ఏడాదిలో ఎన్నో విజయాలు
‘షీ-టీమ్స్’కు ఏడాది పూర్తి
12 నెలల్లో 281 మంది ఆటకట్టు
చిక్కిన వారిలో మైనర్లే అధికం
సిటీబ్యూరో: ఈవ్ టీజర్ల పీచమణచడంతో పాటు అతివలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు పోలీసు విభాగం ఏర్పాటు చేసిన ‘షీ-టీమ్స్’ ఏడాదిలో ఎన్నో విజయాలను సాధించింది. నగరంలో ఇవి పని చేయడం ప్రారంభించి సోమవారం నాటికి ఏడాది పూర్తయింది. బస్సుల్లో మహిళలు, పురుషులు కూర్చునే/నిల్చునే ప్రాంతాలకు మధ్య మెష్ ఏర్పాటు ‘షీ-టీమ్స్’ సిఫార్సుతోనే అమలైంది. నగర అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు) స్వాతి లక్రా నేతృత్వంలో పని చేస్తున్న ఈ బృందాలు ఇప్పటి వరకు 281 మంది పోకిరీల ఆటకట్టించాయి. ఇందుకుగాను బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీల్లో మాటువేయడంతో పాటు డెకాయ్ ఆపరేషన్లు సైతం నిర్వహించాయి. వీరికి చిక్కిన వారిలో 129 మంది మైనర్లు కావడం గమనార్హం.
మొత్తం 281 మందిలో 126 మందిపై చిన్న కేసులు నమోదు చేసి పూచీకత్తుపై విడిచిపెట్టగా మరో 19 మందిని జైలుకు పంపాయి. 101 మందికి జరిమానా విధించగా... 28 మందికి కౌన్సిలింగ్ ఇచ్చాయి. మితిమీరిన స్థాయిలో వేధింపులకు దిగిన 12 మందిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశాయి. ‘షీ-టీమ్స్’ పట్టుకున్న సంచలనాత్మక కేసుగా నయావంచకుడు మధు కేసు రికార్డులకెక్కింది. ఫిర్యాదు అందుకున్నది మొదలు దాదాపు నాలుగు నెలల పాటు నిర్విరామంగా శ్రమించిన ప్రత్యేక బృందం ఎట్టకేలకు గురువారం అరెస్టు చేయగలిగింది. నగరంలో ప్రారంభమై, రాష్ట్రం మొత్తానికే ఆదర్శంగా మారిన ‘షీ-టీమ్స్’ పనితీరును మెరుగు పరచడంతో పాటు అతివల రక్షణకు మరిన్ని చర్యలు చేపట్టడానికి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.