మాట్లాడుతున్న చుక్కా రామయ్య
సాక్షి, సిటీబ్యూరో: కేంద్రం ప్రభుత్వం అమలు చేయనున్న జాతీయ నూతన విద్యావిధానంలో సామాజిక అంశాలు, గ్రామీణ ప్రజల స్థితిగతులకు చోటు దక్కలేదని పలువురు విద్యావేత్తలు అన్నారు. కార్పొరేట్, మార్కెటింగ్ అంశాలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానం ముసాయిదాను రూపొందించారని ఆరోపించారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం ‘న్యూ ఎడ్యుకేషన్ పాలసీ’పై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఒకవైపు దేశ ప్రాచీన విద్యను శ్లాఘిస్తూనే.. మరోవైపు విదేశీ యూనివర్సిటీల ఏర్పాటుకు రెడ్ కార్పెట్ వేయడం దారుణమన్నారు. విద్యను సామాజిక రాజకీయ అంశంగా పరిగణించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాల పేరుతో కార్పొరేట్, గ్లోబలైజేషన్‌కు పెద్దపీట వేస్తోందని, గ్రామీణ జీవన విధానం మెరుగుపడే దిశగా ఆలోచించడం లేదన్నారు. ప్రైవేటు చేతిలో విద్య ఎందుకు ఉండాలన్న ప్రశ్నకు సమాధానం లేదని, దేశ అవసరాలు, డిమాండ్లు, సమానత్వ భావన, విలువలను ప్రస్తావిస్తే అందరికీ సమానమైన విద్య దక్కుతుందన్నారు.
ప్రభుత్వం వైఖరి కారణంగా నాణ్యమైన విద్య కొందరికే పరిమితమైందని, బడుగు, బలహీన వర్గాలు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలే విద్యా విధానాన్ని బ్రష్టు పట్టించాయని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. కేవలం మార్కుల కోసమే.. తప్ప పాఠ్య సారాంశాన్ని అర్థం చేసుకునే విధానాన్ని గాలి కొదిలేశారన్నారు. పరీక్షలపైనే దృష్టి కేంద్రీకరిస్తుండడంతో విద్యార్థుల్లో సృజనాత్మకత క్షీణిస్తుందన్నారు. కార్పొరేట్ శక్తులు విద్యార్థిని వినియోగదారునిగా, టీచర్‌ను షాప్ కీపర్‌గా, తల్లిదండ్రులను స్టాక్ హోల్డర్లుగా మార్చాయని ధ్వజమెత్తారు.
ప్రగతికి ఎవరూ అడ్డుకాదని, ఎక్స్‌లెన్స్ కంటే సమానత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. లేని పక్షంలో ప్రభుత్వ విద్యా విధానాలు గాలిలో మేడలవుతాయన్నా రు. నూతన విద్యా విధాన ముసాయిదాను నిరసిస్తూ ఈనెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నట్లు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ కె. చక్రధరరావు తెలిపారు. సమావేశంలో డాక్టర్. కె. లక్ష్మినారాయణ, మనోహర్ పాల్గొన్నారు.