womens problems
-
ఆడపడుచులకు చేయూత
సాక్షి, బాపట్ల : తరాలు మారినా.. తలరాతలు మారని పరిస్థితి వారిది. బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సుమారు 1.20 లక్షల మంది ఉన్నారు. వీరంతా రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు తెల్లవారుజామున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయేంతవరకు ఆయా కులవృత్తుల్లో నిమగ్నమైన జీవనాన్ని గడుపుతూ జీవిస్తుంటారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. పాలకులు ఎందరొచ్చినా వీరి జీవనస్థితిలో మాత్రం ఎదుగుబొదుగు లేకుండా పోతుంది. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు నిజజీవితంలో మాత్రం వాటిని ఎక్కడా కూడా అమలు చేస్తున్న దాఖలాలు కనుచూపుమేరల్లో కనిపించడం లేదు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను కేవలం ఓటు బ్యాంకింగ్ కోసమే ఉపయోగించుకునే టీడీపీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పేదల అభ్యున్నతి కోసం మేము కట్టుబడి ఉన్నాం.. పేదలకు అన్నివిధాల అండగా ఉంటామంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఐదేళ్లు గడిచేంతవరకు ఏ నాడు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఆలోచించలేదు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద 45 ఏళ్లకే పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని, నాలుగేళ్లలో మహిళలకు రూ.75 వేలు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తానని ప్రకటించడంతో మహిళాలోకం ఆనందంగా ఉంది. కష్టపడినా ఫలితం శూన్యం ఏళ్ల తరబడి బుట్టల అల్లికే ప్రధాన వృత్తిగా చేసుకుంటూ జీవిస్తున్న నిరుపేదలు ప్రస్తుతం మార్కెట్లో విరివిగా ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల విక్రయాల వల్ల పూట గడవని స్థితిలో ఆకలి కేకలతో ఆలమటిస్తున్నారు. ఇలాంటి సమయంలో వాళ్లను ఆదుకోవాల్సిన పాలకులు, అధికారులు కనీసం ఆదిశగా ఆలోచించకపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్డాడుతున్నారు. బాపట్ల మండలంలోని కనకాద్రినగర్, కర్లపాలెం మండలంలోని ఎస్టీకాలనీ, పిట్టలవానిపాలెం మండలంలోని కాలువకట్టపై జీవనం సాగించే ఎస్టీలు పదేళ్లుగా జీవనం సాగిస్తున్న ఎస్టీలకు వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి బుట్టల అల్లిక. వీరంతా సూర్యలంక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈత చెట్లను పాడుకొని ఈత సువ్వలను కోస్తారు. కోసిన ఈత సువ్వలను 15 రోజులు ఎండిన తర్వాత వాటిని ఇంటికి చేర్చుకుని బుట్టల అల్లిక ప్రారంభిస్తారు. రోజంతా భార్య, భర్త కలిసి 4 బుట్టలు మాత్రమే అల్లుతారు. వాటిని మార్కెట్లో విక్రయిస్తే రూ. 120 నుంచి 150 వరకు వస్తాయి. వాటితోనే కుటుంబం మొత్తం పోషించుకోవాలి. గతంలో ఏ గ్రామానికి బుట్టలు తీసుకెళ్లినా వెంటనే కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం ప్లాస్టిక్ వస్తువులు విరివిగా వాడుకలోకి రావడంతో ఈత సువ్వలతో తయారుచేసిన బుట్టలను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకురావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదుగు బొదుగు లేని బీసీ బతుకులు ఇదిలా ఉండగా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తాం. ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామంటూ ఇచ్చిన హామీలను మరిచారు. కనీసం 120 పైగా కులాలు ఉన్న బీసీల అభ్యున్నతి గురించి ఏనాడు ఆలోచించిన దాఖలాలు లేవు. బీసీల్లో ప్రధాన కులాలు అయిన యాదవులు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రేంతవరకు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కనీసం వారికి సబ్సిడీపై గొర్రెలను అందించిన దాఖలాలు లేవు. అదేవిధంగా గౌడ కులస్తులకు ఏళ్ల తరబడి కల్లుగీతనే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. వారి జీవితాల్లో కూడా అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగానే మారింది. నాయీబ్రహ్మణులు, రజకులు, వడ్డెర, పద్మశాలీలు, విశ్వబ్రహ్మణులు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు ఏం చేయని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆదరణ పథకం అంటూ మరోసారి బీసీలను మోసగించే ప్రయత్నానికి తెరలేపారు. పేదలకు మేలు చేసే పథకం వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పేదలు ఆర్థికంగా చేయూత అందుతుంది. కనీసం పూటగడవని నిరుపేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని నిరుపేదలకు 45 సంవత్సరాలకే పింఛన్ సౌకర్యం కల్పించేవిధంగా హామీ ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయం. దేశ చరిత్రలో మరెవ్వరూ ఇవ్వనటువంటి హామిను ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేశారు. ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడనే నమ్మకం ఉంది. -నర్రా ధనలక్ష్మి, మంతెనవారిపాలెం మహిళలకు ఆర్థిక భరోసా వైఎస్సార్ చేయూత పథకం మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చే పథకం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. పేద, బడుగు, బలహీన వర్గాల్లోని మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ అందించే విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం. -మద్దికర ఝాన్సీలక్ష్మి, భవనంవారిపాలెం -
రాజకీయాల్లో విలువలెక్కడ?
సాక్షి, హైదరాబాద్ : ‘మహిళలపై హింస పెరిగింది. అనేక రకాల హింసలను ఎదుర్కొంటున్నారు. ఏటా గృహ హింస కేసులు వందల్లో నమోదవుతున్నాయి. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ హింస గురించి మాట్లాడడం లేదు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా’.. ప్రముఖ మహిళా హక్కుల నేత, రాజనీతిశాస్త్ర అధ్యాపకులు, ప్రొసర్ఫె రమా మెల్కోటే ఆవేదన ఇది. అనేక దశాబ్దాలుగా మహిళల సమస్యలపై పోరాడే సంస్థలతో కలిసి పనిచేస్తున్నారామె. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీల భాగస్వామిగా నిలిచారు. కానీ ఏ ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు మహిళల పక్షాన మాట్లాడకపోవడం పట్ల ప్రొఫెసర్ రమా మెల్కోటే విస్మయం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హింస, లైంగిక దోపిడీ పెరిగాయని, అయినా రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో మహిళల సమస్యలు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అల్వాల్‌లో నిన్న ఆరేళ్ల పసిపాపను దుర్మార్గులు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపారు. 48 గంటలు గడిచాయి.. కానీ ఏ రాజకీయ పార్టీ గొంతు విప్పలేదు. బాధిత కుటుంబాన్ని ఓదార్చిన దాఖలా లేదు. స్థానిక ప్రజలు, స్కూల్ పిల్లలు ఆందోళన చేశారు. కానీ నాయకులు, పార్టీలు మాత్రం ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. మహిళలపైనా, పిల్లలపైన జరుగుతున్న హింసను గురించి ఏ పార్టీ పట్టించుకోవడం లేదనేందుకు ఇంతకంటే నిదర్శనం మరేముంటుంది. మహిళలపై గృహహింస పెరిగింది. ఇంట్లోకి, బయటకు పెద్దగా తేడా లేదు. లైంగిక దాడులు నిత్యకృత్యంగా మారాయి. అత్యంత అమానవీయమైన పద్ధతిలో పరువు హత్యలు జరుగుతున్నాయి. ఒకచోట కన్న కూతుళ్లనే కిరాతకంగా హతమార్చే తండ్రులు ఉంటే, మరో చోట అగ్రకుల అహంకారంతో హత్యలు చేస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి గూడూరులో ఇలాంటి హత్యలే జరిగాయి. మహిళలపై ఎక్కడ ఏ రూపంలో హింస జరిగినా మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు మాత్రమే మాట్లాడుతున్నాయి.. ఆందోళనలు చేస్తున్నాయి. మహిళా సంఘాల పోరాటాలే జరుగుతున్నాయి. కానీ ఏ రాజకీయ పార్టీలైనా మహిళా హింసకు వ్యతి రేకంగా పోరాడుతున్నాయా..? మహిళలకు సంబంధించిన అంశాల పట్ల ఇంచుమించు అన్ని పార్టీలు ఒకే తాను ముక్కల్లా వ్యవహరిస్తున్నాయి. ఇది చాలా దారుణం. దరిద్రపు రాజకీయాలు ఇవి.. రాజకీయ పార్టీలు, నాయకుల వైఖరులు పూర్తిగా డబ్బు చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. రాజకీయాలను వ్యాపారంగా మార్చు కుంటున్నారు. పెట్టుబడులు పెట్టి లాభాలను రాబట్టుకుంటున్నారు. డబ్బులు, మద్యం ఏరులై పారిస్తున్నారు. ఎక్కడా రవ్వంత విలువలకు స్థానం లేదు. చాలా దరిద్రపు రాజకీయాలు ఇవి. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియదు. తిరిగి మరే పార్టీకి మారుతారో తెలియదు. ఓటేసి గెలిపించిన ప్రజలను అవమానిస్తున్నారు. దీర్ఘకాలికమైన సమస్యల పట్ల ఒక దృక్పథం లేదు. ఒకప్పుడు రాజకీయ నాయకులు తమ పార్టీల ఆలోచనలకు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు. తాము నమ్మిన విలువలను ఆచరించారు. అక్రమార్జనే ధ్యేయంగా పార్టీలు మారడాన్ని ఎంతో అవమానంగాభావించారు. కానీ ఇప్పుడు.. ఎలాంటి విలువలు ఎక్కడా లేవు.. చాలా హాస్యాస్పదంగా ఉంది. వీళ్లా రాజకీయ నాయకులు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ల గురించి ఏం మాట్లాడగలం’ అంటూ ముగించారు. -
పింఛన్ల పండుగ.. ప్రాణం మీదకొచ్చింది
ఒంగోలు టౌన్/కంభం: పండుగ పింఛన్‌దారుల ప్రాణం మీదకు వచ్చింది. ఇప్పటివరకు అందుకుంటున్న పింఛన్ల మొత్తాన్ని పెంచిన ప్రభుత్వం వారి ఇళ్ల వద్ద ఇవ్వకుండా అందరినీ ఒకచోటకు రప్పించి పండుగ పేరుతో ఇవ్వాలన్న ప్రయత్నం లబ్ధిదారుల ప్రాణం మీదకు తెచ్చిపెట్టింది. ఇప్పటివరకు ఇళ్ల వద్ద ప్రశాంతంగా అందుకుంటున్న పింఛన్లను గుంపులు గుంపులుగా ఒక్కచోట చేర్చారు. ఒంగోలు మినీ స్టేడియం వద్దకు పిలిపించిన యంత్రాంగం అక్కడ ప్రసంగాలు జరిగేలోపు పండుటాకులు నీరసపడిపోయారు. కొందరు పింఛన్ల పెంపు మొత్తాన్ని అందుకోకుండానే స్పృహ తప్పి పడిపోయి ఆస్పత్రి పాలయ్యారు. ఒక వృద్ధురాలు తలకు గాయం కూడా అయింది. ఇవేమీ పట్టించుకోని యంత్రాంగం వరుసపెట్టి ప్రసంగాలు చేసుకుంటూ వెళుతూ పింఛన్‌దారులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను వారిపాటికి వారిని వదిలేశారు. దీంతో అనేకమంది పింఛన్‌దారుల్లో తాము రెట్టింపు పింఛన్ పొందామన్న ఆనందం కంటే ప్రాణాలమీదకు తెచ్చుకున్నామన్న ఆవేదనే కనిపించింది. జన జాతర.. సామాజిక భద్రతా పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. వృద్దాప్య, వితంతు, దివ్యాంగులతోపాటు ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, హిజ్రాలందరినీ ఒకేచోటకు తీసుకువచ్చి వారికి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో పొదుపు గ్రూపు మహిళలకు పసుపు, కుంకుమ కింద ప్రతి గ్రూపు సభ్యురాలుకు పదివేల రూపాయల చొప్పున దశలవారీగా ఇస్తామని ప్రకటించి వారిని కూడా ఒకేచోటకు తరలించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒంగోలు నగర పాలక సంస్థ పింఛన్‌దారులను, మెప్మా పొదుపు గ్రూపు సభ్యులను తరలించే బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. శనివారం నుండి సోమవారం వరకు పింఛన్లు, పొదుపు గ్రూపు మహిళలకు నగదును అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలిరోజైన శనివారం 1æ నుంచి 16 డివిజన్ల వరకు పింఛన్లు, పొదుపు గ్రూపు మహిళలను మినీ స్టేడియంకు తరలించారు. ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేశారు. డివిజన్ కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పింఛన్‌దారులు, పొదుపు గ్రూపు మహిళల తరలింపు కార్యక్రమం చేపట్టారు. ఉదయం ఎనిమిది గంటలకే పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు మినీ స్టేడియంకు వచ్చారు. ముఖ్యమంత్రి సభను తలపించే విధంగా మినీ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. అంతా గందరగోళం.. పింఛన్ల కోసం వేలాదిగా మినీ స్టేడియానికి చేరుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌కు సంబంధించిన వ్యక్తిగత ప్రచార ఫెక్సీలే అధికంగా ఉన్నాయి. ప్రాంగణమంతా మహిళలతో నిండి ఉండటంతో ఎవరు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. వారిని సరిగా గైడ్ చేసేవారు లేకపోవడంతో బారికేడ్లకు అటూ ఇటూ తిరగడానికి ఎక్కువ సమయం పట్టింది. చివరకు తమకు కేటాయించిన కౌంటర్ల వద్దకు వెళ్లేసరికి అక్కడ గుంపులు గుంపులుగా ఉండటంతో ఆ రద్దీని తట్టుకోవడం అనేక మందికి ఇబ్బంది కలిగించింది. ముఖ్యంగా పింఛన్ల కోసం వచ్చిన వారిలో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్పృహ తప్పి తలకు గాయమై.. ముక్తినూతలపాడుకు చెందిన మాణిక్యమ్మ వృద్ధాప్య పింఛన్ తీసుకునేందుకు వచ్చింది. ఉదయం తొమ్మిది గంటలకల్లా ఒంగోలు మినీ స్టేడియానికి చేరుకొంది. పింఛన్ తీసుకునేందుకు అటూ ఇటూ తిరగడంతో స్పృహ తప్పి పడిపోయింది. చివరకు తలకు గాయమైంది. 108వాహనంలో రిమ్స్‌కు పింఛన్లు పొందేందుకు వచ్చిన వారిలో కొంతమంది వృద్ధులు స్పృహ తప్పి పడిపోయారు. అక్కడ వైద్య బృందానికి ఈ సమాచారం చేరవేయడంతో హుటాహుటిన 108ను రప్పించి రిమ్స్‌కు తరలించారు. కాపు కళ్యాణ మండపం వద్ద నివసిస్తున్న దానమ్మ, ముక్తినూతలపాడుకు చెందిన వరికూటి వెంకాయమ్మ, గోపాలనగర్‌కు చెందిన సుబ్బరావమ్మలు స్పృహ తప్పి కింద పడటంతో వారిని రిమ్స్‌కు తరలించారు. ‘భోజన’ పాట్లు పింఛన్లు పొందేందుకు, పసుపు కుంకుమ కింద నగదు తీసుకునేందుకు వేలాది మంది మహిళలు మినీ స్టేడియం వద్దకు చేరుకున్నారు. అయితే వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసినట్లు నగర పాలక సంస్థ కమీషనర్ ప్రకటించారు. మినీ స్టేడియం పక్కనే ఉన్న స్థలంలో షామియానాలు ఏర్పాటుచేసి భోజనాలు పెట్టారు. వందలాది మంది రావడంతో భోజనాలకు ఇబ్బంది పడ్డారు. చివరకు భోజనం ప్లేట్ల కోసం ఎగబడాల్సిన దుస్థితి నెలకొంది. చివర్లో వచ్చిన వారికి పెరుగుతో సరిపుచ్చారు. ఎన్సీసీ క్యాడెట్లు, నర్సింగ్ స్టూడెంట్లను ఈ కార్యక్రమానికి వినియోగించుకున్నారు. అయితే ఎన్సీసీ క్యాడెట్ల చేత దామచర్ల జనార్ధన్‌రావు పేరుతో తెలుగుదేశం పార్టీ తరపున ముద్రించిన క్యాలెండర్లను మహిళలకు పంపిణీ చేయించడంపట్ల విమర్శలు వినిపించాయి. కార్యక్రమానికి హాజరైన మహిళల నుదుటున కుంకుమతోపాటు గంధం పూశారు. పని పోగొట్టుకొని వచ్చా: లాజర్ చిన్న తనం నుంచే తన కుమారుడు నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. మంచానికే పరిమితమైన తన కుమారుడికి పింఛన్ ఇస్తున్నారు. ఈరోజు ఇక్కడకు వచ్చి పింఛన్ తీసుకోకుంటే ఇవ్వమని చెప్పారు. దాంతో తాను పని పోగొట్టుకొని తన కుమారుడిని తీసుకువచ్చాను. ఇక్కడ గంటల తరబడి ఉన్నా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. పెరిగిన పింఛన్ కోసం కనిపించిన ప్రతి ఒక్కరినీ అడిగాను. అయినప్పటికీ పట్టించుకోలేదు. పెంచిన పింఛన్ ఇళ్ల వద్ద ఇస్తే బాగుంటుంది. ఇలా ఇక్కడకు తీసుకువచ్చి ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నాడు కేశవరాజుగుంటకు చెందిన గద్దల లాజర్. -
వినూత్న ఆలోచనలకు ‘షురువాత్’
హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)–2017 నేపథ్యంలో ‘రోడ్ టు జీఈఎస్’పేరిట ప్రారంభించిన దేశవ్యాప్త ‘షురువాత్’ బస్సు యాత్ర నగరానికి చేరుకుంది. గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయ క్యాంపస్‌కు ఆదివారం ఈ యాత్ర చేరింది. నీతిఆయోగ్, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సంయుక్త ఆధ్వర్యంలో ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ ఫౌండేషన్ చైర్మన్ శివ్‌విక్రమ్ ఖేమ్కా, సీఈవో గౌరీ ఈశ్వరన్, స్పెషల్ ప్రాజెక్ట్స్ లీడ్ క్షితిజ్ శరణ్ నేతృత్వంలో పది మంది సభ్యుల బృందం ఈ బస్సులో ప్రయాణం సాగిస్తోంది. ఐఐటీ ఢిల్లీలో ప్రారంభమైన ఈ షుర్వాత్ బస్సు ఐదు నగరాల్లో పర్యటిస్తూ హైదరాబాద్ చేరుకుంది. జీఈఎస్ జరిగే మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ ప్రాంగణంలో మూడు రోజులూ ఈ బస్సు ఉంటుంది. 14 రోజుల పర్యటనలో ఢిల్లీ, అహ్మదాబాద్, పుణే, ముంబై, బెంగళూరు నగరాల్లో పర్యటించి 500 వినూత్న ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను ‘షురువాత్’ బస్సులోని బృందం సేకరించింది. వీటిలో అత్యుత్తమమైన ఆలోచనలకు ఫండింగ్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. జాబ్ క్రియేటర్లుగా మార్చడమే లక్ష్యం.. ‘రోడ్ టు జీఈఎస్’ పేరిట ప్రారంభించిన ఈ యాత్ర.. పలు ప్రధాన విద్యా సంస్థల క్యాంపస్‌లలో పర్యటిస్తూ విద్యార్థులను జాబ్ క్రియేటర్లుగా మార్చడమే లక్ష్యంగా సాగుతోంది. ఉన్నత చదువులు చదివి.. ఉపాధి కోసం ఎదురు చూడకుండా వినూత్న ఆలోచనలతో వ్యాపారాన్ని ప్రారంభించిన పది మందికి ఉపాధి కల్పించేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకే షురువాత్ బస్సును ప్రారంభించారు. 100 సెకన్లలో వివరించాలి.. ప్రజలకు మేలు చేకూర్చే వినూత్న ఆలోచనలతో వచ్చే విద్యార్థులు, యువత తమ ఆలోచనలను 100 సెకన్లలో వివరించాల్సి ఉంటుంది. ‘షురువాత్’ బస్సులో ఉన్న ఐదుగురితో కూడిన కమిటీ ముందు విద్యార్థులు తమ ఆలోచనలను వివరించాలి. ఉర్దూ విశ్వవిద్యాలయం నుంచి 85 మంది తమ ఆలోచనలు వివరించేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి స్టార్టప్.. మహిళల సమస్యలు, వాటి పరిష్కారానికి ‘వాక్ ఫర్ విమెన్’పేరిట స్టార్టప్‌ను నిర్వహిస్తున్నా. ఇంట్లో కూర్చునే తమ సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవడానికి అవసరమైన టెక్నాలజీని వినియోగించడానికి ఈ స్టార్టప్ రూపొందించాం. మహిళా పారిశ్రామికవేత్తగా మరికొంత మంది మహిళలకు ఉపాధి కల్పించాలన్నదే నా ప్రధాన లక్ష్యం. – సాఫియా,వాక్ ఫర్ విమెన్ స్టార్టప్ నిర్వాహకురాలు సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు పుట్టుకతోనే నాకు కళ్లు లేవు. చాలా మంది నీకు చదువెందుకన్నారు. కానీ నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు.. çపట్టుదలతో చదివా, కష్టపడ్డా.. ఆ తర్వాత సరైన తోడ్పాటు దొరకడంతో ముందుకు సాగా.. ప్రస్తుతం రూ.400 కోట్ల పరిశ్రమలను నడుపుతున్నా. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు పొందలేదు. కళ్లు లేవని ఎప్పుడూ బాధపడలేదు. మా సంస్థల్లో 600 మంది ఉపాధి పొందుతున్నారు. అందులో 50 శాతం మంది వికలాంగులే. కష్టపడేతత్వం.. పట్టుదల.. సంకల్పం ఉంటే యువత ఏదైనా సాధించవచ్చు. – శ్రీకాంత్ బొల్లా,బొల్లాంత్ ఇండస్ట్రీస్, వ్యవస్థాపకుడు ‘ఈ–లెర్నింగ్’స్టార్టప్ నిర్వహిస్తున్నా.. ఆన్లైన్ ద్వారా ఈ–లెర్నింగ్ ప్రోగ్రామ్ స్టార్టప్‌ను ప్రారంభించా. ఇప్పటికే ఇందులో 650 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. దీని ద్వారా ఆన్లైన్లో చదువు కోవడానికి అవకాశం ఉంటుంది. కళాశాల విద్యార్థులకు ఈవ్‌టీజింగ్, ఇతర వేధింపులపై అవగాహన కల్పించడానికే ఈ స్టార్టప్ రూపొందించాం. ప్రోత్సాహం లభిస్తే.. నిధులు సమకూరితే అందరికీ చేరువలోకి తీసుకెళతాం. – సయీద్,ఈ–లెర్నింగ్ ప్రోగ్రామ్ స్టార్టప్ నిర్వాహకుడు యువత మైండ్‌సెట్ మార్చడమే లక్ష్యం.. దేశవ్యాప్తంగా యువత మైండ్‌సెట్ మార్చడమే షురువాత్ బస్సు లక్ష్యం.బస్సు యాత్ర ద్వారా అన్ని ఉన్నత విద్యా సంస్థలకు వెళ్లి విద్యార్థులను కలవడం.. వారి నుంచి వినూత్న ఆలోచనలను సేకరించి అందులో మంచి వాటిని ప్రోత్సహించేలా చేస్తాం. ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు, అహ్మదాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నాం. 450 మంది నుంచి వినూత్న ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను సేకరించాం. వాటిని పరిశీలించి ఉత్పత్తి ఆధారిత పరిశ్రమలుగా ప్రోత్సహించేలా నీతిఆయోగ్ దృష్టికి తెస్తాం. – క్షితిజ్శరణ్, ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ ఫౌండేషన్ స్పెషల్ ప్రాజెక్ట లీడ్ జనవరిలో.. మలివిడత బస్సుయాత్ర తొలి విడతలో భాగంగా ఆరు నగరాల్లో కొనసాగిన షుర్వాత్ బస్సు యాత్రను ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు వరకు పొడిగించారు. దీంతో మొదటి విడత పర్యటన ముగుస్తుంది. మలివిడత పర్యటనను జనవరి నుంచి ప్రారంభించి భువనేశ్వర్, రాంచీ, కోల్‌కతా, షిల్లాంగ్, గువాహటి, లక్నోతోపాటు మరికొన్ని నగరాల్లో సాగేలా ప్రణాళిక రూపొందించారు. -
మహిళలపై పెరుగుతున్న దాడులు
ఎస్పీ రవిప్రకాష్ కాట్రేనికోన : జిల్లాలో క్రైమ్ రేటు తగ్గిందని అయితే మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల కేసులు అధికంగా నమోదవుతున్నాయని జిల్లా ఎస్పీ ఎం. రవిప్రకాష్ పేర్కొన్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం కాట్రేనికోన పోలీసు స్టేషన్‌ను ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. స్టేషన్ పనితీరుపై అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్యతో కలసి సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కళాశాలల్లో ఈవ్ టీజింగ్‌పై అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నా మన్నారు. జిల్లాలో 450 మంది సిబ్బంది కొరత ఉందన్నారు. శాంతికమిటీలు వేసేందుకు ఈనెల 10lఆఖరు తేదీ అన్నారు. హింసాత్మక సంఘటనలకు పాల్పడితే రౌడీ షీటు తెరుస్తామని హెచ్చరించారు. ధర్నాలు , రాస్తారోకోలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదన్నారు. హైవే రోడ్లుకు జియోట్యాగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. లాటరీలో కోట్ల రూపాయలు గెలుచుకున్నారనే మెసేజ్‌లు చూసి బ్యాంకు, వ్యక్తి గత వివరాలు ఇచ్చి మోసపోవద్దన్నారు. కాల్ మనీ, చీటీలు వంటి వైట్ కాలర్ నేరాలపై దృష్టి సారించామన్నారు. ముమ్మిడివరం సీఐ కేటీటీవీ రమణారావు, ఎస్సై షేక్ జానీ బాషా, ముమ్మిడివరం ఎస్సై నాయుడు తదితరులు ఆయన వెంట ఉన్నారు.