సాక్షి, న్యూఢిల్లీ : కథల పుస్తకాలైనా, శాస్త్ర విజ్ఞాన పుస్తకాలైనా ఎవరికి వారు చదువుకోవడం కన్నా ఎవరైనా చదివి వినిపిస్తే ముఖ్యంగా పిల్లల మెదడుకు బాగా ఎక్కుతుంది. కఠినమైన పదాలు తగిలినప్పుడు అర్థం వివరిస్తూ చదివితే మరింత సులువుగా మెదడులోకి ఎక్కుతుంది. కొంత సమయం అయ్యాక కొందరికి నిద్రకూడా వస్తుంది. వినేవాళ్ల హావభావాలను గమనించకుండా చదివేవాళ్లు వాళ్ల మానాన వాళ్లు పాఠం చెబుతున్నట్లుగా చదువుకుంటూ పోతే కాసేపటికి వినేవాళ్ల గురక వినిపించి చదివే వాళ్ల సమయం వృధా అవుతుంది.
అదే వినేవాళ్లు ఆకాశంలోని రంగులను, చుక్కలను చూస్తూ వింటుంటే మరింత సులువుగా మెదడుకు ఎక్కుతుందంటారు. అందుకు చదవడానికి, వినడానికి ఆరుబయట ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో చదివే పుస్తకం సీడీ రూపంలోనే, ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా అలా చదువుతూ పోవడం కన్నా చదువుతున్న వ్యక్తుల చుట్టూ ఓ కదులుతున్న ప్రపంచం ఉంటే... అదే ఆకాశమో, నక్షత్రాలో ఉంటే మరింతగా వినేవాళ్లను లేదా పాఠకులను ఆకట్టుకుంటుందని భావించిన ‘గ్లోబల్‌స్పేస్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ సంస్థ ఏకంగా ఆకాశంలోని అంతర్జాతీయ ప్రయోగశాలలో వ్యోమగాముల చేతనే పుస్తక పఠన కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఆకాశంలోని అంతర్జాతీయ ప్రయోగశాలలో భూమ్యాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వ్యోమగాములతో సహా ఏ వస్తువైన చలనంలో ఉంటుందని తెల్సిందే. శూన్యంలో తేలియాడుతున్న పుస్తకాన్ని పట్టుకొని వ్యోమగాములు శూన్యంలో తాము తిరుగుతూ చదివి వినిపిస్తుంటారు. వినేవాళ్లకు వ్యోమగామి చుట్టున్న ప్రపంచం, అంటే ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలు, గ్రహశకలాలు కనిపిస్తుంటాయి. ఇలా ప్రవేశపెట్టిన పుస్తక పఠనం కార్యక్రమానికి ‘స్టోరీ టైమ్ ఫ్రమ్ స్పేస్’ అని పేరు పెట్టారు. కథలు, శాస్త్రవిజ్ఞాన పుస్తకాలు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని ఫౌండేషన్ తెలిపింది. ఇలా పుస్తక పఠనం వినాలనుకునేవాళ్లు ‘స్టోరీ టైమ్ ఫ్రమ్ స్పేస్. కామ్’ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే చాలు.
Comments
Please login to add a commentAdd a comment