సాక్షి, అమరావతి: ఆరేళ్ల లోపు పిల్లల్లో మెదడు ఎదుగుదల అధికంగా ఉంటుంది. ఆ వయసులో మానసిక వికాసానికి సాన పెట్టాలి. అయితే దేశంలో ఇప్పటికీ 3.7 కోట్ల మందికి పైగా బాలలు పూర్వ బాల్య విద్యకు దూరమైనట్లు ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం సత్ఫలితాలనివ్వాలంటే పూర్వ బాల్యవిద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొంది.
విద్యాహక్కు చట్టం–2009, నేషనల్ ఈసీసీఈ పాలసీ–2013, జాతీయ నూతన విద్యావిధానం–2020లో పూర్వ బాల్య విద్య ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే పూర్వ బాల్య విద్యకు తగినన్ని నిధులు కేటాయించాలి. 3– 6 ఏళ్ల వయసు వారి విద్యాభ్యాసాన్ని పాఠశాల విధానంలో చేర్చేలా ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టాలని నూతన విద్యావిధానం సిఫార్సు చేసింది.
2011 జనాభా లెక్కల నివేదిక పూర్వ బాల్య విద్యకు అర్హులైన బాలలు దేశంలో 10 కోట్ల మంది ఉన్నారు. ప్రస్తుతం పూర్వ బాల్య విద్య, ప్రాథమిక విద్యకు దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 0.1 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తుండగా కనిష్టంగా 1.6 నుంచి 2.2 శాతం వరకు పెంచాలి. అమెరికా, యూకే, ఈక్వెడార్ లాంటి దేశాల్లో 1.17 శాతం వరకు నిధులు కేటాయిస్తున్నారు.
రాష్ట్రంలో బాల్య విద్య భేష్
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక విద్యారంగ సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్వ బాల్య విద్య, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యమిచ్చారు. జాతీయ నూతన విద్యావిధానం కంటే ముందే రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక విద్యకు రూపకల్పన చేశారు. అంగన్‌వాడీలను స్కూళ్లతో అనుసంధానించి పీపీ–1, పీపీ–2 తరగతులతో ఫౌండేషన్ స్కూళ్లకు శ్రీకారం చుట్టారు. పూర్తిగా బాలల కోసమే ప్రత్యేక బడ్జెట్ పెట్టి ఏటా రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. 2021–22లో సీఎం జగన్ ప్రభుత్వం రూ.16,748.47 కోట్లతో తొలిసారిగా బాలల బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2022 – 23లో ఇందుకోసం రూ.16,903 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment