సమావేశంలో ప్రణయ్ హత్యను ఖండిస్తూ పోస్టర్లను చూపుతున్న ‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, చుక్కా రామయ్య, జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, లక్ష్మణ్‌రెడ్డి, మల్లెపల్లి లక్ష్మయ్య
సాక్షి, హైదరాబాద్: ప్రణయ్ హత్యోదంతం ఒక కులానికి మాత్రమే సంబంధించింది కాదని, సమాజ సమస్య అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దళితులపై జరుగుతున్న ఇలాంటి దాడులు ఆగాలంటే అంబేడ్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుల పరిరక్షణ జరగాలని, ఆయన ఆశించినట్టు దళితులకు రాజ్యాధికారం రావాలని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యోదంతంపై జనచైతన్య వేదిక అ«ధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని నెలలుగా అమ్మాయి కుటుంబం కుట్ర పన్ని ప్రణయ్‌ను హత్య చేయించిందని పేర్కొన్నారు.
అయితే దీని వెనకున్న రాజకీయ నేతలు, పెద్దలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే బాధిత కుటుంబానికే కాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందన్న నమ్మకం కలిగేదన్నారు. రాజకీయ హత్య అని ఎవరూ ఆరోపించకపోయినా పోలీసు శాఖ మాత్రం అది రాజకీయ హత్య కాదంటూ వెల్లడించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేసు దర్యాప్తు పూర్తి కాకుండానే పోలీసులు రాజకీయ హత్య కాదని చెప్పడం సమంజసం కాదని చెప్పారు. అలాగే దళితులను అణగదొక్కాలన్న ధోరణి మారాలని, ప్రణయ్ çఘటనను కుల సంఘాలు, పౌరహక్కుల సంఘాలే ఖండించడం కాకుండా యావత్ సమాజం ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రి పదవులు దళితులకు కేటాయించినప్పుడే అంబేడ్కర్ ఆశయాలు అమలైనట్లు భావించాలని పేర్కొన్నారు.
అఘాతం పెరుగుతోంది: చుక్కా రామయ్య
పాత పద్ధతులను తల్లిదండ్రులు పిల్లలపై రుద్దడం వల్ల ఇలాంటి కుల దురహంకారాలు, పరువు హత్యలు పెరిగిపోతున్నాయని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య పేర్కొన్నారు. సమాజంలో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య తీవ్రమైన అగాథం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కుల, మతాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రణయ్ హత్య నిందితుల అరెస్టుతో సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పదవుల్లో ఉన్న వారు ఒక్కరు కూడా ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శించకపోవడం, ఘటనను ఖండించకపోవడం పీడిత వర్గాలను మరింత అణగదొక్కే ధోరణిలా కనిపిస్తోందని విమర్శించారు.
అరెస్ట్ చేయాల్సిందే: రమా మేల్కొటే
ప్రణయ్ హత్యకు ముందు ఆ జంటను విడదీసేందుకు బెదిరింపులకు దిగిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలను కూడా అరెస్ట్ చేయాలని ప్రొఫెసర్ రమామేల్కొటే డిమాండ్ చేశారు. పరువు హత్యలు, కులహంకార హత్యలతో సమాజాన్ని విడదీసేలా చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాచౌక్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సంతోషాన్నిచ్చినా ప్రణయ్‌లాంటి ఘటనలతో ఆ సంతోషం నిమిషాల్లో ఆవిరైపోతున్నాయన్నారు.
పదవుల్లో ఉన్నవాళ్లు పరామర్శించాల్సింది: ‘సాక్షి’ఈడీ రామచంద్రమూర్తి
ప్రణయ్ సంఘటనను పదవుల్లో ఉన్నవారు ఖండించపోవడం, కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం విచారకరమని ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. సీఎం కానీ, దళిత ఉపముఖ్యమంత్రి కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉంటే దళితుల్లో ధైర్యం పెరిగేదన్నారు. ఇందిరాగాంధీ పదవిలో ఉన్నప్పుడు బిహార్‌లో జరిగిన ఇలాంటి ఓ హత్య సమయంలో వేగంగా స్పందించారన్నారు. ఘటనా స్థలికి వెళ్లేందుకు మార్గం లేకపోయినా ఏనుగుపై వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారన్నారు. నెహ్రూ, ఇందిర కుటుంబాలను దళితులు ఎప్పుడూ మరవలేరని చెప్పారు. ప్రణయ్ హత్యను సమాజం మొత్తం ఖండించాలని, ఇది దళిత హక్కులను కాలరాసేలా కనిపిస్తోందని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని మేధావులు, పెద్దలు ఈ ఘటనను ఖండించాలన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సురేశ్‌చంద్ర హరి, సెంటర్ ఫర్‌దళిత్ స్టడీస్ ప్రతినిధులు, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి: జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి
ఒకప్పుడు పరువు హత్యలంటే ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరిగేవని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ పరువు హత్యలు, కుల హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కులాలుండవని, అక్కడ 90 శాతం ప్రేమ వివాహాలే జరుగుతున్నట్లు చెప్పారు. సమాజ సమస్యగా మారుతున్న ప్రణయ్ హత్యలాంటి ఘటనలను నియంత్రించాలన్నా, నిరోధించాలన్నా కులాంతర వివాహాలను ప్రభుత్వాలే పోత్సహించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment