
డేంజర్ లో 3.5 లక్షల చిన్నారులు
లండన్: ఇరాక్‌లోని పశ్చిమ మోసుల్ నగరంలో జిహాదీలకు, సైన్యానికి మధ్య జరుగుతున్న పోరులో 3.5 లక్షల మంది చిన్నారులు చిక్కుకున్నారని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఈ వ్యూహాత్మక నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఇరాకీ దళాలు తాజాగా జిహాదీలపై దాడి ప్రారంభించిన నేపథ్యంలో ఈ సంస్థ ఈ విధంగా హెచ్చరించింది. ఇరాకీ దళాలు, వారితో కలిసి పనిచేస్తున్న అమెరికా, యూకే సైన్యం కలిసి చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి ఆపద కలుగకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలని కోరింది. యుద్ధంలో చిక్కుకున్న బాలలు 18 ఏళ్ల లోపువారేనని తెలిపింది.
ఐసిస్ క్యాంపుల నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయొద్దని బందీలకు సూచించింది. పారిపోతే జిహదీలకు చిక్కితే ప్రాణాలు తీయడం ఖాయమని హెచ్చరించింది. ఒకవేళ తప్పించుకుని బయటకు వచ్చినా భద్రతా దళాలు, జిహాదీల మధ్య నిరాంతరాయంగా కొనసాగుతున్న కాల్పులతో ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చని వివరించింది.