She-Teams
-
‘ఇన్‌స్టా’ స్నేహితుడు.. 20 రోజులు నిర్బంధించాడు!
సాక్షి, హైదరాబాద్: సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన ఓ యువకుడు నిర్మల్ జిల్లా, భైంసాకు చెందిన బాలికను ట్రాప్ చేశాడు. 20 రోజుల క్రితం నగరానికి రప్పించి ఓ హోటలో నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితురాలు తన కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆదివారం నగరానికి చేరుకున్నారు. హైదరాబాద్ షీ–టీమ్స్‌ను ఆశ్రయించడంతో బాలికను రక్షించారు. నిందితుడిపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెలితే..భైంసాకు చెందిన బాలికకు నగరానికి చెందిన యువకుడితో ఇన్స్టాగ్రామ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు స్నేహం నటించిన అతగాడు ఆమెను పూర్తిగా నమ్మించాడు. చివరకు తన అసలు రూపం బయటపెట్టి సదరు యువకుడు 20 రోజుల క్రితం బాలికను బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక తల్లిదండ్రులకు చెప్పకుండా నగరానికి వచ్చేసింది. ఆమెను కలుసుకున్న అతను నారాయణగూడలోని ఓ లాడ్జికి తీసుకువెళ్లి గదిలో నిర్భంధించాడు. బాలికపై పదేపదే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అతడి బెదిరింపులకు భయపడిన ఆమె మిన్నకుండిపోయింది. చివరకు ఆదివారం ధైర్యం చేసిన బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. వాట్సాప్ ద్వారా కరెంట్ లోకేషన్ షేర్ చేసింది. హుటాహుటిన నగరానికి వచి్చన బాలిక తల్లిదండ్రులు షీ–టీమ్స్‌ను ఆశ్రయించారు. తక్షణం రంగంలోకి దిగిన షీ–టీమ్స్ నారాయణగూడలోని లాడ్జిపై దాడి చేసి బాలికను రెస్క్యూ చేశారు. తల్లిదండ్రులను చూసిన బాలిక ఉద్వేగానికి గురైంది. సదరు యువకుడిపై బాలిక తల్లిదండ్రులు నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినికి ఆన్లైన్లో వేధింపులు..మరో కేసులో ఓ విద్యార్థినిని ఆన్లైన్లో వేధిస్తున్న సహ విద్యార్థులకు షీ–టీమ్స్ చెక్ చెప్పింది. బాధిత యువతి పంజగుట్ట పరిధిలోని ఓ ప్రముఖ అకాడమీలో విద్యనభ్యసిస్తున్నారు. అదే అకాడమీకి చెందిన కొందరు పోకిరీలు ఆన్లైన్లో, సోషల్‌మీడియా ద్వారా యువతిని రకరకాలుగా వేధించారు. దీనిపై ఆమె వాట్సాప్ ద్వారా షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన అధికారులు వారిని గుర్తించడంతో పాటు పంజగుట్ట ఠాణాలో కేసు నమోదు చేయించారు. ఈ పోకిరీలతో పాటు అకాడమీ నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యనభ్యసిస్తున్న యువతుల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్వాహకులకు స్పష్టం చేశారు. -
వన్ స్టేట్... వన్ షీ–టీమ్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీసింగ్ విధానం ఉండాలనే లక్ష్యంతో షీ–టీమ్స్ పనితీరులో సమగ్ర మార్పుచేర్పులు చేయడానికి డీజీపీ కార్యాలయం సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఏ జిల్లా కమిషనరేట్‌లోనైనా వీటి పనితీరు, స్పందన ఒకేలా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ‘యూనిఫామ్ సర్వీస్ డెలివరీ–షీ టీమ్స్’పేరుతో 4 రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని అన్ని యూనిట్లలోని షీ–టీమ్స్ సిబ్బందికి విడతల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఏడీజీ (శాంతిభద్రతలు) జితేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలు పూర్తి శాంతిభద్రతల మధ్య జీవించాలనేది దీని ముఖ్య ఉద్దేశమన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ షీ–టీమ్స్ అంకురార్పణ జరిగిందన్నారు. షీ–టీమ్స్ బృందాల విజయం ఒక్క రోజులో వచ్చింది కాదని, కొన్ని నెలల కృషి ఫలితమని వ్యాఖ్యానించారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో విజయవంతమైన షీ–టీమ్స్‌ను ఆదర్శంగా తీసుకొని మరో ఆరు రాష్ట్రాలు అమలులోకి తీసుకొచ్చాయని, ఇది మన బాధ్యతల్ని మరింత పెంచింద’’న్నారు. కార్యక్రమంలో సీఐడీ ఎస్పీ బి.సుమతి తదితర అధికారులు పాల్గొన్నారు. -
‘వావ్’ హైదరాబాద్!
భరోసా, షీ–టీమ్స్ ఏర్పాటుతో ఇప్పటికే మహిళల భద్రతలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న సిటీ పోలీసు విభాగం మరో అడుగు ముందుకు వేసింది. గస్తీలో మహిళా సిబ్బందికి ప్రాధాన్యం కల్పిస్తూ ‘ఉమెన్ ఆన్ వీల్స్’(వావ్) పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. దేశంలోనే తొలిసారిగా కంబాట్ సిస్టమ్‌లో శిక్షణ తీసుకుని రంగంలోకి దిగుతున్న ఈ టీమ్స్‌ను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ఇక్కడ గోషామహల్ పోలీసుస్టేడియంలో ఆవిష్కరించారు. తొలిదశలో డివిజన్‌కు ఒకటి చొప్పున కేటాయించారు. త్వరలో ప్రతిఠాణాకు ఒక బృందం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ టీమ్స్ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ డెమో ఇచ్చాయి. సుశిక్షితులైన ఈ 43 మందితో 20 వావ్ టీమ్స్ ఏర్పాటు చేశారు. వీరు బ్లూకోల్ట్స్లో అంతర్భాగంగా ఒక్కో ద్విచక్రవాహనంపై ఇద్దరు చొప్పున గస్తీ తిరుగుతూ ఉంటారు.తొలిదశలో నగరంలోని 17 డివిజన్లకూ ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. మరో మూడింటిని ప్రత్యేక సందర్భాలు, పర్యాటక ప్రాంతాల్లో వినియోగిస్తారు. భవిష్యత్తులో ప్రతి పోలీసుస్టేషన్‌కు ఒక వావ్ టీమ్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సాధారణ గస్తీతోపాటు డయల్–100కు వచ్చే కాల్స్ ఆధారంగానూ ఈ టీమ్స్ పనిచేస్తుంటాయి. నేరాలు నిరోధించడం, సమాచారం సేకరించడంతో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ బాధ్యతల్నీ నిర్వర్తించనున్నాయి. ప్రత్యేక లోగోతో కూడిన ద్విచక్ర వాహనంపై సంచరించే బ్లూకోల్ట్స్ యూనిఫామ్‌తోపాటు వారికి కమ్యూనికేషన్ పరికరాలు, ప్లాస్టిక్ లాఠీ తదితరాలూ అందించారు. రెండు నెలల కఠోర శిక్షణ... ఇప్పటివరకు నగరంలో కేవలం పురుష పోలీసులు మాత్రమే బ్లూకోల్ట్స్ పేరుతో గస్తీ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, మహిళా పోలీసులకూ అన్ని రకాలైన విధుల్లోనూ భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించిన సిటీ పోలీసు కమిషనర్ ‘వావ్’బృందాలకు అంకురార్పణ చేశారు. గత ఏడాది కానిస్టేబుళ్లుగా ఎంపికై, ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన యువ మహిళా కానిస్టేబుళ్ల నుంచి అవసరమైన అర్హతలు ఉన్న 43 మందిని ఎంపిక చేశారు. వీరికి రెండు నెలలపాటు కఠోర శిక్షణ ఇచ్చారు. ఇందులో ఎలాంటి ఆయుధం లేకుండా అసాంఘిక శక్తుల్ని ఎదుర్కోవడం నుంచి ఉగ్రవాదులతోనూ పోరాడే పాటవాలను నేర్పించారు. ఏడీబీ టూల్స్, టీడీ 9 కాంబోస్ వంటి అత్యాధునిక శిక్షణలు ఇచ్చారు. మహిళా పోలీసులకు ఈ తరహా శిక్షణలు ఇవ్వడం ఇదే తొలిసారి. పురుషులతో సమానంగా ఎదిగేలా.. మహిళాపోలీసులకు ఇదో మైలురాయి. పోలీసు విభాగంలోని మహిళాసిబ్బంది పురుష సిబ్బందితో సమానంగా ఎదిగేలా అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఉమెన్ ఆన్ వీల్స్ బృందాలను ఏర్పాటు చేశాం. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన ‘వీ కెన్’అనే కార్యక్రమంలో పోలీసు విభాగంలో ఉత్తమ సేవలు అందించిన 63 మంది మహిళల్ని సన్మానించుకున్నాం. అప్పుడే మహిళా పోలీసుల్నీ అన్ని రకాలైన విధుల్లోనూ వినియోగించుకోవాలని, ఆ దిశలో చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఈ టీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. – షికా గోయల్, అదనపు సీపీ ప్రతి మహిళా టెక్నిక్స్ నేర్చుకోవాలి ఈ బృందాల ఏర్పాటు మహిళా సాధికారతలో కీలక పరిణామం.ఈ ‘ఉమెన్ ఆన్ వీల్స్’బృందాలు మనందరికీ సేవ చేస్తాయి. ప్రతి మహిళా కొన్ని కాంబాక్ట్ టెక్నిక్స్ నేర్చుకోవాల్సిందే. నిత్యజీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి వాటిని వాడాలి. సమాజంలో తిరగాల్సి వచ్చినప్పుడు ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా వెళ్లడానికి ఇవి ఎంతో ఉపయుక్తం. – మెహరీన్ కౌర్,హీరోయిన్ సిటీ రోల్ మోడల్‌గా మారింది ‘భరోసా, షీ టీమ్స్తోపాటు మహిళల భద్రత కోసం తీసుకున్న అనేక చర్యలతో హైదరాబాద్ ఇతర నగరాలకు, రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారింది. ప్రతివారం ఎవరో ఒకరు వచ్చి అధ్యయనం చేసి వెళ్తున్నారు. ఉమెన్ ఆన్ వీల్స్ బృందాల ఏర్పాటుతో మరో రికార్డు సొంతం చేసుకుంది. రాష్ట్రంలో గడిచిన మూడేళ్లుగా మహిళల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు రిక్రూట్మెంట్ లోనూ వీరి కోసం స్పెషల్‌డ్రైవ్స్ చేపడుతున్నాం. పోలీసింగ్ అంటే రఫ్ అండ్ టఫ్ ఉద్యోగమని, మహిళలు ఈ విధులు నిర్వర్తించలేరనే అభిప్రాయం ఈ బృందాల ఏర్పాటుతో పోతుంది. సమాజంలో సగం ఉండటమే కాదు పోలీసుస్టేషన్‌కు వచ్చేవారిలోనూ మహిళాబాధితులు ఎక్కువే. వీరి భద్రతకు కీలకప్రాధాన్యం ఇస్తున్నాం. ఎవరైనా ఎక్కడైనా తప్పు జరుగుతున్నట్లు గమనిస్తే కనీసం ముగ్గురికి చెప్పండి... లేదా 100కు ఫోన్ చేయండి’ – అంజనీకుమార్, కొత్వాల్ – సాక్షి, హైదరాబాద్ -
పర్యాటకురాలితో క్యాబ్ డ్రైవర్ వికృత చేష్టలు
వాట్సాప్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు నిందితుడిని అరెస్టు చేసిన ‘షీ–టీమ్స్’ సాక్షి, హైదరాబాద్: బెంగళూరు నుంచి నగర పర్యటనకు వచ్చిన ఓ పర్యాటకురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె పట్ల క్యాబ్ డ్రైవర్ వికృతంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో మంగళవారం నిందితుడిని అరెస్టు చేసినట్లు అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా వెల్లడించారు. బెంగళూరుకు చెందిన మహిళ గత వారం కుటుంబీకులతో నగర పర్యటనకు వచ్చారు. సిటీకి చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ నుంచి క్యాబ్‌ను ఎంగేజ్ చేసుకున్నారు. ఈ వాహనానికి పహాడీషరీఫ్‌కు చెందిన నలభై ఏళ్ల మహ్మద్ సలీం డ్రైవర్‌గా వచ్చాడు. పర్యటన అనంతరం తిరిగి వెళ్లేందుకు అంతా రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. బాధితురాలు డ్రైవర్ పక్క సీటులో కూర్చోగా... కుటుంబీకులు వెనుక సీట్లో కూర్చున్నారు. దారిలో డ్రైవర్ సలీం వికృతంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. తీవ్ర జుగుప్సకు లోనైన బాధితురాలు కారు ఆపమని చెప్తున్నా వినకుండా ముందుకు వెళ్లాడు. చివరకు బలవంతంగా కారు ఆపించి కిందికి దిగిన బాధితురాలు తన తండ్రితో పాటు బంధువుకు విషయం చెప్పారు. వారు ప్రశ్నిస్తుండగానే.. లగేజ్‌ను నడిరోడ్డుపై పడేసిన సలీం అక్కడి నుంచి ఉడాయించాడు. దీనిపై బాధితురాలు అప్పుడే ట్రావెల్స్ నిర్వాహకుడికి ఫిర్యాదు చేసినప్పటికీ సమయాభావంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బెంగళూరు చేరుకున్న తర్వాత షీ–టీమ్స్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్టు చేశారు. -
షీ ఈజ్ స్వాతి
పరిచయస్తులే పోకిరీలు వేధించేవారిలో 80 శాతం వారే.. వీరిలో విద్యార్థులే ఎక్కువ ఆ 15 శాతం పురుషులతోనే సమస్య షీ–టీమ్స్‌తో మహిళకు భరోసా ‘సాక్షి’తో అదనపు సీపీ స్వాతి లక్రా సిటీబ్యూరో: మహిళ కనిపిస్తే చాలు మృగాళ్లు మేల్కొంటున్నారు. వెంటపడి వేధిస్తున్నారు. వనితతో స్నేహం నటిస్తునే అదును చూసి కాలనాగులై కాటేస్తున్నారు. మహానగరంలో ‘ఆమె’కు షీ–టీమ్స్ ఓ భరోసా. కొంత కాలంగా షీ–టీమ్స్, భరోసా కేంద్రాల్లో నమోదవుతున్న వేధింపుల కేసుల్లో 80 శాతం పరియస్తులే నిందితులుగా ఉంటున్నట్టు అదనపు సీపీ (నేరాలు, సిట్) స్వాతి లక్రా తెలిపారు. వీరిలో అత్యధికులు విద్యార్థులేనన్నారు. షీ–టీమ్స్, భరోసా కేంద్ర ఇన్చార్జ్గా ఉన్న ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. మహిళకు అందిస్తున్న భరోసాను వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. బాధితులు బయటకు వస్తున్నారు.. వేధింపుల బారినపడిన మహిళలు/యువతులు ఒకప్పుడు బయటకు వచ్చి ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేసేవారు. పోలీసులంటే భయం ఉండడంతో పాటు కుటుంబ గౌరవం తదితర అంశాలు దీనికి కారణమయ్యేవి. ఇటీవల కాలంలో బాధితుల్లో ఆ భయం పోయింది. షీ–టీమ్స్, భరోసా ద్వారా పోలీసులపై నమ్మకం పెరిగింది. దీంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. మా బాధ్యత కూడా గణనీయంగా పెరిగింది. బాధితులకు సత్వర న్యాయం చేస్తున్నప్పటికీ.. సాంకేతిక అంశాలతో కూడిన కేసుల దర్యాప్తునకు కొంత సమయం పడుతోంది. సిబ్బందికి టార్గెట్స్ ఇవ్వనేలేదు.. షీ–టీమ్స్ ఏర్పడిన నాటి నుంచి నగర వ్యాప్తంగా అనేక బృందాలు పనిచేస్తూ పోకిరీల పనిపడుతున్నాయి. గడిచిన రెండేళ్లల్లో ఇలా వందల కేసులు నమోదయ్యాయి. అయితే ఏ ఒక్క సందర్భంలోనూ రోజుకు ఇన్ని కేసులు ఉండాలంటూ మా సిబ్బందికి టార్గెట్లు ఇవ్వలేదు. షీ–టీమ్స్ ప్రారంభించిన ఏడాది(2014) కేసుల సంఖ్య తక్కువే. 2015లో వీటి సంఖ్య పెరిగిపోయింది. ఈ గణాంకాలు చూస్తే ఎవరైనా నగరంలో మహిళలపై వేధింపులు పెరిగిపోయాని అనే భావించే ఆస్కారం ఉందని తెలిసీ వెనుకాడలేదు. అలా ప్రతి కేసుపైనా చర్యలు తీసుకున్నాం. దీంతో గతేడాది నాటికి సిటీలో మహిళలు/యువతులపై వేధింపులు తగ్గి కేసుల సంఖ్య కూడా తగ్గింది. అమాయకుల్ని బలికానీయట్లేదు... మహిళలు/యువతుల నుంచి మాకు అందుతున్న ప్రతి ఫిర్యాదునీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. కొన్ని అంశాల్లో వారిదే పొరపాటుగా తేలుతోంది. ఇలాంటి వాటితో తొందరపడితే అమాయకులు బలయ్యే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి కేసునూ లోతుగా పరిశీలించి, పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే నిందితులపై చర్యలు తీసుకుంటున్నాం. ఇదే మా పనితీరుపై అందిరికీ నమ్మకం పెంచింది. బాధితులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్నాం. రెండేళ్లలో 50 మందిపై నిర్భయ చట్టం, 40 మందిపై ఐటీ యాక్ట్, ముగ్గురిపై పీడీ యాక్ట్ ప్రయోగించాం. 15 శాతం మందే పోకిరీలు గడిచిన రెండేళ్లలో ఎన్నో కేసుల్ని అధ్యయనం చేశాం. ఇందులో యువకులు/పురుషుల్లో 85 శాతం మంచివారే అని తేలింది. మిగిలిన 15 శాతం మందిలోనే వేధింపు రాయుళ్లు, పోరికీలు ఉంటున్నారు. అలా తక్కువ శాతం ఉన్నవారి వల్ల ఎక్కువ శాతం ఉన్న వారికి చెడ్డపేరు వస్తోంది. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని పోరికీలను అరికట్టే బాధ్యతను మంచివారూ తీసుకోవాలి. వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలని ప్రచారం చేస్తున్నాం. కాలేజీ విద్యార్థులు, మైనర్లు ఒకప్పుడు టీజింగ్ చేయడం గొప్పగా భావించేవారు. వారందరిలో ‘అది తప్పు’ అనే భావన తీసుకురాగలిగాం. ఇదే మాకు పెద్ద సక్సెస్. మైనర్లకు తల్లిదండ్రులతో కలిసి కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు ఇరువురిలోనూ మార్పు రావడంతో పాటు బాధ్యత పెరుగుతోంది. తెలిసి దాచినా నేరమే.. ఇటీవల కాలంలో చిన్నారులపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. అయితే కేవలం కొన్ని మాత్రమే కేసులుగా నమోదవుతున్నాయి. ఇలాంటి కేసుల్ని పోలీసులు ‘పోక్సో’ యాక్ట్ ప్రకారం నమోదు చేస్తారు. ఓ చిన్నారికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలిసీ పోలీసులకు ఫిర్యాదు చేయని తల్లిదండ్రులూ బాధ్యులే అని ఈ చట్టంలో ఉంది. పాఠశాలల్లో వేధింపులు జరిగినప్పుడు బాధ్యతలపై వారు అంతర్గతంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నా వారూ బాధ్యులవుతారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోతే మరో చిన్నారిని బలి తీసుకుంటారనేది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ప్రాంతాల వారిగా కమిటీలు వేస్తాం.. ఇప్పటికీ కొందరు బాధిత యువతులు తమకు ఎదురైన చేదు అనుభవాలపై ఫిర్యాదు చేసేందుకు ధైర్యం చేయట్లేదనిగమనించాం. దీనికి అనేక కారణాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాలేజీల్లో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేశాం. బాధితుల ఈ కమిటీని ఆశ్రయిస్తే.. వారు విషయాన్ని షీ–టీమ్స్ దృష్టికి తీసుకువస్తారు. భవిష్యత్తులో కాలనీలు, అపార్ట్మెంట్లు, మొహల్లాలు, స్లమ్స్ల్లోనూ స్థానికులతో ఇలాంటి కమిటీలే ఏర్పాటు చేయనున్నాం. ఓ మహిళ సాటి మహిళకు కచ్చితంగా సహకరించాలి. అప్పుడే సిటీ పూర్తిస్థాయి సేఫ్ హైదరాబాద్‌గా మారుతుంది. -
ఆరుగురు పోకిరీలకు జైలు
సాక్షి, సిటీబ్యూరో: రహదారులపై, మార్కెట్లో, సెల్‌ఫోన్ ద్వారా మహిళలు, యువతుల్ని వేధిస్తూ నగర షీ-టీమ్స్‌కు చిక్కిన ఆరుగురు పోకిరీలకు న్యాయస్థానం జైలు శిక్ష విధించిందని అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా గురువారం తెలిపారు. వీటి లో కొన్ని ఉదంతాల్లో కేసు నమోదుకు బాధితులు వెనుకాడినా పెట్టీ కేసులు నమోదు చేయడంతో పాటు సరైన ఆధారాలతో న్యాయస్థానంలో ప్రవేశపెట్టామని ఆమె పేర్కొన్నారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముసీయుద్దీన్ ఆన్లైన్ వ్యాపార సంస్థకు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఓ మహిళ వస్తువులు డెలివరీ చేస్తున్న సమయంలో ఆమె ఫోన్ నెంబర్ నమోదు చేసుకున్నాడు. ఆపై చాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ తనతో స్నేహం చేయాల్సిందిగా వెంటపడ్డాడు. బాధితురాలు వాట్సాప్ ద్వారా షీ-టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రెండు రోజుల జైలు పడింది. ఆజంపురకు చెందిన కె.నరేంద్ర మద్యం తాగి ఫలక్‌నుమ రైతు బజార్ వద్ద ఓ మహిళ వెంటపడి వేధిస్తున్నాడు. అక్కడే డెకాయ్ ఆపరేషన్‌లో ఉన్న షీ-టీమ్స్ ఈ తతంగాన్ని వీడియో రికార్డింగ్ చేయడంతో పాటు బాధితురాలి నుంచి వాం గ్మూలం రికార్డు చేశారు. వీటి ఆధారంగా కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రెండు రోజుల జైలు, జరిమానా విధిం చారు. యాకత్‌పురకు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖదీర్‌తో పాటు మరో వ్యక్తికి ఓ యువతితో స్నేహం ఉండేది. దాన్ని ఆసరాగా చేసుకున్న ఇరువురూ కొన్ని ఫొటోలు, వీడియోల ఆధారంగా బెదిరిం పులకు దిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన షీ-టీమ్స్ ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టుకు తరలించగా... ఒకరికి మూడు, మరొకరికి రెండు రోజుల శిక్ష పడింది. ఛత్రినాకకు చెందిన అరుణ్‌కుమార్ తన తండ్రి చిన్ననాటి స్నేహితుడి కుమార్తె వెంటపడటం ప్రారంభిం చాడు. స్థానిక పోలీసుస్టేషన్లో కౌన్సిలింగ్ చేసినా, ఇరువురి పెద్దలూ మందలించినా తన పంథా మార్చుకోలేదు. దీంతో బాధితురాలు తన తండ్రితో కలిసి షీ-టీమ్స్‌కు ఫిర్యా దు చేయడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఇతడికి రెండు రోజుల జైలు, జరిమానా విధించారు. గోల్నాక ప్రాంతానికి చెందిన రవికాంత్ గతంలో ఓ యువతితో స్నేహం చేశాడు. ఆమె తండ్రి చదువుపై దృష్టిపెట్టమని మందలించడంతో రవికి దూరంగా ఉంటోంది. దీంతో యువతిపై కక్షపెంచుకున్న నింది తుడు ఆమె తన ఫోన్లో అందుబాటులో లేకపోవడంతో ఆమె సోదరికి ఫోన్లు చేయడం ప్రారంభించాడు. ఫోన్‌ను తన మాజీ స్నేహితురాలికి ఇవ్వమని బెదిరిం పులకు దిగాడు. ఫేస్బుక్ ద్వారానూ బెదిరింపులు ప్రారంభించడంతో విష యం షీ-టీమ్స్‌కు చేరి అరెస్టయ్యాడు. న్యాయస్థానం రవికి రెండు రోజుల జైలు, జరిమానా విధించింది. ఈ ఆరుగురు పోకిరీలను డీఎస్పీ డి.కవిత నేతృత్వంలోని షీ-టీమ్స్ బృందాలు పట్టుకున్నామని స్వాతిలక్రా పేర్కొన్నారు. -
ప్రచారం... సమాచారం... పనితీరు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక బృందాల ఏర్పాటుపై విస్తృత ప్రచారం... ప్రజలు, బాధితుల ఇస్తున్న సమాచారం... తక్షణం స్పందిస్తున్న సిబ్బంది పనితీరు... ఈ మూడింటి కారణంగానే నగరంలో ఏర్పాటైన ‘షీ-టీమ్స్’ విజయవంతం కావడంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడానికి మూలమయ్యాయని అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు) స్వాతి లక్రా అన్నారు. ఈ బృందాలు అందుబాటులోకి వచ్చిశనివారానికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ... ‘ఏడాదిలో ‘షీ-టీమ్స్’కు వివిధ మాధ్యమాల ద్వారా 883 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా 573 ‘డయల్-100’ ద్వారా వచ్చినవే. ప్రతి ఫిర్యాదు పైనా తక్షణం స్పందించేందుకు నగర వ్యాప్తంగా మొత్తం 100 బృందాలు షిఫ్టుల వారీగా పని చేస్తున్నాయి. వీటికి అదనంగా పోలీసుస్టేషన్లలోనూ కొన్ని టీమ్స్ ఉన్నాయి. కేసు తీరును బట్టి కౌన్సెలింగ్ నుంచి నిర్భయ చట్టం కింద కేసుల వరకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ‘షీ-టీమ్స్’ పనితీరుతో పాటు మహిళలు/యువతుల భద్రతపై కరపత్రాలు, లఘు చిత్రాల ద్వారా భారీ ప్రచారం చేపట్టనున్నాం. అన్ని వయస్సుల వారు, స్వచ్ఛంద సంస్థలతో పాటు మారిన పోకిరీలను వాలెంటీర్లుగా ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. బంగారు తెలంగాణ సాధనలో ‘షీ-టీమ్స్’ పాత్ర కీలకంగా మారనుంది’ అని అన్నారు. ఈ ‘షీ-టీమ్స్’ విజయవంతం కావడంతో సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ డాక్టర్ టి.ప్రభాకరరావు, అదనపు డీసీపీ రంజన్ రతన్ కుమార్, ‘షీ-టీమ్స్’ ఏసీపీ కవితతో పాటు సిబ్బందీ అహర్నిశలు శ్రమించారని స్వాతిలక్రా పేర్కొన్నారు. కౌన్సెలెంగ్ నా కుమారుడిని మార్చింది ‘రోడ్లపై యువతుల్ని వేధిస్తున్న నా కుమారుడిని ‘షీ-టీమ్స్’ అదుపులోకి తీసుకుని సీసీఎస్‌కు తరలించారు. కౌన్సెలింగ్ కోసం నన్ను కూడా పిలిచారు. ఆ సందర్భంలో అధికారులు చెప్పిన మాటలు, ఇంట్లో మేం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ నా కుమారుడిలో మార్పు తెచ్చాయి’ - మహ్మద్ హాజీ బృందాలు నలుమూలలా విస్తరించాయి ‘‘షీ-టీమ్స్’ బృందాలు నగరంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. వీటి ఏర్పాటు, విస్తరణ ఓ ఉద్యమంలా సాగింది. ఇబ్బంది ఎదురైనప్పుడు ‘డయల్-100’కు ఫోన్ చేయగానే స్పందిస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నాయి.’ - దివ్య, విద్యార్థిని నేను ధైర్యంగా తిరుగుతున్నాను.. ‘సిటీకి కొత్తగా వచ్చాను. ఒకప్పుడు ఇంట్లోంచి బయటకు రావాలంటే పోకిరీలతో భయం వేసేది. తల్లిదండ్రులూ ఎంతో ఆందోళన చెందే వారు. ‘షీ-టీమ్స్’తో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేను ధైర్యంగా తిరగడంతో పాటు ఇబ్బందుల్లో వారినీ ఆదుకుంటున్నాను.’ - గాయత్రి, విద్యార్థిని -
పోలీసు కస్టడీకి మాయగాడు మధు
హైదరాబాద్ : అమాయక యువతుల్ని లోబరుచుకున్న మహా మాయగాడు మధును సీసీఎస్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. మధును తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నగర సీసీఎస్ పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందుకు నాంపల్లి కోర్టు అయిదు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతించింది. ఎఫ్ సీఐ లో ఉద్యోగం చేస్తూ సస్పెండ్ అయ్యాడు. వందలాది మంది అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని మోసం చేశాడు. మధును షీ-టీమ్స్ బృందం గత గురువారం పట్టుకుంది. నయవంచకుడి చేతిలో మోసపోయిన బాధితుల వివరాలతో పాటు ఇంకా ఏవైనా పంథాలు అనుసరించి ఎవరినైనా మోసం చేశాడా... అనే కోణంలో విచారించాలని పోలీసులు నిర్ణయించారు. దీనికోసం ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్ విశ్లేషించి, నివేదిక ఇవ్వడం కోసం రాష్ట్ర ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపాలని నిర్ణయించారు. వీటి ఆధారంగా బాధితుల వివరాలతో పాటు మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
పోలీసు కస్టడీకి మాయగాడు మధు
-
ఏడాదిలో ఎన్నో విజయాలు
‘షీ-టీమ్స్’కు ఏడాది పూర్తి 12 నెలల్లో 281 మంది ఆటకట్టు చిక్కిన వారిలో మైనర్లే అధికం సిటీబ్యూరో: ఈవ్ టీజర్ల పీచమణచడంతో పాటు అతివలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు పోలీసు విభాగం ఏర్పాటు చేసిన ‘షీ-టీమ్స్’ ఏడాదిలో ఎన్నో విజయాలను సాధించింది. నగరంలో ఇవి పని చేయడం ప్రారంభించి సోమవారం నాటికి ఏడాది పూర్తయింది. బస్సుల్లో మహిళలు, పురుషులు కూర్చునే/నిల్చునే ప్రాంతాలకు మధ్య మెష్ ఏర్పాటు ‘షీ-టీమ్స్’ సిఫార్సుతోనే అమలైంది. నగర అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు) స్వాతి లక్రా నేతృత్వంలో పని చేస్తున్న ఈ బృందాలు ఇప్పటి వరకు 281 మంది పోకిరీల ఆటకట్టించాయి. ఇందుకుగాను బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీల్లో మాటువేయడంతో పాటు డెకాయ్ ఆపరేషన్లు సైతం నిర్వహించాయి. వీరికి చిక్కిన వారిలో 129 మంది మైనర్లు కావడం గమనార్హం. మొత్తం 281 మందిలో 126 మందిపై చిన్న కేసులు నమోదు చేసి పూచీకత్తుపై విడిచిపెట్టగా మరో 19 మందిని జైలుకు పంపాయి. 101 మందికి జరిమానా విధించగా... 28 మందికి కౌన్సిలింగ్ ఇచ్చాయి. మితిమీరిన స్థాయిలో వేధింపులకు దిగిన 12 మందిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశాయి. ‘షీ-టీమ్స్’ పట్టుకున్న సంచలనాత్మక కేసుగా నయావంచకుడు మధు కేసు రికార్డులకెక్కింది. ఫిర్యాదు అందుకున్నది మొదలు దాదాపు నాలుగు నెలల పాటు నిర్విరామంగా శ్రమించిన ప్రత్యేక బృందం ఎట్టకేలకు గురువారం అరెస్టు చేయగలిగింది. నగరంలో ప్రారంభమై, రాష్ట్రం మొత్తానికే ఆదర్శంగా మారిన ‘షీ-టీమ్స్’ పనితీరును మెరుగు పరచడంతో పాటు అతివల రక్షణకు మరిన్ని చర్యలు చేపట్టడానికి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. -
వేధించడానికి 30 ఫోన్లు మార్చాడు!
అదే సంఖ్యలో సిమ్‌కార్డులు వినియోగం ఎట్టకేలకు షీ-టీమ్‌కు చిక్కిన నిందితుడు మరో కేసులో ఓ విద్యార్థికీ అరదండాలు సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ ప్రబుద్ధుడు సంక్షిప్త సందేశాల ద్వారా ఓ వివాహితను వేధించడానికి ఏకంగా 30 సెల్ఫోన్లు మార్చాడు. అదే సంఖ్యలో సిమ్కార్డులూ వినియోగించాడు. చివరకు విషయం షీ-టీమ్స్‌కు చేరడంతో బుధవారం పట్టుబడి కటకటాల్లోకి చేరాడు. ఇతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు) స్వాతి లక్రా వెల్లడించారు. ఇదే తరహా నేరానికి పాల్పడిన మరో నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు ఓ మైనర్‌నూ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ చేసినట్లు ఆమె వివరించారు. అంబర్పేట్ పరిధిలోని లాల్బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సాజిద్ హుస్సేన్ ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీలో ఉద్యోగి. అదే ప్రాంతంలో నివసించే ఓ వివాహితను వేధించడం ప్రారంభించిన ఇతగాడు దీనికోసం వివాహితకు సంబంధించిన అసభ్య వ్యాఖ్యలు, పరుష పదజాలంతో ఆమె భర్త, అత్తమామల సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపాడు. దీనికోసం దాదాపు 30 సెకండ్ హ్యాండ్ సెల్ఫోన్లు, అదే సంఖ్యలో బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులు వాడాడు. ఓ సెల్ఫోన్లో సిమ్‌కార్డు వేసి ఈ చర్యలతో వివాహిత కుటుంబ జీవితం ఇబ్బందుల పాలైంది. విసిగిపోయిన బాధితురాలు షీ-టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన పోలీసులు బుధవారం సాజిద్ హుస్సేన్ ను బాధ్యుడిగా గుర్తించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న షీ-టీమ్స్ అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అంబర్పేట్ పోలీసులకు అప్పగించాయి. సాజిద్ వినియోగించిన ఫోన్లన్నీ వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైనవిగా గుర్తించిన పోలీసులు అవి అతడి దగ్గరకు ఎలా వచ్చాయనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్షాకోట్ ప్రాంతానికి చెందిన కె.శ్రీశైలం విద్యార్థి. ఓ యువతిపై వేధింపులు ప్రారంభించిన ఇతగాడు ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులకూ అసభ్యపదజాలంతో కూడిన ఎస్సెమ్మెస్‌లు పంపాడు. యువతిని బెదిరిస్తూ కొన్ని ఈ-మెయిల్స్ చేశాడు. ఈ కేసునూ పర్యవేక్షించిన షీ-టీమ్స్ బుధవారం శ్రీశైలాన్ని అరెస్టు చేసి పెట్టీ కేసు నమోదు చేశాయి. నగరానికి చెందిన ఓ మైనర్ పరిచయస్థురాలైన బాలిక ఫొటోలు ఫేజ్‌బుక్‌లో పెట్టడంతో పాటు ఆమె తండ్రికీ ఆన్లైన్లో పంపిస్తూ వేధించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మైనర్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్న షీ-టీమ్స్ అతడి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి, భవిష్యత్తులో పునరావృతం కాకూడదని హెచ్చరించి విడిచిపెట్టారు.