ఉగ్రదాడి నుంచి దూరంగా పారిపోతున్న పిల్లలు, వారి సహాయకులు
జలాలాబాద్ : అభంశుభం తెలియని పసిపిల్లలే లక్ష్యంగా ఉగ్రవాదులు భీకరదాడికి పాల్పడ్డారు. అఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్ పట్టణంలోగల ‘సేవ్ ద చిల్డ్రెన్’ కార్యాలయంపై విరుచుకుపడ్డ ముష్కరులు.. కనిపించినవారిని కనిపించినట్లు కాల్చేశారు. బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో పదుల మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.
భీతావహదృశ్యాలు : పిల్లల సంరక్షణ కోసం పనిచేస్తోన్న ‘సేవ్ ద చిల్డ్రెన్’ సంస్థ కార్యాలయం ఎదుట కారుబాంబును పేల్చిన ఉగ్రవాదులు.. అనంతరం తుపాకులతో లోపలికి ప్రవేశించారు. ఇప్పటివరకు అందిన సమాచారాన్నిబట్టి 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్యాలయం లోపలున్న ఉగ్రవాదులు ఇంకా ఎంతమందికి హానితలపెట్టారో ఇప్పుడే చెప్పలేమని జలాలాబాద్ ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధి అతావుల్లా పేర్కొన్నారు. భయంతో వణికిపోతున్న పిల్లల్ని.. సంస్థ సహాయకులు దూరంగా తీసుకెళుతున్న దృశ్యాలు సంచలనంగా మారాయి.
దాడి సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వ బలగాలు ఘటనా స్థలికి తరలివెళ్లాయి. కౌంటర్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. గతవారం కాబూల్‌లోని అతిపెద్ద హోటళ్లలో ఒకటైన ఇంటర్ కాంటినెంటల్‌పై దాడిచేసిన ఉగ్రవాదులు 22 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment