పుస్తకం హస్తభూషణమన్నారు; అది చదివే పుస్తకాల గురించి! ఇప్పుడు వినే పుస్తకాలు ప్రాచుర్యాన్ని తెచ్చుకుంటూ కర్ణభూషణంగా మారుతున్నాయి. కాలం చేసే తమాషాలలో ఇదొకటి. మన జీవితమూ, ఊహలూ, ప్రణాళికలూ కాలం వెంబడి సరళరేఖలా సాగుతాయనుకుంటాం. కానీ,దృష్టి వైశాల్యాన్ని పెంచుకుని చూస్తే కాలం మళ్ళీ మళ్ళీ బయలుదేరిన చోటికే వచ్చే చక్రంలా కూడా కనిపిస్తుంది. ‘కాలచక్ర’మనే మాట సర్వత్రా ప్రసిద్ధమే.
పుస్తక ప్రపంచంలోకే కనుక ఒకసారి తొంగి చూస్తే, ‘చదువు’ అనే మాట పుస్తకంతో ముడిపడే ప్రచారంలోకి వచ్చింది. పుస్తకాలు లేని కాలంలో; లేదా, అవి జనసామాన్యానికి విరివిగా అందుబాటులోకి రాని రోజుల్లో కథలూ, కవిత్వాలూ, ఇతరేతర జ్ఞానాలూ అన్నీ వినుకలి ద్వారానే అందేవి. దీర్ఘకాలంపాటు ప్రపంచవ్యాప్తంగా సమస్త వాఙ్మయమూ చక్షురక్షరాల మధ్య కాకుండా; వక్తకీ, శ్రోతకీ మధ్య ప్రవహిస్తూ మౌఖిక వాఙ్మ యమనే ముద్ర వేసుకుంది. పుస్తక వ్యాప్తితోనే లిఖిత సాహిత్యమన్న మాట వాడుకలోకి వచ్చింది.
కాలచక్రం మళ్ళీ మొదటికొచ్చి, పుస్తకమనే ‘పఠన’ మాధ్యమం స్థానాన్ని, ఇయర్ ఫోన్ రూపంలో తిరిగి వెనకటి ‘శ్రవణ’ మాధ్యమం ఆక్రమించుకుంటున్నట్టు తోస్తోంది. నేటి యువత పుస్తకాన్ని చదవడం కన్నా, వినడాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ విధంగా, ‘పుస్తకాలు లేని గది ఆత్మలేని దేహ’మన్న సిసిరో సూక్తిని కొంత సవరించుకోవలసిన అవసరమూ కలుగుతోంది.
కనుకలి నుంచి వినుకలికి మారినప్పుడు పుస్తకం కలిగించే అనుభూతి గాఢతలోనూ మార్పు వస్తుందా అన్నది అనుభవంతో మాత్రమే చెప్పగలం. ఏదైనాసరే అంతిమంగా అలవాటు పడడంలోనే ఉంటుంది. మాధ్యమం ఎలాంటిదైనా పుస్తకానికీ మస్తకానికీ పడిన పీటముడి స్థిరమూ, శాశ్వతమనీ మాత్రం నిస్సంశయంగా చెప్పవచ్చు. రాబోయే కాలం అనూహ్యంగా మన అంచనాలను తలకిందులు చేస్తే తప్ప పుస్తకాలతో మన సహజీవనం మరికొన్ని తరాలపాటు నిరాఘాటంగా కొనసాగుతుందనే అనుకోవచ్చు.
కాపురంలోలానే పుస్తకాలతో కాపురంలోనూ చేదూ, తీపీ కలగలిసే ఉంటాయి. పుస్తక ప్రియులు వియ్యమందితే ఒక్కోసారి సొంతింటి పుస్తక వారసత్వానికీ, సొంత సేకరణకూ అదనంగా అత్తింటి పుస్తక వారసత్వమూ అంది, పుస్తకాలు ఇబ్బడి ముబ్బడై అల్మైరాలను దాటిపోయి నేల మీద పరచుకుంటూ ఉంటాయి. పుస్తెతోపాటు సంక్రమించిన పుస్తక సంపదా ఇల్లాలికి దినదిన సమస్య అవుతూ ఉంటుంది.
పుస్తకాలతో జీవించడం కూడా ఒక పుస్తకానికి సరిపోయే ఇతివృత్త మవుతుంది. బాల్యం నుంచి, వార్ధక్యం వరకూ మనతో ఉండే పుస్తకాలు, ఒక్క పుట కూడా తెరవకుండానే, ఆయా వయోదశల మీదుగా మన అభిరుచులలో వచ్చే తేడాలను బోధిస్తాయి. మనకు పనికిరానివని పక్కన పెట్టిన పుస్తకాలే క్రమంగా మన చదువుల బల్లకెక్కి వెక్కిరిస్తాయి. మన హస్తస్పర్శ కోసం ఏళ్ల తరబడి మౌన తపస్సు చేసే పుస్తకాలే, ఒక్కసారి తెరవగానే అద్భుత ప్రపంచంలోకి మనల్ని లాక్కుపోతాయి. మన ప్రయాణం ఆగినా పుస్తక ప్రయాణం కొన సాగుతూనే ఉంటుంది.
కవిత్వానికి ఏదీ అనర్హం కాదని మహాకవి ఉగ్గడించినట్టుగా, చరిత్ర శోధనకూ ఏదీ అనర్హం కాదు. పుస్తక చరిత్రనే తవ్వితే అది కూడా ఎన్నో అవతారాలు ఎత్తుతూ నేటి దశకు వచ్చిన సంగతి అర్థమై రేపటి అవతారం గురించిన దిగులు, గుబుళ్లను తగ్గిస్తుంది. పుస్తకం గురించిన ఊహ క్రీస్తుపూర్వం నాలుగవ సహస్రాబ్ది నాటికే ఉండేది. ప్రాచీన ఈజిప్టు వాసులు మధ్య ఆఫ్రికా, నైలునదీ లోయల్లో పెరిగే ‘పెపారస్’ అనే నీటిమొక్క నుంచి తీసిన మెత్తని బెరడును రాతకు, చిత్రలేఖనానికి ఉపయోగించేవారు.
ఈ ‘పెపారస్’ పేరే ‘పేపర్’గా మారి ఇప్పటికీ వ్యవహారంలో ఉంది. ఆంగ్లంలో ‘బుక్’ అనే మాట పుట్టుకా ఇంతే ఆసక్తికరం. యూరప్, ఆసియా అడవుల్లో పెరిగే ‘బచ్’ అనే చెట్టు తాలూకు తెల్లని బెరడును రాతకు ఉపయోగించేవారు. నేటి ఇండో–యూరోపియన్ భాషలకు మాతృక అయిన ప్రోటో–ఇండో–యూరోపియన్ లోని ‘భెరెగ్’, ‘భగో’ అనే మాటలే వివిధ పుత్రికాభాషల్లో ‘బచ్’ గానూ, ‘బీచ్’ గానే కాక; ఇంకా అనేక రూపాంతరాలు చెందుతూ చివరికి ‘బుక్’గా మారాయి.
ప్రాచీన భారతదేశంలో రాతకు ఉపయోగించిన ‘భూర్జపత్ర’ మనే సంస్కృత శబ్ద మూలాలు కూడా ‘భెరెగ్’ అనే ప్రోటో–ఇండో–యూరోపియన్ పదంలోనే ఉన్నాయి. క్రీస్తుశకం తొలి శతాబ్దంలో రోమన్లు శిక్షాస్మృతుల రాతకు గొర్రె, మేక చర్మాన్ని వినియో గించేవారు. క్రమంగా తాటియాకులు, రాగిరేకులు రాతకు ఆలంబనమయ్యాయి. క్రీస్తుశకం 2–5 శతాబ్దుల మధ్యలో వచ్చినట్టు చెబుతున్న ‘డైమెండ్ సూత్ర’ తొలి ముద్రితగ్రంథమంటారు.
ఇక 15వ శతాబ్దిలో జోహానెస్ గూటెన్‌బర్గ్ కనిపెట్టిన ముద్రణ యంత్రం పుస్తక ప్రచురణను విప్లవీకరించడం, 16వ శతాబ్దిలో రిచర్డ్ ముల్‌కాస్టర్ అనే పండితుడు ఎనిమిదివేల మాటలతో తొలి నిఘంటువును ప్రచురించడం వగైరాలు ఇటీవలి చరిత్ర. ఎప్పటికప్పుడు పరిమిత సంఖ్యలో పుస్తకాలను ప్రచురించుకునే నేటి అవకాశాన్ని (ప్రింట్–ఆన్ –ఆర్డర్) ఫ్రెడరిక్ ఫో అనే సైన్సు ఫిక్షన్ రచయిత 1966లోనే ఊహించాడు.
ఇంతకీ ఈ పుస్తక స్మరణ దేనికంటే, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పుస్తకాల పండుగ సమీపిస్తోంది. కొన్ని రోజులపాటు జరిగే ఈ పండుగకు ముద్రాపకులు, విక్రేతలు, రచయితలు సమధికోత్సాహంతో సిద్ధమవుతున్నారు. ముద్రిత గ్రంథాల భవిష్యత్తు పట్ల ప్రస్తుతానికి అదే కొండంత భరోసా.
పుస్తకం కర్ణభూషణం
Published Mon, Nov 20 2023 12:09 AM | Last Updated on Mon, Nov 20 2023 12:09 AM
Comments
Please login to add a commentAdd a comment