మహిళలపై పెరుగుతున్న దాడులు
-
ఎస్పీ రవిప్రకాష్
కాట్రేనికోన :
జిల్లాలో క్రైమ్ రేటు తగ్గిందని అయితే మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల కేసులు అధికంగా నమోదవుతున్నాయని జిల్లా ఎస్పీ ఎం. రవిప్రకాష్ పేర్కొన్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం కాట్రేనికోన పోలీసు స్టేషన్‌ను ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. స్టేషన్ పనితీరుపై అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్యతో కలసి సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కళాశాలల్లో ఈవ్ టీజింగ్‌పై అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నా మన్నారు. జిల్లాలో 450 మంది సిబ్బంది కొరత ఉందన్నారు. శాంతికమిటీలు వేసేందుకు ఈనెల 10lఆఖరు తేదీ అన్నారు. హింసాత్మక సంఘటనలకు పాల్పడితే రౌడీ షీటు తెరుస్తామని హెచ్చరించారు. ధర్నాలు , రాస్తారోకోలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదన్నారు. హైవే రోడ్లుకు జియోట్యాగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. లాటరీలో కోట్ల రూపాయలు గెలుచుకున్నారనే మెసేజ్‌లు చూసి బ్యాంకు, వ్యక్తి గత వివరాలు ఇచ్చి మోసపోవద్దన్నారు. కాల్ మనీ, చీటీలు వంటి వైట్ కాలర్ నేరాలపై దృష్టి సారించామన్నారు. ముమ్మిడివరం సీఐ కేటీటీవీ రమణారావు, ఎస్సై షేక్ జానీ బాషా, ముమ్మిడివరం ఎస్సై నాయుడు తదితరులు ఆయన వెంట ఉన్నారు.