న్యూఢిల్లీ: భారతీయ తల్లిదండ్రుల్లో చాలామంది తాము చిన్నతనంలో చదివిన పుస్తకాలనే తమ పిల్లలకు చదివి వినిపిస్తారట. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) చేసిన ఓ అధ్యయనం ఈ మేరకు తేల్చింది. కోవిడ్ నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు కలిసి గడపడం, భాష ప్రాముఖ్యతను చాటడంతో పాటు పఠనాసక్తిని ప్రోత్సహించేందుకు ఓయూపీ ప్రయత్నించింది.
అందులో భాగంగా ‘గిఫ్ట్ ఆఫ్ వర్డ్స్’ పేరుతో భారత్, బ్రిటన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, చైనాల్లో ఇటీవల ఓ సర్వే చేసింది. అందులో పాల్గొన్న తల్లిదండ్రుల్లో దాదాపు సగం మంది తాము చిన్ననాడు చదివిన పుస్తకాలనే పిల్లలకు చదివి విన్పిస్తుంటామని చెప్పారు. తమ పిల్లలు కూడా దాన్నే ఇష్టపడతారని 56% మంది వెల్లడించారు. 48% మందేమో చిన్నప్పుడు తాము చదివిన పుస్తకాలనే చదివేందుకు తమ పిల్లలు ఇష్టపడుతున్నారని చెప్పారు.
తాజాగా వచ్చే పుస్తకాలను ఎలా కనుక్కోవాలో 37% మందికి తెలియదని తేలింది. ఆన్‌లైన్, ఆడియో బుక్స్ కంటే ముద్రిత ప్రతులను చదివేందుకే ఇష్టపడతామని 70% మంది భారతీయ తల్లిదండ్రులు చెప్పారు. ఇలా పిల్లలకు పుస్తకాలు చదివి విన్పించడం ద్వారా వారితో తమ బంధం మరింత గట్టిపడుతుందని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు.
పిల్లలకు పుస్తకాలు చదివి విన్పించేందుకు తమకు మరింత సమయం అందుబాటులో ఉంటే బాగుండేదని 85 శాతం మంది బాధపడుతున్నారట! పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ది పైరేట్ మమ్స్, ది పర్ఫెక్ట్ ఫిట్, స్టెల్లా అండ్ ది సీగల్, ఎ సాంగ్ ఇన్ ది మిస్ట్, ఎవ్రీబడీ హాజ్ ఫీలింగ్స్, మ్యాక్స్ టేక్స్ ఎ స్టాండ్, ది సూప్ మూమెంట్, బేర్ షేప్డ్, ఎవ్రీబడీ వర్సీస్ వంటి ఆసక్తికరమైన పుస్తకాలను ఓయూపీ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment