Reading books
-
పుస్తకం చదవటంలో.. ఏకాగ్రత లోపమా? అయితే ఇలా చేయండి!
ఈ రోజుల్లో.. పిల్లలు చేత పుస్తకం పట్టి, పదినిమిషాలు చదవాలంటే.. ఓపికతో కూడుకున్న పనిగా, ఇబ్బందిగా భావిస్తున్నారు. అందులో వారికి ఇష్టంలేని సబ్జెక్ట్ గురించైతే చెప్పనవసరం లేదు. పుస్తకం ఇలాగ తెరిచి వామ్మో.. ఈ సబ్జెక్టా అంటూ పక్కనెట్టుస్తున్నారు. ప్రస్తుతం జనరేషన్ కి పుస్తక పఠనంపై దృష్టి పెట్టడమనేది చాలా పెద్ద సమస్యగా మారింది.దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఓపిక లేకపోవడం, ఇతర చిన్న చిన్న కారణాలు, మరెన్నో.. మరి ఇటువంటి కారణాలకు సహజంగా చదువుపై ఏకాగ్రత పొందాలంటే కొన్ని పర్యావసనాలు ఎంచుకోవాల్సిందే. తదుపరి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ కలగడం, అంకితభావంతో తమ చదువుల్లో నిమగ్నమై ఉండటం, చదువులో పురోగతి సాధించడంవంటి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే, శ్రద్ధతో చదవడంతో విద్యార్థులు ఎక్కువ సబ్జెక్టులను అర్థం చేసుకోగలుగుతారు, దీంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతంది.పాటించాల్సిన చర్యలు..పర్యావరణం..చదువుకోవడానికి ఎప్పుడూ ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. చుట్టూ ఉన్న స్థలం శుభ్రంగా ఉండటం మరీ ఉత్తమం. వీలైతే, సహజ కాంతి, సౌకర్యవంతమైన కుర్చీ, పొందిగ్గా కూర్చునే విధానం ఎంతో అవసరం. చదివేంతవరకైనా మన ఫోన్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలనుంచి ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి.సమయం..మనకున్న రోజుకి 24 గంటల సమయంలో ఇతర అవసరాలకి చాలా సమయం పోగా, చదువుకై కొంత సమయాన్ని కెటాయంచుకోవడం అవసరం. అలా వీలు పడలేదంటే వెంటనే షెడ్యూల్‌ని తయారుచేసుకుని దానిని అనుసరించడం ఎంతో కీలకం. ప్రతిరోజూ చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని.. పెద్ద లక్ష్యాల వైపుగా కొనసాగడం సులభమైన మార్గం. ప్రతీ 45-60 నిమిషాలకు.. 5-10 నిమిషాల విరామం తీసుకోవడం అవసరం. ప్రస్తుత జనరేషన్ లో 7-8 గంటల నిద్ర మరీ ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామంతో దృష్టి, ఏకాగ్రత మెరుగుపడుతుంది.సాంకేతికత..ఓపిక, సహనానికై పోమోడోరో వంటి టెక్నిక్స్ సహాయంగా మారుతుంది. పోమోడోరో టెక్నిక్‌లో.. 25 నిమిషాల పనికి 5 నిమిషాల విరామంగా విడమర్చి ఉంటుంది. సంక్లిష్ట భావనలను అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి మైండ్ మ్యాపింగ్‌ని ఉపయోగించండి. పదజాలం, వాస్తవాలను గుర్తుంచుకోవడానికి ఫ్లాష్‌కార్డ్‌లను ఉపయోగించండి. మీ చదువులో మీకు సహాయపడే ఆన్లైన్ ట్యుటోరియల్లు, వీడియోలు, కథనాలతో కూడిన ఆన్లైన్ మాద్యమాలను ఉపయోగించడం సులభమైన మార్గం.మనస్తత్వం..ప్రతీనిమిషం సానుకూలంగా ఉండడానికే ప్రయత్నించాలి. ఎల్లప్పుడూ మన శక్తి సామర్థ్యాలపై విశ్వాసం వీడొద్దు. ధ్యానం మీ దృష్టిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఎవరైనా సహాయం కోరితే సానుకూలంగా స్పందించండి. ఇతరులనుంచి సాయంకోరడంలో ఇబ్బంది పడటం, చివరికి చిక్కుల్లో పడటం చేయకండి. సజావుగానే, తేలికగా అడగడానికి ప్రయత్నించండి.ప్రతీ వ్యక్తి భిన్నంగా ఉండాలనే నియమం ఎక్కడా కూడా లేదు. అది కొందరికి సాధ్యం అవచ్చు. మరికొందరికి కాకపోవచ్చు. అలా ఉండకపోవడానికి గల లోపాలను గుర్తించి, అవసరమైన జాగ్రత్తలు పాటించడం మేలు. శ్వాస విషయంలో గట్టిగా గాలి తీసుకోవడం, నెమ్మదిగా వదలడం ఇలా 5 నిమిషాల శ్వాసవ్యాయామంతో అలోచనా శక్తి మెరుగుపరుచుకోవచ్చు. -
మీ ఇంటి దగ్గర పుస్తకాలను అద్దెకు ఇచ్చే షాపులు ఉన్నాయా?
మన పక్కింటికో, ఎదురింట్లోకో పండగ సెలవులకని ఎవరైనా కొత్తపిల్లలు వచ్చినపుడు మాటా మాటా కలిసినపుడు మీ ఊరు పెద్దదా మా ఊరు పెద్దదా అని ఒక అంచనా వేసుకొవడానికి అడిగే మొదటి ప్రశ్న మీ ఊర్లో సినిమా టాకీసులు ఎన్ని ఉన్నాయి? అని అయి ఉండేది. నా కటువంటి సమస్యే ఎదురయ్యేది కాదు. నాకు కావలసిన భోగట్టా అల్లా మీ ఊర్లో, మీ ఇంటి దగ్గర పుస్తకాలకు అద్దెకు ఇచ్చే షాపులు ఎన్ని ఉన్నాయని మాత్రమే.నాకు ఊహ తెలిసాకా తరుచుగా ఎమ్మిగనూరుకు వెల్తుండే వాడిని. ఊర్లో దిగి మా మేనత్త ఇంటికి వెళ్ళే రిక్షా ఎక్కాకా దారికి అటూ ఇటూ చూస్తూ ఆ ఊరిలో పుస్తకాల బంకులు ఎన్ని ఉన్నాయా ? ఎక్కడెక్కడ ఉన్నాయా అని బుర్రలో గురుతులు పెట్టుకునేవాడిని . మా నూనెపల్లె లో భద్రయ్య బంకు అద్దె పుస్తకాలకు పేరెన్నికది. నూనెపల్లె సెంటరు లో గుర్రాల షెడ్డుకు ఎదురుగా ఉండేదది. ఆ బజారు అంతా కోమట్ల ఇల్లు ఎక్కువగా ఉండేవి. భద్రయ్య గారు కూడా కొమట్లే. ఆయన కొడుకు భాస్కర్ ఆ బంకులో ఎక్కువగా కూచునేవాడు. బంకు సీలింగు కు ఒక చిన్న ప్యాన్ బిగించి ఉండేది. బంకులో ఒక మూల రేడియో కూడా. అక్కడ నాకు పుస్తకాల తరువాత అత్యంత ప్రీతిప్రాత్రమైన వస్తువు బెల్లంపాకపు వేరుసేనగ గట్టా. ఎంతో రుచిగా ఉండేదది . ఇప్పుడు అటువంటి గట్టాలే ఆల్మండ్ హౌస్ లో కనపడతాయి. రూపం ఒకటే కాని ధర మాత్రం హస్తిమశకాంతరం. పుస్తకాలు, గట్టాల తరువాత నాకు ఫేవరెట్ అనదగ్గది గుడ్ డే బిస్కత్తు. గాజు సీసాలలో చక్కగా అమర్చి పెట్టి ఉండేవి. సుతారంగా అల్యూమినియం మూత తిప్పి అడిగిన వారికి బిస్కట్లు ఇచ్చేవాడు భద్రయ్య . అపుడు ఆ సీసాలోనుంచి బిస్కెట్ల వాసన ఎంత కమ్మగా వచ్చేదో. ఇప్పుడు అప్పుడప్పుడూ రత్నదీప్ సూపర్ మార్కెట్ కు ఏదయినా సరుకులు కొనడానికి వెడతానా, బిస్కెట్ కౌంటర్ దగ్గర గుడ్ డే ప్యాకెట్ పుచ్చుకుని ఆ చిన్ననాడు తగిలిన చక్కని వాసన వస్తుందా లేదా అని చూస్తా, రానే రాదు. ఆ వాసన లేని బిస్కెట్ కూడా రుచిగా అనిపించదు నాకు . నేను భద్రయ్య అంగట్లో పుస్తకం తీసుకుంటే కూడా ఉన్న ఫ్రెండ్ ఎవరో ఒకరు బిస్కెటో , బుడ్డల గట్టానో కొనేవాడు అది ఇద్దరం పంచుకుని తినుకుంటూ నడిచే దారిలోనే పుస్తకాన్ని నమిలేస్తూ కదిలేవాడ్ని.పుస్తకాలు అద్దెకిచ్చే షాపులో ఆ గోడల నిండా వందలుగా పుస్తకాలను నిలువ వరుసల్లో నింపేవారు. స్కెచ్చు పెన్నులతో పుస్తకాల మీద పేర్లు రాసి ఉండేవి. ఏ పుస్తకం కోసం కష్టపడి వెదుక్కోనక్కరలేదు. చక్కని చేతి రాతలో ఆ పేర్లు కళ్ళని ఆకర్షించేవి. చాలా షాపుల్లో అయితే పత్రికలో సీరియల్ గా వచ్చిన నవల పేజీలని చించి పుస్తకంగా బైండ్ చేసి అద్దెకు ఇచ్చెవారు. కొత్తగా రిలీజ్ అయిన పుస్తకాలయితే డిమాండ్ ఎక్కువ కాబట్టి వాటిని జనం కంట పడకుండా సెపరేట్ గా ఉంచేవాళ్ళు. నియమిత ఖాతాదారుల కోసం ఆ పుస్తకాలు పక్కకు తీసిపెట్టేవారు. షాపు వాళ్ళు ఏ పుస్తకాన్ని కూడా ఒకటి ఒకటిగా కొనేవాళ్ళు కాదు. ప్రతి పుస్తకం రెండు మూడు ఉండేవి సూపర్ స్టార్లయిన మధుబాబు, మల్లాది, యండమూరి పుస్తకాలయితే అయిదు లెక్కన కొనేవారు. ఆ పుస్తకాలు వచ్చిన కొత్తలో అయిదేం ఖర్మ పది కొన్నా అంత సులువుగా పాఠకుల చేతికి వచ్చేవి కావు. త్రిమూర్తులకు డిమాండ్ ఎక్కువ. ఎవరు ఎంత గీ పెట్టి చచ్చినా ఒకానొక కాలంలో హైస్కూలు పిల్లవాళ్ళ దగ్గరి నుండి సకుటుంబ సపరివారం వరకు తెలిసిన రచయితలంటే వీరే . పెరిగిపెద్దయి అతి పెద్ద చదవరులయిన ఆ రోజుల చదువరులు చాలామందికి అక్షర ప్రాశన చేసింది వీరే. వీరిలో యండమూరి కాస్త హట్ కే. రాసింది కమర్షియల్, పాపులర్ సాహిత్యమే కావచ్చు. అయినా ఆయన తన పుస్తకాల్లో ఎక్కడో ఒకక్కడ బుచ్చిబాబు, తిలక్ , విశ్వనాథ సత్యనారాయణ, చలం... ఇత్యాదుల ప్రస్తావన తెచ్చేవారు. నాకయితే ఈ మహారచయితల తొలి పరిచయం వీరేంద్రనాథ్ గారి పుస్తకాల్లోనే. ఒక పుస్తకంలో ఆయన ఇట్లావాక్యం వ్రాశారు "తెలుగు సాహిత్యంలో ఒకే ఒక హీరో తంగిరాల శంకరప్ప" ఆ వాక్యాన్ని పట్టుకుని నేను పెద్దయ్యాకా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి సాహిత్యాన్ని మొత్తం చదువుకునే భాగ్యం కలిగింది. లేకుంటే ఎక్కడి చిన్న పల్లె నూనెపల్లె? దానికి అద్భుతమైన సాహిత్యం ఎంతెంత దూరం?షాపు పెట్టాము కదాని వచ్చిన ప్రతి ఒక్కరికి పుస్తకాలు ఇవ్వబడవు. బ్యాంకులో అకవుంట్ తెరవడానికి సాక్షి సంతకం కావాలన్నట్లు, షాపువారికి తెలిసిన వారినెవరినయినా తోడుగా తీసుకెడితేనే పుస్తకాలు ఇస్తారు. లేదా పుస్తకం ధరమొత్తం అడ్వాన్సుగా కట్టాలి. నాకు గుర్తు ఉండి కొందరు 20 రూపాయలు బయానా గా పుచ్చుకునేవారు. అంత డబ్బు ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు? అందుకని నేను ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి అడ్వాన్స్ కట్టే వాణ్ని, అద్దె చెల్లించే వాడిని. పుస్తకాలు నాకు దొంగతనం నేర్పాయి. అలవాటు ఐయింది కదాని ప్రతిఎప్పుడూ దొంగతనం చేయకూడదు. పట్టుబడి పోతాం. అందుకే పుస్తకాలకు అద్దె అప్పు పెట్టడం నేర్చుకున్నాను. ఈ రోజుల్లో చోరీ చేస్తూ పట్టుబడిన పిల్లలు ఎవరైనా పుస్తకాలు కొనడానికి దొంగతనం చేసాను అని ఏడుపుముఖంతో అంటే వాళ్ళని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోబుద్ది వేస్తోంది. నేను పెరిగి పెద్దయ్యాక ఒకసారి నాకెంతో ఇష్టమైన ఆర్టిస్ట్ పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక దిగాలుగా ఉంటే ఏమిటి విషయమని అడిగి తెలుసుకుని చిత్రకారులు శ్రీ బాపు గారు దగ్గరకు పిలిచి ముద్దు పెట్టుకోలేదు కానీ ఇరవైవేల రూపాయలు ఇచ్చి నా ముఖంలో నవ్వు చూశారు . అద్దెకు తీసుకున్న పుస్తకాన్ని తమ వద్దనున్న రిజిస్టరు పుస్తకంలో తేది, సమయం వేసి , మళ్ళీ ఆ పుస్తకాన్ని రేపటి రోజున అదే సమయం లేదా అంతకంటే ముందుగా తెచ్చి ఇస్తే ఒక రోజు అద్దె, రోజు మారిన కొద్దీ అద్దె రెట్టింపు అయ్యేది ,ఒక్కొక్క సారి అద్దె కట్టడానికి కి డబ్బులు లేక పుస్తకాన్ని అట్లానే అట్టిపెట్టేసుకుని పుస్తకం ధరకన్నా ఎక్కువ అద్దె డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడప్పుడు షాపు యజమానికి ఏదయినా పనిపడో , భోజనానికి వెళ్ళవలసి వచ్చినపుడో పుస్తకాల షాపు మూసి ఉండేది. షాపు మూసి ఉన్నదేమి అని ఖంగారు పడకూడదు. అంగడి చెక్కలకు సన్న సందులు ఉంటాయి . అందు గుండా పుస్తకాన్ని పడెయ్యాలి. షాపు ఆయన తిరిగి వచ్చాక మన పుస్తకం నెంబరు , పేరూ చూసి పుస్తకం ముట్టినట్టుగా పద్దు వేసుకుంటాడు. అద్దె బకాయి రాసుకుంటాడు.మా ఇంటి దగ్గరలోనే, శివశంకర విలాస్ దగ్గర ఒక క్రైస్తవ కుటుంబం పుస్తకాల బంకు పెట్టుకున్నారు. అమ్మా, నాన్న, ఒక అబ్బాయి. ఒకరు లేనప్పుడు ఒకరు ఆ షాపు చూసుకునేవారు. నేను వాళ్లదగ్గర పుస్తకాలు అద్దెకు తీసుకునేవాడిని. యండమూరి వీరేంద్రనాథ్ "’రక్తసింథూరం" పుస్తకం అక్కడే తీసుకున్న గుర్తు నాకు. ఆ పుస్తకానికి చిత్రకారులు చంద్ర గారు వేసిన బొమ్మని చూసి మంత్రముగ్దుణ్ణి అయ్యాను ఆ కాలల్లోనే. ఒకసారి పుస్తకాలకు అద్దె చెల్లించడానికి డబ్బులు లేనప్పుడు ఒక ఉపాయం చేశా. కొడుకు ఆ షాపులో ఉన్నపుడు పుస్తకం తీసుకున్నాను అనుకో, పుస్తకం తిరిగి ఇచ్చేటప్పుడు అతను కాకుండా వాళ్ళ అమ్మగారో , నాయనో ఉన్నప్పుడు పుస్తకం వాపసు ఇచ్చి అద్దె ముందే కట్టా అని చెప్పేవాడిని. కొన్ని సార్లు పుస్తకం అద్దె ముందే కట్టించుకునేవారు. పుస్తకాలు నాకు మోసాన్ని కూడా నేర్పాయి. ఆ కుటుంబం వారు కడు బీదవారు. వారి రూపు, వేసుకున్న బట్టలు ఆ విషయాన్ని యథాతంగా చూపేవి. ఇప్పుడు ఎప్పుడయినా నాకు ఏదయినా అన్యాయం జరిగింది అనిపించినపుడు నేను ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుని వారిని మోసం చేసినందుకు ఇదంతా నాకు తగినదే జరిగింది అనుకుంటాను. ఇపుడు ఆ బంకు వాళ్ళు ఎవరూ కనపడరు కానీ కనపడితే బావుండు, వాళ్ళ చేతులు పట్టుకుని మన్నించమని ప్రాధేయపోయేవాడినే. పుస్తకాల చదువు వలన నేను దొంగతనం, మోసం నేర్చుకుంటే నా ప్రెండు బాషా అనేవాడికి పుస్తకాలు వ్యాపారం నేర్పాయి. ఆ రోజుల్లో ఎంత పెద్ద పుస్తకాన్నయినా ఒక దెబ్బకు గంటా రెండు గంటల్లో చదివేసేవాళ్లం. మరి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లొక లెక్క. మా బాషాగాడు ఏం చేసేవాడంటే వాడు ఒక పిల్లల పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకుని చదివేసి , ఒకోసారి చదవకుండా కూడా మాకు అద్దెకు ఇచ్చేవాడు. గంటకు పావలా పుచ్చుకునేవాడు . షాపులో అయితే పుస్తకాన్ని ఒక గంటకు వెనక్కి ఇచ్చినా, ఒక రోజుకు వెనక్కి ఇచ్చినా రూపాయో, రూపాయిన్నరనో కట్టక తప్పదు . బాషగాడి పావలా పథకం హాయిగా ఉండేది. వాడు ఇచ్చినంత మందికి అద్దెకు ఇచ్చి , అద్దె చెల్లించి ఆ పై దర్జాగా మిగిలిన డబ్బులు జేబులో వేసుకునే వాడు.చిన్న చిన్న బంకుల్లో కుదరదు కానీ, కాస్త పెద్ద షాపుల్లో అయితే పుస్తకాలు చూస్తూన్నట్టుగా నటిస్తూ, షాపు యజమాని తల తిప్పగానే చేతిలో ఉన్న పుస్తకాన్ని చొక్కా ఎత్తి లటుక్కున నిక్కరుకు పొట్టకు మధ్యలో దాచేవాళ్లం. పుస్తకం చదివెయ్యగానే మళ్ళీ వెనక్కి వచ్చి పుస్తకాన్ని ఆ అరల మధ్యనే ఇరికించి వెళ్ళేవాళ్లం. చెప్పుకుంటూ పొతే చాలా సంగతులు ఊరుతూనే ఉంటయి. నిజానికి ఎలా కనుమరుగయ్యాయో, ఎప్పుడు కనుమరుగయ్యాకో కూడా ఊహకు అందడం లేదు ఆ పుస్తకాలని అద్దెకు ఇచ్చే షాపులు. టెంత్ క్లాస్ లోనా? కాదేమో ! ఇంటర్ మీడియట్ లోనా , లేక డిగ్రీ రోజుల్లోనా? ఏమో గుర్తు లేదు. సినిమా థియేటర్ టికెట్ కౌంటర్ బయట నిలబడ్డంత పెద్ద బారు వరుస కాకపోయినా , అద్దె పుస్తకాల షాపు, బంకుల బయట వరుసలో నాలుగురయిదుగురే ఉన్నా, కొత్త నవల కోసం విపరీతమయిన ఒత్తిడి తోనో , నాలుగురోజులుగా తెగ తిరుగుతున్నా ఇంకా దొరకని అభిమాన రచయితా పుస్తకం ఈరోజైనా దొరుకుతుందా లేదా అనే మనోదౌర్బల్యం తోడుగానో నిలబడి ఉండేవారు పాఠకులు. వట్టి అద్దె పుస్తకాలే కాదు. ఊరి మెయిన్ సెంటర్లలోనూ, సందు చివర, వీధి మలుపులో ప్రతిచోటా దినపత్రికలు, వార పత్రికలూ, పక్షపత్రికలు, పిల్లల పత్రికలూ , పాకెట్ నవల్స్ కనపడుతూనే ఉండేవి, ఈరోజు ఒక దినపత్రిక కోసమో, వార పత్రిక కోసమో కిలోమీటర్లకు కిలో మీటర్లు నడిచినా ఒక్క పుస్తకమూ రోడ్డు మీద కనపడుత లేదంటే అత్యంత సాంస్కృతిక లేమి నడుస్తున్న రోజులవి . ఆరోజుల్లో కథలు, నవలలు, పాటలు , పద్యాలు అనేకాలు పుస్తకాలుగా దొరికేవి. రచయితల ముక్కు మొహంతో అవసరం లేని రోజులవి. రాసిందే భాగ్యం. కంటపడిన అచ్చు కాగితమే వరం. ఈ రోజున వద్దన్నా వీధికొక, సందుకోక, నగరం నాలుగు వైపులా రచయితలూ, కవులు ఊరికూరికే కనపడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సరస్వతి మీద ఒట్టు రచయితల పేర్లు తెలుసు , వారు వ్రాసిన ఒక్క వాక్యం కూడా తెలీదు. రాసేవారు మాత్రమే తెలుస్తున్నారు రచన అందడం లేదు . ఏం రాశారో ఆనవాలు లేదు, చూసిన తనని పోల్చుకుంటే చాలన్నంత అల్పసంతోషి అయిపోయినాడు సృజనకారుడు.-అన్వర్ -
పుస్తకం కర్ణభూషణం
పుస్తకం హస్తభూషణమన్నారు; అది చదివే పుస్తకాల గురించి! ఇప్పుడు వినే పుస్తకాలు ప్రాచుర్యాన్ని తెచ్చుకుంటూ కర్ణభూషణంగా మారుతున్నాయి. కాలం చేసే తమాషాలలో ఇదొకటి. మన జీవితమూ, ఊహలూ, ప్రణాళికలూ కాలం వెంబడి సరళరేఖలా సాగుతాయనుకుంటాం. కానీ,దృష్టి వైశాల్యాన్ని పెంచుకుని చూస్తే కాలం మళ్ళీ మళ్ళీ బయలుదేరిన చోటికే వచ్చే చక్రంలా కూడా కనిపిస్తుంది. ‘కాలచక్ర’మనే మాట సర్వత్రా ప్రసిద్ధమే. పుస్తక ప్రపంచంలోకే కనుక ఒకసారి తొంగి చూస్తే, ‘చదువు’ అనే మాట పుస్తకంతో ముడిపడే ప్రచారంలోకి వచ్చింది. పుస్తకాలు లేని కాలంలో; లేదా, అవి జనసామాన్యానికి విరివిగా అందుబాటులోకి రాని రోజుల్లో కథలూ, కవిత్వాలూ, ఇతరేతర జ్ఞానాలూ అన్నీ వినుకలి ద్వారానే అందేవి. దీర్ఘకాలంపాటు ప్రపంచవ్యాప్తంగా సమస్త వాఙ్మయమూ చక్షురక్షరాల మధ్య కాకుండా; వక్తకీ, శ్రోతకీ మధ్య ప్రవహిస్తూ మౌఖిక వాఙ్మ యమనే ముద్ర వేసుకుంది. పుస్తక వ్యాప్తితోనే లిఖిత సాహిత్యమన్న మాట వాడుకలోకి వచ్చింది. కాలచక్రం మళ్ళీ మొదటికొచ్చి, పుస్తకమనే ‘పఠన’ మాధ్యమం స్థానాన్ని, ఇయర్ ఫోన్ రూపంలో తిరిగి వెనకటి ‘శ్రవణ’ మాధ్యమం ఆక్రమించుకుంటున్నట్టు తోస్తోంది. నేటి యువత పుస్తకాన్ని చదవడం కన్నా, వినడాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ విధంగా, ‘పుస్తకాలు లేని గది ఆత్మలేని దేహ’మన్న సిసిరో సూక్తిని కొంత సవరించుకోవలసిన అవసరమూ కలుగుతోంది. కనుకలి నుంచి వినుకలికి మారినప్పుడు పుస్తకం కలిగించే అనుభూతి గాఢతలోనూ మార్పు వస్తుందా అన్నది అనుభవంతో మాత్రమే చెప్పగలం. ఏదైనాసరే అంతిమంగా అలవాటు పడడంలోనే ఉంటుంది. మాధ్యమం ఎలాంటిదైనా పుస్తకానికీ మస్తకానికీ పడిన పీటముడి స్థిరమూ, శాశ్వతమనీ మాత్రం నిస్సంశయంగా చెప్పవచ్చు. రాబోయే కాలం అనూహ్యంగా మన అంచనాలను తలకిందులు చేస్తే తప్ప పుస్తకాలతో మన సహజీవనం మరికొన్ని తరాలపాటు నిరాఘాటంగా కొనసాగుతుందనే అనుకోవచ్చు. కాపురంలోలానే పుస్తకాలతో కాపురంలోనూ చేదూ, తీపీ కలగలిసే ఉంటాయి. పుస్తక ప్రియులు వియ్యమందితే ఒక్కోసారి సొంతింటి పుస్తక వారసత్వానికీ, సొంత సేకరణకూ అదనంగా అత్తింటి పుస్తక వారసత్వమూ అంది, పుస్తకాలు ఇబ్బడి ముబ్బడై అల్మైరాలను దాటిపోయి నేల మీద పరచుకుంటూ ఉంటాయి. పుస్తెతోపాటు సంక్రమించిన పుస్తక సంపదా ఇల్లాలికి దినదిన సమస్య అవుతూ ఉంటుంది. పుస్తకాలతో జీవించడం కూడా ఒక పుస్తకానికి సరిపోయే ఇతివృత్త మవుతుంది. బాల్యం నుంచి, వార్ధక్యం వరకూ మనతో ఉండే పుస్తకాలు, ఒక్క పుట కూడా తెరవకుండానే, ఆయా వయోదశల మీదుగా మన అభిరుచులలో వచ్చే తేడాలను బోధిస్తాయి. మనకు పనికిరానివని పక్కన పెట్టిన పుస్తకాలే క్రమంగా మన చదువుల బల్లకెక్కి వెక్కిరిస్తాయి. మన హస్తస్పర్శ కోసం ఏళ్ల తరబడి మౌన తపస్సు చేసే పుస్తకాలే, ఒక్కసారి తెరవగానే అద్భుత ప్రపంచంలోకి మనల్ని లాక్కుపోతాయి. మన ప్రయాణం ఆగినా పుస్తక ప్రయాణం కొన సాగుతూనే ఉంటుంది. కవిత్వానికి ఏదీ అనర్హం కాదని మహాకవి ఉగ్గడించినట్టుగా, చరిత్ర శోధనకూ ఏదీ అనర్హం కాదు. పుస్తక చరిత్రనే తవ్వితే అది కూడా ఎన్నో అవతారాలు ఎత్తుతూ నేటి దశకు వచ్చిన సంగతి అర్థమై రేపటి అవతారం గురించిన దిగులు, గుబుళ్లను తగ్గిస్తుంది. పుస్తకం గురించిన ఊహ క్రీస్తుపూర్వం నాలుగవ సహస్రాబ్ది నాటికే ఉండేది. ప్రాచీన ఈజిప్టు వాసులు మధ్య ఆఫ్రికా, నైలునదీ లోయల్లో పెరిగే ‘పెపారస్’ అనే నీటిమొక్క నుంచి తీసిన మెత్తని బెరడును రాతకు, చిత్రలేఖనానికి ఉపయోగించేవారు. ఈ ‘పెపారస్’ పేరే ‘పేపర్’గా మారి ఇప్పటికీ వ్యవహారంలో ఉంది. ఆంగ్లంలో ‘బుక్’ అనే మాట పుట్టుకా ఇంతే ఆసక్తికరం. యూరప్, ఆసియా అడవుల్లో పెరిగే ‘బచ్’ అనే చెట్టు తాలూకు తెల్లని బెరడును రాతకు ఉపయోగించేవారు. నేటి ఇండో–యూరోపియన్ భాషలకు మాతృక అయిన ప్రోటో–ఇండో–యూరోపియన్ లోని ‘భెరెగ్’, ‘భగో’ అనే మాటలే వివిధ పుత్రికాభాషల్లో ‘బచ్’ గానూ, ‘బీచ్’ గానే కాక; ఇంకా అనేక రూపాంతరాలు చెందుతూ చివరికి ‘బుక్’గా మారాయి. ప్రాచీన భారతదేశంలో రాతకు ఉపయోగించిన ‘భూర్జపత్ర’ మనే సంస్కృత శబ్ద మూలాలు కూడా ‘భెరెగ్’ అనే ప్రోటో–ఇండో–యూరోపియన్ పదంలోనే ఉన్నాయి. క్రీస్తుశకం తొలి శతాబ్దంలో రోమన్లు శిక్షాస్మృతుల రాతకు గొర్రె, మేక చర్మాన్ని వినియో గించేవారు. క్రమంగా తాటియాకులు, రాగిరేకులు రాతకు ఆలంబనమయ్యాయి. క్రీస్తుశకం 2–5 శతాబ్దుల మధ్యలో వచ్చినట్టు చెబుతున్న ‘డైమెండ్ సూత్ర’ తొలి ముద్రితగ్రంథమంటారు. ఇక 15వ శతాబ్దిలో జోహానెస్ గూటెన్‌బర్గ్ కనిపెట్టిన ముద్రణ యంత్రం పుస్తక ప్రచురణను విప్లవీకరించడం, 16వ శతాబ్దిలో రిచర్డ్ ముల్కాస్టర్ అనే పండితుడు ఎనిమిదివేల మాటలతో తొలి నిఘంటువును ప్రచురించడం వగైరాలు ఇటీవలి చరిత్ర. ఎప్పటికప్పుడు పరిమిత సంఖ్యలో పుస్తకాలను ప్రచురించుకునే నేటి అవకాశాన్ని (ప్రింట్–ఆన్ –ఆర్డర్) ఫ్రెడరిక్ ఫో అనే సైన్సు ఫిక్షన్ రచయిత 1966లోనే ఊహించాడు. ఇంతకీ ఈ పుస్తక స్మరణ దేనికంటే, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పుస్తకాల పండుగ సమీపిస్తోంది. కొన్ని రోజులపాటు జరిగే ఈ పండుగకు ముద్రాపకులు, విక్రేతలు, రచయితలు సమధికోత్సాహంతో సిద్ధమవుతున్నారు. ముద్రిత గ్రంథాల భవిష్యత్తు పట్ల ప్రస్తుతానికి అదే కొండంత భరోసా. -
పుస్తక మర్యాద
ఒక పుస్తకాన్ని చదవడం వేరు, ఆ పుస్తకాన్ని అపురూపంగా చూడటం వేరు. చాలామంది పుస్తకాలను అమర్యాదగా చదువుతారు. అంతే సమానంగా వాటిపట్ల అజాగ్రత్తగా ఉంటారు. పుస్తకాలను వాటి మర్యాదకు తగినట్టుగా గౌరవించడం కూడా ఒక సంస్కృతి! పుస్తకం పేజీలు తీయడం కూడా కొందరు సుతారంగా తీస్తారు; పేజీలు నలగకుండా దాన్నొక పువ్వులా హ్యాండిల్ చేస్తారు. కొందరు నీటుగా బుక్ మార్క్స్ సిద్ధం చేసుకుంటారు. కొందరు చదవడం ఆపిన చోట పేజీ కొసను చిన్నగా మడుచుకుంటారు. ఇక కొందరి పుస్తకం చదవడం పూర్తయ్యేసరికి ఒక బీభత్సం జరిగివుంటుంది. అలాగని పుస్తకం చదువుతూ రాసుకునే నోట్సు దీనికి భిన్నం. అది పుస్తకంతో ఎవరికి వారు చేసుకునే వ్యక్తిగత సంభాషణ. కొందరు కేవలం అండర్లైన్ చేసుకుంటారు. కొందరు పుస్తకం చివర నచ్చిన పేజీ తాలూకు నంబర్ వేసుకుని దానికి సంబంధించిన వ్యాఖ్యో, పొడి మాటో రాసుకుంటారు. ఇలాంటివారికి పుస్తకంలో చివర వచ్చే తెల్ల కాగితాలు చాలా ఉపయుక్తం. పఠనానుభవాన్ని పెంపు చేసుకునేది ఏదైనా పుస్తకాన్ని గౌరవించేదే. అయితే, పుస్తకాన్ని గౌరవిస్తున్నారని చూడగానే ఇట్టే తెలియజేసే అతి ముఖ్యమైన భౌతిక రూప చర్య– దాన్ని బైండు చేయడం. ఈ బైండు చేయించడంలో, స్వయంగా తామే చేసుకోవడంలో కూడా ఎవరి అభిరుచి వారిది. అలాగే పుస్తకం తరహాను బట్టి కూడా ఇది మారొచ్చు. అలాగే బైండింగుకు వాడే మెటీరియల్, అది చేసే పద్ధతులు కూడా చాలా రకాలు. ఏమైనా బైండింగు కూడా దానికదే ఒక కళ. అది కొందరికి బతుకుదెరువు అనేది కూడా ఒక వాస్తవమే. కానీ ప్రపంచంలో గొప్ప బైండింగు కళాకారుల పనితనాన్ని తెలియజేసే పుస్తకాలు కూడా కొన్ని చోట్ల ప్రదర్శనకు ఉన్నాయి. పుస్తకం లోపల వ్యక్తమయ్యే భావాలకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దాలంటే ఆ బైండరు కూడా మంచి కళాకారుడు అయివుండాలి. ఫ్యోదర్ దోస్తోవ్స్కీ నవల ‘ద పొసెస్డ్’లో జరిగే ఈ ఆసక్తికర సంభాషణ పుస్తకాల పట్ల ప్రపంచం ఇంకా ఎక్కడుందో తెలియజేస్తుంది. ఈ నవలకే వాటి అనువాదకులను బట్టి ‘డెమన్ ్స’, ‘డెవిల్స్’ అని మరో రెండు పేర్లున్నాయి. జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, వాస్తవాల చేదును గ్రహించి, బండి బాడుగ కూడా ఇవ్వలేని స్థితిలో చివరకు తానే వదిలేసిన భర్త దగ్గరకు మళ్లీ చేరుతుంది మేరీ. బతకడానికి ఏదైనా మార్గం గురించి ఆలోచిస్తూ, ‘పోనీ పుస్తకాల బైండింగు చేస్తాను’ అంటుంది. అప్పుడు ఆమె భర్త, నవలలో అన్నివిధాలా సంయమనం కలిగిన మనిషి, ‘ఆదర్శాల్లోని’ నిగ్గును తేల్చుకున్న ఇవాన్ షతోవ్ ఆమె భ్రమలు తొలిగేలా ఇలా చెబుతాడు: ‘‘పుస్తకాలను చదవడం, వాటిని బౌండు చేయించడం అనేవి అభివృద్ధికి సంబంధించిన రెండు పూర్తి భిన్న దశలు. మొదట, జనాలు నెమ్మదిగా చదవడానికి అలవాటు పడతారు. దీనికి సహజంగానే శతాబ్దాలు పడుతుంది; కానీ వాళ్లు తమ పుస్తకాలను కాపాడుకోరు. వాటిని నిర్లక్ష్యంగా పడేస్తారు. పుస్తకాలను బైండు చేయించడం అనేది పుస్తకాల పట్ల గౌరవానికి సంకేతం; అది ప్రజలు పుస్తకాలను చదవడానికి ఇష్టపడటమే కాదు, వాళ్లు దాన్ని ఒక ప్రధాన వృత్తిగా భావిస్తున్నారని సూచిస్తుంది. రష్యాలో ఎక్కడా అలాంటి దశకు చేరుకోలేదు. యూరప్‌లో కొంతకాలంగా తమ పుస్తకాలను బైండింగ్ చేయిస్తున్నారు.’’ 1871–72 కాలంలో రాసిన ఈ నవలలో, సాహిత్యం అత్యంత ఉచ్చస్థితిని అందుకొందనుకునే రష్యా సైతం ఒక దేశంగా చదివే సంస్కతిలో వెనుకబడి ఉందన్నట్టుగా రాశారు దోస్తోవ్స్కీ. ఇంక మిగతా దేశాల పరిస్థితి? ఒక సమాజపు అత్యున్నత స్థితిని కొలవగలిగే ప్రమాణాలు అక్కడి కళలు, వాటి పట్ల జనాల వైఖరి మాత్రమే. దీనికి కూడా ఈ నవలలో దోస్తోవ్స్కీ ద్వారా సమాధానం దొరుకుతుంది. అప్పటి కాలానికి తనను తాను అభ్యుదయ రచయితగా భావించుకొనే పీటర్ వెర్కోవెన్ స్కీ ఇలా ఆవేశపడతాడు: ‘‘బానిసల (సెర్ఫులు) దాస్య విమోచన కంటే కూడా షేక్స్పియర్, రఫేల్ అధికోన్నతులని నేను ఘోషిస్తున్నాను; జాతీయత కంటే అధికోన్నతులు, సామ్యవాదం కంటే అధికోన్నతులు, యువతరం కంటే అధికోన్నతులు, రసాయన శాస్త్రం కంటే అధికోన్నతులు, దాదాపు మానవాళి మొత్తం కంటే అధికోన్నతులు; ఎందుకంటే వాళ్లు ఇప్పటికే సమస్త మానవాళి సాధించిన ఫలం. నిజమైన ఫలం. బహుశా ఇంకెప్పటికీ సాధ్యం కానంతటి అత్యున్నత ఫలం!’’ అలాంటి ఒక కళోన్నత స్థితి లేని సమాజంలో తాను జీవించడానికి కూడా సమ్మతించకపోవచ్చునంటాడు వెర్కోవెన్ స్కీ. ఇది ఆర్ట్ అనేదానికి అత్యున్నత స్థానం ఇచ్చే సాంస్కృతిక కులీనుల అతిశయోక్తిలా కనబడొచ్చు. కానీ కళ అనేదాన్ని మినహాయిస్తే మన జీవితాల్లో మిగిలేది ఏమిటి? మహాశూన్యం. గాఢాంధకారం. అందుకే తమ జీవితాల్లో ఏదో మేరకు కళను సజీవంగా నిలుపుకొన్నవాళ్లు అదృష్టవంతులు. అది తమకు నచ్చిన సీరియళ్లను ఒక పుస్తకంగా కుట్టుకోవడం, తమకు నచ్చిన పుస్తకాలను బైండు చేయించుకోవడం కూడా కావొచ్చు. ఏ రూపంలో ఉన్న అతివాదాన్నయినా దాని మూలాలను, అది పాతుకుపోవడానికి దారితీసే పరిస్థితులను, ఒకప్పుడు తమ వర్గంవాడే అయినా కేవలం ఇప్పుడు ఆ వాదంలోంచి బయటపడ్డాడన్న కారణంగా చంపడానికీ వెనుకాడని మూక మనస్తత్వాన్ని–– ఒక శక్తిమంతమైన సూక్ష్మదర్శినిలో చూసినట్టుగా చిత్రించిన నవల ‘పొసెస్డ్’. విషాదాంతంగా ముగిసే ఈ సామాజిక, రాజకీయ వ్యాఖ్యాన నవల కూడా బైండు చేసుకుని దాచుకోవాల్సిన పుస్తకం. అదే అనితర సాధ్యుడైన దోస్తోవ్స్కీ లాంటి రచయితకు ఇవ్వగలిగే సముచిత మర్యాద! -
అలా చేయవచ్చా... అది అవమానం కదూ !!!
మన దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సనాతన ధర్మానికి పూర్వ వైభవం తీసుకురావడంలో ఎనలేని కృషి చేసిన సమర్ధ రామదాసు గారు చెప్పిన మరో సూత్రం – జ్ఞాన సముపార్జన, ప్రచారం. ఇంట్లో మంచి మంచి చిత్తరువులు, మంచి పరుపులు, మంచి మంచాలు, కుర్చీలు, ఇతర అలంకార సామాగ్రి ఎలా ఉంచుకుంటామో... ప్రతి ఇంటా కూడా చదవదగిన పుస్తకాలు కొన్ని ఉండి తీరాలి. చదివిన పుస్తకాల మీద చర్చ కూడా జరుగుతుండాలి. ఇంటి పెద్ద ఒక మంచి పుస్తకం చదివి దానిలో తనకు నచ్చిన అంశాలు ఏ పేజీల్లో ఉన్నాయో ఆ పుస్తకం ముందుండే తెల్లకాగితంపై రాసి ఉంచాలి. పిల్లలు ఆ పుస్తకం తెరిచినప్పుడల్లా వాటిని చదివి పుస్తకంపట్ల ఆసక్తి పెంచుకుంటారు. చదివిన పుస్తకంపై కుటుంబ సభ్యులతో చర్చిస్తూండాలి. అప్పడు తీరికసమయాల్లో వాటిని చదవడానికి అందరికీ ప్రేరణ కలుగుతుంది. నిజానికి ఇంటి సంపద వృద్ధిలోకి రావాలన్నా, ఇంటి గౌరవం ఆచంద్రార్కం కొనసాగాలన్నా.. ఆ ఇంటి యజమాని ఎన్ని పుస్తకాలు చదివి, ఎన్ని పుస్తకాలగురించి అలా రాసి భద్రపరిచి ఉంచాడన్నది ముఖ్యం. అదే వారికి నిజమైన ఆస్తి. అదే తరువాత తరాలవారిలో స్ఫూర్తి రగిలిస్తుంది, వారినీ ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. పుస్తకాలు కొనడం పెద్ద కష్టమేమీ కాదు, పుస్తకాలు భద్రపరచడం భారం కూడా కాదు. ‘మా ఇంట్లో పుస్తకాలు చదివేవారు లేరండీ.. అని ఇచ్చేయడం ఆ కుటుంబానికి చాలా అవమానకరమైన విషయం. చదివే వాళ్ళు లేకపోవడమేమిటి! చదివేవాళ్ళు ఉండాలి. ప్రతివాళ్లూ పుస్తకాలు ఒక నియమంగా చదవాలి. ప్రతిరోజూ మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలనుంచి బయటపడడానికి అవి ఎంతగానో ఉపయోగ పడతాయి. అవి మనకు మనశ్శాంతినిస్తాయి. ఒక్క ఆధ్యాత్మిక పుస్తకాలే కాదు... మన జీవితాలను, మన పిల్లల జీవితాలను ఉద్ధరించడానికి ఇది పనికొస్తుంది–అని అనుకున్న ప్రతి పుస్తకం ఆ ఇంట తప్పనిసరిగా ఉండాలి. పుస్తకాలు లేని జ్ఞానాన్ని ఇస్తాయి, ఉన్న జ్ఞానాన్ని అనేక రెట్లు పెంచుతాయి. ఆ జ్ఞానాన్ని పదిమందితో పంచుకున్నప్పుడు అది మరింత పెరుగుతుందే కానీ తరిగేది కూడా కాదు. అందరూ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు. కానీ కుటుంబ సభ్యులతో, ఇంటికొచ్చిన అతిథులతో, ఆత్మీయులతో జరిపే సమావేశాల్లో, విందులు, వినోదాల్లో కలిసిన సన్నిహితులతో వారు చదివిన మంచి పుస్తకాలపై చర్చ పెట్టాలి. అలాగే పిల్లలున్న ఇంటికి వెళ్ళినప్పుడు, ఇతరత్రా శుభకార్యాల్లో, దూరప్రయాణాలు వెళ్ళేవారికి మంచి మంచి పుస్తకాలు బహూకరించడం అలవాటు చేసుకోవాలి. వీలయితే ఆ పుస్తకాల ప్రాధాన్యతను, వాటిని ఎందుకు బహూకరిస్తున్నది వాటిపై రాసి సంతకం చేసి ఇస్తే... వారితో మీ బంధం మరింత గట్టిపడుతుంది. మీపట్ల వారికి, వారి కుటుంబానికి ఎనలేని గౌరవం ఏర్పడుతుంది. వారు కూడా వాటిని చదివి ఎంత ప్రభావితమవుతారో, ఎంత శాంతి పొందుతారో మాటల్లో చెప్పలేం. సమర్ధ రామదాసుగారి లాగా గురుస్థానాల్లో ఉన్న వారు ఇటువంటి విషయాలను ప్రబోధం చేయాలి, ప్రచారం చేయాలి... సమాజ అభ్యున్నతికి ఇది అవసరం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వైరల్: ఈ అమ్మాయిని చూసి... అడవి ముచ్చటపడింది!
పిల్లలు ఇష్టంగా చదువుకుంటుంటే పెద్దలే కాదు ప్రకృతి కూడా ముచ్చటపడుతుంది. నిండు మనసుతో ఆశీర్వదిస్తుంది! ‘నిద్ర సుఖం ఎరగదు’ అంటారు. విద్య కూడా అంతే! ఏసీ గదులలో, మెత్తని సోఫాలలో కూర్చుని చదివితేనే చదువు వస్తుందని ఏమీ లేదు. ఇలా ఎండలో, రాళ్లపై కూర్చొని చదువుకుంటే కూడా చదువు వస్తుంది. అదంతా మన ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. విషయంలోకి వెళితే... హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక అమ్మాయి ప్రకృతి ఒడిలో పాఠ్యపుస్తకం చదువుకుంటున్న ఫోటో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాను బాగా ఆకట్టుకుంది. ‘మన్డే మోటివేషన్స్’ ట్యాగ్‌లైన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఇన్స్పిరేషనల్ పోస్ట్ నెటిజనులను బాగా ఆకట్టుకుంది. మొదట ఈ ఫోటోను ట్విట్టర్ యూజర్ అభిషేక్ దూబే పోస్ట్ చేశాడు. ‘ఈరోజు నేను హిమాచల్‌ద్రేశ్‌లోని సత్నా ప్రాంతానికి వెళ్లాను. అక్కడ చూసిన ఒక దృశ్యం నన్ను ఆశ్చర్యానందాలకు గురి చేసింది. ఒక అమ్మాయి శ్రద్ధగా చదువుకుటోంది. నోట్స్ రాసుకుంటోంది. పచ్చటి ప్రకృతి ఆమెను దీవిస్తున్నట్లుగా ఉంది. నిజం చెప్పాలంటే... ఈ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు దొరకడం లేదు’ అంటూ రాసి మురిసిపోయాడు దూబే. ఇక యూజర్ల కామెంట్స్‌లోకి వెళితే... ‘పట్టణ రణగొణ ధ్వనుల మధ్య కాకుండా, ప్రకృతి అందాల మధ్య ప్రశాంత, నిశ్శబ్ద వాతావరణంలో చదువుకుంటున్న ఈ బాలిక ఎంత అదృష్టవంతురాలో’ అన్ని రాశాడు ఒక యూజర్. దీనికి స్పందనగా మరో యూజర్ ఇలా రాశాడు... ‘చక్కగా చెప్పారు. నా వ్యక్తిగత విషయం రాస్తాను. మా అమ్మాయి పుస్తకం పట్టుకోగానే ఇంట్లో టీవీ ఆఫ్ చేస్తాం. చిన్నగా మాట్లాడుకుంటాం. కానీ ఏం లాభం. ఇరుగింటి నుంచి పొరుగింటి నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. వెళ్లి వాళ్లతో గొడవ పడలేము కదా! ఆ రకంగా చూస్తే ఈ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు’ ‘శబ్దకాలుష్యం మితిమీరి పోతుంది. అది ఏదో ఒక రూపంలో మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు అయితే ఈ శబ్దకాలుష్యాన్ని భరించలేక అడవిలోకి పారిపోవాలనిపిస్తుంది. కానీ ఈ అమ్మాయికి అలా పారిపోవాల్సిన అవసరం లేదు. తాను ప్రకృతిలోనే ఉంది’ అని రాశాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఒక యూజర్. ‘నిజానికి పిల్లలకు నాలుగు గోడల మధ్య కాకుండా పచ్చటి ప్రకృతి మధ్యే విద్య నేర్పించాలి. ఇలా చేస్తే వారికి ప్రకృతి విలువ తెలుస్తుంది. పర్యావరణ స్పృహ బాల్యం నుంచే కలుగుతుంది. గోడలు లేని బడిలో మనసు విశాలం అవుతుంది. తాత్విక విద్యావేత్తలు ఇదే విషయాన్ని చెప్పారు’ అంటుంది ఒక యూజర్. ‘పెద్దల పోరు భరించలేక చదువుకుంటున్నట్లు కాకుండా... చాలా ఇష్టంగా చదువుకుంటున్నట్లుగా ఉంది. ఇలాంటి అమ్మాయిలే భవిష్యత్‌లో గొప్ప విజయం సాధించగలరు’ అని స్పందించాడు మరో యూజర్. ‘ఒక చిత్రం వంద మాటల సారాంశం’ అంటారు. ఈ చిత్రం మాత్రం బాలికల చదువు నుంచి కాంక్రిట్ జంగిల్లో విద్యావిధానం, పర్యావరణం... మొదలైన ఎన్నో అంశాలను చర్చలోకి తెచ్చింది. -
చిన్ననాటి పుస్తకాలనే చిన్నారులకు వినిపిస్తున్నారు
న్యూఢిల్లీ: భారతీయ తల్లిదండ్రుల్లో చాలామంది తాము చిన్నతనంలో చదివిన పుస్తకాలనే తమ పిల్లలకు చదివి వినిపిస్తారట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) చేసిన ఓ అధ్యయనం ఈ మేరకు తేల్చింది. కోవిడ్ నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు కలిసి గడపడం, భాష ప్రాముఖ్యతను చాటడంతో పాటు పఠనాసక్తిని ప్రోత్సహించేందుకు ఓయూపీ ప్రయత్నించింది. అందులో భాగంగా ‘గిఫ్ట్ ఆఫ్ వర్డ్స్’ పేరుతో భారత్, బ్రిటన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, చైనాల్లో ఇటీవల ఓ సర్వే చేసింది. అందులో పాల్గొన్న తల్లిదండ్రుల్లో దాదాపు సగం మంది తాము చిన్ననాడు చదివిన పుస్తకాలనే పిల్లలకు చదివి విన్పిస్తుంటామని చెప్పారు. తమ పిల్లలు కూడా దాన్నే ఇష్టపడతారని 56% మంది వెల్లడించారు. 48% మందేమో చిన్నప్పుడు తాము చదివిన పుస్తకాలనే చదివేందుకు తమ పిల్లలు ఇష్టపడుతున్నారని చెప్పారు. తాజాగా వచ్చే పుస్తకాలను ఎలా కనుక్కోవాలో 37% మందికి తెలియదని తేలింది. ఆన్లైన్, ఆడియో బుక్స్ కంటే ముద్రిత ప్రతులను చదివేందుకే ఇష్టపడతామని 70% మంది భారతీయ తల్లిదండ్రులు చెప్పారు. ఇలా పిల్లలకు పుస్తకాలు చదివి విన్పించడం ద్వారా వారితో తమ బంధం మరింత గట్టిపడుతుందని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు. పిల్లలకు పుస్తకాలు చదివి విన్పించేందుకు తమకు మరింత సమయం అందుబాటులో ఉంటే బాగుండేదని 85 శాతం మంది బాధపడుతున్నారట! పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ది పైరేట్ మమ్స్, ది పర్ఫెక్ట్ ఫిట్, స్టెల్లా అండ్ ది సీగల్, ఎ సాంగ్ ఇన్ ది మిస్ట్, ఎవ్రీబడీ హాజ్ ఫీలింగ్స్, మ్యాక్స్ టేక్స్ ఎ స్టాండ్, ది సూప్ మూమెంట్, బేర్ షేప్డ్, ఎవ్రీబడీ వర్సీస్ వంటి ఆసక్తికరమైన పుస్తకాలను ఓయూపీ సూచించింది. -
నడిచే పుస్తకాలయాలు
పుస్తకాలు ఒక సంప్రదాయానికి ప్రతీకలు. ఒక సంస్కృతిని మరొక తరానికి అందించే వారధులు. అటువంటి పుస్తక పఠనం తగ్గిపోతుండటంతో, తిరిగి పుస్తక పఠనానికి వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో మహారాష్ట్రకు చెందిన కొందరు ఐటీ ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు కలిసి ‘లెట్స్ రీడ్ ఇండియా’ అనే ఒక ఉద్యమం ప్రారంభించి, పుస్తకాల లైబ్రరీని ఇంటింటికీ తీసుకురావటం మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ కొద్ది నెలల క్రితం ప్రారంభమైంది. అన్ని విభాగాలకు చెందిన పది లక్షల పుస్తకాలతో వీరు ఈ ఉద్యమం ప్రారంభించారు. ‘మా ప్రయత్నం వృథా పోలేదు. మంచి ఫలితాలు వస్తున్నాయి. వాట్సాప్, సోషల్ మీడియా తరాన్ని వెనుకకు మళ్లించి, పుస్తకాలు చదివించాలనేదే మా లక్ష్యం. వారు పుస్తకాలు చదివి, మన సంస్కృతి ని అర్థం చేసుకోవాలి. పుస్తకాల ద్వారా వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం’ అంటున్నారు ఈ ఉద్యమ వ్యవస్థాపకులలో ఒకరైన ప్రఫుల్ల వాంఖేడే. ఇప్పుడు ఈ పుస్తకాలు దూర ప్రాంతాలకు, ఎటువంటి సౌకర్యాలు లేని ప్రదేశాలకు కూడా చేరుతున్నాయి. ‘‘మా పుస్తకాలు ప్రతి ఒక్కరికీ చేరాలి. మాకు మూడు మొబైల్ లైబ్రరీలు ఉన్నాయి. ప్రజలు మా దగ్గర నుంచి పుస్తకాలను ఉచితంగా, ఒక వారం వారి దగ్గర ఉంచుకునేలా తీసుకోవచ్చు. అయితే పుస్తకం చదివినవారు తప్పనిసరిగా ఆ పుస్తకం గురించి 300 పదాలలో ఒక రివ్యూ రాసి ఇవ్వాలి. అప్పుడే రెండో పుస్తకం ఇస్తామన్నది షరతు. లేదంటే వారు ఒక పుస్తకం తీసుకుని, ఇంట్లో ఏదో ఒక మూల పడేస్తారు. అప్పుడు మా లక్ష్యం నెరవేరదు’’ అంటున్నారు వాంఖేడే. పుస్తకాలు చదవాలనుకునేవారు సోషల్ మీడియా సైట్ లేదా వెబ్సైట్ యాప్ ద్వారా సంప్రదించే అవకాశం ఉంది. జిపియస్ ద్వారా మొబైల్ లైబ్రరీ ఎక్కడుందో తెలుస్తుంది. అలాగే ప్రతి పుస్తకానికీ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. గుర్తించిన ప్రదేశాలకు ప్రతివారం మొబైల్ లైబ్రరీ వస్తుంటుంది. మొదట్లో ‘లెట్స్ రీడ్ ఇండియా’ సంస్థ మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్‌లలో ఈ లైబ్రరీని ప్రారంభించాలనుకున్నా, కరోనా మహమ్మారి కారణంగా పరిధి తగ్గించుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో దృష్టి కేంద్రీకరించారు. రానున్న రెండు సంవత్సరాలలో చిన్నచిన్న గ్రామాల ప్రజలకు కూడా పుస్తకాలు చేరవేయాలనే సంకల్పంతో ఉన్నారు. ‘మహారాష్ట్రలో విస్తృతి పెంచిన తరవాత, దేశంలోని మిగతా ప్రదేశాల మీద మా దృష్టి కేంద్రీకరిస్తాం’’ అంటున్నారు వాంఖేడే. ‘‘మేం పుస్తకాలు మాత్రమే అందచేయట్లేదు. చాలామందికి ఎటువంటి పుస్తకాలు చదవాలనే విషయంలో సందిగ్ధత ఉంటుంది. వారికి ఉపయోగపడే పుస్తకాలు చదవగలిగితే, అది వారి వృత్తి జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల ఎటువంటి పుస్తకాలు చదవాలో కూడా సూచిస్తాం’’ అంటారు వాంఖేడే. ఈ సంస్థ త్వరలోనే యూట్యూబ్ చానల్ కూడా ప్రారంభించాలనుకుంటోంది. ఇందులో ప్రముఖ రచయితల ఉపన్యాసాలు, ఇంటర్వూ్యలు, రివ్యూలు ప్లే చేస్తారు. పుస్తకం నిలబడాలి, పుస్తకం ద్వారా అక్షరాలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకోవాలి. సంస్కృతి సంప్రదాయాలు వారసత్వ సంపదగా రానున్న తరాలకు అందాలి. -
చదివేస్తున్నారానందంగా...
హీరోయిన్లంటే తీరిక లేనంత బిజీ. పలు భాషల్లో సినిమాలు చేస్తుంటారు. షూటింగ్‌లు, ప్రమోషన్స్‌తో సగం సమయం గడిచిపోతుంది. హాబీలకు సమయం కేటాయించేంత వీలు ఎక్కువగా దొరకదు. కొందరికి బుక్స్ చదవడం ఓ హాబీ. కరోనా వల్ల పని ఒత్తిడి తగ్గి, పుస్తకాలు చేతిలో తీసుకునే ఛాన్స్ దొరికింది. ఆలస్యం చేయకుండా షెల్ఫ్‌లో ఉన్న పుస్తకాలన్నీ పూర్తి చేసే పనిలో పడ్డారు. అక్షరాలన్నీ నమిలేసే పుస్తకాల పురుగులయ్యారు. ఈ లాక్డౌన్లో నచ్చిన పుస్తకాల్ని ‘చదివేస్తున్నారానందంగా’. మరి బుక్స్ పట్టిన భామల గురించి చదివేద్దామా? ‘‘ఈ క్వారంటైన్లో యోగా, పుస్తకాలు బిజీగా ఉంచాయి’’ అంటూ తాను చదివిన పుస్తకాల వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు శ్రియ. అనార్కీ, ఉమెన్ హూ రన్ దిత్ ది ఉల్వ్స్, లైవ్ సినిమా అండ్ ఇట్స్ టెక్నిక్స్, విపాసన యోగాకు సంబంధించిన పుస్తకాలు.. ఇంకా చాలా చదివానని తెలిపారామె. అంతే కాదు.. మంచి పుస్తకాలేమైనా ఉంటే నాకు సూచించరూ అని విన్నవించుకున్నారు శ్రియ. పుస్తకాల పురుగు రాశీ ఖన్నా ఎప్పటినుంచో చదవాలనుకుంటున్న పుస్తకం ‘ది పవర్ ఆఫ్ ఇంటెన్షన్’. ఈ లాక్డౌన్లో చదవడం మొదలెట్టారట. ‘‘ఈ పుస్తకం నాలో చాలా మార్పును తీసుకొచ్చింది. కొంచెం నెమ్మదస్తురాలిని కూడా అయ్యాను’’ అన్నారు రాశీ ఖన్నా. దక్షిణాదిన క్రేజీ హీరోయిన్గా దూసుకెళుతోన్న రష్మికా మందన్నాకు కూడా పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. ఇటీవల చదివిన ‘ది లిటిల్ బిగ్ థింగ్స్’ చాలా బాగుందని పేర్కొన్నారామె. ‘ఇస్మార్ట్ శంకర్’తో పాపులార్టీ తెచ్చుకున్న నభా నటేశ్ కూడా లాక్డౌన్ సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించారు. మరో తార ఆండ్రియా ‘‘జీవితాన్ని హ్యాండిల్ చేయలేనట్టుగా అనిపిస్తే పుస్తకాల్లోకి వెళ్లిపోతాను. ఈ ప్రపంచం నుంచి ఆ ప్రపంచంలోకి ఎస్కేప్ అయి పేజీల మధ్యలో సంతోషాన్ని వెతుక్కోవడం నాకు భలే ఇష్టం’’ అంటారు. ‘మీరు పుస్తకాలు ఎందుకు చదువుతుంటారు’ అని అడిగితే ఈ బ్యూటీ ఇలా చెబుతారు. అది మాత్రమే కాదు.. ‘బ్రోకెన్ వింగ్’ అనే పుస్తకం కూడా రాశారామె. ఇందులో కవితలు ఉంటాయి. గతంలో ఒక పెళ్లయిన వ్యాపారవేత్తతో ప్రేమలో పడ్డారామె. అతడు ఆండ్రియాని మానసికంగా, శారీరకంగా వేధించాడట. అతన్నుంచి విడిపోయి, మానసికంగా చాలా కుంగిపోయారామె. తన వ్యక్తిగత అనుభవాలను ఈ పుస్తకంలో పంచుకున్నారు ఆండ్రియా. ఇక ఆమె చదివిన పుస్తకాల విషయానికొస్తే.. ‘ది లేజీ జీనియస్ వే’, ‘హామిల్టన్: ది రివల్యూషన్’, ‘ఇంటిమేషన్స్’.. ఇంకా చాలా ఉన్నాయి. ‘‘జీవితం ఏమో చిన్నది. చదవాల్సిన పుస్తకాలేమో చాలా!’’ అంటున్నారు శోభితా ధూళిపాళ్ల. క్వారంటైన్ సమయంలో అక్షరాల్ని నమిలేశారు ఈ తెలుగమ్మాయి. లియోనార్డ్ కోహెన్ రాసిన నవలలు, కవితలంటే చాలా ఇష్టం అంటున్నారు శోభితా. జ్ఞానం పెంచుకోవడానికి, సంతోషంగా ఉన్నప్పుడు హ్యాపీగా చదవడానికి, బాధ నుంచి బయటపడటానికి, టైమ్‌పాస్ కోసం... ఇలా ఏదైనాసరే మనకోసం ఒక పుస్తకం ఉంటుంది. ‘పుస్తకం మంచి నేస్తం’ అవుతుంది. -
ఒక్కో బుక్... ఒక్కో కిక్
లాక్ డౌన్ లో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సమయాన్ని వినియోగించుకుంటున్నారు. యోగా, ధ్యానం, డాన్స్, కుకింగ్, బుక్స్... ఇవన్నీ శ్రియను బిజీగా ఉంచుతున్నాయట. ఈ లాక్ డౌన్లో చదివిన పుస్తకాల గురించి ఓ వీడియోను పంచుకున్నారామె. ఒక్కో బుక్ ఒక్కో కిక్ ఇచ్చిందంటున్నారీ బ్యూటీ. ఇటీవల తాను చదివిన పుస్తకాల గురించి శ్రియ మాట్లాడుతూ –‘‘విలియమ్ డాల్ రాసిన ‘అనార్కీ’ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. చరిత్రకు సంబంధించిన విషయాలు భలే ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. దక్షిణ భారత దేశానికి సంబంధించిన చరిత్ర పుస్తకాలు వెతుకుతున్నాను. ‘గాడ్ ఫాదర్’ చిత్రదర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పొల రచించిన ‘లివ్ సినిమా అండ్ ఇట్స్ టెక్నిక్స్’ చదివాను. సినిమాలంటే ఇష్టం ఉన్నవాళ్లు, సినిమాల్లో పని చేసేవాళ్లు ఈ బుక్ కచ్చితంగా చదవాలి. చాలా స్ఫూర్తివంతంగా అనిపించింది. ఈ పుస్తకాన్ని ఆండ్రూ (శ్రియ భర్త) నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. రచయిత జో డిస్పెంజ్ ‘బికమింగ్ సూపర్ న్యాచురల్’లో మన మెదడు ఎలా పని చేస్తుందో భలే చెప్పాడు. ట్రెవోర్ నోహా రాసిన ‘బోర్న్ క్రై మ్’ సరదాగా సాగింది. ‘ఉమెన్ హూ రన్ విత్ ఉల్ఫ్వ్’ మన స్పిరిట్‌ని పెద్ద స్థాయిలో ఉంచుతుంది. యోగాకి సంబంధించి ‘కృష్ణమాచార్య : హిజ్ లైఫ్ అండ్ టీచింగ్స్’ చదివాను. విపాసనకు సంబంధించి కొన్ని పుస్తకాలు చదివాను. ఈ పుస్తకాలన్నీ మీరు కూడా చదివి ఆనందిస్తారని, నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మీరు కూడా నాకేదైనా పుస్తకాలు సూచించండి. విషాదంగా ఉండే పుస్తకాలు మాత్రం వద్దు’’ అన్నారు శ్రియ. -
వేరే ప్రపంచంలో...
‘‘ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో నిరాశకు గురి కాకుండా ఆశావహ దృక్పథంతో ఉండాలి. చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కోవాలి’’ అంటున్నారు అనూ ఇమ్మాన్యుయేల్. యూఎస్‌లో పుట్టి, పెరిగి హీరోయిన్ కావాలనే ఆలోచనతో ఇండియా వచ్చారు అను. తెలుగులో ‘మజ్ను’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘శైలజారెడ్డి అల్లుడు’ తదితర చిత్రాల్లో నటించారీ బ్యూటీ. తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఈ లాక్డౌన్లో ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవడానికి కేటాయిస్తున్నానని అనూ ఇమ్మాన్యుయేల్ చెబుతూ – ‘‘మనం చదివే ప్రతి పుస్తకంలోనూ కొత్త కథ ఉంటుంది. అవి చదువుతున్నప్పుడు ఆ కథల్లో ఉన్న పాత్రల ప్రపంచంలోకి మనం వెళతాం. అలా వేరే ప్రపంచంలోకి వెళ్లడం బాగుంటుంది. షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడానికి కుదరదు. ఎన్ని పుస్తకాలు చదివితే అంత జ్ఞానం సంపాదించుకోవచ్చు’’ అన్నారు. -
మార్పుని అలవాటు చేసుకోవాల్సిందే
కరోనా వైరస్ కారణంగా ఏర్పడ్డ లాక్డౌన్ పరిస్థితుల వల్ల షూటింగ్స్ అన్నీ బంద్ కావడంతో స్టార్స్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ లాక్డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? అనే ప్రశ్నకు రానా బదులిస్తూ – ‘‘భిన్న రకాలైన విషయాల పట్ల ఆసక్తికరంగా ఉండే నాలాంటి వ్యక్తులు లాక్డౌన్ వల్ల ఏర్పడ్డ ఖాళీ సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుంటారు. నేను అదే చేస్తున్నాను. నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. మాములు సమయాల్లో షూటింగ్స్ ఉంటాయి కాబట్టి పుస్తకాలు చదవడానికి పెద్దగా సమయం దొరికేది కాదు. ఇప్పుడు ఆ అవకాశం దొరికింది. పుస్తకాలు చదివితే వేరే ప్రపంచంలోకి వెళ్లినట్లుంటుంది. అది ఇప్పుడున్న ప్రపంచం కన్నా బాగుండొచ్చు (సరదాగా). అలాగే ఆత్మపరిశీలన చేసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఇంకా కరోనా మహమ్మారి గురించి రానా మాట్లాడుతూ – ‘‘కరోనా వైరస్ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. కానీ కరోనా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఉండే మారే పరిస్థితులను మనం తప్పక అలవాటు చేసుకోవాల్సిందే. ఎందుకంటే కరోనా తర్వాత మన జీవన విధానంలో మార్పులు వస్తాయి. మనం మునుపటిలా ఉండలేం’’ అని పేర్కొన్నారు. -
పుస్తకాలు.. సినిమాలు.. వంటలు
‘‘లక్ష్యసాధన కోసం నిత్య జీవితంలో మనమందరం పరుగులు పెడుతూనే ఉంటాం. కానీ ప్రకృతి విపత్తు వస్తే మనం ఎంతవరకు ఎదుర్కోగలమో ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనే అర్థం అవుతుంది. మన ఆరోగ్యం, కుటుంబం, మనల్ని ప్రేమించేవారు, వారితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు ఎంతో అమూల్యమైనవి. మిగతావన్నీ తర్వాతే అనిపిస్తోంది’’ అంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. లాక్డౌన్ సమయం ఎలా గడుస్తుందో రకుల్ చెబుతూ – ‘‘ఈ ఏడాది మార్చి 18 నా చివరి వర్కింగ్ డే. అప్పట్నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఎప్పటిలానే ఉదయం యెగాతో నా రోజు మొదలవుతుంది. పుస్తకాలు బాగా చదువుతున్నాను. ప్రస్తుతం నేను ‘వై వియ్ స్లీప్’ అనే పుస్తకం చదువుతున్నాను. ‘ఛారియట్స్ ఆఫ్ గాడ్స్’, ‘కాస్మిక్ కాన్షియస్నెస్’ అనే పుస్తకాలను చదవడం పూర్తి చేశాను. మార్నింగ్ టైమ్‌లో బుక్స్ చదువుతున్నాను. మధ్యాహ్నం ఏదైనా సోషల్ మీడియా లైవ్స్ చూస్తాను. సాయంత్రం ఒక సినిమా చూస్తాను. అలాగే ఒక షోకు సంబంధించిన రెండు, మూడు ఎపిసోడ్స్ ఫాలో అవుతాను. ఆస్కార్ అవార్డు సాధించిన అన్ని సినిమాలను చూడాలనుకుంటున్నాను. ఆస్కార్ సినిమాలను రెండేళ్లుగా చూస్తున్నాను. వీలైనప్పుడు వంట కూడా చేస్తున్నాను. దీనిపై ఓ యాట్యూబ్ చానెల్‌ను కూడా స్టార్ట్ చేశాం. ఆత్మపరిశీలన చేసుకోవడానికి, వ్యక్తిగతంగా మరింత స్ట్రాంగ్ అవ్వడానికి ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నాను. కానీ ఇంత లాంగ్ బ్రేక్ నా లైఫ్‌లో రాలేదు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత సినిమాలతో మళ్లీ బిజీ అవుతాను’’ అన్నారు. -
ఆకాశం నుంచి పుస్తక పఠనం
సాక్షి, న్యూఢిల్లీ : కథల పుస్తకాలైనా, శాస్త్ర విజ్ఞాన పుస్తకాలైనా ఎవరికి వారు చదువుకోవడం కన్నా ఎవరైనా చదివి వినిపిస్తే ముఖ్యంగా పిల్లల మెదడుకు బాగా ఎక్కుతుంది. కఠినమైన పదాలు తగిలినప్పుడు అర్థం వివరిస్తూ చదివితే మరింత సులువుగా మెదడులోకి ఎక్కుతుంది. కొంత సమయం అయ్యాక కొందరికి నిద్రకూడా వస్తుంది. వినేవాళ్ల హావభావాలను గమనించకుండా చదివేవాళ్లు వాళ్ల మానాన వాళ్లు పాఠం చెబుతున్నట్లుగా చదువుకుంటూ పోతే కాసేపటికి వినేవాళ్ల గురక వినిపించి చదివే వాళ్ల సమయం వృధా అవుతుంది. అదే వినేవాళ్లు ఆకాశంలోని రంగులను, చుక్కలను చూస్తూ వింటుంటే మరింత సులువుగా మెదడుకు ఎక్కుతుందంటారు. అందుకు చదవడానికి, వినడానికి ఆరుబయట ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో చదివే పుస్తకం సీడీ రూపంలోనే, ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో కూడా అలా చదువుతూ పోవడం కన్నా చదువుతున్న వ్యక్తుల చుట్టూ ఓ కదులుతున్న ప్రపంచం ఉంటే... అదే ఆకాశమో, నక్షత్రాలో ఉంటే మరింతగా వినేవాళ్లను లేదా పాఠకులను ఆకట్టుకుంటుందని భావించిన ‘గ్లోబల్‌స్పేస్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ సంస్థ ఏకంగా ఆకాశంలోని అంతర్జాతీయ ప్రయోగశాలలో వ్యోమగాముల చేతనే పుస్తక పఠన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆకాశంలోని అంతర్జాతీయ ప్రయోగశాలలో భూమ్యాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వ్యోమగాములతో సహా ఏ వస్తువైన చలనంలో ఉంటుందని తెల్సిందే. శూన్యంలో తేలియాడుతున్న పుస్తకాన్ని పట్టుకొని వ్యోమగాములు శూన్యంలో తాము తిరుగుతూ చదివి వినిపిస్తుంటారు. వినేవాళ్లకు వ్యోమగామి చుట్టున్న ప్రపంచం, అంటే ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలు, గ్రహశకలాలు కనిపిస్తుంటాయి. ఇలా ప్రవేశపెట్టిన పుస్తక పఠనం కార్యక్రమానికి ‘స్టోరీ టైమ్ ఫ్రమ్ స్పేస్’ అని పేరు పెట్టారు. కథలు, శాస్త్రవిజ్ఞాన పుస్తకాలు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని ఫౌండేషన్ తెలిపింది. ఇలా పుస్తక పఠనం వినాలనుకునేవాళ్లు ‘స్టోరీ టైమ్ ఫ్రమ్ స్పేస్. కామ్’ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే చాలు. -
మోదీపై 1.5 లక్షల పుస్తకాలకు మహా ఆర్డర్
సాక్షి, ముంబయి : మహారాష్ర్టలో స్కూల్ విద్యార్థులు త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ జీవితానికి సంబంధించిన అంశాలను పుస్తకాల్లో అభ్యసించనున్నారు. మహారాష్ర్ట విద్యాశాఖ మోదీ జీవితంలోని పలు కోణాలను స్పృశిస్తూ సాగే పుస్తకాలను అందుబాటులోకి తేనుంది. మోదీ జీవితంపై దాదాపు 1.5 లక్షల పుస్తకాల కొనుగోలుకు విద్యాశాఖ ఆర్డర్ ఇచ్చింది. ఈ నెలాఖరులోగా పుస్తకాలు రాష్ర్ట ప్రభుత్వ పాఠశాలలకు చేరుకుంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ పుస్తకాలను కూడా ఆర్డర్ చేసినా మోదీ బుక్‌ల కన్నా ఇవి తక్కువ సంఖ్యలో ముద్రించనున్నారని అధికారులు చెప్పారు. పర్చేజ్ ఆర్డర్ ప్రకారం మోదీ జీవితంపై దాదాపు 1.5 లక్షల పుస్తకాలకు ఆర్డర్ ఇవ్వగా, నెహ్రూపై 1635 పుస్తకాలను, గాంధీపై 4,343 బుక్స్, అంబేద్కర్‌పై 79,388 పుస్తకాలను ముద్రించాలని ఆర్డర్ చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గురించి 76,713 పుస్తకాలకు ఆర్డర్ ఇచ్చామని అధికారులు తెలిపారు. సర్వ శిక్షా అభియాన్ కింద మరాఠి, ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషల్లో ఈ పుస్తకాలు ముద్రితమవుతాయని చెప్పారు. 1 నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులకు అదనపు రీడింగ్ మెటీరియల్‌గా ఈ పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. -
పుస్తక పఠనంలో హైదరాబాద్ టాప్-4:అమెజాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పుస్తక పఠనంలో భాగ్యనగరి వరుసగా మూడోసారి టాప్-5 నగరాల్లో నిలిచిందని అమెజాన్ తెలిపింది. 2015లో అమెజాన్ వెబ్సైట్ ద్వారా జరిగిన పుస్తకాల అమ్మకాల ఆధారంగా పలు ఆసక్తికర అంశాలను నివేదిక రూపంలో వెల్లడించింది. టాప్-4లో ఉన్న హైదరాబాద్ వాసులు అమిష్ త్రిపాఠి రాసిన సియాన్ ఆఫ్ ఇక్ష్వాకు పుస్తకాన్ని అత్యధికంగా కొనుగోలు చేశారు. 2014లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన చేతన్ భగత్ హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 7వ స్థానంలో ఉన్న మనోరమ ఇయర్ బుక్ 2015లో రెండో స్థానానికి ఎగబాకింది. తెలుగు పుస్తకాల విభాగంలో రోండా బైర్న్ రాసిన ద సీక్రెట్ పుస్తకం తెలుగు అనువాదం టాప్‌లో ఉంది. 2014లో అమ్ముడైన హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ కంటే సియాన్ ఆఫ్ ఇక్ష్వాకు మూడు రెట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఇక నగరాల వారీగా చూస్తే ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై టాప్-5లో ఉన్నాయి. 20వ స్థానంలో విశాఖపట్నం ఉంది.