విద్యార్థుల్లో వైజ్ఞానిక స్ఫూర్తిని నింపాలి
లిఫ్ట్ ఇస్తారా.. సార్
నిత్యం ‘లెఫ్ట్..రైట్..లెఫ్ట్..రైట్’ అంటూ విధి నిర్వహణలో తలమునకలై ఉండే రాష్ట్ర పోలీస్ బాస్ ప్రసాదరావు కాసేపు స్టూడెంట్‌లా మారిపోయారు. విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. లిఫ్ట్ పనిచేసే విధానాన్ని డీజీపీకి వివరిస్తున్న ఓ విద్యార్థి.
రాంగోపాల్‌పేట్, న్యూస్‌లైన్:
విద్యార్థులకు విద్యతో పాటు వైజ్ఞానిక స్ఫూర్తిని చిన్ననాడే నింపాల్సిన బాధ్యత గురువులపై ఉందని రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రసాదరావు సూచించారు. మంగళవారం సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల 150వ వార్షికోత్సవాలు, స్వామి వివేకానంద 150వ జయంతుత్సవాల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్, రిసోర్స్ సెంటర్, మ్యూజియమ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞానిక అంశాల్లో ప్రయోగాత్మకంగా వివరించడం మూలంగా వారిలో పాఠ్యాంశాలు సులభంగా అర్ధం కావడంతో పాటు అది వారిలో ఈ అంశాల్లో సరికొత్త అంశాలపై ఆలోచనా శక్తి కూడా పెరుగుతుందన్నారు. 150 ఏళ్లుగా ఉత్తమ విద్యాబోధనలతో ఇప్పటికీ అదే పంథాలో మహబూబ్ కళాశాల కొనసాగుతుండటం అభినందించదగ్గ విషయమన్నారు.
ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ సైన్సు పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని కలిగించి దేశానికి ఉపయోగపడే మేధావులను తయారు చేయాలని సూచించారు. నేటి విద్యా వ్యవస్థలో నైతిక విలువలు బోధించడం లోపించడం మూలంగానే నేడు అనేక ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు ప్రజల్లో ఉండే మూఢనమ్మకాలు తొలగించేందుకు పలు రకాల అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీఈఆర్టీ డెరైక్టర్ గోపాల్‌రెడ్డి, పాఠ శాల పాలక మండలి అధ్యక్షులు సీబీ నాంధేవ్, కార్యదర్శి డాక్టర్ విద్యారాణి, కరస్పాండెంట్ భగవత్ వారణాసీ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సత్య ప్రసాద్, ఎన్‌ఐఎన్ చీఫ్ సైంటిస్టు వి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఆసక్తిగా పరిశీలించిన డీజీపీ
మహబూబ్ కళాశాలలో నూతనంగా ప్రారంభించిన సైన్స్ రిసోర్స్ సెంటర్, మ్యూజియంలో సైన్సు ప్రయోగాలకు చెందిన పలు నమూనాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఏర్పాటు చేసిన ఈ నమూనాలను డీజీపీ ఆసక్తిగా తిలకిస్తూ వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయంగా వాటి పనితీరును పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో ఓ మొక్కను నాటారు.