‘ఇన్‌స్టా’ స్నేహితుడు.. 20 రోజులు నిర్బంధించాడు! | Minor Girl Confined At Hotel By Her Instagram Friend Rescued By Hyderabad City Police She Teams | Sakshi
Sakshi News home page

‘ఇన్‌స్టా’ స్నేహితుడు.. 20 రోజులు నిర్బంధించాడు!

Published Mon, Sep 9 2024 7:36 AM | Last Updated on Mon, Sep 9 2024 12:53 PM

young lady Confinement in a lodge

ట్రాప్‌ చేసి హైదరాబాద్‌కు రప్పించి, లాడ్జిలో నిర్బంధం 

తల్లిదండ్రులకు సమాచారం అందించిన బాధితురాలు 

రంగంలోకి సిటీ షీ–టీమ్స్‌ 

యువతిని రక్షించి కుటుంబీకులకు అప్పగింత  

సాక్షి, హైదరాబాద్: సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన ఓ యువకుడు నిర్మల్‌ జిల్లా, భైంసాకు చెందిన బాలికను ట్రాప్‌ చేశాడు. 20 రోజుల క్రితం నగరానికి రప్పించి ఓ హోటలో నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితురాలు తన కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆదివారం నగరానికి చేరుకున్నారు. హైదరాబాద్‌ షీ–టీమ్స్‌ను ఆశ్రయించడంతో బాలికను రక్షించారు. నిందితుడిపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెలితే..భైంసాకు చెందిన బాలికకు నగరానికి చెందిన యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. 

కొన్నాళ్లు స్నేహం నటించిన అతగాడు ఆమెను పూర్తిగా నమ్మించాడు. చివరకు తన అసలు రూపం బయటపెట్టి సదరు యువకుడు 20 రోజుల క్రితం బాలికను బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక తల్లిదండ్రులకు చెప్పకుండా నగరానికి వచ్చేసింది. ఆమెను కలుసుకున్న అతను నారాయణగూడలోని ఓ లాడ్జికి తీసుకువెళ్లి గదిలో నిర్భంధించాడు. బాలికపై పదేపదే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అతడి బెదిరింపులకు భయపడిన ఆమె మిన్నకుండిపోయింది. చివరకు ఆదివారం ధైర్యం చేసిన బాలిక తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తన పరిస్థితిని వివరించింది. వాట్సాప్‌ ద్వారా కరెంట్‌ లోకేషన్‌ షేర్‌ చేసింది. 

హుటాహుటిన నగరానికి వచి్చన బాలిక తల్లిదండ్రులు షీ–టీమ్స్‌ను ఆశ్రయించారు. తక్షణం రంగంలోకి దిగిన షీ–టీమ్స్‌ నారాయణగూడలోని లాడ్జిపై దాడి చేసి బాలికను రెస్క్యూ చేశారు. తల్లిదండ్రులను చూసిన బాలిక ఉద్వేగానికి గురైంది. సదరు యువకుడిపై బాలిక తల్లిదండ్రులు నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.  

విద్యార్థినికి ఆన్‌లైన్‌లో వేధింపులు..
మరో కేసులో ఓ విద్యార్థినిని ఆన్‌లైన్‌లో వేధిస్తున్న సహ విద్యార్థులకు షీ–టీమ్స్‌ చెక్‌ చెప్పింది. బాధిత యువతి పంజగుట్ట పరిధిలోని ఓ ప్రముఖ అకాడమీలో విద్యనభ్యసిస్తున్నారు. అదే అకాడమీకి చెందిన కొందరు పోకిరీలు ఆన్‌లైన్‌లో, సోషల్‌మీడియా ద్వారా యువతిని రకరకాలుగా వేధించారు. దీనిపై ఆమె వాట్సాప్‌ ద్వారా షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన అధికారులు వారిని గుర్తించడంతో పాటు పంజగుట్ట ఠాణాలో కేసు నమోదు చేయించారు. ఈ పోకిరీలతో పాటు అకాడమీ నిర్వాహకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. విద్యనభ్యసిస్తున్న యువతుల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్వాహకులకు స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement