Save The Children
-
దేశంలో బాల్యవిద్య బలహీనమే!
సాక్షి, అమరావతి: ఆరేళ్ల లోపు పిల్లల్లో మెదడు ఎదుగుదల అధికంగా ఉంటుంది. ఆ వయసులో మానసిక వికాసానికి సాన పెట్టాలి. అయితే దేశంలో ఇప్పటికీ 3.7 కోట్ల మందికి పైగా బాలలు పూర్వ బాల్య విద్యకు దూరమైనట్లు ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం సత్ఫలితాలనివ్వాలంటే పూర్వ బాల్యవిద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొంది. విద్యాహక్కు చట్టం–2009, నేషనల్ ఈసీసీఈ పాలసీ–2013, జాతీయ నూతన విద్యావిధానం–2020లో పూర్వ బాల్య విద్య ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే పూర్వ బాల్య విద్యకు తగినన్ని నిధులు కేటాయించాలి. 3– 6 ఏళ్ల వయసు వారి విద్యాభ్యాసాన్ని పాఠశాల విధానంలో చేర్చేలా ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టాలని నూతన విద్యావిధానం సిఫార్సు చేసింది. 2011 జనాభా లెక్కల నివేదిక పూర్వ బాల్య విద్యకు అర్హులైన బాలలు దేశంలో 10 కోట్ల మంది ఉన్నారు. ప్రస్తుతం పూర్వ బాల్య విద్య, ప్రాథమిక విద్యకు దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 0.1 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తుండగా కనిష్టంగా 1.6 నుంచి 2.2 శాతం వరకు పెంచాలి. అమెరికా, యూకే, ఈక్వెడార్ లాంటి దేశాల్లో 1.17 శాతం వరకు నిధులు కేటాయిస్తున్నారు. రాష్ట్రంలో బాల్య విద్య భేష్ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక విద్యారంగ సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్వ బాల్య విద్య, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యమిచ్చారు. జాతీయ నూతన విద్యావిధానం కంటే ముందే రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక విద్యకు రూపకల్పన చేశారు. అంగన్వాడీలను స్కూళ్లతో అనుసంధానించి పీపీ–1, పీపీ–2 తరగతులతో ఫౌండేషన్ స్కూళ్లకు శ్రీకారం చుట్టారు. పూర్తిగా బాలల కోసమే ప్రత్యేక బడ్జెట్ పెట్టి ఏటా రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. 2021–22లో సీఎం జగన్ ప్రభుత్వం రూ.16,748.47 కోట్లతో తొలిసారిగా బాలల బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2022 – 23లో ఇందుకోసం రూ.16,903 కోట్లు కేటాయించారు. -
AP: ఏబీసీడీ.. మనమే మేటి
బుడిబుడి నడకతో ముద్దులొలికే మాటలతో ముచ్చట గొలిపే చిన్నారులకు గ్రహణ శక్తి ఎక్కువే. ఒక్కసారి వారు ఏదైనా విన్నా, చూసినా ఇట్టే పట్టేస్తారు. చిట్టి మెదళ్లలో దానిని నిక్షిప్తం చేసుకుని అనుకరిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సమయంలో వారికి సరైన మార్గ నిర్దేశం చేస్తే గొప్ప భవిష్యత్ దిశగా అడుగులు వేస్తారు. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్ జగన్ సర్కారు.. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తోంది. నిధులు ఖర్చు చేయడం మాత్రమే కాకుండా వినూత్న రీతిలో ఆట పాటల ద్వారా చిన్నారుల మెదళ్లకు సాన పడుతోంది. సాక్షి, అమరావతి: మూడు నుంచి ఆరేళ్ల వయసు గల పిల్లలకు బాల్య విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ (ఈసీఈ–బాల్య విద్య/పూర్వ ప్రాథమిక విద్య)అమలులో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే విద్యారంగం అభివృద్ధికి చేపట్టిన సంస్కరణలతో అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం ఇతర రాష్ట్రాలను అధిగమించి దేశంలోనే మొదటి స్థానానికి చేరుకుంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా రాష్ట్రంలో అత్యధికంగా నిధులను బాల్య విద్య కోసం కేటాయించి ఖర్చు చేస్తోంది. సెంటర్ ఫర్ బడ్జెట్ అండ్ గవర్నెన్స్ అకౌంటబిలిటీ (సీబీజీఏ), ఎన్జీఓ సంస్థ అయిన ‘సేవ్ ది చిల్డ్రన్ ఫౌండేషన్’ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. దేశంలో యూనివర్సలైజింగ్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (ఈసీఈ) కోసం చేసిన బడ్జెట్ ఖర్చులను ఈ నివేదిక విశ్లేషించింది. బాల్య విద్య, పూర్వ ప్రాథమిక విద్య కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా బడ్జెట్లో నిధులు కేటాయించి, ఖర్చు చేస్తున్నాయో వివరించింది. మూడు నుంచి ఆరేళ్ల వయసు గల పిల్లలకు బాల్య విద్యను అందించడంలో 2020–21 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా ఇతర రాష్ట్రాలేవీ అందుకోలేని స్థాయిలో ఉందని నివేదిక పేర్కొంది. రాష్ట్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యకు నిధులు ఇలా.. లక్ష్య సాధన కోసం కేంద్రం చేస్తున్న ఖర్చు ఒక్కో విద్యార్థిపై రూ.8,297 కాగా.. ఏపీలో 2020–21లో ఒక్కో పిల్లాడిపై రూ.34,758 చొప్పున ఖర్చు చేసినట్లు నివేదిక వివరించింది. ఇతర రాష్ట్రాల్లో చూస్తే ఏపీ తరువాత స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.26,396, సిక్కిం రూ.24,026 చొప్పున ఖర్చు చేశాయి. అత్యల్పంగా మేఘాలయలో రూ.3,796, పశ్చిమ బెంగాల్లో రూ.5,346, ఉత్తరప్రదేశ్‌లో రూ.6,428 చొప్పున ఖర్చు చేశారు. కేంద్రం వెచ్చిస్తోంది అత్యల్పం దేశంలో 3–6 ఏళ్ల వయస్సుగల పిల్లల సంఖ్య 9.9 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. వీరి విద్య కోసం జీడీపీలో 1.4 శాతం నిధులు ఖర్చు చేయాలని నూతన జాతీయ విద్యా విధానం సిఫార్సు చేసింది. ఇతర దేశాల్లో బాల్య విద్యకోసం తమ జీడీపీలో 0.7 శాతం నిధులు ఖర్చుచేస్తుండగా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలున్న దేశంలో ఖర్చు చేస్తున్న నిధులు చాలా తక్కువగా ఉన్నాయని నివేదిక విశ్లేషించింది. వాస్తవానికి ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పురోగతిని సాధించాలంటే అంగన్వాడీల్లోని ఒక్కో పిల్లాడిపై కేంద్రం రూ.32,500 చొప్పున, పూర్వ ప్రాథమిక విద్య కోసం ఒక్కొక్కరిపై రూ.46 వేల చొప్పున ఖర్చు చేయాల్సి ఉందని నివేదిక పేర్కొంది. అలా ఏటా ఖర్చు చేయగలిగితేనే 2030 నాటికి బాల్య విద్యలో ఇతర దేశాలతో సమానమైన స్థాయిలో పురోగతిని సాధించ గలుగుతామని తెలిపింది. కానీ, దేశంలో ఒక్కో అంగన్వాడీ పిల్లాడిపై కేంద్రం 2020–21లో వెచ్చించిన మొత్తం రూ.8,297 (0.1 శాతం) మాత్రమే. కేంద్రం బాల్య విద్య కోసం జీడీపీలో 1.5 శాతం నుంచి 2.2 శాతం నిధులు ఖర్చుచేస్తేనే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని నివేదిక స్పష్టం చేసింది. నూతన జాతీయ విద్యావిధాన పత్రంలో కూడా పూర్వ ప్రాథమిక విద్య కోసం జీడీపీలో 1.4 శాతం నిధులు ఖర్చు చేయాల్సి ఉందని పేర్కొన్నా కేంద్రం ఆ మేరకు నిధులు కేటాయించడం లేదు. 2020–21లో బాల్య విద్య కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చూస్తే 0.39 శాతం నిధులేనని నివేదిక వివరించింది. అలాగే, బాల్య విద్యకు సంబంధించి 14 రకాల సంస్థలలో సీబీజీఏ, సేవ్ ద చిల్డ్రన్ సంస్థలు అధ్యయనం చేశాయి. వీటిల్లో ప్రస్తుతం వెచ్చిస్తున్న నిధులు, జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించి ఇప్పుడు కేటాయించే నిధుల శాతాన్ని భారీగా పెంచాల్సి ఉంటుందని సీబీజీఏ స్పష్టం చేసింది. కేంద్రం కన్నా ముందుగానే ఏపీలో.. కానీ, ఏపీ సర్కారు మాత్రం మిగతా రాష్ట్రాలు, కేంద్రం కన్నా అత్యధిక నిధులను వెచ్చిస్తోంది. గతంలో ఎన్నడూలేని రీతిలో దేశంలోనే రికార్డుస్థాయిలో పిల్లల్లో పౌష్టికత పెంపు, పూర్వప్రాథమిక విద్యకు బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయిస్తోంది. ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ (పూర్వప్రాథమిక విద్య) విషయంలో కేంద్ర ప్రభుత్వం కన్నా ముందే సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టడమే కాకుండా అందుకు తగ్గట్లుగా అత్యధిక నిధులను ఖర్చు చేయించారు. అలాగే, జాతీయ నూతన విద్యావిధానంలో ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని సూచించగా అంతకు ముందుగానే రాష్ట్రంలో దాన్ని సీఎం వైఎస్ జగన్ అమల్లోకి తేవడం విశేషం. 3–8 ఏళ్లలోపు పిల్లల్లో మేధోవృద్ధి ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో వారికి చదువులకు సంబంధించిన పూర్వ ప్రాథమిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రీప్రైమరీ విధానానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టించారు. ఫౌండేషన్ స్కూళ్లుగా అంగన్వాడీలు ఇక అంగన్వాడీల ద్వారా మహిళలు, పిల్లల్లో సంపూర్ణ ఆరోగ్యం, పిల్లలు మేధోపరంగానే కాక శారీరకాభివృద్ధికి వీలుగా సంపూర్ణ పోషణ, పాఠశాలల అభివృద్ధికి నిర్దేశించిన నాడు–నేడు పథకాన్ని అంగన్వాడీలకు వర్తింపచేసి వాటిని ఫౌండేషన్ స్కూళ్లుగా తీర్చిదిద్దిస్తున్నారు. వీటిల్లోని పిల్లల కోసం ఏటా రూ.1,800 కోట్లకు పైగా ఖర్చు చేయిస్తున్నారు. అలాగే, బాలలు, వారి తల్లుల పౌష్టికతకోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలతో వారిని ఆదుకుంటున్నారు. ఇలా రాష్ట్రంలో దాదాపు 35 లక్షలకు పైగా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం పోషకాహారాన్ని అందిస్తోంది. వారిలో రక్తహీనత, పోషకాహార లోపం నివారణతోపాటు ఆరోగ్య వంతమైన సమాజం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. -
‘మానవ చరిత్రలో ఇదే అత్యంత భారీ సంక్షోభం’
పారీస్: కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. వైరస్ కట్టడి కోసం దేశాలన్ని లాక్డౌన్ విధించడంతో ఆర్థికంగా ఇప్పటికే ఎంతో నష్టాన్ని చవి చూస్తున్నాయి. అయితే కరోనా వల్ల ఆర్థికంగానే కాక విద్యాపరంగా కూడా ఎంతో నష్టం వాటిల్లిందని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ వెల్లడించింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్లో దాదాపు 1.6 బిలియన్ మంది పిల్లలు పాఠశాలకు, యూనివర్సిటీలకు దూరమయ్యారని సంస్థ తెలిపింది. ఒక తరం మొత్తం పిల్లల చదువు పాడవ్వడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి అన్నది. యునెస్కో డాటాను ఆధారంగా చేసుకుని సేవ్ ది చిల్డ్రన్ ఓ నివేదిక వెల్లడించింది. ఫలితంగా 90-117 మిలియన్ల మంది పిల్లలు పేదరికంలోకి నెట్టబడతారని నివేదిక అంచనా వేసింది. కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక నష్టాలను భరించడం కోసం చాలా మంది పిల్లలు బలవంతంగా పనులకు వెళ్లాల్సి వస్తుందని.. బాల్య వివాహాల సంఖ్య పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. అంతేకాక దాదాపు 9.7 మిలియన్ల మంది పిల్లలు పాఠశాలకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు తలెత్తుతాయని నివేదిక తెలిపింది. అంతేకాక 2021 నాటి అన్ని దేశాల బడ్జెట్లలో విద్యకు కేటాయింపులు భారీగా తగ్గుతాయని.. ప్రపంచవ్యాప్తంగా ఈ మొత్తం 77 బిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉంటుందని సేవ్ ది చిల్డ్రన్ నివేదిక అంచాన వేసింది. అంతేకాక ఈ చర్యల వల్ల పేద-ధనిక, ఆడ-మగ అంతరాలు మరింత పెరుగుతాయన్నది. దీని నుంచి బయటపడటం కోసం ప్రభుత్వాలు, దాతలు పిల్లలందరికి సురక్షితమైన, నాణ్యమైన విద్యనందించేందుకు ఎక్కువ పెట్టుబడి పెట్టాలని కోరింది. ఇప్పటికే పేద, అట్టడుగు వర్గాల పిల్లలు సగం విద్యా సంవత్సరం నష్టపోయారని నివేదిక తెలిపింది. విద్యా కార్యక్రమాల కోసం దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు 77 బిలియన్ డాలర్లు కేటాయించాల్సి వస్తుందని నివేదిక అంచనా వేసింది. ఈ విద్యా సంక్షోభం ముగియకపోతే.. పిల్లల భవిష్యత్తుపై ఆ ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుందని సేవ్ ది చిల్డ్రన్ తెలిపింది. 2030 నాటికి పిల్లలందరికి నాణ్యమైన విద్య అందించాలనే ఐక్యరాజ్యసమితి వాగ్దానం పూర్తికాదని తెలిపింది. 12 దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు నివేదిక వెల్లడించింది. నైజర్, మాలి, చాడ్, లైబీరియా, అఫ్ఘనిస్తాన్, గినియా, మౌరిటానియా, యెమెన్, నైజీరియా, పాకిస్తాన్, సెనెగల్, ఐవరీ కోస్ట్ దేశాల పిల్లలు చాలా వెనకబడిపోయే ప్రమాదం ఉందని సేవ్ ది చిల్డ్రన్ నివేదిక హెచ్చరించింది. -
పిల్లలపై ‘యుద్ధం’
మ్యూనిచ్: యుద్ధం, దాని ప్రభావం వల్ల ఏటా లక్ష మంది పిల్లలు మృతి చెందుతున్నట్లు సేవ్ ద చిల్డ్రన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. యుద్ధం, దాని వల్ల కలిగే ఆహార కొరత, ఆస్పత్రులు నాశనమవడం, పారిశుధ్యలేమీ వంటి కార ణాల వల్ల 2013–17 మధ్య 10 దేశాల్లో సుమారు ఐదున్నర లక్షల మంది పిల్ల లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఇలాంటి వాటిల్లో పిల్లలే అధికంగా బాధితులుగా మారుతున్నారని పేర్కొంది. చంపబడటం, అపహరణకు గురికావడం, లైంగిక బానిసలుగా మారడం వంటివి పిల్లలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. గత రెండు దశాబ్దాల్లో ప్రతీ ఐదుగురు పిల్లల్లో ఒకరు యు ద్ధ ప్రభా వం గల ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని సంస్థ సీఈవో హెల్లీ తోర్నింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో యుద్ధ ప్రభావం గల ప్రాంతాల్లో సుమారు 42 కోట్ల మంది పిల్లలు జీవిస్తున్నట్లు తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి దేశాల్లో అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇరాక్, మాలి, నైజీరియా, సొమాలియా, సౌత్ సూడాన్, సిరియా, యెమెన్లు ఉన్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదికను మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో శుక్రవారం విడుదల చేశారు. -
పసిపిల్లలే లక్ష్యంగా ఉగ్రవాదుల బీభత్సం
జలాలాబాద్ : అభంశుభం తెలియని పసిపిల్లలే లక్ష్యంగా ఉగ్రవాదులు భీకరదాడికి పాల్పడ్డారు. అఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్ పట్టణంలోగల ‘సేవ్ ద చిల్డ్రెన్’ కార్యాలయంపై విరుచుకుపడ్డ ముష్కరులు.. కనిపించినవారిని కనిపించినట్లు కాల్చేశారు. బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో పదుల మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. భీతావహదృశ్యాలు : పిల్లల సంరక్షణ కోసం పనిచేస్తోన్న ‘సేవ్ ద చిల్డ్రెన్’ సంస్థ కార్యాలయం ఎదుట కారుబాంబును పేల్చిన ఉగ్రవాదులు.. అనంతరం తుపాకులతో లోపలికి ప్రవేశించారు. ఇప్పటివరకు అందిన సమాచారాన్నిబట్టి 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్యాలయం లోపలున్న ఉగ్రవాదులు ఇంకా ఎంతమందికి హానితలపెట్టారో ఇప్పుడే చెప్పలేమని జలాలాబాద్ ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధి అతావుల్లా పేర్కొన్నారు. భయంతో వణికిపోతున్న పిల్లల్ని.. సంస్థ సహాయకులు దూరంగా తీసుకెళుతున్న దృశ్యాలు సంచలనంగా మారాయి. దాడి సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వ బలగాలు ఘటనా స్థలికి తరలివెళ్లాయి. కౌంటర్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. గతవారం కాబూల్‌లోని అతిపెద్ద హోటళ్లలో ఒకటైన ఇంటర్ కాంటినెంటల్‌పై దాడిచేసిన ఉగ్రవాదులు 22 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. -
పాపం పసివాడు..
ఈ రెండింటిలో ప్రపంచంలో మొదటి స్థానంలో భారత్ సేవ్ ద చిల్డ్రన్ అంతర్జాతీయ సంస్థ నివేదికలో వెల్లడి బంగరు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బాల్యం.. అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తోంది.. గనుల్లో, కార్ఖానాల్లో మగ్గిపోతోంది.. చితికిన కలలతో కొట్టుమిట్టాడుతోంది.. ఇది ‘ఎదగని’ భారతం వ్యథ.. ఆ భారతంలోని బాలల కథ... ఆడుతూపాడుతూ గడపాల్సిన బాల్యం.. అస్తవ్యస్తంగా మారుతోంది. సరైన ఆహారంలేక అలమటిస్తోంది.. తల్లిదండ్రులు శ్రమించాల్సిన చోట చిన్నారులే కార్మికులుగా మారుతున్నారు. పేదరికం.. నిరక్షరాస్యత.. మొదలైన సమస్యలతో కుటుంబ భారాన్ని తామే మోస్తున్నారు. దీంతో వయసుకు తగ్గ ఎదుగుదల లేని చిన్నారుల సంఖ్యలో మనదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి చిన్నారుల సంఖ్య 4.82 కోట్లు. అలాగే 3.1 కోట్ల మంది చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారట. ఇది కూడా ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్య కావడం గమనార్హం. సేవ్ ద చిల్డ్రన్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ తాజా సర్వేలో ఈ విస్తుగొలిపే గణాంకాలు వెల్లడయ్యాయి. 172 దేశాల్లో చేసిన సర్వేలో ఈ విషయాన్ని తేల్చారు. ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ రిపోర్ట్ 2017 పేరిట సేవ్ ద చిల్డ్రన్ సంస్థ అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా జూన్ 1న దీనిని విడుదల చేసింది. బాల్యాన్ని కోల్పోతున్న 70 కోట్ల మంది.. వివిధ దేశాల్లో పలు కీలక అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు, పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపే పోషకాహార లోపం, విద్య అందకపోవడం, బాల కార్మికులు, బాల్య వివాహాలు, నెలలు నిండకుండానే జననాలు, శిశు భ్రూణహత్యలు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది చిన్నారులు వివిధ కారణాల వల్ల ముందుగానే తమ బాల్యాన్ని కోల్పోతున్నారని వెల్లడైంది. సరైన ఎదుగుదల లేని పిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని, త్వరగా అనారోగ్యం, వ్యాధుల బారిన పడుతున్నారని, వీటి వల్ల త్వరగా మరణిస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ‘విద్య’కు దూరం.. ‘పని’కి దగ్గర.. దేశంలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయి చిన్నారులు 18.6% మంది పాఠశాలకు వెళ్లడం లేదు. అప్పర్ సెకండరీ వయసు కలిగిన 4.7 కోట్ల మంది స్కూళ్లకు వెళ్లడం లేదు. దేశంలోని 4–14 ఏళ్ల వయసు పిల్లల్లో 11.8 శాతం మంది(3.1 కోట్లు) బాల కార్మికులుగా మారుతున్నారు. కుటుంబ పోషణ కోసం పనిలోకి వెళుతున్న వీరంతా చదువు, విశ్రాంతి, ఆటలు, వినోదాన్ని కోల్పోతున్నారు. -
డేంజర్ లో 3.5 లక్షల చిన్నారులు
లండన్: ఇరాక్‌లోని పశ్చిమ మోసుల్ నగరంలో జిహాదీలకు, సైన్యానికి మధ్య జరుగుతున్న పోరులో 3.5 లక్షల మంది చిన్నారులు చిక్కుకున్నారని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఈ వ్యూహాత్మక నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఇరాకీ దళాలు తాజాగా జిహాదీలపై దాడి ప్రారంభించిన నేపథ్యంలో ఈ సంస్థ ఈ విధంగా హెచ్చరించింది. ఇరాకీ దళాలు, వారితో కలిసి పనిచేస్తున్న అమెరికా, యూకే సైన్యం కలిసి చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి ఆపద కలుగకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలని కోరింది. యుద్ధంలో చిక్కుకున్న బాలలు 18 ఏళ్ల లోపువారేనని తెలిపింది. ఐసిస్ క్యాంపుల నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయొద్దని బందీలకు సూచించింది. పారిపోతే జిహదీలకు చిక్కితే ప్రాణాలు తీయడం ఖాయమని హెచ్చరించింది. ఒకవేళ తప్పించుకుని బయటకు వచ్చినా భద్రతా దళాలు, జిహాదీల మధ్య నిరాంతరాయంగా కొనసాగుతున్న కాల్పులతో ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చని వివరించింది. -
'పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో పిల్లల హక్కుల్ని చేర్చాలి'
హైదరాబాద్ : రాజకీయ పార్టీలు తమ తమ మానిఫెస్టోలో బాలల హక్కులు కాపాడే విధంగా కృషి చేయాలంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పలువురు విద్యార్థులు బుధవారం వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిసి విజ్ఙప్తి చేశారు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా లోటస్‌పాండ్‌లో 'సేవ్ ద చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ఎన్జీవో' తరుపున వీరంతా విజయమ్మను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పేద బాలలు చదువుకునే హక్కుని కోల్పోతున్నారని...ఎన్నికల మానిఫెస్టోలో తమ హక్కులను కూడా ప్రస్తావించాలని వారు విజ్ఞప్తి చేశారు. విద్యార్ధుల సమస్యలపై విజయమ్మ సానుకూలంగా స్పందించారు. కచ్చితంగా విద్యార్థులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. విజయమ్మను కలవడం తమకు సంతోషంగా ఉందని పలువురు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.