ఇంతకు ‘పాడ్‌క్యాస్ట్‌’ అంటే ఏమిటీ? | Surge In The Popularity Of Podcasts | Sakshi
Sakshi News home page

‘పాడ్‌క్యాస్ట్‌’లకు పెరుగుతున్న ఆదరణ’

Published Thu, Jan 2 2020 8:21 AM | Last Updated on Thu, Jan 2 2020 10:21 AM

Surge In The Popularity Of Podcasts - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నేటి ఆధునిక సాంకేతిక రంగంలో వీడియో, ఆడియోలు విజ్ఞానంతోపాటు వినోదం ఇచ్చే అద్భుత అంశాలుగా మారిన విషయం తెల్సిందే. అందుకే ఈ రెండింటిని తోబుట్టువులుగా అభివర్ణిస్తారు. ముందుండి వీడియో రంగం దారి చూపుతుంటే వెనకాల వెన్నంటి ఆడియో రంగం అనుసరిస్తోంది. ఇంటర్నెట్‌ మందగమనం వల్ల కూడా అప్పుడప్పుడు ఆడియోకు అదృష్టం కలిసొస్తోంది. ఆడియో సంగీతం అలా అభివృద్ధిలోకి వచ్చిన విషయం తెల్సిందే. 

స్టాక్‌హోమ్‌ కేంద్రంగా పనిచేస్తోన్న ఓ కంపెనీ సంగీతం అందించేందుకు ‘స్పాటిఫై’ యాప్‌ను గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టగా, దానికి పోటీగా మూడు వారాల్లోనే ‘యూట్యూబ్‌ మ్యూజిక్‌’ భారత్‌లో ప్రవేశించింది. అప్పటికే రంగప్రవేశం చేసిన ఆపిల్, అమెజాన్‌ మ్యూజిక్, గానా, జియోసావన్, హంగామా యాప్‌ల మధ్య పోటీ తీవ్రమైంది. సరిగ్గా ఈ సమయంలోనే ‘పాడ్‌క్యాస్ట్‌’ ఆడియో విభాగానికి ఆదరణ పెరిగుతూ వచ్చింది. ప్రస్తుతం దేశంలో 50 కోట్ల మంది ఇంటర్నెట్‌ యూజర్లు ఉండగా, కేవలం నాలుగు కోట్లమందే పాడ్‌క్యాస్ట్‌ శ్రోతలు ఉన్నారు. అయినా ఇది మంచి పెరుగుదలగానే చెప్పవచ్చు. ఒక్క 2018లోనే ఈ రంగం 60 శాతం వృద్ధి రేటును సాధించింది. 

ఇంతకు ‘పాడ్‌క్యాస్ట్‌’ అంటే ఏమిటీ?
ఐప్యాడ్‌ ప్లస్‌ బ్రాడ్‌క్యాస్ట్‌ కలిపి ‘పాడ్‌క్యాస్ట్‌’ను సృష్టించారు. ఐప్యాడ్లను రూపొందించిన ఆపిల్‌ కంపెనీ దీనిపై పేటెంట్‌ను కోరకపోవడంతో పలు కంపెనీలు, వ్యక్తులు ‘పాడ్‌క్యాస్ట్‌’ పదాన్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ఐప్యాడ్‌ను గుర్తుచేయడం ఇష్టంలేని వారు మాత్రం వీటిని ‘నెట్‌క్యాస్ట్‌’ అని వ్యవహరిస్తున్నారు. తొలుత డిజిటల్‌ ఆడియో ఫైల్స్‌తో మాత్రమే ఇవి మార్కెట్‌లోకి వచ్చాయి. కంపెనీల నుంచే కాకుండా ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తి లేదా యూజర్‌ ‘పాడ్‌క్యాస్ట్‌’ ద్వారా సమాచారాన్ని షేర్‌ చేసుకొనే అదనపు సౌకర్యం ఉంది. సైన్స్, సాంకేతిక రంగాలతోపాటు రాజకీయాల నుంచి సాంస్కృతిక, కళారంగాల వరకు, విజ్ఞానం నుంచి వినోదం వరకు సకల రంగాలకు చెందిన సమాచారాన్ని ‘పాడ్‌క్యాస్ట్‌’ ద్వారా గ్రహించవచ్చు. అంటే ఆయా రంగాలకు చెందిన సమాచారాన్ని ఇంతకు ముందు వ్యక్తులు, ఇప్పుడు వ్యక్తుల బృందం అందజేస్తోంది.
 

వీటిని ప్రసారం చేయడానికి ‘యాంకర్‌’పాటు పలు యాప్‌లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్, యాపిల్‌ కంపెనీలు రూపొందిస్తున్న ‘పాడ్‌క్యాస్ట్‌’లను యాంకర్‌ యాప్‌ ద్వారానే ప్రసారం అవుతున్నాయి. 2004 సంవత్సరం నాటికి ఇంగ్లీషులో కొన్ని పాడ్‌క్యాస్ట్‌లే ఇంటర్నెట్‌లో అందుబాటులోకి రాగా, నేడు లక్షా యాభై వేల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇతర భాషలకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. ఇప్పుడు వీడియో పాడ్‌క్యాస్ట్‌లను ‘యూప్‌ట్యూబ్‌’ ప్రసారం చేస్తోంది. వీటిని నెట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొని ఆఫ్‌లైన్‌లో ఇష్టం ఉన్నప్పుడు చూసే అవకాశం కూడా ఉంది. నచ్చే పాడ్‌క్యాస్ట్‌లను ముందుగానే ఎంపిక చేసుకుంటే ఆటోమేటిక్‌గా కూడా డౌన్‌లోడ్‌ అవుతాయి.
డబ్బులు కూడా వస్తాయి ?
మనుషుల అభిరుచులకు తగ్గట్టుగా విజ్ఞానం, వినోదాన్ని పంచడంతోపాటు వివిధ భాషలు, సంగీతాన్ని నేర్పే ‘పాడ్‌క్యాస్ట్‌’లు కూడా నేడు అందుబాటులోకి వచ్చాయి. కమేడియన్లకు కూడా ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రైవేటు రేడియో కంపెనీలు కూడా ఇప్పుడు ఈ రంగంలో పోటీ పడుతున్నాయి. వీటికి శ్రోతలు లేదా వీక్షకులు సబ్‌స్క్రైబ్‌ చేయాల్సి ఉంటుంది. సబ్‌స్క్రైబ్‌లనుబట్టి పాడ్‌క్యాస్ట్‌ నిర్మాతలకు యాడ్స్‌ రూపంలో డబ్బులు వస్తాయి. వాటిల్లో 30 శాతం రెవెన్యూను నేడు వాటి ‘ప్రసార మాద్యమాలే’ లాగేసుకుంటున్నాయి. పాడ్‌క్యాస్ట్‌ల ద్వారా యాంకర్లు కూడా సెలబ్రిటీలుగా మారుతున్నారు. సంగీతాన్ని అందించే ‘స్పాటిఫై’ ఈ రంగంలోకి ప్రవేశించి ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ పాడ్‌క్యాస్ట్‌ను ప్రసారం చేయడంతో దాని యాంకర్లయిన ఆస్థా, అంకిత్‌లు సెలబ్రిటీలుగా మారిపోయారు. వారికి సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ఫాలోయింగ్‌ కూడా పెరిగింది. ‘ఓయో గదుల్లో సెక్స్‌ సురక్షితమా, కాదా ?’ లాంటి ప్రశ్నలే ఎక్కువగా వారికి వస్తుంటాయి. అది వేరే విషయం.

కరన్‌ జోహర్, కరీనాకపూర్‌ అతిథేయులుగా విడుదల చేసిన పాడ్‌క్యాస్ట్‌లకు మంచి ఆదరణ ఉంది. కంపెనీల పరంగా ఆపిల్‌ కంపెనీ విడుదల చేస్తోన్న పాడ్‌క్యాస్ట్‌లకు 30 నుంచి 35 శాతం ఆదరణ ఉండగా, క్యాస్ట్‌బాక్స్‌ కంపెనీకి పది నుంచి పన్నెండు శాతం ప్రజాదరణ ఉంది. వీటిని వింటున్న, వీక్షిస్తున్న వారంతా 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులే. వీటిద్వారా వ్యక్తిగత టాలెంట్లు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ రంగంలో ముందుండాల్సిన మీడియానే వెనకబడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement