ప్రొఫెసర్ రమా మెల్కోటే
సాక్షి, హైదరాబాద్ : ‘మహిళలపై హింస పెరిగింది. అనేక రకాల హింసలను ఎదుర్కొంటున్నారు. ఏటా గృహ హింస కేసులు వందల్లో నమోదవుతున్నాయి. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ హింస గురించి మాట్లాడడం లేదు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా’.. ప్రముఖ మహిళా హక్కుల నేత, రాజనీతిశాస్త్ర అధ్యాపకులు, ప్రొసర్‌ఫె రమా మెల్కోటే ఆవేదన ఇది.
అనేక దశాబ్దాలుగా మహిళల సమస్యలపై పోరాడే సంస్థలతో కలిసి పనిచేస్తున్నారామె. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీల భాగస్వామిగా నిలిచారు. కానీ ఏ ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు మహిళల పక్షాన మాట్లాడకపోవడం పట్ల ప్రొఫెసర్ రమా మెల్కోటే విస్మయం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హింస, లైంగిక దోపిడీ పెరిగాయని, అయినా రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో మహిళల సమస్యలు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
అల్వాల్‌లో నిన్న ఆరేళ్ల పసిపాపను దుర్మార్గులు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపారు. 48 గంటలు గడిచాయి.. కానీ ఏ రాజకీయ పార్టీ గొంతు విప్పలేదు. బాధిత కుటుంబాన్ని ఓదార్చిన దాఖలా లేదు. స్థానిక ప్రజలు, స్కూల్ పిల్లలు ఆందోళన చేశారు. కానీ నాయకులు, పార్టీలు మాత్రం ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. మహిళలపైనా, పిల్లలపైన జరుగుతున్న హింసను గురించి ఏ పార్టీ పట్టించుకోవడం లేదనేందుకు ఇంతకంటే నిదర్శనం మరేముంటుంది. మహిళలపై గృహహింస పెరిగింది. ఇంట్లోకి, బయటకు పెద్దగా తేడా లేదు. లైంగిక దాడులు నిత్యకృత్యంగా మారాయి.
అత్యంత అమానవీయమైన పద్ధతిలో పరువు హత్యలు జరుగుతున్నాయి. ఒకచోట కన్న కూతుళ్లనే కిరాతకంగా హతమార్చే తండ్రులు ఉంటే, మరో చోట అగ్రకుల అహంకారంతో హత్యలు చేస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి గూడూరులో ఇలాంటి హత్యలే జరిగాయి. మహిళలపై ఎక్కడ ఏ రూపంలో హింస జరిగినా మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు మాత్రమే మాట్లాడుతున్నాయి.. ఆందోళనలు చేస్తున్నాయి. మహిళా సంఘాల పోరాటాలే జరుగుతున్నాయి. కానీ ఏ రాజకీయ పార్టీలైనా మహిళా హింసకు వ్యతి రేకంగా పోరాడుతున్నాయా..? మహిళలకు సంబంధించిన అంశాల పట్ల ఇంచుమించు అన్ని పార్టీలు ఒకే తాను ముక్కల్లా వ్యవహరిస్తున్నాయి. ఇది చాలా దారుణం.
దరిద్రపు రాజకీయాలు ఇవి..
రాజకీయ పార్టీలు, నాయకుల వైఖరులు పూర్తిగా డబ్బు చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. రాజకీయాలను వ్యాపారంగా మార్చు కుంటున్నారు. పెట్టుబడులు పెట్టి లాభాలను రాబట్టుకుంటున్నారు. డబ్బులు, మద్యం ఏరులై పారిస్తున్నారు. ఎక్కడా రవ్వంత విలువలకు స్థానం లేదు. చాలా దరిద్రపు రాజకీయాలు ఇవి. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియదు. తిరిగి మరే పార్టీకి మారుతారో తెలియదు. ఓటేసి గెలిపించిన ప్రజలను అవమానిస్తున్నారు. దీర్ఘకాలికమైన సమస్యల పట్ల ఒక దృక్పథం లేదు.
ఒకప్పుడు రాజకీయ నాయకులు తమ పార్టీల ఆలోచనలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు. తాము నమ్మిన విలువలను ఆచరించారు. అక్రమార్జనే ధ్యేయంగా పార్టీలు మారడాన్ని ఎంతో అవమానంగాభావించారు. కానీ ఇప్పుడు.. ఎలాంటి విలువలు ఎక్కడా లేవు.. చాలా హాస్యాస్పదంగా ఉంది. వీళ్లా రాజకీయ నాయకులు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ల గురించి ఏం మాట్లాడగలం’ అంటూ ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment