‘శ్రవణ’ మేఘాలు | Sakshi Editorial On Audio Books | Sakshi
Sakshi News home page

‘శ్రవణ’ మేఘాలు

Published Mon, Sep 27 2021 12:14 AM | Last Updated on Mon, Sep 27 2021 7:53 AM

Sakshi Editorial On Audio Books

చదవడం ఏకాంత అనుభవం. వినడం సామూహిక అనుభవం.  పాతకాలంలో ఏ గ్రామపెద్దో మర్రిచెట్టు నీడన ప్రపంచ ధోరణిని వైనవైనాలుగా వివరించే వాడు. ఏ పెద్దతాతో చలిమంట కాచుకుంటూ జీవిత అనుభవసారాన్ని పంచేవాడు. వెన్నెల వాకిళ్లలో నులకమంచాల మీద మేను వాల్చిన నాన్నమ్మలు పిల్లలకు కథల మీద కథలు చెప్పేవారు. పూర్వీకులు తాము తెచ్చిన వేటను విందుకు సిద్ధం చేస్తూ, తమ ప్రాచీనుల వీరోచిత గాథలను ఆ మాంసంతో పాటు నంజుకునేవారు. మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యానికి ఈ వినడం అనే సంబం«ధం ఒక కందెనగా పనికొచ్చేది. ఇవే కథలు, గాథలు రకరకాల కళారూపాలుగా మారి, వాటిని ప్రత్యేకించి చక్కటి గొంతుతో, ఆకట్టుకునే హావభావాలతో ప్రదర్శించే కళాకారులు వచ్చారు. దాంతో వినడం ఒక పరిమిత సమూహ అనుభవ పరిధిని దాటింది.

కాలం మారింది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. అక్షరం పుస్తకాల దొంతరలుగా ఆకాశం ఎత్తు పెరిగింది. ఒక మనిషి గొంతును సజీవంగా ఒక యంత్రంలో బంధించడాన్ని లోకం చెవులొగ్గి విన్నది. పదిహేనో శతాబ్దంలో జర్మనీకి చెందిన జాన్‌ గూటెన్‌బెర్గ్‌ అచ్చుయంత్రాన్ని రూపొందించాడు. పంతొమ్మిదో శతాబ్దపు చివరలో ఇటలీకి చెందిన మార్కోనీ రేడియోకు తుదిరూప మిచ్చాడు. మనిషి అంతటితో ఆగలేదు. వినడం పోయింది. చూడటం వచ్చింది. అమెరికాలో టీవీ వచ్చిన కొత్తలో ఈ సుఖకరంగా వినే అవకాశమున్న రేడియోను కాదని, దానికే ముఖం అప్పగించాల్సిన టీవీని ఎవరు చూస్తారని విసుక్కున్నారట అప్పటి పెద్దవాళ్లు.

అయినా అది రావడమే కాదు, ప్రపంచమంతటా అలవాటైపోయింది. అక్షరాన్ని, వినడాన్ని మింగేసింది. పెరిగిన సాంకేతికత ఒక్కోసారి ముందుకు వెళ్లడం కోసం, వెనక్కి కూడా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో దృశ్యం పనికి రాదు. వంట చేస్తూ గరిట తిప్పుతున్నప్పుడు చూపు ఒక్కచోటే నిలపమంటే కుదరదు. ఒంటరిగా నడుస్తున్నప్పుడు తోడు కాగలిగేది అజ్ఞాత గొంతుకే. కళ్లు మూసుకుని, మగతగా ఒక అనుభవంలోకి, ఒక అనుభూతిలోకి మేలుకోవాలంటే దృశ్యం పనికిరాదు; శ్రవణమే కావాలి.

అంధులకు ఏ ఇబ్బందీ కలగకుండా ఉండేందుకుగానూ వాళ్లకోసం మాట్లాడే పుస్తకాలను(ఫోనోగ్రాఫిక్‌ బుక్స్‌) సంకల్పించాడు థామస్‌ ఆల్వా ఎడిసన్‌ 1877లో. కానీ 1952లో న్యూయార్క్‌ కేంద్రంగా గల క్యాడ్‌మాన్‌ రికార్డ్స్‌ వాళ్లు కవి డైలాన్‌ థామస్‌ కవితలను ఆయన గొంతులోనే చదివించి అమ్మకాలను చేపట్టడంతో ‘ఆడియో బుక్స్‌’ అనే భావనకు బీజం పడింది. దీంతో చదవడం అనే ప్రక్రియ, వినడం అనే కొత్త రూపంలో జరగడం ప్రారంభమైంది. చెట్టుమీది కాయను, సముద్రంలోని ఉప్పును ఎట్లా కలిపింది సృష్టి! అక్షరాన్నీ, శ్రవణాన్నీ ఎలా ముడివేసింది సాంకేతిక పరిజ్ఞానం! మరి ఆ మేఘాలు అంతటికీ వ్యాపించకుండా ఉంటాయా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆడియో బుక్‌ మార్కెట్‌ పరిధిని 2019లో 2.67 బిలియన్‌ డాలర్లుగా అంచనావేశారు. ఇది ప్రతి సంవత్సరం రెండంకెల వృద్ధిని సాధిస్తోందని తేల్చారు.

మన తెలుగు వరకే తీసుకుంటే– శ్రీశ్రీ గొంతులోనే తన కవితలను చదివించిన గూటాల కృష్ణమూర్తి ప్రయత్నం; తన కథలను నేరుగా ఆడియో రూపంలోనే విడుదల చేసిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఉత్సాహం; తమ రచనలను యూట్యూబ్‌లో వినిపిస్తున్న కొందరి ఆరాటం లాంటివి విడివిడి సంఘటనలు. కానీ ఐదేళ్ల క్రితం విశ్రాంత ప్రభుత్వోద్యోగి కొండూరు తులసీదాస్‌ సరదాగా చదువుతూ రికార్డు చేస్తూ పోయిన ‘దాసుభాషితం’ ఇప్పుడు వందలాది టైటిళ్లు, వెయ్యికి పైగా గంటల నిడివి కలిగివుంది. పుస్తకాన్ని చదవమని చేతికిస్తే– చదివే తీరిక లేని కొడుకు తనకోసం చదివి వినిపించమన్నందుకు మొదలైన ఈ తండ్రి ప్రయత్నం ‘తెలుగు సంగీత, సాహిత్య, కళల శ్రవణ భాండాగారం’గా రూపుదిద్దుకుంది.

అయితే స్వీడన్‌కు చెందిన ఆడియో స్ట్రీమింగ్‌ కంపెనీ ‘స్టోరీటెల్‌’ నాలుగేళ్లుగా భారతదేశంలో మౌఖిక సంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లిషు, మరాఠీ, హిందీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ, గుజరాతీ, తమిళం, మలయాళంతో పాటు ఇప్పుడు తెలుగు పుస్తకాలు కూడా ఇందులో ఆడియోలుగా రికార్డు అవుతున్నాయి. పాపులర్‌ సాహిత్యం నుంచి ప్రజా సాహిత్యం దాకా; ఏనుగుల వీరాస్వామయ్య నుంచి ఏకాంత ద్వీపంగా బతికే రచయిత దాకా; స్వయంగా రాసేవారి గొంతుల్లోనూ, గొంతే పెట్టుబడిగా కలిగిన కళాకారుల ద్వారానూ రికార్డ్‌ అవుతున్నాయి. కనీసం ఐదు లక్షల టైటిల్స్‌ ఇందులో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌ దిగ్గజం అమెజాన్‌ కూడా ‘ఆడిబుల్‌’ పేరుతో ఈ ఆడియో బుక్స్‌ రంగంలోకి వచ్చినా ప్రస్తుతం ఇంగ్లి్లష్, హిందీకే పరిమితమైంది.

చదవలేకపోవడం ఒక సమస్య అయితే, రకరకాల కారణాల వల్ల చదవడం అనే ప్రక్రియ మీద ఆసక్తి కోల్పోవడం ఇంకో సమస్య. ఈ రెండు కోవల మనుషులకూ ఈ కొత్త విప్లవం గొప్ప తోడు. చదవడంలో ఉత్సాహం పోతే గనక వినడం ద్వారా దాన్ని తిరిగి ఉత్సవం చేసుకోవచ్చు. అన్ని లైట్లూ ఆపేసుకుని, ఆ గొంతును అనుసరించడంలో ఏర్పడే దృశ్యాలను ఆ చీకట్లో సృజించుకోవడం ఒక పద్ధతి; ఇంటిల్లిపాదీ దగ్గరగా కూర్చుని వింటూ, ఒకే అనుభూతి మిగిలినవాళ్ల ముఖాల్లో ఎలా ప్రతిఫలిస్తున్నదో చూస్తూ ఆనందించడం రెండో పద్ధతి. అటు ఏకాంత అనుభవంగానూ, ఇటు సమూహ అనుభవంగానూ ఆనందించగల అవకాశం మనకు ఇప్పుడు ఉన్నది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement