శ్రీ గౌతమిది రోడ్డు ప్రమాదమే
శ్రీ గౌతమిది రోడ్డు ప్రమాదమే
Published Mon, Jan 30 2017 12:49 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM
ఏలూరు అర్బన్ : శ్రీ గౌతమిది హత్య కాదని, రోడ్డు ప్రమాదంలోనే ఆమె మరణించిందని ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నరసాపురానికి చెందిన శ్రీగౌతమి, ఆమె చెల్లెలు పావని ఈనెల 18న ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, కారు ఢీకొని గౌతమి మరణించిందని, పావని తీవ్రంగా గాయపడిందని ఎస్పీ చెప్పారు. విశాఖపట్నానికి చెందిన వాహన యజమాని పాశల సందీప్, అతని కారు డ్రైవర్ ప్రసాద్ మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఘటన అనంతరం గౌతమి చెల్లెలు పావని తన అక్కది హత్య అని, ఆమెను రెండో పెళ్లి చేసుకున్న నరసాపురానికి చెందిన సజ్జాబుజ్జి, అతని భార్య శిరీష పథకం ప్రకారం హత్య చేయించారని ఆరోపించిన నేపథ్యంలో దీనిపై ఏఎస్పీ వి.రత్నను దర్యాప్తు అధికారిగా నియమించామని, ఆమె ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాలు విచారణ చేశాయని, దీనిలో గౌతమిది రోడ్డు ప్రమాదమేనని తేలిందని వెల్లడించారు. గౌతమి హత్యకు గురైనట్టు ఎలాంటి ఆధారాలూ లభించలేదని స్పష్టం చేశారు. సందీప్, అతని కారు డ్రైవర్ ప్రసాద్ మద్యం మత్తులో కారు నడిపి గౌతమి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని, ఈ కేసులో నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈ మేరకు ఈనెల 26న పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీ రత్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు వివరాలు వెల్లడించారని, అయినా ప్రసార సాధనాల్లో గౌతమి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. వరుస కథనాలు వస్తున్నాయని, అందుకే ఈ కేసు విషయంలో మరోమారు స్పష్టత ఇచ్చేందుకు తాను ఈ సమావేశం నిర్వహించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో ఏఎస్పీ వలిశల రత్న, సీఐ జయసూర్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement