పుస్తకం హస్తభూషణం అన్నారు.చేతిలో ఉండాల్సిన పుస్తకం ‘ఆడియో బుక్స్’ రూపంలో చెవికి చేరువవుతోంది.వ్యక్తిత్వ వికాసం నుంచి కాల్పనిక సాహిత్యం వరకు పుస్తకాలను ‘ఆడియో బుక్స్’ రూపంలో వినడానికి యూత్ ఆసక్తి ప్రదర్శిస్తోంది.
పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉన్న బెంగళూరుకు చెందిన విరజ, పుస్తకాల విలువ గురించి తెలుసుకొని వాటిపై ప్రేమ పెంచుకున్న భోపాల్‌కు చెందిన చైత్రకు పుస్తకాలకు చేరువ కావడానికి ఒకప్పుడు టైమ్ దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం వీరిద్దరికి మాత్రమే కాదు యువతరంలోని ఎంతోమందికి పుస్తకాలు దగ్గర కావడానికి ‘టైమ్’ అనేది సమస్య కావడం లేదు. దీనికి కారణం... ఆడియో బుక్స్.మిలీనియల్స్, జెన్‌జెడ్ జెనరేషన్‌కు ‘ఆడియో బుక్స్’ హాట్ ఫేవరెట్‌గా మారాయి.‘ఒక పుస్తకం చదవడానికి రకరకాల కారణాల వల్ల నెల రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి.
అయితే ఆడియో బుక్స్ వారానికి ఒకటి వినగలుగుతున్నాను. వినడం పూర్తయిన వెంటనే ఆ పుస్తకానికి సంబంధించిన నోట్స్ రాసుకుంటాను’ అంటుంది విరజ.గూగుల్ ప్లేలో ఆడియో బుక్స్ సెక్షన్ ప్రారంభమైన కొత్తలో యువత అంత దగ్గర కాలేదు. అయితే ఇప్పుడు దృశ్యం మారింది. వారి ప్రధానమైన ఆసక్తులలో ‘గూగుల్ ఆడియో బుక్స్’ కూడా ఒకటి.గూగుల్ ప్లేలో డబ్బు చెల్లించే ఆడియో బుక్స్‌తో పాటు చెల్లించనవసరం లేనివి కూడా ఉన్నాయి.‘ఓకే గూగుల్, హూ ఈజ్ అథర్?’ ‘ఓకే గూగుల్, స్టాప్ ప్లేయింగ్ ఇన్ 20 మినిట్స్’...ఇలాంటి కమాండ్స్ గూగుల్ అసిస్టెంట్‌కు ఇవ్వవచ్చు.
గ్లోబల్ ఆడియో బుక్స్ మార్కెట్ లీడర్‌గా ఉన్న ‘ఆడిబుల్’ ఇండియన్ మార్కెట్‌లోకి ప్రవేశించిన తరువాత ఆడియో బుక్స్‌కు ఊపు వచ్చింది. రకరకాల వయసుల వారిని దృష్టిలో పెట్టుకొని ‘ఆడిబుల్ ఇండియా’లో వేలాది ఆడియో బుక్స్‌ను రొమాన్స్, థ్రిల్లర్, ఆధ్మాత్మికం, హారర్, డ్రామా జానర్‌లలో తీసుకువచ్చారు.ఇంగ్లిష్‌తో సహా హిందీ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ... మొదలైన భాషలలో ఆడియో బుక్స్ ఉన్నాయి.‘ఆడియో బుక్స్ సక్సెస్ కావడానికి కారణం మన మూలాల్లోనే ఉంది. చిన్నప్పుడు కథలను వినేవాళ్లం’ అంటుంది ముంబైకి చెందిన స్మిత.
ఒక పుస్తకం విజయాన్ని అంచనా వేసే ప్రమాణాలలో ఆడియో బుక్స్ కూడా చేరాయి. మాతృభాషలో పుస్తకాలు చదవడానికి ఇబ్బంది పడే యువతరానికి ఆడియో బుక్స్ ఆత్మీయనేస్తాలయ్యాయి.‘పాడ్‌కాస్ట్‌తో పాటు ఆడియో బుక్స్‌కు ఆదరణ పెరిగింది’ అంటున్నాడు ‘వన్ బై టు’ మీడియా కో–ఫౌండర్ రాజేష్ తాహిల్.ఫిక్షన్, రొమాన్స్ జానర్స్ కోసం యాపిల్ బుక్ ‘మాడిసన్’ ‘జాక్సన్’ ‘హెలెన్’ అనే డిజిటల్ నేరేటర్‌లను క్రియేట్ చేసింది.యూఎస్, యూరోపియన్ దేశాలలో పబ్లిషర్స్‌కు ఆడియో కంటెంట్ క్రియేట్ చేయడానికి సొంతంగా స్టూడియోలు ఉన్నాయి.
మన దేశంలో అలాంటి పరిస్థితి వచ్చినట్లు లేదు. ఒక ఆడియో బుక్‌కు కనీసం లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.‘స్పాటిఫై’ అనగానే గుర్తుకు వచ్చేది సంగీతం. ఆడియో బుక్స్ ఆదరణను పసిగట్టిన ఈ డిజిటల్ మ్యూజిక్ సర్వీస్ యూఎస్‌తో పాటు నాలుగు దేశాల్లో ఆడియో బుక్ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. మూడు లక్షల ఆడియో బుక్స్‌ను తీసుకువచ్చిన ‘స్పాటిఫై’ యూజర్‌ల కోసం ‘ఆడియో కామెంట్’ తీసుకురానుంది.ఆడియో బుక్ ఇండస్ట్రీ ఊపందుకోవడాన్ని గమనించిన పబ్లిషర్‌లు రానున్న రోజుల్లో ఆడియో బుక్స్ స్పేస్‌ను పెంచాలనుకుంటున్నారు.
క్లాసిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.‘గతంతో పోల్చితే ఆడియో బుక్స్ వినడానికి వెచ్చిస్తున్న టైమ్ పెరిగింది’ అంటున్నాడు ‘స్టోరీ టెల్ ఇండియా’ కంట్రీ మేనేజర్ యోగేష్ దశరథ్.ఆడియో బుక్స్ యూత్‌ను ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం ప్రయాణాలలో, బారెడు క్యూలలో నిలబడిన సందర్భాలలో కూడా వాటిని వినే అవకాశం ఉండడం. కొందరైతే వ్యాయామాలు చేస్తూ కూడా ఆడియో బుక్స్ వింటున్నారు.‘ఆడియో బుక్స్ వల్ల పుస్తకం చదివే దృశ్యం అదృశ్యం కానుందా?’ అనే ప్రశ్నకు ఇంజనీరింగ్ స్టూడెంట్ సౌమ్య మాటల్లో జవాబు దొరుకుతుంది.‘పుస్తకం చదవడం అంటేనే నాకు ఇష్టం. అంతమాత్రాన ఆడియో బుక్స్‌కు దూరం కాలేదు. సమయ సందర్భాలను బట్టి చదవాలా, వినాలా అనేదాన్ని ఎంచుకుంటాను’ అంటుంది సౌమ్య.
ఆడియో బుక్ రీడ్ బై సెలబ్రిటీ
ఆడియో బుక్స్ విజయంలో పుస్తకంలోని కంటెంట్‌తో పాటు నేరేటర్ ప్రతిభ కూడా ఆధారపడి ఉంటుంది. వినే కొద్దీ వినాలనుకునే గొంతులు ఆడియో బుక్స్ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.‘ఆడియో బుక్ రీడ్‌బై సెలబ్రిటీస్’ ధోరణి మన దేశంలోనూ పెరగనుంది. ఆడియో బుక్ రీడింగ్‌లో బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మంచి పేరు తెచ్చుకుంది. వుడీ ఎలెన్ ‘కౌంట్ డ్రాకులా’తో పాటు ఎన్నో పుస్తకాలు ఆమె స్వరంలో యువత మంత్రముగ్ధులై విన్నారు.
Comments
Please login to add a commentAdd a comment