చైనా వ్యోమగాముల ఘనత
చైనా వ్యోమగాములు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతరిక్షంలో ఏకంగా చేపలను పెంచి చూపించారు. నవంబర్ 4న ముగిసన షెన్‌ఝౌ–18 స్పేస్ మిషన్‌లో భాగంగా వాళ్లు ఈ ఘనత సాధించారు. చైనా అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదికైంది. ఈ ప్రయోగం కోసం శరవేగంగా పెరిగే జీబ్రా చేపలను ఎంచుకున్నారు. వాటిని పెంచేందుకు అంతరిక్ష కేంద్రం లోపల అన్ని వసతులతో కూడిన క్లోజ్డ్ ఎకో సిస్టంను ఏర్పాటు చేశారు.
చేపలు అందులోనే పెరిగి పెద్దవై పునరుత్పత్తి కూడా జరిపాయి. 43 రోజుల జీవనచక్రాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. తద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో ఇది సరికొత్త రికార్డుగా నిలిచింది. అంతరిక్షంలో అత్యంత సవాళ్లతో కూడిన వాతావరణంలో జలచరాలు ఏ మేరకు మనుగడ సాగించగలవన్న దానిపై ఈ ప్రయోగం ద్వారా చాలా స్పష్టత వచి్చందని సైంటిస్టులు అంటున్నారు. అంతేగాక అంతరిక్ష రంగంలో కొంతకాలంగా చైనా సాధిస్తున్న పైచేయికి ఇది తాజా నిదర్శనమని కూడా చెబుతున్నారు.
జీబ్రా చేపలకు జన్యుపరంగా మానవులతో చాలా దగ్గరి పోలికలుంటాయి. అంతరిక్షంలో వీటితో చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడాన్ని కీలక మైలురాయిగా చెబుతున్నారు. భూమికి ఆవల శాశ్వత మానవ ఆవాసాల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు ఇకపై మరింతగా ఊపందుకుంటాయని భావిస్తున్నారు. ‘‘దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్లు విజయవంతం కావాలంటే ఏం చేయాలన్న దానిపై ఈ ప్రయోగం మరింత స్పష్టతనిచి్చంది. అంతరిక్షంలో స్వయంపోషక జీవ వ్యవస్థల అభివృద్ధికి బాటలు పరిచింది’’ అని చైనా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment