సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 2024లో సీఎం అవుతారని కొందరు టీడీపీ నేతలు కంటున్న కలలు కల్లలవుతాయని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన తాడేపల్లిలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వాస్తవ రాజకీయ పరిస్థితులను బాబు అభిమానులు గమనించాలని సూచించారు.
సుదీర్ఘ చరిత్ర ఉన్న డీఎంకేకు, మామను వెన్నుపోటు పొడిచి లాక్కున్న టీడీపీకి నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తెలిపారు. ప్రజా ఉద్యమాల్లో రాటుదేలిన పోరాట యోధుడు, గొప్ప రచయిత అయిన కరుణానిధికి, కుప్పం ఎమ్యెల్యే నారా చంద్రబాబుకి మధ్య పోల్చడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
గెలుపే లక్ష్యంగా సామాజిక సాధికార యాత్ర..
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్రలు చేయాలని వైఎస్సార్‌సీపీ సంకల్పించిందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూనే.. మరోవైపు పార్టీ పరమైన కార్యక్రమాల నిర్వహణకు సీఎం వైఎస్ జగన్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారని వివరించారు.
ఈ నెల 26వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం, కోస్తాంధ్రలోని తెనాలి, రాయలసీమలోని శింగనమల నియోజకవర్గాలలో బస్సు యాత్రలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. తొలి విడతలో నవంబర్ తొమ్మిదో తేదీ వరకు యాత్రలు కొనసాగుతాయని వివరించారు. గడిచిన నాలుగున్నరేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సీఎం జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఈ యాత్రల్లో వివరిస్తారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment