పిల్లలు ఇష్టంగా చదువుకుంటుంటే పెద్దలే కాదు ప్రకృతి కూడా ముచ్చటపడుతుంది. నిండు మనసుతో ఆశీర్వదిస్తుంది!
‘నిద్ర సుఖం ఎరగదు’ అంటారు. విద్య కూడా అంతే! ఏసీ గదులలో, మెత్తని సోఫాలలో కూర్చుని చదివితేనే చదువు వస్తుందని ఏమీ లేదు. ఇలా ఎండలో, రాళ్లపై కూర్చొని చదువుకుంటే కూడా చదువు వస్తుంది. అదంతా మన ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. విషయంలోకి వెళితే...
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక అమ్మాయి ప్రకృతి ఒడిలో పాఠ్యపుస్తకం చదువుకుంటున్న ఫోటో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాను బాగా ఆకట్టుకుంది. ‘మన్‌డే మోటివేషన్స్’ ట్యాగ్‌లైన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఇన్‌స్పిరేషనల్ పోస్ట్ నెటిజనులను బాగా ఆకట్టుకుంది.
మొదట ఈ ఫోటోను ట్విట్టర్ యూజర్ అభిషేక్ దూబే పోస్ట్ చేశాడు.
‘ఈరోజు నేను హిమాచల్‌ద్రేశ్‌లోని సత్నా ప్రాంతానికి వెళ్లాను. అక్కడ చూసిన ఒక దృశ్యం నన్ను ఆశ్చర్యానందాలకు గురి చేసింది. ఒక అమ్మాయి శ్రద్ధగా చదువుకుటోంది. నోట్స్ రాసుకుంటోంది. పచ్చటి ప్రకృతి ఆమెను దీవిస్తున్నట్లుగా ఉంది. నిజం చెప్పాలంటే... ఈ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు దొరకడం లేదు’ అంటూ రాసి మురిసిపోయాడు దూబే.
ఇక యూజర్‌ల కామెంట్స్‌లోకి వెళితే...
‘పట్టణ రణగొణ ధ్వనుల మధ్య కాకుండా, ప్రకృతి అందాల మధ్య ప్రశాంత, నిశ్శబ్ద వాతావరణంలో చదువుకుంటున్న ఈ బాలిక ఎంత అదృష్టవంతురాలో’ అన్ని రాశాడు ఒక యూజర్.
దీనికి స్పందనగా మరో యూజర్ ఇలా రాశాడు...
‘చక్కగా చెప్పారు. నా వ్యక్తిగత విషయం రాస్తాను. మా అమ్మాయి పుస్తకం పట్టుకోగానే ఇంట్లో టీవీ ఆఫ్ చేస్తాం. చిన్నగా మాట్లాడుకుంటాం. కానీ ఏం లాభం. ఇరుగింటి నుంచి పొరుగింటి నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. వెళ్లి వాళ్లతో గొడవ పడలేము కదా! ఆ రకంగా చూస్తే ఈ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు’
‘శబ్దకాలుష్యం మితిమీరి పోతుంది. అది ఏదో ఒక రూపంలో మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు అయితే ఈ శబ్దకాలుష్యాన్ని భరించలేక అడవిలోకి పారిపోవాలనిపిస్తుంది. కానీ ఈ అమ్మాయికి అలా పారిపోవాల్సిన అవసరం లేదు. తాను ప్రకృతిలోనే ఉంది’ అని రాశాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ఒక యూజర్.
‘నిజానికి పిల్లలకు నాలుగు గోడల మధ్య కాకుండా పచ్చటి ప్రకృతి మధ్యే విద్య నేర్పించాలి. ఇలా చేస్తే వారికి ప్రకృతి విలువ తెలుస్తుంది. పర్యావరణ స్పృహ బాల్యం నుంచే కలుగుతుంది. గోడలు లేని బడిలో మనసు విశాలం అవుతుంది. తాత్విక విద్యావేత్తలు ఇదే విషయాన్ని చెప్పారు’ అంటుంది ఒక యూజర్.
‘పెద్దల పోరు భరించలేక చదువుకుంటున్నట్లు కాకుండా... చాలా ఇష్టంగా చదువుకుంటున్నట్లుగా ఉంది.
ఇలాంటి అమ్మాయిలే భవిష్యత్‌లో గొప్ప విజయం సాధించగలరు’ అని స్పందించాడు మరో యూజర్.
‘ఒక చిత్రం వంద మాటల సారాంశం’ అంటారు.
ఈ చిత్రం మాత్రం బాలికల చదువు నుంచి కాంక్రిట్ జంగిల్‌లో విద్యావిధానం, పర్యావరణం... మొదలైన ఎన్నో అంశాలను చర్చలోకి తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment