హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)–2017 నేపథ్యంలో ‘రోడ్ టు జీఈఎస్’పేరిట ప్రారంభించిన దేశవ్యాప్త ‘షురువాత్’ బస్సు యాత్ర నగరానికి చేరుకుంది. గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయ క్యాంపస్‌కు ఆదివారం ఈ యాత్ర చేరింది. నీతిఆయోగ్, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ సంయుక్త ఆధ్వర్యంలో ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్‌షిప్ ఫౌండేషన్ చైర్మన్ శివ్‌విక్రమ్ ఖేమ్కా, సీఈవో గౌరీ ఈశ్వరన్, స్పెషల్ ప్రాజెక్ట్స్ లీడ్ క్షితిజ్ శరణ్ నేతృత్వంలో పది మంది సభ్యుల బృందం ఈ బస్సులో ప్రయాణం సాగిస్తోంది. ఐఐటీ ఢిల్లీలో ప్రారంభమైన ఈ షుర్వాత్ బస్సు ఐదు నగరాల్లో పర్యటిస్తూ హైదరాబాద్ చేరుకుంది. జీఈఎస్ జరిగే మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో మూడు రోజులూ ఈ బస్సు ఉంటుంది. 14 రోజుల పర్యటనలో ఢిల్లీ, అహ్మదాబాద్, పుణే, ముంబై, బెంగళూరు నగరాల్లో పర్యటించి 500 వినూత్న ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను ‘షురువాత్’ బస్సులోని బృందం సేకరించింది. వీటిలో అత్యుత్తమమైన ఆలోచనలకు ఫండింగ్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
జాబ్ క్రియేటర్లుగా మార్చడమే లక్ష్యం..
‘రోడ్ టు జీఈఎస్’ పేరిట ప్రారంభించిన ఈ యాత్ర.. పలు ప్రధాన విద్యా సంస్థల క్యాంపస్‌లలో పర్యటిస్తూ విద్యార్థులను జాబ్ క్రియేటర్లుగా మార్చడమే లక్ష్యంగా సాగుతోంది. ఉన్నత చదువులు చదివి.. ఉపాధి కోసం ఎదురు చూడకుండా వినూత్న ఆలోచనలతో వ్యాపారాన్ని ప్రారంభించిన పది మందికి ఉపాధి కల్పించేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకే షురువాత్ బస్సును ప్రారంభించారు.
100 సెకన్లలో వివరించాలి..
ప్రజలకు మేలు చేకూర్చే వినూత్న ఆలోచనలతో వచ్చే విద్యార్థులు, యువత తమ ఆలోచనలను 100 సెకన్లలో వివరించాల్సి ఉంటుంది. ‘షురువాత్’ బస్సులో ఉన్న ఐదుగురితో కూడిన కమిటీ ముందు విద్యార్థులు తమ ఆలోచనలను వివరించాలి. ఉర్దూ విశ్వవిద్యాలయం నుంచి 85 మంది తమ ఆలోచనలు వివరించేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు.
మహిళల సమస్యల పరిష్కారానికి స్టార్టప్..
మహిళల సమస్యలు, వాటి పరిష్కారానికి ‘వాక్ ఫర్ విమెన్’పేరిట స్టార్టప్‌ను నిర్వహిస్తున్నా. ఇంట్లో కూర్చునే తమ సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవడానికి అవసరమైన టెక్నాలజీని వినియోగించడానికి ఈ స్టార్టప్ రూపొందించాం. మహిళా పారిశ్రామికవేత్తగా మరికొంత మంది మహిళలకు ఉపాధి కల్పించాలన్నదే నా ప్రధాన లక్ష్యం.
– సాఫియా,వాక్ ఫర్ విమెన్ స్టార్టప్ నిర్వాహకురాలు
సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు
పుట్టుకతోనే నాకు కళ్లు లేవు. చాలా మంది నీకు చదువెందుకన్నారు. కానీ నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు.. çపట్టుదలతో చదివా, కష్టపడ్డా.. ఆ తర్వాత సరైన తోడ్పాటు దొరకడంతో ముందుకు సాగా.. ప్రస్తుతం రూ.400 కోట్ల పరిశ్రమలను నడుపుతున్నా. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు పొందలేదు. కళ్లు లేవని ఎప్పుడూ బాధపడలేదు. మా సంస్థల్లో 600 మంది ఉపాధి పొందుతున్నారు. అందులో 50 శాతం మంది వికలాంగులే. కష్టపడేతత్వం.. పట్టుదల.. సంకల్పం ఉంటే యువత ఏదైనా సాధించవచ్చు.
– శ్రీకాంత్ బొల్లా,బొల్లాంత్ ఇండస్ట్రీస్, వ్యవస్థాపకుడు
‘ఈ–లెర్నింగ్’స్టార్టప్ నిర్వహిస్తున్నా..
ఆన్‌లైన్ ద్వారా ఈ–లెర్నింగ్ ప్రోగ్రామ్ స్టార్టప్‌ను ప్రారంభించా. ఇప్పటికే ఇందులో 650 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. దీని ద్వారా ఆన్‌లైన్‌లో చదువు కోవడానికి అవకాశం ఉంటుంది. కళాశాల విద్యార్థులకు ఈవ్‌టీజింగ్, ఇతర వేధింపులపై అవగాహన కల్పించడానికే ఈ స్టార్టప్ రూపొందించాం. ప్రోత్సాహం లభిస్తే.. నిధులు సమకూరితే అందరికీ చేరువలోకి తీసుకెళతాం.
– సయీద్,ఈ–లెర్నింగ్ ప్రోగ్రామ్ స్టార్టప్ నిర్వాహకుడు
యువత మైండ్‌సెట్ మార్చడమే లక్ష్యం..
దేశవ్యాప్తంగా యువత మైండ్‌సెట్ మార్చడమే షురువాత్ బస్సు లక్ష్యం.బస్సు యాత్ర ద్వారా అన్ని ఉన్నత విద్యా సంస్థలకు వెళ్లి విద్యార్థులను కలవడం.. వారి నుంచి వినూత్న ఆలోచనలను సేకరించి అందులో మంచి వాటిని ప్రోత్సహించేలా చేస్తాం. ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు, అహ్మదాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నాం. 450 మంది నుంచి వినూత్న ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను సేకరించాం. వాటిని పరిశీలించి ఉత్పత్తి ఆధారిత పరిశ్రమలుగా ప్రోత్సహించేలా నీతిఆయోగ్ దృష్టికి తెస్తాం.
– క్షితిజ్‌శరణ్, ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్‌షిప్ ఫౌండేషన్ స్పెషల్ ప్రాజెక్ట లీడ్
జనవరిలో.. మలివిడత బస్సుయాత్ర
తొలి విడతలో భాగంగా ఆరు నగరాల్లో కొనసాగిన షుర్వాత్ బస్సు యాత్రను ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు వరకు పొడిగించారు. దీంతో మొదటి విడత పర్యటన ముగుస్తుంది. మలివిడత పర్యటనను జనవరి నుంచి ప్రారంభించి భువనేశ్వర్, రాంచీ, కోల్‌కతా, షిల్లాంగ్, గువాహటి, లక్నోతోపాటు మరికొన్ని నగరాల్లో సాగేలా ప్రణాళిక రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment