AP: ఏబీసీడీ.. మనమే మేటి | Andhra Pradesh is top in pre-primary education CBGA latest report | Sakshi
Sakshi News home page

AP: ఏబీసీడీ.. మనమే మేటి

Published Sun, Sep 25 2022 3:54 AM | Last Updated on Sun, Sep 25 2022 8:02 AM

Andhra Pradesh is top in pre-primary education CBGA latest report - Sakshi

బుడిబుడి నడకతో ముద్దులొలికే మాటలతో ముచ్చట గొలిపే చిన్నారులకు గ్రహణ శక్తి ఎక్కువే. ఒక్కసారి వారు ఏదైనా విన్నా, చూసినా ఇట్టే పట్టేస్తారు. చిట్టి మెదళ్లలో దానిని నిక్షిప్తం చేసుకుని అనుకరిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సమయంలో వారికి సరైన మార్గ నిర్దేశం చేస్తే గొప్ప భవిష్యత్‌ దిశగా అడుగులు వేస్తారు. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్‌ జగన్‌ సర్కారు.. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తోంది. నిధులు ఖర్చు చేయడం మాత్రమే కాకుండా వినూత్న రీతిలో ఆట పాటల ద్వారా చిన్నారుల మెదళ్లకు సాన పడుతోంది.

సాక్షి, అమరావతి: మూడు నుంచి ఆరేళ్ల వయసు గల పిల్లలకు బాల్య విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్‌ (ఈసీఈ–బాల్య విద్య/పూర్వ ప్రాథమిక విద్య)అమలులో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే విద్యారంగం అభివృద్ధికి చేపట్టిన సంస్కరణలతో అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం ఇతర రాష్ట్రాలను అధిగమించి దేశంలోనే మొదటి స్థానానికి చేరుకుంది.

జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా రాష్ట్రంలో అత్యధికంగా నిధులను బాల్య విద్య కోసం కేటాయించి ఖర్చు చేస్తోంది. సెంటర్‌ ఫర్‌ బడ్జెట్‌ అండ్‌ గవర్నెన్స్‌ అకౌంటబిలిటీ (సీబీజీఏ), ఎన్‌జీఓ సంస్థ అయిన ‘సేవ్‌ ది చిల్డ్రన్‌ ఫౌండేషన్‌’ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది.

దేశంలో యూనివర్సలైజింగ్‌ ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ ఎడ్యుకేషన్‌ (ఈసీఈ) కోసం చేసిన బడ్జెట్‌ ఖర్చులను ఈ నివేదిక విశ్లేషించింది. బాల్య విద్య, పూర్వ ప్రాథమిక విద్య కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించి, ఖర్చు చేస్తున్నాయో వివరించింది. మూడు నుంచి ఆరేళ్ల వయసు గల పిల్లలకు బాల్య విద్యను అందించడంలో 2020–21 ఏడాదికి ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా ఇతర రాష్ట్రాలేవీ అందుకోలేని స్థాయిలో ఉందని నివేదిక పేర్కొంది. 

రాష్ట్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యకు నిధులు ఇలా..
లక్ష్య సాధన కోసం కేంద్రం చేస్తున్న ఖర్చు ఒక్కో విద్యార్థిపై రూ.8,297 కాగా.. ఏపీలో 2020–21లో ఒక్కో పిల్లాడిపై రూ.34,758 చొప్పున ఖర్చు చేసినట్లు నివేదిక వివరించింది. ఇతర రాష్ట్రాల్లో చూస్తే ఏపీ తరువాత స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.26,396, సిక్కిం రూ.24,026 చొప్పున ఖర్చు చేశాయి. అత్యల్పంగా మేఘాలయలో రూ.3,796, పశ్చిమ బెంగాల్‌లో రూ.5,346, ఉత్తరప్రదేశ్‌లో రూ.6,428 చొప్పున ఖర్చు చేశారు.

కేంద్రం వెచ్చిస్తోంది అత్యల్పం
దేశంలో 3–6 ఏళ్ల వయస్సుగల పిల్లల సంఖ్య 9.9 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. వీరి విద్య కోసం జీడీపీలో 1.4 శాతం నిధులు ఖర్చు చేయాలని నూతన జాతీయ విద్యా విధానం సిఫార్సు చేసింది. ఇతర దేశాల్లో బాల్య విద్యకోసం తమ జీడీపీలో 0.7 శాతం నిధులు ఖర్చుచేస్తుండగా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలున్న దేశంలో ఖర్చు చేస్తున్న నిధులు చాలా తక్కువగా ఉన్నాయని నివేదిక విశ్లేషించింది.

వాస్తవానికి ఎర్లీ చైల్డ్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పురోగతిని సాధించాలంటే అంగన్‌వాడీల్లోని ఒక్కో పిల్లాడిపై కేంద్రం రూ.32,500 చొప్పున, పూర్వ ప్రాథమిక విద్య కోసం ఒక్కొక్కరిపై రూ.46 వేల చొప్పున ఖర్చు చేయాల్సి ఉందని నివేదిక పేర్కొంది. అలా ఏటా ఖర్చు చేయగలిగితేనే 2030 నాటికి బాల్య విద్యలో ఇతర దేశాలతో సమానమైన స్థాయిలో పురోగతిని సాధించ గలుగుతామని తెలిపింది.

కానీ, దేశంలో ఒక్కో అంగన్‌వాడీ పిల్లాడిపై కేంద్రం 2020–21లో వెచ్చించిన మొత్తం రూ.8,297 (0.1 శాతం) మాత్రమే. కేంద్రం బాల్య విద్య కోసం జీడీపీలో 1.5 శాతం నుంచి 2.2 శాతం నిధులు ఖర్చుచేస్తేనే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని నివేదిక స్పష్టం చేసింది. నూతన జాతీయ విద్యావిధాన పత్రంలో కూడా పూర్వ ప్రాథమిక విద్య కోసం జీడీపీలో 1.4 శాతం నిధులు ఖర్చు చేయాల్సి ఉందని పేర్కొన్నా కేంద్రం ఆ మేరకు నిధులు కేటాయించడం లేదు.

2020–21లో బాల్య విద్య కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే 0.39 శాతం నిధులేనని నివేదిక వివరించింది. అలాగే, బాల్య విద్యకు సంబంధించి 14 రకాల సంస్థలలో సీబీజీఏ, సేవ్‌ ద చిల్డ్రన్‌ సంస్థలు అధ్యయనం చేశాయి. వీటిల్లో ప్రస్తుతం వెచ్చిస్తున్న నిధులు, జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించి ఇప్పుడు కేటాయించే నిధుల శాతాన్ని భారీగా పెంచాల్సి ఉంటుందని సీబీజీఏ స్పష్టం చేసింది.  

కేంద్రం కన్నా ముందుగానే ఏపీలో..
కానీ, ఏపీ సర్కారు మాత్రం మిగతా రాష్ట్రాలు, కేంద్రం కన్నా అత్యధిక నిధులను వెచ్చిస్తోంది. గతంలో ఎన్నడూలేని రీతిలో దేశంలోనే రికార్డుస్థాయిలో పిల్లల్లో పౌష్టికత పెంపు, పూర్వప్రాథమిక విద్యకు బడ్జెట్‌ కేటాయించి ఖర్చు చేయిస్తోంది. ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్‌ (పూర్వప్రాథమిక విద్య) విషయంలో కేంద్ర ప్రభుత్వం కన్నా ముందే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక కార్యాచరణ చేపట్టడమే కాకుండా అందుకు తగ్గట్లుగా అత్యధిక నిధులను ఖర్చు చేయించారు.

అలాగే, జాతీయ నూతన విద్యావిధానంలో ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని సూచించగా అంతకు ముందుగానే రాష్ట్రంలో దాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ అమల్లోకి తేవడం విశేషం. 3–8 ఏళ్లలోపు పిల్లల్లో మేధోవృద్ధి ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో వారికి చదువులకు సంబంధించిన పూర్వ ప్రాథమిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రీప్రైమరీ విధానానికి సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టించారు. 

ఫౌండేషన్‌ స్కూళ్లుగా అంగన్‌వాడీలు 
ఇక అంగన్‌వాడీల ద్వారా మహిళలు, పిల్లల్లో సంపూర్ణ ఆరోగ్యం, పిల్లలు మేధోపరంగానే కాక శారీరకాభివృద్ధికి వీలుగా సంపూర్ణ పోషణ, పాఠశాలల అభివృద్ధికి నిర్దేశించిన నాడు–నేడు పథకాన్ని అంగన్‌వాడీలకు వర్తింపచేసి వాటిని ఫౌండేషన్‌ స్కూళ్లుగా తీర్చిదిద్దిస్తున్నారు. వీటిల్లోని పిల్లల కోసం ఏటా రూ.1,800 కోట్లకు పైగా ఖర్చు చేయిస్తున్నారు. అలాగే, బాలలు, వారి తల్లుల పౌష్టికతకోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ కార్యక్రమాలతో వారిని ఆదుకుంటున్నారు.

ఇలా రాష్ట్రంలో దాదాపు 35 లక్షలకు పైగా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం పోషకాహారాన్ని అందిస్తోంది. వారిలో రక్తహీనత, పోషకాహార లోపం నివారణతోపాటు ఆరోగ్య వంతమైన సమాజం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement