
పోలీసు కస్టడీకి మాయగాడు మధు
హైదరాబాద్ : అమాయక యువతుల్ని లోబరుచుకున్న మహా మాయగాడు మధును సీసీఎస్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. మధును తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నగర సీసీఎస్ పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందుకు నాంపల్లి కోర్టు అయిదు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతించింది.
ఎఫ్ సీఐ లో ఉద్యోగం చేస్తూ సస్పెండ్ అయ్యాడు. వందలాది మంది అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని మోసం చేశాడు. మధును షీ-టీమ్స్ బృందం గత గురువారం పట్టుకుంది. నయవంచకుడి చేతిలో మోసపోయిన బాధితుల వివరాలతో పాటు ఇంకా ఏవైనా పంథాలు అనుసరించి ఎవరినైనా మోసం చేశాడా... అనే కోణంలో విచారించాలని పోలీసులు నిర్ణయించారు. దీనికోసం ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు.
ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్ విశ్లేషించి, నివేదిక ఇవ్వడం కోసం రాష్ట్ర ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపాలని నిర్ణయించారు. వీటి ఆధారంగా బాధితుల వివరాలతో పాటు మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.