూ, తమిళులతో, ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిన వివిధ భాషలవారితో కలసి నివసించేవారు. మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్రులు తమిళుల ఆధిపత్యాన్ని ధిక్కరించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేశారు. భాషే ఈ ఉద్యమంలో ఆయుధం. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం తర్వాత మద్రాసు లేని తెలుగు ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంగా అవతరించింది. హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకు సారథ్యం వహించింది ఆంధ్రమహాసభ. ఈ పోరాటంలో సైతం భాషే ఆయుధం. ఉర్దూ ఆధిక్యాన్ని ధిక్కరించి ఉద్యమించిన తెలుగువారు నిజాం పాలన నుంచి విమోచన సాధించారు. ఆంధ్ర, హైదరాబాద్‌ రాష్ట్రాలలోని తెలుగు ప్రాంతాలు 1956లో ఏకమై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆవిర్భవించడానికి బలమైన కారణం భాషే. ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం. అటు తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, తదితరాలు ఆ ప్రాతిపదికన ఏర్పడినాయి. 58 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగింది. హైదరాబాద్‌ సహజంగానే తెలంగాణకు దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని నిర్మించుకోవలసిన అవసరం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధానాం శాలు నిధులూ, నియామకాలూ, నీళ్ళూ అయినప్పటికీ భాష, సాంస్కృతిక చైతన్యం పాత్ర కూడా అంతే ప్రధానమైనది. అంటే తెలుగువారి రాజకీయంలో భాష అంతర్భాగం. భాషలో రాజకీయం అనివార్యం. 1975లో జలగం వెంగళరావు తొలి ప్రపంచ మహాసభలు నిర్వహించడం వెనుక రాజకీయ లక్ష్యం ఉంది. 1969–70, 1971–72లో తెలంగాణ, ఆంధ్ర ఉద్యమాల ఫలితంగా వందలమంది బలి కావడం, ఇద్దరు ముఖ్యమంత్రులు పదవీచ్యుతులు కావడంతో పాటు అనైక్యత ప్రబలి తెలుగు ప్రజల హృదయాలు అశాంతితో రగిలాయి. ఆ దశలో ఇరు ప్రాంతాల మధ్య ఐక్యత సాధించేందుకు భాషను సాధనంగా వినియోగించుకునే ప్రయత్నం చేశారు. అంజయ్య హయాంలో ప్రవాసాంధ్రుల ప్రోత్సాహంతో 1981లో మలేసియాలో జరిగిన సభలకూ, 1990లో ఫిలిప్పీన్స్‌ సభలకూ రాజకీయ ప్రాముఖ్యం లేదు. కిరణ్‌కుమార్‌ రెడ్డి తిరుపతిలో నిర్వహించిన మహాసభల లక్ష్యం తెలుగువారి సమైక్య సాధనే. అవి కూడా నిష్ఫలమైనాయి.
 
తెలుగు భాషపై కేసీఆర్‌ అధికారం
తెలుగు ముఖ్యమంత్రులలో తెలుగుభాషపైన అధికారం, మమకారం కలిగినవారి జాబితాలో దామోదరం సంజీవయ్య, పీవీ నరసింహారావు, నందమూరి తారక రామారావు, కేసీఆర్‌ పేర్లు ముందుంటాయి. ఈ సభల వెనుక సైతం రాజకీయం ఉంది. కదన కుతూహలం, కవన కుతూహలం దండిగా కలిగిన ముఖ్యమంత్రి ఉద్యమ సేనానిగా పరాక్రమించి ప్రత్యేక రాష్ట్ర సారథిగా పరిశ్రమిస్తున్న నేపథ్యంలో అచ్చ తెలుగు భాషకు మూలాలు తెలంగాణంలోనే ఉన్నాయని నిరూపించవలసిన చారిత్రక అవసరం ఉన్నదని భావించి ఉంటారు. రెండున్నర జిల్లాల ప్రజలు మాట్లాడే భాషనే ప్రామాణికం చేసి ఇతర ప్రాంతాలవారి మాండలికాలనూ, యాసలనూ ఎద్దేవా చేసిన ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే మాట నిజం. ఉద్యమ సమయంలో సీమాంధ్ర రాజకీయ నాయకులనూ, ప్రజలనూ ఘాటు విమర్శలతో తూర్పారబట్టిన కేసీఆర్‌ రాష్ట్ర విభజన జరిగి తాను అధికారంలో కుదురుకున్న అనంతరం సీమాంధ్ర ప్రజల హృదయాలలో విభజన చేసిన గాయం మాన్పడానికి లేపనం అద్దడానికి ప్రయత్నిస్తున్నట్టే తెలుగు మహాసభలను సైతం యావన్మంది తెలుగు ప్రజల సంఘీభావ సాధన కోసం ఉద్దేశించారా? కేవలం హైదరాబాద్‌లో, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాలలో స్థిరపడిన సీమాంధ్రుల ఓట్ల కోసమే కేసీఆర్‌ రూ. 50 కోట్లకు పైగా ఖర్చుతో ఇంత హంగామా చేశారా? విడిపోయినా కలసి ఉందాం అనే సద్భావనను ప్రోత్సహించాలనుకుంటే సీమాంధ్ర తెలుగు వెలుగుల ప్రస్తావన విధిగా ఉండేది. పాల్కురికి సోమనాథుడూ, పోతనతో పాటు కవిత్రయం, శ్రీనాథుడు వెంకయ్యనాయుడి లిఖిత ప్రసంగంలోనైనా ఉండవలసింది. గిడుగు, గురజాడల జాడ లేదు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ పేరు విస్మరించారు. ముఖ్యమంత్రి మదిలో ఆలోచన మెదిలిన తర్వాత నాలుగు మాసాలలో ఇంతటి బృహత్కార్యక్రమం నిర్వహించాలంటే చాలా కష్టం. వ్యవధి చాలక కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. అదే కారణమైతే రాద్ధాంతం చేయనక్కరలేదు. అట్లా కాకుండా, బుద్ధిపూర్వకంగా తెలంగాణ వేడుకగానే నిర్వహించి ఉంటే భాషను తాజాగా రాజకీయ ప్రయోజనం కోసం వినియోగించుకున్నట్టు భావిం చాలి. గత పాలకులు చేసిన తప్పిదాన్నే కేసీఆర్‌ సైతం చేశారని చరిత్రలో నమోదు అవుతుంది. ఐదు రోజుల కార్యక్రమాలకీ నిర్దిష్టమైన చర్చనీయాంశాలు సూచిం చారా లేక ఎవరి పాట వారు పాడుకొని వెళ్ళిపోవడమేనా? కార్యక్రమాల జాబితా చూసినప్పుడు పూసలలో దారం లాగా అంతస్సూత్రం ఏదీ కనిపించదు. ఈ సమావేశాల కొనసాగింపు ఏమిటనే స్పష్టత లేదు. దేశ, విదేశాల నుంచి వచ్చిన హేమాహేమీలు ఒక చోట చేరి చర్చించుకున్న తర్వాత తెలుగు భాషాసాహిత్య వికాసానికి భవిష్యత్‌ చిత్రపటం రూపకల్పన జరగాలి. సాహిత్య అధ్యయనాన్ని ప్రోత్సహిం చేందుకూ, భాషాజ్ఞానం పెంపొందించేందుకూ, భాష వాడుకను విస్తరించేందుకూ ఎటువంటి వ్యవస్థలు, ఎటువంటి కార్యక్రమాలు అవసరమో నిర్ణయించాలి. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిన అనంతరం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మహాసభలు ఇవి. ప్రణాళికాబద్ధంగా చర్చలూ, సమాలోచనలూ జరిగితే తెలుగు జాతికి ప్రయోజనం ఉంటుంది. అధికార భాషగా తెలుగును ప్రకటించిన తర్వాత ఏమి జరిగిందో లేదా ఏమేమి జరగలేదో, బోధనాభాషగా తెలుగు ఉండాలంటూ భాషాభిమానులు చేస్తున్న వాదనకు సమాధానం ఏమి చెప్పాలో కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఈ సభలు సార్థకం అవుతాయి. లేకపోతే తానా, ఆటా, నాటా సభలలాగే ఇవి కూడా తెలంగాణ తెలుగు సంబురాలుగానే మిగిలిపోతాయి.

బోధనాభాషగా సాధ్యమా?
తెలంగాణలో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ తెలుగును ఒక సబ్జెక్టుగా నిర్బంధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందించాలి. భాషకు సంబంధించి లోగడ ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. చిత్తశుద్ధి లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. తాజా ఉత్తర్వులను నిష్కర్షగా అమలు చేస్తే ప్రభుత్వం పట్ల గౌరవం పెరుగుతుంది. తెలుగు సబ్జెక్టును నిర్బంధం చేయాలని నిర్ణయించారంటే తెలుగును బోధనా భాషగా చేయడం సాధ్యం కాదని భావించి ఉంటారు. ఈ విషయంలో రెండు అభిప్రాయాలు ఉన్నాయి. తక్కువ ఆదాయవర్గాల వారు సైతం సర్వస్వం ఒడ్డి తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో బోధించే విద్యాసంస్థలలో చేర్చుతున్నారు. ఉద్యోగావకాశాలు వినియోగించుకోవాలంటే ఇంగ్లీషు ప్రావీణ్యం తప్పనిసరి. ఈ క్షేత్ర వాస్తవికతని గర్తించాలి. అయితే మాతృభాషకీ, ఆంగ్లానికీ మధ్య వైరుధ్యం లేదు. ఎనిమిదో తరగతి వరకూ బోధన మాతృభాషలో ఉంటే పిల్లలకు చదువు బాగా ఒంటపడుతుందనీ, ఆ సమయంలో మెదడు పెరుగుతుంది కనుక ఒకటి కంటే ఎక్కువ భాషలను బాలలు సులభంగా నేర్చుకోగలుగుతారనీ పాశ్చాత్య దేశాలలో జరిగిన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కనీసం ప్రాథమిక పాఠశాల స్థాయి వరకైనా బోధన మాతృభాషలో చేసి, ఇంగ్లీషును ఒక భాషగా తప్పనిసరి చేయగలిగితే విద్యార్థులకు రెండు భాషలలోనూ గట్టి పునాది పడుతుంది. ఆరో తరగతి నుంచి ఇంగ్లీషును బోధనాభాషగా చేసి తెలుగు సబ్జెక్టును నిర్బంధం చేయడం వల్ల ఉద్యోగార్హత ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి పై చదువులు చదువుకోవచ్చు. ఉద్యోగాలు చేసుకోవచ్చు. మాతృభాష బాగా వచ్చినవారికి మరో భాష నేర్చుకోవడం సులువు. పునరుక్తి భయం ఉన్నప్పటికీ ఒక్క అనుభవం మనవి చేస్తాను. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం కోర్సు చదువుతున్న రోజుల్లో (1972–73) ‘దక్కన్‌ క్రానికల్‌’ న్యూస్‌ ఎడిటర్‌ మూర్తి పాఠాలు చెప్పేవారు. కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చినప్పుడు నన్ను విజయవాడ వెళ్ళి ఆయనను ఇంటర్వ్యూ చేసి రమ్మనమని పురమాయించారు. సత్యనారాయణ తెలుగులో మహాకవి. నేను ఇంగ్లీషులో ఇంటర్వ్యూ రాయాలి. ‘మాస్టారూ, నేను తెలుగులో ప్రశ్నలు అడుగుతాను. మీరు తెలుగులోనే సమాధానాలు చెప్పండి పర్వాలేదు. నేను తర్వాత ఇంగ్లీషులోకి అనువాదం చేసుకుంటాను’ అని వినయం ఉట్టిపడుతుండగా అన్నాను. ‘అంత శ్రమ ఎందుకు. ఇంగ్లీషులోనే అడగవోయ్‌’ అన్నారు చిర్నవ్వుతో. నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ తడుముకోకుండా టకటకా జవాబులు చెప్పాడు మహానుభావుడు. చెప్పింది చెప్పినట్టు పొల్లుపోకుండా రాసి మూర్తిగారికి సమర్పించాను. ఆయన అక్షరం మార్చకుండా ఎడిట్‌ పేజీలో పై నుంచి కింది దాకా ఆ వ్యాసం ప్రచురిం చారు. ఎంతో మంది మెచ్చుకున్నారు. ఒక భాషలో పట్టు ఉన్నవారికి మరో భాష నేర్చుకోవడం సులువని చెప్పడానికి ఇది నిదర్శనం.

భాష సంపద్వంతం కావాలంటే...
తెలుగులో మహా నిఘంటువు లేకపోవడం పెద్ద లోపమని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఏ భాష అయినా సంపద్వంతం కావాలంటే మడికట్టుకొని కూర్చోకూడదు. తన అస్తిత్వానికి ముప్పు లేకుండా అన్య భాషాపదాలను స్వీకరించాలి. అన్ని భాషల నుంచీ పదాలు సొంతం చేసుకుంటుంది కనుకనే ఇంగ్లీషు అంతర్జాతీయ భాషగా అనునిత్యం ఎదుగుతూ ఎదురు లేని ప్రస్థానం సాగి స్తోంది. ప్రామాణిక భాష మాండలికాలపైన ఆధిక్యం చెలాయించకూడదు. వాటిని తనలో కలుపుకోవాలి. కొత్త కొత్త పరికరాలూ, ఆవిష్కరణలూ శాస్త్రసాంకేతిక రంగాలలో కొత్త పదజాలాన్ని తీసుకొస్తుంటాయి. ఆ సమాచారం సర్వసాధారణంగా ఇంగ్లీషులో పీటీఐ లేదా యూఎన్‌ఐ న్యూస్‌ ఏజెన్సీ ద్వారా వస్తుంది. దానిని తెలుగులో తర్జుమా చేసే బాధ్యత పత్రికా కార్యాలయంలో పనిచేస్తున్న ఉప సంపాదకులపైన పడుతుంది. ఎవరికి తోచినట్టు వారు తర్జుమా చేస్తారు. అన్నిటినీ పరిశీలించి ఒక్క మాటను ఖరారు చేయడానికి శాశ్వత ప్రాతిపదికన ఒక వ్యవస్థను నెలకొల్పాలి. పొత్తూరి వెంకటేశ్వరరావు ఇటువంటి ప్రయత్నం చేశారు కానీ అది కొనసాగలేదు. ఒకసారి పబ్లిక్‌ గార్డెన్‌లోని జూబిలీ హాలులో పత్రికాభాషపైన జరిగిన సభలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పాల్గొన్నారు. ‘టెలివిజన్‌కు తెలుగులో ఏమి రాయాలో మనకు తెలియదు. ఒక పని చేయండి. ఒక పల్లెటూరులో అందరూ గుమిగూడే చోట టీవీ పెట్టండి. దాన్ని ప్రజలు ఏ పేరు పెట్టి పిలుస్తారో దాన్ని ఖాయం చేయండి. వారు బొమ్మలపెట్టె అంటే అదే రాయండి’ అని సలహా చెప్పారు. ప్రజల దగ్గరికి భాషను తీసుకొని వెళ్ళడం అంటే అదే. ఈ పని ఎంత ఎక్కువగా జరిగితే భాష అంత సజీవంగా ఉంటుంది. దేశంలో హిందీ తర్వాత తెలుగే ఎక్కువ మంది మాట్లాడే భాష. ప్రాచీన భాష హోదా వచ్చి ఏళ్ళు గడిచిపోతున్నా దానికి ఒక భవనం ఏర్పాటు చేసి భాష, సాహిత్యం అధ్యయనానికీ, పరిశోధనకూ అవసరమైన హంగులు ఏర్పాటు చేయలేదు. సాంకేతిక పరిభాషగా తెలుగు ఇంకా ఎంతో అభివృద్ధి చెందవలసి ఉంది. గూగుల్‌ సాఫ్ట్‌వేర్‌ లైబ్రరీలో తెలుగు వాటా పెంచుకోవాలి. ఈ విషయంలో తమిళనాడు, కర్ణాటకలను చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. అక్కడ ప్రభుత్వ ఉత్తర్వులూ, దిగువ కోర్టులలో తీర్పులూ మాతృభాషలోనే వెలువడుతున్నాయి. ఈ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. గతంలో జరిగిన లోపాలను సరిదిద్ది తెలుగుభాషకు కొత్త వెలుగూ, కొత్త చూపూ, కొత్త ఊపూ తేగలిగితే కేసీఆర్‌ జన్మ చరితార్థం అవుతుంది.

కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement