సాక్షి, అమరావతి: సంస్థాగత అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి.. తదనుగుణంగా కార్యక్రమాలు అమలు చేసే సంస్థలకు మాత్రమే ఇకపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిధులు అందించనుంది. నూతన విద్యా విధానం–2020 ప్రకారం.. యూజీసీ ఈ మేరకు అన్ని ఉన్నత విద్యా సంస్థలకు నూతన ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఐడీపీ) ప్రణాళికలు రూపొందించడంలో అనుసరించాల్సిన అంశాలను ముసాయిదాలో వివరించింది. అధ్యాపకులుగా నిపుణుల నియామకం, వారి కోసం ఫాస్ట్ ట్రాకింగ్ ప్రమోషన్ సిస్టమ్, క్యాంపస్‌ల ఆడిట్‌లు, సమర్థవంతమైన బోధన, అభ్యాసం కోసం భౌతిక, మౌలిక సదుపాయాలను పెంచడం వంటి అంశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
యూజీసీ ఆధ్వర్యంలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ డైరెక్టర్ అవినాష్ చంద్ర పాండే అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ (ఏఐసీటీఈ), హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్‌లు కూడా ఐడీపీలను అనుసరించే నిధులు విడుదల చేయనున్నాయి.
ఆయా ఉన్నత విద్యా సంస్థలు తయారుచేసిన ఐడీపీలు, వాటి అమలులో సాధించిన పురోగతి, పారదర్శక ప్రమాణాల ఆధారంగా ఉన్నత విద్యకు నిధులు వస్తాయని యూజీసీ పేర్కొంది. ప్రస్తుతానికి.. యూజీసీ ఉన్నత విద్యా సంస్థలకు నిధులు సమకూరుస్తుండగా ఇకపై హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ నిధులను అందించనుంది.
అధ్యాపకుల్లో 50 శాతం పరిశ్రమల నిపుణులు..
ప్రొఫెషనల్ కాలేజీల్లో వివిధ విభాగాల్లో థియరీ, ప్రాక్టికల్ మధ్య సమతుల్యతను కొనసాగించడానికి మొత్తం అధ్యాపకుల్లో 50 శాతం మంది వృత్తి నిపుణులు లేదా పారిశ్రామిక నిపుణులుండాలని యూజీసీ పేర్కొంది. సంస్థాగతంగా పరిశోధన, బోధన కార్యక్రమాలు అత్యున్నతంగా కొనసాగేందుకు బోధన సిబ్బందికి తగిన ప్రోత్సాహకాలు ఎప్పటికప్పుడు అందించాలని సూచించింది.
ఫ్యాకల్టీ కోసం ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. సిబ్బంది పదవీకాలం, పదోన్నతి ఇంక్రిమెంట్ల కోసం అధ్యాపకుల పనితీరును సరిగ్గా అంచనా వేయడానికి ఉన్నత విద్యా సంస్థలు ‘పీర్ స్టూడెంట్ రివ్యూలు’తో సహా బహుళ ప్రమాణాల వ్యవస్థని రూపొందించాలని సూచించింది.
అంతేకాకుండా ప్రతి ఉన్నత విద్యా సంస్థ యూజీసీ నిర్దేశించిన ఫ్యాకల్టీ, విద్యార్థి నిష్పత్తిని తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ప్రతి సంస్థ విద్య, మౌలిక వసతులను మెరుగుపరచడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని వెల్లడించింది.
విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థుల అభీష్టానికనుగుణంగా ఆన్‌లైన్ లెర్నింగ్, బ్లెండెడ్ లెర్నింగ్ కోసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. సామర్థ్యం గల విద్యార్థులను గుర్తించి క్రీడలు, కళల్లో ప్రోత్సహించాలని సూచించింది.
ప్రమాణాలు లేని కళాశాలలను అనుమతించరాదు..
వివిధ రాష్ట్రాల ఉన్నత విద్యా సంస్థల్లో విద్యా, మౌలిక వసతులకు సంబంధించి డేటా సరిగా లేదని యూజీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి రాష్ట్రం.. తక్కువ పనితీరు చూపుతున్న వర్సిటీలు, గుర్తింపు, ప్రమాణాలు లేని కళాశాలలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇలాంటి సంస్థల సంఖ్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు సమాచారాన్ని క్రోడీకరించాలని సూచించింది.
ఆయా విద్యా సంస్థలు.. అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, విద్యాపరమైన సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగించాలని తెలిపింది. అన్ని ఉన్నత విద్యా సంస్థలు తప్పనిసరిగా తమ క్యాంపస్‌లలో భూ సంబంధిత ఆడిట్‌ను చేపట్టాలని సూచించింది.
సంస్థాగత అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తేనే నిధులు
Published Mon, Dec 19 2022 5:22 AM | Last Updated on Mon, Dec 19 2022 5:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment