Childhood education
-
దేశంలో బాల్యవిద్య బలహీనమే!
సాక్షి, అమరావతి: ఆరేళ్ల లోపు పిల్లల్లో మెదడు ఎదుగుదల అధికంగా ఉంటుంది. ఆ వయసులో మానసిక వికాసానికి సాన పెట్టాలి. అయితే దేశంలో ఇప్పటికీ 3.7 కోట్ల మందికి పైగా బాలలు పూర్వ బాల్య విద్యకు దూరమైనట్లు ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం సత్ఫలితాలనివ్వాలంటే పూర్వ బాల్యవిద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొంది. విద్యాహక్కు చట్టం–2009, నేషనల్ ఈసీసీఈ పాలసీ–2013, జాతీయ నూతన విద్యావిధానం–2020లో పూర్వ బాల్య విద్య ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే పూర్వ బాల్య విద్యకు తగినన్ని నిధులు కేటాయించాలి. 3– 6 ఏళ్ల వయసు వారి విద్యాభ్యాసాన్ని పాఠశాల విధానంలో చేర్చేలా ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టాలని నూతన విద్యావిధానం సిఫార్సు చేసింది. 2011 జనాభా లెక్కల నివేదిక పూర్వ బాల్య విద్యకు అర్హులైన బాలలు దేశంలో 10 కోట్ల మంది ఉన్నారు. ప్రస్తుతం పూర్వ బాల్య విద్య, ప్రాథమిక విద్యకు దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 0.1 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తుండగా కనిష్టంగా 1.6 నుంచి 2.2 శాతం వరకు పెంచాలి. అమెరికా, యూకే, ఈక్వెడార్ లాంటి దేశాల్లో 1.17 శాతం వరకు నిధులు కేటాయిస్తున్నారు. రాష్ట్రంలో బాల్య విద్య భేష్ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక విద్యారంగ సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్వ బాల్య విద్య, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యమిచ్చారు. జాతీయ నూతన విద్యావిధానం కంటే ముందే రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక విద్యకు రూపకల్పన చేశారు. అంగన్వాడీలను స్కూళ్లతో అనుసంధానించి పీపీ–1, పీపీ–2 తరగతులతో ఫౌండేషన్ స్కూళ్లకు శ్రీకారం చుట్టారు. పూర్తిగా బాలల కోసమే ప్రత్యేక బడ్జెట్ పెట్టి ఏటా రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. 2021–22లో సీఎం జగన్ ప్రభుత్వం రూ.16,748.47 కోట్లతో తొలిసారిగా బాలల బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2022 – 23లో ఇందుకోసం రూ.16,903 కోట్లు కేటాయించారు. -
AP: బాల్య విద్యలో భళా
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల చేరికల్లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాలు సాధించినట్లు యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ (అసర్) 2022 నివేదిక వెల్లడించింది. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్కూళ్ల చేరికల్లో మంచి పురోగతి ఉన్నట్లు పేర్కొంది. ప్రథమ్ సంస్థ నిర్వహించిన అసర్ సర్వే 2022ను బుధవారం విడుదల చేసింది. 2018 తరువాత నాలుగేళ్ల అనంతరం ప్రథమ్ సంస్థ ఈ సర్వేను ప్రకటించింది. జాతీయ స్థాయిలో పాఠశాల విద్యారంగం, రాష్ట్రాలలో పరిస్థితులను గణాంకాలతో పొందుపరిచింది. 2014–2018 వరకు, 2018 – 2022 వరకు పరిస్థితులను బేరీజు వేసి ప్రమాణాలను విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యారంగ పరిస్థితిని విశ్లేషించేందుకు ప్రథమ్ సంస్థ 390 గ్రామాలలో సర్వే నిర్వహించింది. 7,760 కుటుంబాలు, 3 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న 12,950 మంది విద్యార్ధులు సర్వేలో పాల్గొన్నారు. ► జాతీయ స్థాయిలో గత 15 ఏళ్లలో 6 – 14 ఏళ్ల వయసు పిల్లల చేరికలు 95 శాతం లోపే ఉండగా 2018 నాటికి 97.2 శాతానికి పెరిగాయి. ఇక 2022లో 98.4 శాతానికి చేరుకున్నట్లు సర్వేలో తేలింది. స్కూళ్లలో చేరని వారి సంఖ్య జాతీయ స్థాయిలో 1.6 శాతానికి తగ్గగా ఏపీలో 0.6 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. ► మూడేళ్ల వయసు పిల్లలకు జాతీయ స్థాయిలో 78.3 శాతం మందికి బాల్యవిద్య అందుతున్నట్లు సర్వే పేర్కొంది. 2018లో ఇది 71.2 శాతం మాత్రమే ఉంది. మూడేళ్ల అనంతరం ప్రీస్కూల్, అంగన్వాడీ కేంద్రాలలో చేరేవారు 2018లో 57.1 శాతం మంది ఉండగా 2022లో 66.8 శాతానికి పెరిగింది. నాలుగేళ్ల వయసు చిన్నారుల చేరికలు 50.5 శాతం నుంచి 61.2 శాతానికి పెరిగాయి. ఇదే కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయికి మించి ప్రగతి సాధించినట్లు ప్రథమ్ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని అంగన్వాడీలు, ప్రీస్కూళ్లలో చేరే పిల్లలు 2018లో 71.3 శాతం ఉండగా 2022 నాటికి 80.7 శాతానికి పెరిగారు. నాలుగేళ్ల వయసు పిల్లల చేరికలు 53.4 నుంచి 68.3 శాతానికి పెరిగాయి. ► దేశంలో ప్రభుత్వ స్కూళ్లలో 6–14 వయసు పిల్లల చేరికలు 2014 నాటికి 64.9 శాతం ఉండగా నాలుగేళ్లు పెరుగుదల లేదు. 2018 నాటికి 65.6 శాతానికి చేరుకోగా 2022లో 72.9 శాతానికి పెరిగినట్లు ప్రథమ్ సంస్థ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు 63.2 శాతం నుంచి 70.8 శాతానికి చేరినట్లు సర్వే పేర్కొంది. 2018 నుంచి 2022 మధ్య చేరికల్లో జాతీయ స్థాయి పెరుగుదల 7.3 కాగా ఏపీలో 7.6గా ఉంది. ► బాలికల చేరికల విషయంలో జాతీయ స్థాయిలో ఏపీ ముందు వరుసలో నిలిచింది. 11 – 14 ఏళ్ల మధ్య వయసు బాలికల్లో పాఠశాలలకు వెళ్లని వారు జాతీయ స్థాయిలో 2006లో 10.3 శాతం కాగా 2018 నాటికి 4.1 శాతానికి తగ్గింది. 2022లో రెండు శాతానికి తగ్గిపోయింది. అదే ఆంధ్రప్రదేశ్‌లో బాలికల డ్రాపౌట్లు 1 శాతం లోపే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 15 – 16 ఏళ్ల వయసు బాలికల్లో పాఠశాలలకు రాని వారు జాతీయ స్థాయిలో 2008 నాటికి 20 శాతం ఉండగా 2018లో అది 13.5 శాతానికి తగ్గింది. 2022 నాటికి 7.9 శాతానికి తగ్గిపోయినట్లు అసర్ ప్రకటించింది. అదే ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లకు దూరమైన 15 – 16 ఏళ్ల వయసు బాలికలు 2 శాతం లోపేనని తెలిపింది. మధ్యప్రదేశ్ (17శాతం), ఉత్తర్‌ప్రదేశ్ (15 శాతం), చత్తీస్ఘడ్ (11.2 శాతం)లో జాతీయ సగటుకు మించి బడికి దూరమైన బాలికలున్నట్లు పేర్కొంది. ► దేశవ్యాప్తంగా ప్రైవేట్ ట్యూషన్లను ఆశ్రయిస్తున్న విద్యార్ధుల శాతం పెరిగినట్లు అసర్ సర్వే తెలిపింది. 1 – 8 తరగతుల విద్యార్థుల ట్యూషన్లు 2018 – 22 మధ్య మరింత పెరిగినట్లు వెల్లడించింది. 2018లో 26.4 శాతం మంది ట్యూషన్లను ఆశ్రయించగా 2022 నాటికి 30.5 శాతానికి పైగా ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, జార్ఖండ్‌లలో ఇది మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ► టీచర్లు, విద్యార్ధుల హాజరు శాతం గతంలో కన్నా మెరుగుపడినట్లు సర్వేలో తేలింది. జాతీయ స్థాయిలో 2018లో టీచర్ల అటెండెన్సు 85.4 శాతం ఉండగా 2022 నాటికి 87.1 శాతానికి పెరిగింది. గతంలో వీరి హాజరు శాతం 72 శాతం మాత్రమే ఉంది. స్కూళ్లలో పిల్లల హాజరు కూడా గణనీయంగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఆంగ్లంలో జాతీయ సగటుకు మించి ఫలితాలు ► రాష్ట్రంలో పాఠశాల విద్యార్ధులు ఆంగ్లంలో మంచి పురోగతి సాధించారని అసర్ 2022 నివేదిక పేర్కొంది. ఆంగ్లం, గణితంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను నివేదికలో పొందుపరిచారు. ఇంగ్లీషులో కేపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, సింపుల్ 3 లెటర్ వర్డ్లు, అతి చిన్న వాక్యాలను ఇచ్చి 3, 5, 8 తరగతుల విద్యార్ధులతో సర్వే చేపట్టినట్లు ప్రథమ్ సంస్థ పేర్కొంది. ► జాతీయ స్థాయిలో 5వ తరగతి పిల్లల్లో 2016లో ఇంగ్లీషులో సామర్థ్యాలున్న పిల్లలు 24.7 శాతం మేర ఉండగా 2022లో అది 24.5 శాతంగా ఉంది. అదే 8వ తరగతిలో 45.3 శాతం నుంచి 46.7 శాతానికి పెరుగుదల ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జాతీయ సగటును మించి ఫలితాలు నమోదయ్యాయి. ఏపీలో ఇంగ్లీషులో సామర్థ్యాలున్న (చిన్న వాక్యాలను చదవడం) పిల్లలు 5వ తరగతిలో 42.5 శాతం మంది ఉన్నట్లు నివేదిక తెలిపింది. అదే 8వ తరగతిలో 69.8 శాతం ఉన్నారు. ► అంకగణితం (అర్థమెటిక్స్)లో దేశవ్యాప్తంగా పిల్లల్లో సామర్థ్యాలు తగ్గాయని నివేదిక పేర్కొంది. కరోనా సమయంలో విద్యార్ధులకు ఎదురైన ప్రతికూల పరిస్థితులే ఇందుకు కారణం. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లన్నిటిలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు వివరించింది. అయితే ఏపీలో 3, 5వ తరగతుల పిల్లలు ఒకింత వెనుకబడి ఉండగా 8వ తరగతి పిల్లల సామర్థ్యాలు జాతీయ సగటుకు మించి ఉన్నాయని ప్రథమ్ సంస్థ వెల్లడించింది. గణితంలో విభజన (డివిజన్) చేసే 8వ తరగతి పిల్లలు జాతీయస్థాయిలో 2018లో 44.1 శాతం మంది ఉండగా 2022 నాటికి స్వల్పంగా 44.7 శాతానికి పెరిగింది. ఏపీలో ఇది 2018లో 47.6 శాతం కాగా 2022లో 51.7 శాతంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. -
బాల్య విద్యకు బలమైన పునాది
రాష్ట్ర విద్యార్థులకు ఫౌండేషనల్ విద్య నుంచే బలమైన పునాదులు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) 2020–21లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ స్కోర్ పాయింట్లను సాధించి లెవల్–2 స్థాయిని దక్కించుకుంది. లెర్నింగ్ అవుట్‌కమ్స్, నాణ్యత, యాక్సెస్, మౌలిక వసతులు, ఈక్విటీ, పరిపాలన, నిర్వహణ అంశాల్లో ఈ ప్రగతిని సాధించింది. సాక్షి, అమరావతి: పిల్లల్లో 3 నుంచి 6 ఏళ్లలోపు మెదడు అభివృద్ధి చెందుతుందని.. ఈ సమయంలో వారికి సరైన ఫౌండేషనల్ విద్యను అందించాల్సిన అవసరముందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఫౌండేషనల్ విద్యకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇదే అంశాన్ని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా నూతన విద్యావిధానంలో చేర్చింది. అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని పాఠశాలలతో అనుసంధానిస్తూ అక్కడి పిల్లలకు ఆటపాటలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రత్యేక సిలబస్‌తో.. ఆకర్షణీయమైన చిత్రాలతో పుస్తకాలను కూడా తెచ్చింది. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని సైతం అందిస్తోంది. వీటన్నిటి ఫలితంగా విద్యార్థుల్లో అక్షర, అంకెల పరిజ్ఞానం, అభ్యసన సామర్థ్యాలు క్రమేణా మెరుగుపడుతున్నాయి. దీంతో గత ప్రభుత్వాల హయాంలో పీజీఐ ర్యాంకింగ్స్‌లో వెనుకంజలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు లెవల్–2 స్థాయిని దక్కించుకుంది. పురోగతికి సాక్ష్యంగా పీజీఐ స్కోర్ పీజీఐకిప్రామాణికంగా తీసుకొనే వివిధ అంశాల్లో ఏపీ గతంలో కంటే మెరుగైన అభివృద్ధిని సాధించింది. ఆయా అంశాల్లో రాష్ట్రం సాధించిన స్కోర్ పాయింట్లే ఇందుకు నిదర్శనం. ఆయా అంశాల్లో గరిష్ట పాయింట్ల వారీగా స్కోర్ చూస్తే లెర్నింగ్ అవుట్‌కమ్స్, నాణ్యతల్లో 180కి 154, యాక్సెస్‌లో 80కి గాను 77, మౌలిక వసతుల కల్పనలో 150కి 127, ఈక్విటీలో 230కి 210, పాలన, నిర్వహణల్లో 360కి 334 పాయింట్లను ఏపీ సాధించింది. ‘యాక్సెస్’లోనూ మెరుగైన పాయింట్లు ఇక రెండో ప్రామాణికమైన ‘యాక్సెస్’కు సంబంధించి రిటెన్షన్ రేట్ (ఒక స్కూల్లో చేరిన విద్యార్థులు అక్కడ చివరి తరగతి వరకు కొనసాగడం)లో ఎలిమెంటరీ, ప్రైమరీ విభాగాల్లో 10కి 10, సెకండరీలో 10కి 9 స్కోర్ పాయింట్లను ఏపీ సాధించింది. అలాగే విద్యార్థులు డ్రాపవుట్ కాకుండా ఒక తరగతి నుంచి పై తరగతుల్లోకి వెళ్లడంలో ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీ విభాగంలో 10కి 10, అప్పర్ ప్రైమరీ నుంచి సెకండరీ విభాగంలో 10కి 10 పాయింట్లను దక్కించుకుంది. అలాగే 1–8 తరగతులకు సంబంధించి బడిబయట ఉన్న విద్యార్థులను గుర్తించి వారిని తిరిగి బడిలో చేర్పించే అంశంలో కూడా 10కి 10 పాయింట్లు సాధించింది. ఫౌండేషనల్ విద్య బలోపేతంతోనే.. ముఖ్యంగా ఫౌండేషనల్ విద్య బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే కింది స్థాయి తరగతుల్లో విద్యార్థులు మెరుగైన సామర్థ్యాలను అందిపుచ్చుకోగలుగుతున్నారని పీజీఐ నివేదిక స్పష్టం చేస్తోంది. పీజీఐప్రామాణికాల్లో మొదటి అంశమైన ‘అవుట్‌కమ్స్, క్వాలిటీ’ల్లో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలోని 3వ తరగతి విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు మెరుగుపడ్డాయి. దీంతో ఆ కేటగిరీలో 20కి 20పాయింట్ల స్కోర్‌ను ఏపీ సాధించింది. అలాగే 3వ తరగతి మ్యాథ్స్‌లో కూడా 20కి 20 పాయింట్లు వచ్చాయి. 5వ తరగతిలోనూ భాష, మ్యాథ్స్‌ల్లో 20కి 18 పాయింట్లు దక్కాయి. 8వ తరగతిలో భాషలో 20కి 16, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్‌ల్లో 14 చొప్పున పాయింట్లు వచ్చాయి. మౌలిక సదుపాయాల్లోనూ ప్రగతి మౌలిక సదుపాయాల విభాగంలో 12 అంశాలనుప్రామాణికంగా తీసుకున్నారు. రాష్ట్రంలో నాడు–నేడు తొలిదశ కింద 15,715 స్కూళ్లను రూ.3,600 కోట్లతో అభివృద్ధి చేశారు. రెండో విడత కింద మిగిలిన స్కూళ్లలో పనులుప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద అందిస్తున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఏపీ 10కి 10 పాయింట్లు సాధించింది. విద్యార్థులకు యూనిఫామ్ అందించడం, పాఠ్యపుస్తకాల సరఫరా, మంచినీటి సదుపాయం కల్పనలో 10కి 9 పాయింట్లను దక్కించుకుంది. సప్లిమెంటరీ మెటీరియల్‌ను సమకూర్చడంలో 20కి 20 పాయింట్లు, 11, 12 తరగతులకు వొకేషనల్ విద్య అందించడంలో 10కి 10 పాయింట్లు సాధించింది. పరిపాలన, నిర్వహణకు సంబంధించిన 32 అంశాల్లో కూడా అత్యధికమైన వాటిలో పూర్తి స్థాయి స్కోర్ పాయింట్లను రాష్ట్రం దక్కించుకుంది. -
AP: ఏబీసీడీ.. మనమే మేటి
బుడిబుడి నడకతో ముద్దులొలికే మాటలతో ముచ్చట గొలిపే చిన్నారులకు గ్రహణ శక్తి ఎక్కువే. ఒక్కసారి వారు ఏదైనా విన్నా, చూసినా ఇట్టే పట్టేస్తారు. చిట్టి మెదళ్లలో దానిని నిక్షిప్తం చేసుకుని అనుకరిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సమయంలో వారికి సరైన మార్గ నిర్దేశం చేస్తే గొప్ప భవిష్యత్ దిశగా అడుగులు వేస్తారు. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్ జగన్ సర్కారు.. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తోంది. నిధులు ఖర్చు చేయడం మాత్రమే కాకుండా వినూత్న రీతిలో ఆట పాటల ద్వారా చిన్నారుల మెదళ్లకు సాన పడుతోంది. సాక్షి, అమరావతి: మూడు నుంచి ఆరేళ్ల వయసు గల పిల్లలకు బాల్య విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ (ఈసీఈ–బాల్య విద్య/పూర్వ ప్రాథమిక విద్య)అమలులో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే విద్యారంగం అభివృద్ధికి చేపట్టిన సంస్కరణలతో అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం ఇతర రాష్ట్రాలను అధిగమించి దేశంలోనే మొదటి స్థానానికి చేరుకుంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా రాష్ట్రంలో అత్యధికంగా నిధులను బాల్య విద్య కోసం కేటాయించి ఖర్చు చేస్తోంది. సెంటర్ ఫర్ బడ్జెట్ అండ్ గవర్నెన్స్ అకౌంటబిలిటీ (సీబీజీఏ), ఎన్జీఓ సంస్థ అయిన ‘సేవ్ ది చిల్డ్రన్ ఫౌండేషన్’ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. దేశంలో యూనివర్సలైజింగ్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (ఈసీఈ) కోసం చేసిన బడ్జెట్ ఖర్చులను ఈ నివేదిక విశ్లేషించింది. బాల్య విద్య, పూర్వ ప్రాథమిక విద్య కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా బడ్జెట్లో నిధులు కేటాయించి, ఖర్చు చేస్తున్నాయో వివరించింది. మూడు నుంచి ఆరేళ్ల వయసు గల పిల్లలకు బాల్య విద్యను అందించడంలో 2020–21 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా ఇతర రాష్ట్రాలేవీ అందుకోలేని స్థాయిలో ఉందని నివేదిక పేర్కొంది. రాష్ట్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యకు నిధులు ఇలా.. లక్ష్య సాధన కోసం కేంద్రం చేస్తున్న ఖర్చు ఒక్కో విద్యార్థిపై రూ.8,297 కాగా.. ఏపీలో 2020–21లో ఒక్కో పిల్లాడిపై రూ.34,758 చొప్పున ఖర్చు చేసినట్లు నివేదిక వివరించింది. ఇతర రాష్ట్రాల్లో చూస్తే ఏపీ తరువాత స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.26,396, సిక్కిం రూ.24,026 చొప్పున ఖర్చు చేశాయి. అత్యల్పంగా మేఘాలయలో రూ.3,796, పశ్చిమ బెంగాల్లో రూ.5,346, ఉత్తరప్రదేశ్‌లో రూ.6,428 చొప్పున ఖర్చు చేశారు. కేంద్రం వెచ్చిస్తోంది అత్యల్పం దేశంలో 3–6 ఏళ్ల వయస్సుగల పిల్లల సంఖ్య 9.9 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. వీరి విద్య కోసం జీడీపీలో 1.4 శాతం నిధులు ఖర్చు చేయాలని నూతన జాతీయ విద్యా విధానం సిఫార్సు చేసింది. ఇతర దేశాల్లో బాల్య విద్యకోసం తమ జీడీపీలో 0.7 శాతం నిధులు ఖర్చుచేస్తుండగా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలున్న దేశంలో ఖర్చు చేస్తున్న నిధులు చాలా తక్కువగా ఉన్నాయని నివేదిక విశ్లేషించింది. వాస్తవానికి ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పురోగతిని సాధించాలంటే అంగన్వాడీల్లోని ఒక్కో పిల్లాడిపై కేంద్రం రూ.32,500 చొప్పున, పూర్వ ప్రాథమిక విద్య కోసం ఒక్కొక్కరిపై రూ.46 వేల చొప్పున ఖర్చు చేయాల్సి ఉందని నివేదిక పేర్కొంది. అలా ఏటా ఖర్చు చేయగలిగితేనే 2030 నాటికి బాల్య విద్యలో ఇతర దేశాలతో సమానమైన స్థాయిలో పురోగతిని సాధించ గలుగుతామని తెలిపింది. కానీ, దేశంలో ఒక్కో అంగన్వాడీ పిల్లాడిపై కేంద్రం 2020–21లో వెచ్చించిన మొత్తం రూ.8,297 (0.1 శాతం) మాత్రమే. కేంద్రం బాల్య విద్య కోసం జీడీపీలో 1.5 శాతం నుంచి 2.2 శాతం నిధులు ఖర్చుచేస్తేనే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని నివేదిక స్పష్టం చేసింది. నూతన జాతీయ విద్యావిధాన పత్రంలో కూడా పూర్వ ప్రాథమిక విద్య కోసం జీడీపీలో 1.4 శాతం నిధులు ఖర్చు చేయాల్సి ఉందని పేర్కొన్నా కేంద్రం ఆ మేరకు నిధులు కేటాయించడం లేదు. 2020–21లో బాల్య విద్య కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చూస్తే 0.39 శాతం నిధులేనని నివేదిక వివరించింది. అలాగే, బాల్య విద్యకు సంబంధించి 14 రకాల సంస్థలలో సీబీజీఏ, సేవ్ ద చిల్డ్రన్ సంస్థలు అధ్యయనం చేశాయి. వీటిల్లో ప్రస్తుతం వెచ్చిస్తున్న నిధులు, జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించి ఇప్పుడు కేటాయించే నిధుల శాతాన్ని భారీగా పెంచాల్సి ఉంటుందని సీబీజీఏ స్పష్టం చేసింది. కేంద్రం కన్నా ముందుగానే ఏపీలో.. కానీ, ఏపీ సర్కారు మాత్రం మిగతా రాష్ట్రాలు, కేంద్రం కన్నా అత్యధిక నిధులను వెచ్చిస్తోంది. గతంలో ఎన్నడూలేని రీతిలో దేశంలోనే రికార్డుస్థాయిలో పిల్లల్లో పౌష్టికత పెంపు, పూర్వప్రాథమిక విద్యకు బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయిస్తోంది. ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ (పూర్వప్రాథమిక విద్య) విషయంలో కేంద్ర ప్రభుత్వం కన్నా ముందే సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టడమే కాకుండా అందుకు తగ్గట్లుగా అత్యధిక నిధులను ఖర్చు చేయించారు. అలాగే, జాతీయ నూతన విద్యావిధానంలో ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని సూచించగా అంతకు ముందుగానే రాష్ట్రంలో దాన్ని సీఎం వైఎస్ జగన్ అమల్లోకి తేవడం విశేషం. 3–8 ఏళ్లలోపు పిల్లల్లో మేధోవృద్ధి ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో వారికి చదువులకు సంబంధించిన పూర్వ ప్రాథమిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రీప్రైమరీ విధానానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టించారు. ఫౌండేషన్ స్కూళ్లుగా అంగన్వాడీలు ఇక అంగన్వాడీల ద్వారా మహిళలు, పిల్లల్లో సంపూర్ణ ఆరోగ్యం, పిల్లలు మేధోపరంగానే కాక శారీరకాభివృద్ధికి వీలుగా సంపూర్ణ పోషణ, పాఠశాలల అభివృద్ధికి నిర్దేశించిన నాడు–నేడు పథకాన్ని అంగన్వాడీలకు వర్తింపచేసి వాటిని ఫౌండేషన్ స్కూళ్లుగా తీర్చిదిద్దిస్తున్నారు. వీటిల్లోని పిల్లల కోసం ఏటా రూ.1,800 కోట్లకు పైగా ఖర్చు చేయిస్తున్నారు. అలాగే, బాలలు, వారి తల్లుల పౌష్టికతకోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలతో వారిని ఆదుకుంటున్నారు. ఇలా రాష్ట్రంలో దాదాపు 35 లక్షలకు పైగా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం పోషకాహారాన్ని అందిస్తోంది. వారిలో రక్తహీనత, పోషకాహార లోపం నివారణతోపాటు ఆరోగ్య వంతమైన సమాజం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. -
చిన్ననాటి పుస్తకాలనే చిన్నారులకు వినిపిస్తున్నారు
న్యూఢిల్లీ: భారతీయ తల్లిదండ్రుల్లో చాలామంది తాము చిన్నతనంలో చదివిన పుస్తకాలనే తమ పిల్లలకు చదివి వినిపిస్తారట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) చేసిన ఓ అధ్యయనం ఈ మేరకు తేల్చింది. కోవిడ్ నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు కలిసి గడపడం, భాష ప్రాముఖ్యతను చాటడంతో పాటు పఠనాసక్తిని ప్రోత్సహించేందుకు ఓయూపీ ప్రయత్నించింది. అందులో భాగంగా ‘గిఫ్ట్ ఆఫ్ వర్డ్స్’ పేరుతో భారత్, బ్రిటన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, చైనాల్లో ఇటీవల ఓ సర్వే చేసింది. అందులో పాల్గొన్న తల్లిదండ్రుల్లో దాదాపు సగం మంది తాము చిన్ననాడు చదివిన పుస్తకాలనే పిల్లలకు చదివి విన్పిస్తుంటామని చెప్పారు. తమ పిల్లలు కూడా దాన్నే ఇష్టపడతారని 56% మంది వెల్లడించారు. 48% మందేమో చిన్నప్పుడు తాము చదివిన పుస్తకాలనే చదివేందుకు తమ పిల్లలు ఇష్టపడుతున్నారని చెప్పారు. తాజాగా వచ్చే పుస్తకాలను ఎలా కనుక్కోవాలో 37% మందికి తెలియదని తేలింది. ఆన్లైన్, ఆడియో బుక్స్ కంటే ముద్రిత ప్రతులను చదివేందుకే ఇష్టపడతామని 70% మంది భారతీయ తల్లిదండ్రులు చెప్పారు. ఇలా పిల్లలకు పుస్తకాలు చదివి విన్పించడం ద్వారా వారితో తమ బంధం మరింత గట్టిపడుతుందని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు. పిల్లలకు పుస్తకాలు చదివి విన్పించేందుకు తమకు మరింత సమయం అందుబాటులో ఉంటే బాగుండేదని 85 శాతం మంది బాధపడుతున్నారట! పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ది పైరేట్ మమ్స్, ది పర్ఫెక్ట్ ఫిట్, స్టెల్లా అండ్ ది సీగల్, ఎ సాంగ్ ఇన్ ది మిస్ట్, ఎవ్రీబడీ హాజ్ ఫీలింగ్స్, మ్యాక్స్ టేక్స్ ఎ స్టాండ్, ది సూప్ మూమెంట్, బేర్ షేప్డ్, ఎవ్రీబడీ వర్సీస్ వంటి ఆసక్తికరమైన పుస్తకాలను ఓయూపీ సూచించింది. -
శైశవ చిత్రం
కొందరికి పసితనం ఆటవిడుపు.. ఇంకొందరి బాల్యం విద్యాభ్యాసంతో చిగురిస్తుంది.. మరికొందరి శైశవం కార్మిక చట్టాలకు చిక్కకుండా తట్టలు మోస్తుంది.. ఒకే బాల్యం అందరికీ ఒక్క తీరుగా ఉండదు. ఇవే కోణాలను స్పృశించిన ఛాయాచిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి, ఆలోచింపజేస్తున్నాయి. యునెటైడ్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాజ్ దక్కన్ హోటల్లో ఏర్పాటు చేసిన ‘గ్లింప్సెస్ ఆఫ్ చైల్డ్‌హుడ్’ ఫొటో ఎగ్జిబిషన్‌ను సినీ నటుడు రాణా ప్రారంభించారు. బాలల హక్కుల గురించి అవగాహన కలిగించేందుకు ఫొటోగ్రాఫర్లు ముందుకు రావడం అభినందనీయమన్నారు.