వేధించడానికి 30 ఫోన్లు మార్చాడు!
అదే సంఖ్యలో సిమ్‌కార్డులు వినియోగం
ఎట్టకేలకు షీ-టీమ్‌కు చిక్కిన నిందితుడు
మరో కేసులో ఓ విద్యార్థికీ అరదండాలు
సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ ప్రబుద్ధుడు సంక్షిప్త సందేశాల ద్వారా ఓ వివాహితను వేధించడానికి ఏకంగా 30 సెల్‌ఫోన్లు మార్చాడు. అదే సంఖ్యలో సిమ్‌కార్డులూ వినియోగించాడు. చివరకు విషయం షీ-టీమ్స్‌కు చేరడంతో బుధవారం పట్టుబడి కటకటాల్లోకి చేరాడు. ఇతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు) స్వాతి లక్రా వెల్లడించారు.
ఇదే తరహా నేరానికి పాల్పడిన మరో నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు ఓ మైనర్‌నూ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ చేసినట్లు ఆమె వివరించారు. అంబర్‌పేట్ పరిధిలోని లాల్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సాజిద్ హుస్సేన్ ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీలో ఉద్యోగి. అదే ప్రాంతంలో నివసించే ఓ వివాహితను వేధించడం ప్రారంభించిన ఇతగాడు దీనికోసం వివాహితకు సంబంధించిన అసభ్య వ్యాఖ్యలు, పరుష పదజాలంతో ఆమె భర్త, అత్తమామల సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపాడు. దీనికోసం దాదాపు 30 సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్లు, అదే సంఖ్యలో బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులు వాడాడు. ఓ సెల్‌ఫోన్‌లో సిమ్‌కార్డు వేసి ఈ చర్యలతో వివాహిత కుటుంబ జీవితం ఇబ్బందుల పాలైంది. విసిగిపోయిన బాధితురాలు షీ-టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన పోలీసులు బుధవారం సాజిద్ హుస్సేన్ ను బాధ్యుడిగా గుర్తించాయి.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న షీ-టీమ్స్ అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అంబర్‌పేట్ పోలీసులకు అప్పగించాయి. సాజిద్ వినియోగించిన ఫోన్లన్నీ వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైనవిగా గుర్తించిన పోలీసులు అవి అతడి దగ్గరకు ఎలా వచ్చాయనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్షాకోట్ ప్రాంతానికి చెందిన కె.శ్రీశైలం విద్యార్థి. ఓ యువతిపై వేధింపులు ప్రారంభించిన ఇతగాడు ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులకూ అసభ్యపదజాలంతో కూడిన ఎస్సెమ్మెస్‌లు పంపాడు. యువతిని బెదిరిస్తూ కొన్ని ఈ-మెయిల్స్ చేశాడు.
ఈ కేసునూ పర్యవేక్షించిన షీ-టీమ్స్ బుధవారం శ్రీశైలాన్ని అరెస్టు చేసి పెట్టీ కేసు నమోదు చేశాయి. నగరానికి చెందిన ఓ మైనర్ పరిచయస్థురాలైన బాలిక ఫొటోలు ఫేజ్‌బుక్‌లో పెట్టడంతో పాటు ఆమె తండ్రికీ ఆన్‌లైన్‌లో పంపిస్తూ వేధించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మైనర్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్న షీ-టీమ్స్ అతడి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి, భవిష్యత్తులో పునరావృతం కాకూడదని హెచ్చరించి విడిచిపెట్టారు.