మన పక్కింటికో, ఎదురింట్లోకో పండగ సెలవులకని ఎవరైనా కొత్తపిల్లలు వచ్చినపుడు మాటా మాటా కలిసినపుడు మీ ఊరు పెద్దదా మా ఊరు పెద్దదా అని ఒక అంచనా వేసుకొవడానికి అడిగే మొదటి ప్రశ్న మీ ఊర్లో సినిమా టాకీసులు ఎన్ని ఉన్నాయి? అని అయి ఉండేది. నా కటువంటి సమస్యే ఎదురయ్యేది కాదు. నాకు కావలసిన భోగట్టా అల్లా మీ ఊర్లో, మీ ఇంటి దగ్గర పుస్తకాలకు అద్దెకు ఇచ్చే షాపులు ఎన్ని ఉన్నాయని మాత్రమే.
నాకు ఊహ తెలిసాకా తరుచుగా ఎమ్మిగనూరుకు వెల్తుండే వాడిని. ఊర్లో దిగి మా మేనత్త ఇంటికి వెళ్ళే రిక్షా ఎక్కాకా దారికి అటూ ఇటూ చూస్తూ ఆ ఊరిలో పుస్తకాల బంకులు ఎన్ని ఉన్నాయా ? ఎక్కడెక్కడ ఉన్నాయా అని బుర్రలో గురుతులు పెట్టుకునేవాడిని . మా నూనెపల్లె లో భద్రయ్య బంకు అద్దె పుస్తకాలకు పేరెన్నికది. నూనెపల్లె సెంటరు లో గుర్రాల షెడ్డుకు ఎదురుగా ఉండేదది. ఆ బజారు అంతా కోమట్ల ఇల్లు ఎక్కువగా ఉండేవి. భద్రయ్య గారు కూడా కొమట్లే. ఆయన కొడుకు భాస్కర్ ఆ బంకులో ఎక్కువగా కూచునేవాడు. బంకు సీలింగు కు ఒక చిన్న ప్యాన్ బిగించి ఉండేది. బంకులో ఒక మూల రేడియో కూడా. అక్కడ నాకు పుస్తకాల తరువాత అత్యంత ప్రీతిప్రాత్రమైన వస్తువు బెల్లంపాకపు వేరుసేనగ గట్టా. ఎంతో రుచిగా ఉండేదది . ఇప్పుడు అటువంటి గట్టాలే ఆల్మండ్ హౌస్ లో కనపడతాయి. రూపం ఒకటే కాని ధర మాత్రం హస్తిమశకాంతరం.
పుస్తకాలు, గట్టాల తరువాత నాకు ఫేవరెట్ అనదగ్గది గుడ్ డే బిస్కత్తు. గాజు సీసాలలో చక్కగా అమర్చి పెట్టి ఉండేవి. సుతారంగా అల్యూమినియం మూత తిప్పి అడిగిన వారికి బిస్కట్లు ఇచ్చేవాడు భద్రయ్య . అపుడు ఆ సీసాలోనుంచి బిస్కెట్ల వాసన ఎంత కమ్మగా వచ్చేదో. ఇప్పుడు అప్పుడప్పుడూ రత్నదీప్ సూపర్ మార్కెట్ కు ఏదయినా సరుకులు కొనడానికి వెడతానా, బిస్కెట్ కౌంటర్ దగ్గర గుడ్ డే ప్యాకెట్ పుచ్చుకుని ఆ చిన్ననాడు తగిలిన చక్కని వాసన వస్తుందా లేదా అని చూస్తా, రానే రాదు. ఆ వాసన లేని బిస్కెట్ కూడా రుచిగా అనిపించదు నాకు . నేను భద్రయ్య అంగట్లో పుస్తకం తీసుకుంటే కూడా ఉన్న ఫ్రెండ్ ఎవరో ఒకరు బిస్కెటో , బుడ్డల గట్టానో కొనేవాడు అది ఇద్దరం పంచుకుని తినుకుంటూ నడిచే దారిలోనే పుస్తకాన్ని నమిలేస్తూ కదిలేవాడ్ని.
పుస్తకాలు అద్దెకిచ్చే షాపులో ఆ గోడల నిండా వందలుగా పుస్తకాలను నిలువ వరుసల్లో నింపేవారు. స్కెచ్చు పెన్నులతో పుస్తకాల మీద పేర్లు రాసి ఉండేవి. ఏ పుస్తకం కోసం కష్టపడి వెదుక్కోనక్కరలేదు. చక్కని చేతి రాతలో ఆ పేర్లు కళ్ళని ఆకర్షించేవి. చాలా షాపుల్లో అయితే పత్రికలో సీరియల్ గా వచ్చిన నవల పేజీలని చించి పుస్తకంగా బైండ్ చేసి అద్దెకు ఇచ్చెవారు. కొత్తగా రిలీజ్ అయిన పుస్తకాలయితే డిమాండ్ ఎక్కువ కాబట్టి వాటిని జనం కంట పడకుండా సెపరేట్ గా ఉంచేవాళ్ళు. నియమిత ఖాతాదారుల కోసం ఆ పుస్తకాలు పక్కకు తీసిపెట్టేవారు. షాపు వాళ్ళు ఏ పుస్తకాన్ని కూడా ఒకటి ఒకటిగా కొనేవాళ్ళు కాదు. ప్రతి పుస్తకం రెండు మూడు ఉండేవి సూపర్ స్టార్లయిన మధుబాబు, మల్లాది, యండమూరి పుస్తకాలయితే అయిదు లెక్కన కొనేవారు. ఆ పుస్తకాలు వచ్చిన కొత్తలో అయిదేం ఖర్మ పది కొన్నా అంత సులువుగా పాఠకుల చేతికి వచ్చేవి కావు. త్రిమూర్తులకు డిమాండ్ ఎక్కువ. ఎవరు ఎంత గీ పెట్టి చచ్చినా ఒకానొక కాలంలో హైస్కూలు పిల్లవాళ్ళ దగ్గరి నుండి సకుటుంబ సపరివారం వరకు తెలిసిన రచయితలంటే వీరే . పెరిగిపెద్దయి అతి పెద్ద చదవరులయిన ఆ రోజుల చదువరులు చాలామందికి అక్షర ప్రాశన చేసింది వీరే. వీరిలో యండమూరి కాస్త హట్ కే. రాసింది కమర్షియల్, పాపులర్ సాహిత్యమే కావచ్చు. అయినా ఆయన తన పుస్తకాల్లో ఎక్కడో ఒకక్కడ బుచ్చిబాబు, తిలక్ , విశ్వనాథ సత్యనారాయణ, చలం... ఇత్యాదుల ప్రస్తావన తెచ్చేవారు. నాకయితే ఈ మహారచయితల తొలి పరిచయం వీరేంద్రనాథ్ గారి పుస్తకాల్లోనే. ఒక పుస్తకంలో ఆయన ఇట్లావాక్యం వ్రాశారు "తెలుగు సాహిత్యంలో ఒకే ఒక హీరో తంగిరాల శంకరప్ప" ఆ వాక్యాన్ని పట్టుకుని నేను పెద్దయ్యాకా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి సాహిత్యాన్ని మొత్తం చదువుకునే భాగ్యం కలిగింది. లేకుంటే ఎక్కడి చిన్న పల్లె నూనెపల్లె? దానికి అద్భుతమైన సాహిత్యం ఎంతెంత దూరం?
షాపు పెట్టాము కదాని వచ్చిన ప్రతి ఒక్కరికి పుస్తకాలు ఇవ్వబడవు. బ్యాంకులో అకవుంట్ తెరవడానికి సాక్షి సంతకం కావాలన్నట్లు, షాపువారికి తెలిసిన వారినెవరినయినా తోడుగా తీసుకెడితేనే పుస్తకాలు ఇస్తారు. లేదా పుస్తకం ధరమొత్తం అడ్వాన్సుగా కట్టాలి. నాకు గుర్తు ఉండి కొందరు 20 రూపాయలు బయానా గా పుచ్చుకునేవారు. అంత డబ్బు ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు? అందుకని నేను ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి అడ్వాన్స్ కట్టే వాణ్ని, అద్దె చెల్లించే వాడిని. పుస్తకాలు నాకు దొంగతనం నేర్పాయి. అలవాటు ఐయింది కదాని ప్రతిఎప్పుడూ దొంగతనం చేయకూడదు. పట్టుబడి పోతాం. అందుకే పుస్తకాలకు అద్దె అప్పు పెట్టడం నేర్చుకున్నాను. ఈ రోజుల్లో చోరీ చేస్తూ పట్టుబడిన పిల్లలు ఎవరైనా పుస్తకాలు కొనడానికి దొంగతనం చేసాను అని ఏడుపుముఖంతో అంటే వాళ్ళని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోబుద్ది వేస్తోంది. నేను పెరిగి పెద్దయ్యాక ఒకసారి నాకెంతో ఇష్టమైన ఆర్టిస్ట్ పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక దిగాలుగా ఉంటే ఏమిటి విషయమని అడిగి తెలుసుకుని చిత్రకారులు శ్రీ బాపు గారు దగ్గరకు పిలిచి ముద్దు పెట్టుకోలేదు కానీ ఇరవైవేల రూపాయలు ఇచ్చి నా ముఖంలో నవ్వు చూశారు .
అద్దెకు తీసుకున్న పుస్తకాన్ని తమ వద్దనున్న రిజిస్టరు పుస్తకంలో తేది, సమయం వేసి , మళ్ళీ ఆ పుస్తకాన్ని రేపటి రోజున అదే సమయం లేదా అంతకంటే ముందుగా తెచ్చి ఇస్తే ఒక రోజు అద్దె, రోజు మారిన కొద్దీ అద్దె రెట్టింపు అయ్యేది ,ఒక్కొక్క సారి అద్దె కట్టడానికి కి డబ్బులు లేక పుస్తకాన్ని అట్లానే అట్టిపెట్టేసుకుని పుస్తకం ధరకన్నా ఎక్కువ అద్దె డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడప్పుడు షాపు యజమానికి ఏదయినా పనిపడో , భోజనానికి వెళ్ళవలసి వచ్చినపుడో పుస్తకాల షాపు మూసి ఉండేది. షాపు మూసి ఉన్నదేమి అని ఖంగారు పడకూడదు. అంగడి చెక్కలకు సన్న సందులు ఉంటాయి . అందు గుండా పుస్తకాన్ని పడెయ్యాలి. షాపు ఆయన తిరిగి వచ్చాక మన పుస్తకం నెంబరు , పేరూ చూసి పుస్తకం ముట్టినట్టుగా పద్దు వేసుకుంటాడు. అద్దె బకాయి రాసుకుంటాడు.
మా ఇంటి దగ్గరలోనే, శివశంకర విలాస్ దగ్గర ఒక క్రైస్తవ కుటుంబం పుస్తకాల బంకు పెట్టుకున్నారు. అమ్మా, నాన్న, ఒక అబ్బాయి. ఒకరు లేనప్పుడు ఒకరు ఆ షాపు చూసుకునేవారు. నేను వాళ్లదగ్గర పుస్తకాలు అద్దెకు తీసుకునేవాడిని. యండమూరి వీరేంద్రనాథ్ "’రక్తసింథూరం" పుస్తకం అక్కడే తీసుకున్న గుర్తు నాకు. ఆ పుస్తకానికి చిత్రకారులు చంద్ర గారు వేసిన బొమ్మని చూసి మంత్రముగ్దుణ్ణి అయ్యాను ఆ కాలల్లోనే. ఒకసారి పుస్తకాలకు అద్దె చెల్లించడానికి డబ్బులు లేనప్పుడు ఒక ఉపాయం చేశా. కొడుకు ఆ షాపులో ఉన్నపుడు పుస్తకం తీసుకున్నాను అనుకో, పుస్తకం తిరిగి ఇచ్చేటప్పుడు అతను కాకుండా వాళ్ళ అమ్మగారో , నాయనో ఉన్నప్పుడు పుస్తకం వాపసు ఇచ్చి అద్దె ముందే కట్టా అని చెప్పేవాడిని. కొన్ని సార్లు పుస్తకం అద్దె ముందే కట్టించుకునేవారు. పుస్తకాలు నాకు మోసాన్ని కూడా నేర్పాయి. ఆ కుటుంబం వారు కడు బీదవారు. వారి రూపు, వేసుకున్న బట్టలు ఆ విషయాన్ని యథాతంగా చూపేవి. ఇప్పుడు ఎప్పుడయినా నాకు ఏదయినా అన్యాయం జరిగింది అనిపించినపుడు నేను ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుని వారిని మోసం చేసినందుకు ఇదంతా నాకు తగినదే జరిగింది అనుకుంటాను. ఇపుడు ఆ బంకు వాళ్ళు ఎవరూ కనపడరు కానీ కనపడితే బావుండు, వాళ్ళ చేతులు పట్టుకుని మన్నించమని ప్రాధేయపోయేవాడినే.
పుస్తకాల చదువు వలన నేను దొంగతనం, మోసం నేర్చుకుంటే నా ప్రెండు బాషా అనేవాడికి పుస్తకాలు వ్యాపారం నేర్పాయి. ఆ రోజుల్లో ఎంత పెద్ద పుస్తకాన్నయినా ఒక దెబ్బకు గంటా రెండు గంటల్లో చదివేసేవాళ్లం. మరి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లొక లెక్క. మా బాషాగాడు ఏం చేసేవాడంటే వాడు ఒక పిల్లల పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకుని చదివేసి , ఒకోసారి చదవకుండా కూడా మాకు అద్దెకు ఇచ్చేవాడు. గంటకు పావలా పుచ్చుకునేవాడు . షాపులో అయితే పుస్తకాన్ని ఒక గంటకు వెనక్కి ఇచ్చినా, ఒక రోజుకు వెనక్కి ఇచ్చినా రూపాయో, రూపాయిన్నరనో కట్టక తప్పదు . బాషగాడి పావలా పథకం హాయిగా ఉండేది. వాడు ఇచ్చినంత మందికి అద్దెకు ఇచ్చి , అద్దె చెల్లించి ఆ పై దర్జాగా మిగిలిన డబ్బులు జేబులో వేసుకునే వాడు.
చిన్న చిన్న బంకుల్లో కుదరదు కానీ, కాస్త పెద్ద షాపుల్లో అయితే పుస్తకాలు చూస్తూన్నట్టుగా నటిస్తూ, షాపు యజమాని తల తిప్పగానే చేతిలో ఉన్న పుస్తకాన్ని చొక్కా ఎత్తి లటుక్కున నిక్కరుకు పొట్టకు మధ్యలో దాచేవాళ్లం. పుస్తకం చదివెయ్యగానే మళ్ళీ వెనక్కి వచ్చి పుస్తకాన్ని ఆ అరల మధ్యనే ఇరికించి వెళ్ళేవాళ్లం. చెప్పుకుంటూ పొతే చాలా సంగతులు ఊరుతూనే ఉంటయి. నిజానికి ఎలా కనుమరుగయ్యాయో, ఎప్పుడు కనుమరుగయ్యాకో కూడా ఊహకు అందడం లేదు ఆ పుస్తకాలని అద్దెకు ఇచ్చే షాపులు.
టెంత్ క్లాస్ లోనా? కాదేమో ! ఇంటర్ మీడియట్ లోనా , లేక డిగ్రీ రోజుల్లోనా? ఏమో గుర్తు లేదు. సినిమా థియేటర్ టికెట్ కౌంటర్ బయట నిలబడ్డంత పెద్ద బారు వరుస కాకపోయినా , అద్దె పుస్తకాల షాపు, బంకుల బయట వరుసలో నాలుగురయిదుగురే ఉన్నా, కొత్త నవల కోసం విపరీతమయిన ఒత్తిడి తోనో , నాలుగురోజులుగా తెగ తిరుగుతున్నా ఇంకా దొరకని అభిమాన రచయితా పుస్తకం ఈరోజైనా దొరుకుతుందా లేదా అనే మనోదౌర్బల్యం తోడుగానో నిలబడి ఉండేవారు పాఠకులు. వట్టి అద్దె పుస్తకాలే కాదు. ఊరి మెయిన్ సెంటర్లలోనూ, సందు చివర, వీధి మలుపులో ప్రతిచోటా దినపత్రికలు, వార పత్రికలూ, పక్షపత్రికలు, పిల్లల పత్రికలూ , పాకెట్ నవల్స్ కనపడుతూనే ఉండేవి, ఈరోజు ఒక దినపత్రిక కోసమో, వార పత్రిక కోసమో కిలోమీటర్లకు కిలో మీటర్లు నడిచినా ఒక్క పుస్తకమూ రోడ్డు మీద కనపడుత లేదంటే అత్యంత సాంస్కృతిక లేమి నడుస్తున్న రోజులవి . ఆరోజుల్లో కథలు, నవలలు, పాటలు , పద్యాలు అనేకాలు పుస్తకాలుగా దొరికేవి. రచయితల ముక్కు మొహంతో అవసరం లేని రోజులవి. రాసిందే భాగ్యం. కంటపడిన అచ్చు కాగితమే వరం. ఈ రోజున వద్దన్నా వీధికొక, సందుకోక, నగరం నాలుగు వైపులా రచయితలూ, కవులు ఊరికూరికే కనపడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సరస్వతి మీద ఒట్టు రచయితల పేర్లు తెలుసు , వారు వ్రాసిన ఒక్క వాక్యం కూడా తెలీదు. రాసేవారు మాత్రమే తెలుస్తున్నారు రచన అందడం లేదు . ఏం రాశారో ఆనవాలు లేదు, చూసిన తనని పోల్చుకుంటే చాలన్నంత అల్పసంతోషి అయిపోయినాడు సృజనకారుడు.
-అన్వర్
Comments
Please login to add a commentAdd a comment