chukka ramayya
-
మౌన సంస్కృతి ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి
కారణాలు ఏవైనా కావచ్చు. కారకులు మీరంటే మీరని రాజకీయ పార్టీలూ, నాయకులూ పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో పొద్దు గడపవచ్చు. దురదృష్టవశాత్తూ మన దేశంలో మౌన సంస్కృతి పవనాలు వేగంగా వీస్తున్నాయి. మౌనం సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రజలు తమలోని భావాల్ని, ఆలోచనల్ని స్వేచ్ఛగా బయటకు ప్రకటించుకొనే హక్కులను గౌరవించి, వాటిని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలే వాటిని కాలరాసేలా వ్యవహరిస్తున్నాయి. బలప్రయోగంతో సమాజంలో నెలకొల్పుతున్న అనారోగ్యకరమైన మౌనాన్ని తొలగించి ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు జలుబు రావాలి. అప్పుడే శరీరంలో ఉన్న మలినమంతా బయటకు పోతుంది. అందువల్ల జలుబు రావడం మంచిది. లేకపోతే ఊపిరితిత్తులు నాశనమై మానవ దేహాన్నే అది కబళిస్తుంది. అలాగే మనిషి తన ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోగలగాలి. అదే ప్రజాస్వామ్యం. దేశాన్ని మౌన సంస్కృతి (సైలెన్స్ కల్చర్) కమ్ముకుంటోంది. ప్రజల్లో, విశ్వవిద్యాలయాల అధ్యాపకుల్లో, యువకుల్లో, పలు రాజకీయ పార్టీల నాయకుల్లోనూ.. ఇలా ఎక్కడ చూసినా ఈ సైలెన్స్ వాతావరణమే కనబడుతోంది. దేశంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వాలు తీసుకుంటోన్న పలు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ మాట్లాడే వారి సంఖ్య పరిమితమైపోతోంది. ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడితే తమకు ఎటువైపు నుంచి ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయమే అందుకు కారణమని చెప్పక తప్పదు. అందువల్ల మౌనమే శ్రీరామరక్ష అనుకుంటూ దేశంలో ఏం జరుగుతున్నా మనకెందుకులే అనుకునే ధోరణి జనంలో పెరుగుతోంది. దీంతో ఎక్కడ ఏం జరుగుతున్నా మౌనంగా ఉండే వారి సంఖ్య దినదినం పెరుగుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పుకుంటున్న మన దేశంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం తీవ్ర ఆందోళనకరం. ఇలాంటి మౌనం సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తమ ఆకాంక్షలను, అభిప్రాయాలను ప్రతి బింబించేలా ప్రభుత్వాలు పనిచేయాలనే కోరిక ప్రతి పౌరుడికీ ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తే జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. దురదృష్టవశాత్తు, మన దేశంలో విచిత్రమైన, విపరీతమైన పోకడలు విస్తరిస్తున్నాయి. ప్రజలు తమలోని భావాల్ని, ఆలోచనల్ని స్వేచ్ఛగా బయటకు ప్రకటించుకునే హక్కులను గౌరవించి, వాటిని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలే వాటిని కాలరాసేలా వ్యవహరిస్తున్నాయి. ప్రతిపక్షాలే లేకుండా ప్రయత్నాలు చేయడం, ప్రశ్నించే తత్వాన్నే భరించలేకపోవడం వంటి అవాం ఛనీయ పోకడలు నేటి రాజకీయ వ్యవస్థలో ప్రవేశిం చాయి. ఇలాంటి ధోరణులు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాలైనా ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వాలి. నూరు పూలు వికసించనీ.. వేయి ఆలోచనలు సంఘర్షించనీ చందంగా ప్రభుత్వాలు పనిచేస్తే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. లేకపోతే పాలకులు ఎక్కడ తప్పు చేస్తున్నారో, పాలన గురించి ప్రజలేం అనుకుంటున్నారో, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటో ఎలా తెలుస్తాయి? ఫలితంగా ప్రజావిశ్వాసాన్ని కోల్పోవడమే కాదు.. జనాగ్రహం తప్పదు. అధికారంలో ఉన్నంతవరకూ ప్రజల్ని, వారి ఆలోచనల్ని భయపెట్టి నియం త్రించే వీలు పాలకులకు ఉండొచ్చేమోగానీ.. అధికారం శాశ్వతం కాదు. భయంలేని సమాజాన్ని సృష్టించగలిగినప్పుడే ఏ ప్రభుత్వమైనా మరింత పదునుదేలుతుంది. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించగలుగుతుంది. అలాంటి వాతావరణం కల్పించినప్పుడే ప్రజలు హద్దులు లేని ఆలోచనలతో ముందుకుసాగుతారు. తద్వారా ప్రగతిశీలతతో, రెట్టింపు ఉత్సాహంతో ఈ సమాజం మరింత పురోగమనంలో దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినూత్న రాజకీయ పంథాలను అనుసరిస్తూనే ప్రజల సహకారంతో పనిచేసినప్పుడే దేశాన్ని అనాదిగా పట్టిపీడిస్తున్న పేదరికం, నిరుద్యోగం, అవినీతి వంటి మహమ్మారిల బారి నుంచి విముక్తి చేయగల్గుతాం. లేకపోతే ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. జనం ఓట్లేస్తారు. గెలిచిన పార్టీ అధికారం చెలాయిస్తుంది. ఓడిపోయిన పార్టీ మళ్లీ అధికారంలోకి ఎలా రావాలో, ప్రజల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆలోచిస్తాయి తప్ప ప్రజల జీవితాల్లో ఏమాత్రం మార్పులు కనబడవు. ఈ రోజు దేశ ప్రజలు కోరుకుంటున్నది ఇది కాదు. తమ జీవితాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ప్రపంచంలో జరుగుతున్న పరి ణామాలను అనునిత్యం పరిశీలిస్తున్న సగటు భారతీయ పౌరుడు అగ్రదేశాల సరసన భారత్ సగర్వంగా నిలవాలని అభిలషిస్తున్నాడు. సాంకేతిక యుగంలో వస్తోన్న విప్లవాత్మక మార్పులతో ప్రతిమనిషీ చైతన్యమంతమవుతున్నాడు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా నిమిషాల్లోనే తెలుసుకోగలుగుతున్నారు. అంతలా సాంకేతికత వృద్ధి చెందింది. కానీ మన నాయకుల్లో మాత్రం ఇంకా మూస పద్ధతులే కొనసాగుతున్నాయి. ప్రజల్ని నియంత్రించాలని, భయపెట్టాలని ప్రయత్నిస్తే ఆ చర్యలు తమకే ఇబ్బందులు తెచ్చిపెడతాయని గుర్తించలేకపోతున్నారు. అంతేకాదు, కార్యనిర్వాహక వ్యవస్థలు, స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోతోంది. కార్యనిర్వాహక వ్యవస్థల పనితీరును రాజకీయ వ్యవస్థలు పరిశీలించాలే తప్ప నియంత్రించాలని చూడటం సరికాదు. విశ్వవిద్యాలయాలు మౌనంగా ఉండాలి. అక్కడ పనిచేసే ప్రొఫెసర్లూ ఏమీ మాట్లాడొద్దంటే కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు ఎలా వస్తాయి? ఇలాంటి పరిస్థితులతో వచ్చే తరమే మారిపోతుంది. ఏం జరుగుతున్నా, ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా సగటు మనిషి నాకెందుకులే అనుకుంటూ ఏమీ మాట్లాడకపోతే సమాజాన్ని అది పెద్ద దెబ్బకొడుతుంది. ఈ మౌనం ఏదో ఒక రోజు అగ్నిపర్వతంలా బద్దలవుతుంది. అన్ని వ్యవస్థలూ స్వతంత్రంగా ఎవరిపని వారు చేసుకుంటూ ముందుకెళ్తేనే అందరికీ క్షేమం. దురదృష్టవశాత్తూ మన దేశంలో మౌన సంస్కృతి పవనాలు వేగంగా వీస్తున్నాయి. ఈ మౌనం తొలగించి ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు జలుబు రావాలి. అప్పుడే శరీరంలో ఉన్న మలినమంతా బయటకు పోతుంది. అందువల్ల జలుబు రావడం మంచిది. లేకపోతే ఊపిరితిత్తులు నాశనమై మానవ దేహాన్నే అది కబళిస్తుంది. అలాగే దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో నిజమైన మార్పులు రావాలంటే అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేయాలి. మనిషి స్వేచ్ఛగా తన ఆలోచనల్ని ఇతరులతో పంచుకోగల్గినప్పుడే ప్రజాస్వామ్యం మరింతగా వికసించడమే కాదు మరింత సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. డా.చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త సామాజిక విశ్లేషకులు -
ప్రజా ఫ్రంట్ మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ప్రజా మేనిఫెస్టో’ను ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చుక్కా రామయ్య మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాలు కేవలం డబ్బు సంపాదిం చుకునేందుకు మార్గంగా మారాయని ఆరోపిం చారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి ఎన్నికల్లో గెలవడం, డబ్బు సంపాదించడం పరి పాటిగా మారాయన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రజల కోర్కెలు తీర్చే ప్రభుత్వం వస్తుందని భావించామన్నారు. గత ప్రభుత్వాలు కనీసం మాట్లాడే హక్కునైనా ఇచ్చాయని, ఈ ప్రభుత్వం మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు వచ్చే నాయకులను ప్రశ్నించేందుకు ఫ్రంట్ మేనిఫెస్టో రూపొందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ.. ఎన్నికలు ధనికులకు క్రీడ ల్లా అయ్యాయని, అందులో విజయం సాధిం చిన ఏ నాయకుడూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఉద్యమాల ఉపాధ్యాయు డు సాంబశివరావు మాట్లాడుతూ.. స్వపరిపాలన కోసం తెలంగాణ తీసుకువస్తే స్వగృహ పరి పాలన అయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పద్మజాషా, వివిధ సంఘా ల నాయకులు వేణుగోపాల్, నర్సింహారెడ్డి, రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు. -
అమెరికన్ విద్వేషానికి మూలం
ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ చర్యల పట్ల, అతని వైఖరి పట్ల అంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా అమెరికాలో ప్రజల ఆలోచనా ధోరణి అతనికి ఎందుకను కూలంగా ఉంది అన్న ప్రశ్న అమెరికా వెళ్ళొచ్చినప్పటి నుంచి నన్ను తొలిచేస్తు న్నది. అమెరికా ప్రజల్లో భారతీయుల పట్ల నిద్రాణంగా దాగి ఉన్న ఒక వ్యతిరేకత, రెండు సమాజాల మధ్యనున్న భిన్నత్వం ఈ రెండు దేశాల పరిస్థితు లను ఆర్థికంగా సామాజికంగా, వ్యక్తి గతంగా కూడా చాలా ప్రభావితం చేస్తోంది. మన దేశంలోని ఎందరో మెరికల్లాంటి విద్యార్థులు గంపెడాశతో అమెరికాలో చదువులకోసం, ఉద్యోగాల కోసం తరలివెళుతు న్నారు. అందులో చాలా మంది నిస్పృహతో తిరిగి వస్తున్నారు. ఇంకా కొందరు అక్కడి దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయి కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చిపోతున్నారు. ఎందుకు భారతీయు లను కానీ ఇతర దేశస్థులను కానీ అక్కడి ప్రజలు సహించలేకపోతున్నారు? అమెరికా అధ్యక్షుడి కఠిన నిబంధనలు భారత్‌లాంటి దేశాలను ఇంతగా ప్రభా వితం చేయడానికి ఏ పరిస్థితులు ఉసిగొల్పుతు న్నాయి అని ఆలోచిస్తే చాలా స్పష్టంగా దాని ఆన వాళ్ళు మనకు విద్యావ్యవస్థలో కనిపిస్తున్నాయి. అమెరికాలోని భిన్నమైన సంస్కృతి, అక్కడి ఆధునిక కుటుంబ వ్యవస్థా పరోక్షంగా భారతీయ, ఇతర దేశాల ఉద్యోగులపై విద్వేషానికి కారణంగా మారుతోంది. అమెరికాలో విద్య అత్యంత ఖరీదైన విషయం. ఉన్నత విద్యకోసం లోన్లు తీసుకోవా ల్సిందే తప్ప మన దేశంలో మాదిరిగా ప్రభుత్వం బాధ్యతేమీ అక్కడ కనిపించదు. 18 ఏళ్ళు నిండా యంటే, ప్లస్‌టూ పూర్తయితే చాలు పిల్లల బాధ్యత కుటుంబాలకు కానీ, తల్లి దండ్రులకు కానీ లేనట్టే. పిల్లలు ఆ వయస్సు నుంచే తమకు తాముగా సంపా దనవైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. ఇక ఉన్నత చదువులు కొనసాగించాలన్నా కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని, వాటిని తీర్చేందుకు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ రెండూ బ్యాలన్స్ చేయాల్సిన పరిస్థితి. అంత చిన్న వయస్సులో విద్యార్థులు ఎంతో భారాన్ని మోయాల్సిన పరిస్థితి. ఇక భారత్‌లో బలమైన కుటుంబ వ్యవస్థ కారణంగా పిల్లలకీ, తల్లిదండ్రులకీ మధ్య చాలా బలమైన బంధం పెనవేసుకొని ఉంటుంది. పిల్లలు పూర్తిగా ఉద్యోగాల్లో కుదురుకునే వరకు తల్లిదండ్రులే బాధ్యత వహిస్తారు. వారికి ఏ చిన్న ఇబ్బందీ కలగ కుండా పెళ్ళిళ్ళయ్యాక కూడా వారి అవసరాలను, బాధ్యతలను తల్లిదండ్రులే చూడటం ఇక్కడి సంస్కృతి. తల్లిదండ్రులు ఎంత కష్టమైనా భరించి పిల్లలు జీవితంలో కుదురుకునే వరకూ అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తారు. వారి ఉన్నత చదు వులకి చేసిన రుణాలు సైతం తీర్చే బాధ్యతని తల్లి దండ్రులే తీసుకుంటారు తప్ప పిల్లలపై ఆ భారాన్ని వేయరు. ఉద్యోగాలకోసమో, ఉన్నత చదువులకో సమో అమెరికాకి వెళితే అటువంటి విద్యార్థులకు వేతన రూపంలో వచ్చేదంతా మిగులుగానే ఉంటోంది. దీంతో విలాసవంతమైన జీవితాలూ, మంచి ఉద్యోగాలూ, కార్లూ, సరదాలూ.. ఇవన్నీ అక్కడి యువతరంలో, ప్రధానంగా విద్యార్థుల్లో భారతీయుల పట్ల విద్వేషానికి కారణమవుతు న్నాయి. తమకు నిజాయితీగా రావాల్సిన ఉద్యో గాలు, ఉపాధి అవకాశాలూ వేరెవరో గెద్దలా తన్నుకు పోయే పరిస్థితిలో మార్పుకోసం అక్కడి యువత తహతహలాడుతున్నారు. దాన్ని సాధించుకోవడం కోసం దేనికైనా సిద్ధపడుతున్నారు. చివరకు అది భారతీయులపై తీవ్రమైన దాడులకు దారి తీస్తోంది. మన దేశంలో ఉన్నత విద్యకు ప్రభుత్వాల బాధ్యత కీలకం. దాని ఖర్చు ప్రభావం మన పిల్లలపై పెద్దగా లేదు. కానీ అదే అమెరికాలో చదువు చాలా ఖరీదు. దీని ప్రభావం మన కళ్ళెదుటే స్పష్టంగా కనిపిస్తోంది. దీనంతటికీ పరిష్కారం ఉన్నత విద్య ప్రాధాన్యతను గుర్తించి స్థానికులకు అవకాశాలి వ్వడం, ఉన్నత విద్యపై ఖర్చు ప్రభుత్వాలు పంచు కోవడం, లేదా ఉచితంగా ఉన్నత విద్యావకాశాలు కల్పించడం వల్ల పొరుగు దేశస్తులపట్ల అక్కడి యువ తరంలో ఉన్న విద్వేషాన్ని తగ్గించొచ్చు. అదేవిధంగా అక్కడి యువతరం ఉద్యమాల్లో భారతీయుల సమై క్యమవడం కూడా సమస్యని ఓ మేరకు తగ్గిస్తుంది. తొలి తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రులు తెలం గాణ పోరాటంలో భాగమయ్యారు. నాటి ఉద్య మంలో ఆంధ్రుల పట్ల తెలంగాణ ప్రజలకు విము ఖత లేదు. ఆ తరువాత వచ్చిన వారు ఆంధ్రప్రాంత ప్రజలను దూరంగా ఉంచారు. అలాగే ట్రంప్ సైతం నాన్‌లోకల్ ఫీలింగ్‌ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడు తున్నారు. తద్వారా స్థానికతపై ప్రజల్లో నెలకొన్న సున్నిత భావనలను ఉపయోగించుకుంటున్నారు. స్థానిక ఉద్యమాల్లో పాత్రధారులైతే అమెరికాలో ఉంటోన్న భారతీయులకు కూడా సమస్య ఉత్పన్నం కాదు. అప్పుడది స్థానిక సమస్యగా కాకుండా ప్రపంచ సమస్యగా మారుతుంది. చుక్కారామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ -
దళితులకు రాజ్యాధికారం రావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రణయ్ హత్యోదంతం ఒక కులానికి మాత్రమే సంబంధించింది కాదని, సమాజ సమస్య అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దళితులపై జరుగుతున్న ఇలాంటి దాడులు ఆగాలంటే అంబేడ్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుల పరిరక్షణ జరగాలని, ఆయన ఆశించినట్టు దళితులకు రాజ్యాధికారం రావాలని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యోదంతంపై జనచైతన్య వేదిక అ«ధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని నెలలుగా అమ్మాయి కుటుంబం కుట్ర పన్ని ప్రణయ్‌ను హత్య చేయించిందని పేర్కొన్నారు. అయితే దీని వెనకున్న రాజకీయ నేతలు, పెద్దలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే బాధిత కుటుంబానికే కాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందన్న నమ్మకం కలిగేదన్నారు. రాజకీయ హత్య అని ఎవరూ ఆరోపించకపోయినా పోలీసు శాఖ మాత్రం అది రాజకీయ హత్య కాదంటూ వెల్లడించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేసు దర్యాప్తు పూర్తి కాకుండానే పోలీసులు రాజకీయ హత్య కాదని చెప్పడం సమంజసం కాదని చెప్పారు. అలాగే దళితులను అణగదొక్కాలన్న ధోరణి మారాలని, ప్రణయ్ çఘటనను కుల సంఘాలు, పౌరహక్కుల సంఘాలే ఖండించడం కాకుండా యావత్ సమాజం ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రి పదవులు దళితులకు కేటాయించినప్పుడే అంబేడ్కర్ ఆశయాలు అమలైనట్లు భావించాలని పేర్కొన్నారు. అఘాతం పెరుగుతోంది: చుక్కా రామయ్య పాత పద్ధతులను తల్లిదండ్రులు పిల్లలపై రుద్దడం వల్ల ఇలాంటి కుల దురహంకారాలు, పరువు హత్యలు పెరిగిపోతున్నాయని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య పేర్కొన్నారు. సమాజంలో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య తీవ్రమైన అగాథం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కుల, మతాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రణయ్ హత్య నిందితుల అరెస్టుతో సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పదవుల్లో ఉన్న వారు ఒక్కరు కూడా ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శించకపోవడం, ఘటనను ఖండించకపోవడం పీడిత వర్గాలను మరింత అణగదొక్కే ధోరణిలా కనిపిస్తోందని విమర్శించారు. అరెస్ట్ చేయాల్సిందే: రమా మేల్కొటే ప్రణయ్ హత్యకు ముందు ఆ జంటను విడదీసేందుకు బెదిరింపులకు దిగిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలను కూడా అరెస్ట్ చేయాలని ప్రొఫెసర్ రమామేల్కొటే డిమాండ్ చేశారు. పరువు హత్యలు, కులహంకార హత్యలతో సమాజాన్ని విడదీసేలా చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాచౌక్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సంతోషాన్నిచ్చినా ప్రణయ్లాంటి ఘటనలతో ఆ సంతోషం నిమిషాల్లో ఆవిరైపోతున్నాయన్నారు. పదవుల్లో ఉన్నవాళ్లు పరామర్శించాల్సింది: ‘సాక్షి’ఈడీ రామచంద్రమూర్తి ప్రణయ్ సంఘటనను పదవుల్లో ఉన్నవారు ఖండించపోవడం, కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం విచారకరమని ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. సీఎం కానీ, దళిత ఉపముఖ్యమంత్రి కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉంటే దళితుల్లో ధైర్యం పెరిగేదన్నారు. ఇందిరాగాంధీ పదవిలో ఉన్నప్పుడు బిహార్‌లో జరిగిన ఇలాంటి ఓ హత్య సమయంలో వేగంగా స్పందించారన్నారు. ఘటనా స్థలికి వెళ్లేందుకు మార్గం లేకపోయినా ఏనుగుపై వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారన్నారు. నెహ్రూ, ఇందిర కుటుంబాలను దళితులు ఎప్పుడూ మరవలేరని చెప్పారు. ప్రణయ్ హత్యను సమాజం మొత్తం ఖండించాలని, ఇది దళిత హక్కులను కాలరాసేలా కనిపిస్తోందని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని మేధావులు, పెద్దలు ఈ ఘటనను ఖండించాలన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సురేశ్‌చంద్ర హరి, సెంటర్ ఫర్దళిత్ స్టడీస్ ప్రతినిధులు, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి: జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ఒకప్పుడు పరువు హత్యలంటే ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరిగేవని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ పరువు హత్యలు, కుల హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కులాలుండవని, అక్కడ 90 శాతం ప్రేమ వివాహాలే జరుగుతున్నట్లు చెప్పారు. సమాజ సమస్యగా మారుతున్న ప్రణయ్ హత్యలాంటి ఘటనలను నియంత్రించాలన్నా, నిరోధించాలన్నా కులాంతర వివాహాలను ప్రభుత్వాలే పోత్సహించాలని డిమాండ్ చేశారు. -
కేరళలో దళితులను ఆదుకోవాలి: చుక్కా రామయ్య
హైదరాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో శ్రీమంతులు నిలదొక్కుకుంటున్నారని, దళిత, గిరిజన, ఆదివాసీలు మాత్రం నిరాశ్రయులయ్యారని అలాంటి వారిని ఆదుకుని మానవత్వం చాటాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, ఎస్సీ, ఎస్టీ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సాక్షి దినపత్రిక ఇటీవల చుక్కా రామయ్యకు జీవన సాఫల్య పురస్కారంతోపాటు రూ.లక్ష నగదును అందచేయగా, ఆ మొత్తాన్ని కేరళ వరద బాధితులకు అందించారు. కేరళకు చెందిన దళిత ఫ్యాంథర్స్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అంబుజాక్షన్‌కు ఆయన ఈ చెక్కును అందించారు. కేరళకు విదేశాల నుంచి వచ్చే సాయాన్ని తిరస్కరించరాదని, దాన్ని పేదల కోసం వినియోగించాలని రామయ్య సూచించారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కన్వీ నర్ మల్లేపల్లి లక్ష్మయ్య, మాజీ ఐఏఎస్ కాకి మాధవరావులు మాట్లాడుతూ.. కేరళలో నిమ్నవర్గాల పట్ల చూపిస్తున్న వివక్ష తగదని, అక్కడి ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు చుక్కా రామయ్య
-
ఇది ప్రజా ఉద్యమాల వేదిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీ కోసం ఏర్పాటు చేసిన కార్యాలయం పార్టీ కార్యక్రమాలకే కాకుండా ప్రజా ఉద్యమాలకూ వేదికగా ఉంటుందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ధర్నాచౌక్ ఎత్తివేశాక వేదికలు లేకుండాపోయాయని, అయితే న్యాయపరమైన డిమాండ్లు, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసే వారు వేదిక లేదని రంది పడాల్సిన అవసరం లేదని, టీజేఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని నిర్ణయాలు తీసుకోవచ్చని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులైనా మరెవరైనా దీనిని ఉపయోగించుకోవచ్చని, ప్రజా ఉద్యమాల సమాహారమే జన సమితి పార్టీ అని పేర్కొన్నారు. నాంపల్లి కేర్ ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేసిన పార్టీ కొత్త కార్యాలయాన్ని గురువారం మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్య ప్రారంభించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. ఇప్పటికే అన్ని జిల్లాల కమిటీలను ఏర్పాటు చేశామని, ఈ నెల 19, 20 తేదీల్లో పార్టీ రాజకీయ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల వారికి 19వ తేదీన కరీంనగర్లో శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, కొత్తగూడెం తదితర జిల్లాల వారికి 20వ తేదీన వరంగల్‌లో శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. ఆ తర్వాత మిగతా జిల్లాల వారికి మహబూబ్‌నగర్‌లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని సూచించారు. ఉద్యమ ఆకాంక్షల ధూంధాంకు మద్దతు ఇతర ప్రజా సంఘాలు జూన్ 1న తలపెట్టిన ఉద్యమ ఆకాంక్షల ధూం ధాంకు తమ మద్దతు ఉంటుందని కోదండరాం అన్నారు. రైతు సమస్యలపై 31వ తేదీన ఖమ్మం నుంచి కరీంనగర్ వరకు తలపెట్టిన సడక్ బంద్‌కు తమ మద్దతు ఉంటుందన్నారు. రికార్డుల్లో దొర్లిన తప్పుల కారణంగా రూ.4 వేలు రావడం ఏమో కానీ చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యల పరిష్కారంలో టీజేఎస్ కార్యకర్తలు ముందుండాలని సూచించారు. సెల్‌ఫోన్ ద్వారా పార్టీలో చేరే కార్యక్రమం ముమ్మరం చేయాలన్నారు. ఆన్లైన్ ద్వారా 500 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. కొత్త ఒరవడికి టీజేఎస్ నాంది చుక్కా రామయ్య మాట్లాడుతూ తెలంగాణలో కొత్త ఒరవడికి టీజేఎస్ నాంది పలకాలన్నారు. అంబేడ్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి కోదండరాం ముందుకు వస్తున్నారన్నారు. గతంలో తాము కన్న కలలను సాకారం చేయడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ప్రస్తుత పరిస్థితులతో అమరవీరుల ఆత్మ ఘోషిస్తోందని, కాబట్టి టీజేఎస్ నేతలు చట్ట సభల్లో వారి తరపున మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర నాయకులు వెంకట్‌రెడ్డి, ధర్మార్జున్, విద్యాధర్‌రెడ్డి, అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వికాసాన్ని మింగేస్తున్న ఒత్తిళ్లు
ఇంజనీరింగ్ విద్య పట్ల మొగ్గు అధికం కావడంతో తల్లిదండ్రులు మామూలు కాలేజీలో కాక ఐఐటీలో తమ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారు. ఆపై అమెరికా పంపితే, వారి భవిష్యత్తు అంతా డాలర్ల పంటేనని కలలు కంటున్నారు. ఈ ఐఐటీ మోజుని కార్పొరేట్ కళాశాలలు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఐఐటీ ఎంట్రన్స్ రాయగలిగే సామర్థ్యం, ఆపై చదివేందుకు కావలసిన పునాది విద్యార్థికి ఉందా లేదా అన్న మదింపు చేయకుండా వేల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకొని తరగతి గదులలో కుక్కుతున్నారు. విద్యారంగంలో ప్రస్తుతం విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. మానసిక ఒత్తిడిని తట్టుకోలేని పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. అనుకున్న ర్యాంక్ రాలేదనో, కావాలనుకున్న విభాగంలో సీటు దక్కదనో, పరీక్షలో తన సామర్థ్యం సరిపోవడం లేదనో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు, బంధువుల దృష్టి అంతా విద్యార్థి మీదనే. కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకుల ఆశాదీపం కూడా విద్యార్థే. ఇంతమందీ తనవైపే చూస్తుంటే, తానేమో చదువులో వారందరూ ఆశించిన రీతిలో రాణించలేక పోతున్నానన్న ఒత్తిడితో విద్యార్థులు సతమతమవుతున్నారు. ఇప్పుడిప్పుడే లోకం పోకడ తెలుసుకుంటున్న వారి మనసుకు మరో మార్గం కన్పించక మరణమే శరణ్యమన్న భావన బలపడుతున్నది. ప్రభుత్వం దీనికి స్పందిస్తోంది. కాలేజీలను తనిఖీ చేయిస్తామంటోంది. పెనాల్టీలు విధిస్తామంటోంది. అవసరమైతే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామంటోంది. ప్రస్తుతం విద్యారంగంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ ప్రభుత్వాలనే నియంత్రించే స్థాయిలో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలు ఈ హెచ్చరికలను తాటాకు చప్పుళ్లుగా పరిగణించి పెడచెవిన పెడతాయా? లేకపోతే భయపడి దారికి వస్తాయా? వేచి చూడవలసిందే. కానీ ఈ చర్యలే పరిష్కారమా? వీటివల్లనే విద్యార్థులపై ఒత్తిళ్ళు ఆగి పోతాయా? లేదు. ఇది కేవలం వ్యాధికి పైపైన చేసే చికిత్సే తప్ప, రుగ్మతల మూలాన్ని శోధించి, శాశ్వతంగా నిర్మూలించే ప్రయత్నం మాత్రం కాదు. అలా జరగాలంటే విద్యార్థులపై ఒత్తిళ్ళకు మూల కారణాల కోసం అన్వేషించాలి. చదువుల గమ్యం ఏమిటి? అన్న ప్రశ్నలో ప్రస్తుత సంక్షోభానికి మూలాలు దాగి ఉన్నాయి. విద్య లక్ష్యం ఏమిటి? మనిషిలో చైతన్యానికి సాధనం విద్య. అంతర్గత అవలోకనానికి ఉపకరణం. ఇలా కలిగించిన చైతన్యం జ్ఞానార్జనగా మారి జీవితపర్యంతం కొనసాగుతుంది. కొత్త విషయం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్న తపన మనిషి తుది శ్వాసదాకా జ్వలి స్తూనే ఉండటానికి ఇదే కారణం. విద్య వల్ల సామాజిక పరివర్తన సాధ్యపడుతుంది. సాంస్కృతిక ఉద్దీపన అంకురిస్తుంది. విద్య వల్ల ఒనగూరే ఈ ప్రయోజనాల స్థానాన్ని నేడు ఆర్థిక లబ్ధి ఆక్రమించడం ప్రస్తుత అనర్థాలకు వెనుక ఉన్న కారణం. విద్యార్థికి నేర్పాల్సిన చదువు ఉద్దేశం ధనార్జన మార్గం కావడమే అసలు రుగ్మత. విద్య పెట్టుబడి వస్తువుగా మారడమే నేటి సంక్షోభానికి హేతువు. దీనికి విషబీజాలు అమెరికాలో పడ్డాయి. ఈ విషబీజాలు అక్కడివే! అమెరికాలో ఉన్నత విద్యాసంస్థలు, పారిశ్రామికరంగం పరస్పరాధారితాలు. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు ఒకదాని ఆధారంగా మరొకటి పనిచేస్తుంటాయి. యూనివర్సిటీల పాలకమండళ్లలో పారిశ్రామికవేత్తలు, సంస్థలకు ప్రాతినిధ్యం ఉంటుంది. వారు విశ్వవిద్యాలయ నిర్వహణ, అభివృద్ధికి నిధులు ఇస్తుంటారు. వారి ఆర్థిక తోడ్పాటుతోనే విశ్వవిద్యాలయాలు వృద్ధి చెందుతుంటాయి. అలాగే విశ్వవిద్యాలయాలలో జరిగే పరిశోధనల లక్ష్యం పరిశ్రమలకు ఉపకరించడమే. అక్కడి పరిశోధనల ఆధారంగా పరిశ్రమలు నూతన ఉత్పత్తులు చేపట్టి మార్కెట్లోకి తీసుకువస్తాయి. ఈ ప్రక్రియ సాఫీగా సాగేందుకు విశ్వవిద్యాలయాలలో పరిశోధనలకు సార«థ్యం వహించే ప్రొఫెసర్లే ఒక పరిశోధన కొలిక్కిరాగానే దీర్ఘకాల సెలవు పెట్టి ఆ పరిశోధనలను అమలు పెట్టబోతున్న పరిశ్రమలో తాత్కాలికంగా చేరి సేవలు అంది స్తుంటారు. పరిశోధనలు చేసిన ప్రొఫెసర్లే ఉత్పత్తి రూపకల్పనలో పాలు పంచుకోవడం వల్ల సాధారణంగా సత్ఫలితాలే వస్తాయి. ఇది ఒక కోణం అయితే మరొక కోణం – పరిశ్రమల్లో వాణిజ్య ఉత్పత్తికి మానవ వనరుల అవసరం. ఈ మానవ వనరులను కూడా విశ్వవిద్యాలయాల్లో అవసరమైన నైపుణ్యాలలో తర్ఫీదు ఇచ్చి పరిశ్రమకు పంపుతారు. మళ్లీ అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్లే ఉండి ఎంపికలు జరుపుతారు. ఈ విధంగా పరిశ్రమల కారణంగా విశ్వవిద్యాలయాలు బాగుపడుతుంటాయి. అదేవిధంగా పరిశ్రమలు అపార సంపదను కూడబెడుతుంటాయి. ఈ ఏర్పాటు చూడటానికి ఎంతో బాగున్నట్టు అన్పిస్తుంది. ఎవరికైనా, ‘మంచిదే కదా... రెండూ బాగుపడుతున్నాయి’ అన్న భావన కలగడం సహజం. అయితే ఆర్థికకోణం నుంచి చూసినపుడు ఈ ఏర్పాటు ఉభయతారకంగా అనిపించినపుడు కాని, ఇందులో లోపిస్తున్నది సామాజిక మానవీయ కోణమన్న సంగతి అర్థంకాదు. సమాజానికి ధనం ఒక్కటే అవసరం కాదు. అది ఉన్నవాడి దగ్గరే మరింత పోగుపడడం కాదు. ధనాన్ని సృష్టించింది సమాజమే. అందుకే ధనం సమాజంలో ఒక భాగం మాత్రమే. సమాజానికి ఇంతకుమించి ఉన్నత లక్ష్యాలున్నాయి. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం విద్య దోహదపడాలి. కేవలం ఆర్థిక ఫలితాల కోసమే విద్య కాదు. సామాజిక పరివర్తనకు విద్య ఒక ఆయుధం. సామాజిక చైతన్యానికి, ప్రజాస్వామ్య పరిపుష్టికి, లౌకిక భావాల వ్యాప్తికి, దేశభక్తి ప్రేరేపించేందుకు, విద్య ఒక ఉపకరణంలా నిలవాలి. కానీ అమెరికాలో విద్య ఆదాయ వనరుగా, సంపద సృష్టి మార్గంగా భావించి పరిశ్రమలు, కంపెనీలు ఉన్నత విద్యాలయాలలో పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు. పరిశోధనలు సత్ఫలితాలు రావాలంటూ ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. దానితో పరిశ్రమలు విశ్వవిద్యాలయాల పరిశోధనల ఆధారంగా ఉత్పత్తులు తీసుకువస్తే వాటి ఆదాయంలో యూనివర్సిటీలు వాటా డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. ఇక్కడితో అమెరికాలో ఉన్నత విద్య లాభార్జనకే అన్నది (ఎడ్యుకేషన్ ఫర్ ప్రాఫిట్) ఖరారు అయిపోయింది. దీని ప్రభావం మనదేశంపై మరొక విధంగా పడింది. అంతిమ గమ్యం అమెరికానే! మన దేశంలో ఇంజనీరింగ్ విద్య పట్ల మొగ్గు అధికం కావడంతో తల్లిదండ్రులు మామూలు కాలేజీలోకాక మంచి భవిష్యత్తు ఉండే ఐఐటీలో తమ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారు. ఐఐటీల్లో చదివించి ఆపై ఎం.ఎస్.కు అమెరికా పంపితే ఆపై వారి భవిష్యత్త అంతా డాలర్ల పంటేనని కలలు కంటున్నారు. తల్లిదండ్రుల ఈ ఐఐటీ మోజుని కార్పొరేట్ కళాశాలలు సొమ్ము చేసుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. ఐఐటీ ఎంట్రన్స్ రాయగలిగే సామర్థ్యం, ఆపై ఐఐటీల్లో చదివేందుకు కావలసిన పునాది విద్యార్థికి ఉందా లేదా అన్న మదింపు చేయకుండా వేల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకొని తరగతి గదులలో కుక్కుతున్నారు. తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ ఫీజులు పిండడం కోసం తమ వద్ద ర్యాంకులు తెచ్చుకున్న వారంటూ ఫొటోలు చూపుతారు. నిజంగా ఆ ర్యాంకులు వచ్చినవారు తమ సహజ సొంత ప్రతిభతో సాధించుకొని ఉండవచ్చు. లేదా వేలమందిలో గుప్పెడు ర్యాంకులు వచ్చి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రులు కాస్త తార్కికంగా ఆలోచించాల్సింది పోయి ప్రచారపు రొంపిలో ఇరుక్కుంటున్నారు. ఒక ర్యాంకు చూపితే వేల అడ్మిషన్లు వస్తాయని చాలా సందర్భాలలో కార్పొరేట్ కళాశాలలు ర్యాంకుల్ని కొంటున్నాయి కూడా. మొత్తం మీద తల్లిదండ్రులు కూడా ఈ రొంపిలో పడుతున్నారు. కార్పొరేట్ కళాశాలలను అమెరికాకు పాస్‌పోర్ట్ ఇచ్చే సంస్థలన్నట్టు కొందరు తల్లిదండ్రులు నమ్ముతున్నారంటే ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ఈ విధంగా మనదేశంలో కూడా మంచి చదువు కాసులు కురిపిస్తుందన్న విశ్వాసానికి సగటు మనిషి వచ్చేశాడు. చదువు వల్ల వచ్చే ఒకే ఒక ఫలితం ధనమే అయిపోయింది. దీని వల్లనే విద్యార్థిపై అటు కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకులు, ఇటు తల్లిదండ్రులు ఒత్తిడి పెంచేస్తున్నారు. దీని ఫలితమే విద్యార్థుల ఆత్మహత్యలు. తనపై మితిమీరిన ఆశలు పెట్టుకొన్న తల్లిదండ్రులు, మరోపక్క ర్యాంకులు తెచ్చుకోవాలంటూ కార్పొరేట్ కళాశాలలు మెడమీద కత్తి పెడుతున్నాయి. దానితో మరో దారిలేక విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. ఈ కోణం నుంచి చూడకుండా కేవలం కార్పొరేట్ కళాశాలలపై దాడులు చేస్తే వ్యాధి ఒక చోట ఉంటే చికిత్స మరొక చోట చేసినట్టవుతుంది. దిద్దుబాటు చర్యలు ఏమిటి? తల్లిదండ్రుల దృక్పథం మారాలి. తమ పిల్లలు ఐఐటీల్లోనే చదవాలన్న అత్యాశను వదులుకోవాలి. అలాగే అందరి పిల్లల్లాగానే తమ పిల్లలు అమెరికా వెళ్లిపోవాలన్న కోరిక గురించి పునరాలోచించుకోవాలి. పిల్లలకు ఇష్టం లేకపోయినా ఐఐటీలకు పంపి ఒత్తిడి కలిగించడం కంటే వారికి ఇష్టమైన రంగాన్ని ఎంచుకోనివ్వాలి. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఆసక్తి చూపేవారు తగ్గితే సహజంగానే కార్పొరేట్ కళాశాలల దూకుడు తగ్గుతుంది. కార్పొరేట్ సంస్థలు ర్యాంకుల ప్రకటనను ముద్రణ, ప్రసార మాధ్యమాల్లో ఇతరత్రా రాకుండా చూడాలి. ఉల్లంఘిస్తే చర్యలు ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై దృష్టి పెట్టి మానవ వనరుల విధానాన్ని రూపకల్పన చేయాలి. ఇందులో రాబోయే పదేళ్ల పాటు ఏయే రంగాలలో ఏ విద్యార్హతలు గల నిపుణులు, ఉన్నత విద్యావంతులు అవసరమో ప్రకటించి ప్రచారం కల్పించాలి. ఆయా రంగాలలో కాలుమోపిన వారికి గల ఉజ్జ్వల అవకాశాలను ఆవిష్కరించాలి. దీని ద్వారా పరాయి దేశం పోవడం కంటే ఇక్కడే ఉండి నచ్చిన రంగంలో స్థిరపడవచ్చునన్న ఆశ విద్యార్థులు, తల్లిదండ్రులకు కలుగుతుంది. ఉన్నత విద్యను ఆదాయ కల్పవృక్షంగా చూడకుండా విద్యార్థిలో అది తీసుకువచ్చే మానసిక, సామాజిక మార్పులను సామాన్యుల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. తయారీ రంగం, స్టార్టప్‌లకు దేశంలో ప్రస్తుతం ఉన్న సానుకూల ప్రోత్సాçహకర వాతావరణం రీత్యా ఉన్నత విద్యకు వచ్చిన వారిలో ఆసక్తిగల వారిని గుర్తించి ఉద్యోగం కోసం చేయి చాచకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేందుకు కావలసిన అవకాశాలు కల్పించాలి. మొత్తం మీద లాభార్జన కోసమే విద్య అన్న భావనకే మనవారి దృష్టి స్థిరపడడానికి ముందే ప్రభుత్వాలు కళ్లు తెరచి చొరవ చూపాలి. లేకపోతే అమెరికా చవిచూస్తున్న విషఫలాలే భవిష్యత్తులో మనమూ అందుకునే ప్రమాదం ఉంది. ఈ దిశగా కృషి చేయడం వల్ల మన పిల్లలపై ఒత్తిడి తగ్గి ఆత్మహత్యలు కనుమరుగవుతాయన్నదే ఆశ. చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
విద్యావికాసంతోనే దేశాభివృద్ధి
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య రాజానగరం: ఏ దేశం అభివృద్ధిని సాధించా లన్నా విద్యారంగం అభివృద్ధి చెందితేనే సాధ్యమవుతుందని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామ య్య అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని దివాన్‌చెరువులో శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులకు ఉపయోగపడే విధంగా గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలలో సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎకడమిక్ ఎక్సలెన్స్ ఇన్ స్కూల్స్ (స్పేస్) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే పునశ్చరణ తరగతులను శనివారం ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటిరోజు పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గతంలో ప్రకృతి వనరులనే సంపదగా భావించేవారని, కానీ 21వ శతాబ్దంలో మానవ వనరులనే దేశ సంపదగా భావిస్తున్నారన్నారు. ఈ కారణంగా వా రికి తగిన నైపుణ్యాలను అందించాలంటే ఉపాధ్యాయులు, ఆలోచన అనే వాటి పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులలో యోగ్యతా ప్రమాణాల స్థాయిని పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కేవలం ఐఐటీ కోసమే కాదు.. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్పేస్ కార్యదర్శి కేవీ బ్రహ్మం మాట్లాడుతూ స్పేస్ కేవలం ఐఐటీ కోసమే కాదని, విద్యా విధానం, వ్యవస్థలలో మా ర్పు కోసం కృషి చేస్తుందని అన్నారు. గౌరవ అతిథి సీతామూర్తి మాట్లాడుతూ ‘స్వరాజ్, సత్యాగ్రహ, స్వధర్మ, సర్వోదయ, స్వదేశ్’ అనే పంచధర్మాలను విద్యార్థులకు అవగతం చేసి, ఆచరించేలా చూడాలన్నారు. జీవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ చుక్కా రామయ్య ఎంతో దార్శనికతతో 14 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ‘స్పేస్’ ని నేడు ప్రపంచమంతటా అనుసరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజ యప్రకాష్, తెలుగు రాష్ట్రాలలోని స్పేస్ స్కూల్స్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నైపుణ్యాల పేరుతో కార్పొరేటీకరణకు కుట్ర
సాక్షి, సిటీబ్యూరో: కేంద్రం ప్రభుత్వం అమలు చేయనున్న జాతీయ నూతన విద్యావిధానంలో సామాజిక అంశాలు, గ్రామీణ ప్రజల స్థితిగతులకు చోటు దక్కలేదని పలువురు విద్యావేత్తలు అన్నారు. కార్పొరేట్, మార్కెటింగ్ అంశాలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానం ముసాయిదాను రూపొందించారని ఆరోపించారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం ‘న్యూ ఎడ్యుకేషన్ పాలసీ’పై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఒకవైపు దేశ ప్రాచీన విద్యను శ్లాఘిస్తూనే.. మరోవైపు విదేశీ యూనివర్సిటీల ఏర్పాటుకు రెడ్ కార్పెట్ వేయడం దారుణమన్నారు. విద్యను సామాజిక రాజకీయ అంశంగా పరిగణించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాల పేరుతో కార్పొరేట్, గ్లోబలైజేషన్‌కు పెద్దపీట వేస్తోందని, గ్రామీణ జీవన విధానం మెరుగుపడే దిశగా ఆలోచించడం లేదన్నారు. ప్రైవేటు చేతిలో విద్య ఎందుకు ఉండాలన్న ప్రశ్నకు సమాధానం లేదని, దేశ అవసరాలు, డిమాండ్లు, సమానత్వ భావన, విలువలను ప్రస్తావిస్తే అందరికీ సమానమైన విద్య దక్కుతుందన్నారు. ప్రభుత్వం వైఖరి కారణంగా నాణ్యమైన విద్య కొందరికే పరిమితమైందని, బడుగు, బలహీన వర్గాలు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలే విద్యా విధానాన్ని బ్రష్టు పట్టించాయని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. కేవలం మార్కుల కోసమే.. తప్ప పాఠ్య సారాంశాన్ని అర్థం చేసుకునే విధానాన్ని గాలి కొదిలేశారన్నారు. పరీక్షలపైనే దృష్టి కేంద్రీకరిస్తుండడంతో విద్యార్థుల్లో సృజనాత్మకత క్షీణిస్తుందన్నారు. కార్పొరేట్ శక్తులు విద్యార్థిని వినియోగదారునిగా, టీచర్‌ను షాప్ కీపర్‌గా, తల్లిదండ్రులను స్టాక్ హోల్డర్లుగా మార్చాయని ధ్వజమెత్తారు. ప్రగతికి ఎవరూ అడ్డుకాదని, ఎక్స్‌లెన్స్ కంటే సమానత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. లేని పక్షంలో ప్రభుత్వ విద్యా విధానాలు గాలిలో మేడలవుతాయన్నా రు. నూతన విద్యా విధాన ముసాయిదాను నిరసిస్తూ ఈనెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నట్లు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ కె. చక్రధరరావు తెలిపారు. సమావేశంలో డాక్టర్. కె. లక్ష్మినారాయణ, మనోహర్ పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో వైజ్ఞానిక స్ఫూర్తిని నింపాలి
లిఫ్ట్ ఇస్తారా.. సార్ నిత్యం ‘లెఫ్ట్..రైట్..లెఫ్ట్..రైట్’ అంటూ విధి నిర్వహణలో తలమునకలై ఉండే రాష్ట్ర పోలీస్ బాస్ ప్రసాదరావు కాసేపు స్టూడెంట్‌లా మారిపోయారు. విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. లిఫ్ట్ పనిచేసే విధానాన్ని డీజీపీకి వివరిస్తున్న ఓ విద్యార్థి. రాంగోపాల్‌పేట్, న్యూస్‌లైన్: విద్యార్థులకు విద్యతో పాటు వైజ్ఞానిక స్ఫూర్తిని చిన్ననాడే నింపాల్సిన బాధ్యత గురువులపై ఉందని రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రసాదరావు సూచించారు. మంగళవారం సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల 150వ వార్షికోత్సవాలు, స్వామి వివేకానంద 150వ జయంతుత్సవాల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్, రిసోర్స్ సెంటర్, మ్యూజియమ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞానిక అంశాల్లో ప్రయోగాత్మకంగా వివరించడం మూలంగా వారిలో పాఠ్యాంశాలు సులభంగా అర్ధం కావడంతో పాటు అది వారిలో ఈ అంశాల్లో సరికొత్త అంశాలపై ఆలోచనా శక్తి కూడా పెరుగుతుందన్నారు. 150 ఏళ్లుగా ఉత్తమ విద్యాబోధనలతో ఇప్పటికీ అదే పంథాలో మహబూబ్ కళాశాల కొనసాగుతుండటం అభినందించదగ్గ విషయమన్నారు. ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ సైన్సు పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని కలిగించి దేశానికి ఉపయోగపడే మేధావులను తయారు చేయాలని సూచించారు. నేటి విద్యా వ్యవస్థలో నైతిక విలువలు బోధించడం లోపించడం మూలంగానే నేడు అనేక ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు ప్రజల్లో ఉండే మూఢనమ్మకాలు తొలగించేందుకు పలు రకాల అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ గోపాల్‌రెడ్డి, పాఠ శాల పాలక మండలి అధ్యక్షులు సీబీ నాంధేవ్, కార్యదర్శి డాక్టర్ విద్యారాణి, కరస్పాండెంట్ భగవత్ వారణాసీ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సత్య ప్రసాద్, ఎన్ఐఎన్ చీఫ్ సైంటిస్టు వి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆసక్తిగా పరిశీలించిన డీజీపీ మహబూబ్ కళాశాలలో నూతనంగా ప్రారంభించిన సైన్స్ రిసోర్స్ సెంటర్, మ్యూజియంలో సైన్సు ప్రయోగాలకు చెందిన పలు నమూనాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఏర్పాటు చేసిన ఈ నమూనాలను డీజీపీ ఆసక్తిగా తిలకిస్తూ వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయంగా వాటి పనితీరును పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో ఓ మొక్కను నాటారు.