సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారి ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో తీవ్రస్థాయిలో వ్యక్తమౌతున్న ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడం, కేసీఆర్ కుటుంబం అడ్డగోలు సంపాదనతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని అన్నారు.
కేసీఆర్ భాష, వ్యవహారశైలితో ప్రజలతో పాటు, వారి సొంతపార్టీ నాయకులే అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పట్టణ, ,గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులివ్వక, వాటి అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధుల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమౌతోందన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ తప్పుడు, తొందరపాటు నిర్ణయాలతో ఉద్యోగులు, వైద్యులు, విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు, ఇతర వర్గాల్లో రేగుతున్న అసంతృప్తితో కేసీఆర్ కుటుంబం కుంగుబాటుకు గురైందన్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ, బీజేపీపై ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి కేంద్రాన్ని ప్రజల దృష్టిలో బద్‌నామ్ చేయడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారని సంజయ్ విమర్శించారు. వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులను దారి మళ్లించడం, పేర్లు మార్చడం వంటివి చేస్తుండడంతో ఢిల్లీలో, తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారన్నారు.
మళ్లీ కేంద్రంలో బీజేపీ సర్కార్ రావడం ఖాయం కాబట్టి, ఇక్కడ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మార్చి బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయకార్యవర్గ భేటీ, 3న పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో సంజయ్ ‘సాక్షి’తో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ప్రజలకు భరోసా ఇచ్చేందుకే ఇక్కడ జాతీయ భేటీ
రాష్ట్ర ప్రజల ఇబ్బందులు, కష్టాలను సీఎం కేసీఆర్ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఓదార్పు అసలే లేదు. తెలంగాణ పరిస్థితి ఒక అనాథలాగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ‘మీకు అండగా మేమున్నాం.. మీరేం బాధపడొద్దు’ అని ప్రజలకు భరోసా కల్పించేందుకు బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ ఇక్కడ నిర్వహిస్తున్నాం. టీఆర్‌ఎస్‌పై గట్టిగా పోరాడుతున్న పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని, నూతనోత్తేజాన్ని నింపేందుకు, జాతీయ నాయకత్వం అండగా ఉంటుందని చెప్పేందుకు ఇక్కడ సమావేశమవుతున్నాం.
బతుకులు మారకే టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత
తెలంగాణ ఎందుకు ఏర్పడింది ? దానివల్ల ఏం లాభం జరిగింది? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. తెలంగాణ వచ్చినా ప్రజల బతుకులు మారలేదు. గతంలో యువకులు ఉద్యమంలో ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఉద్యోగాల కోసం చేసుకుంటున్నారు. వరికుప్పల పైనే రైతులు చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. అందుకే టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతోంది.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి..
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కార్ అరాచకాలపై బీజేపీ సింగిల్‌గా పోరాడుతోంది. తెలంగాణలో బీజేపీని ఎదుర్కోలేక టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, లెఫ్ట్ కుమ్మక్కు అయ్యాయి. అవన్నీ ఓ కూటమిగా ఏర్పడి ఎన్నికల దాకా దూరంగా ఉన్నట్టు, అవి వచ్చినప్పుడు కలిసి పోటీ చేయాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచినా మళ్లీ చేరేది టీఆర్‌ఎస్‌లోనే కాబట్టి ఉమ్మడిగా అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఈసారి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి.
బీజేపీ అణచివేతకు కుట్రలు
ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ను బలంగా ఎదుర్కొనే శక్తియుక్తులు బీజేపీకే ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం ఎంతగానో కలిసొచ్చే అంశం. తమకు లాభం, పేరు ప్రఖ్యాతుల గురించి కేసీఆర్ ఆలోచిస్తున్నారే తప్ప తెలంగాణకు న్యాయం జరగాలి, ప్రజలకు మేలు జరగాలి అన్న ధ్యాస లేదు. కేంద్రాన్ని బద్‌నామ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో బీజేపీని అణచి వేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. సీఎంవోలో ప్రత్యేక విభాగం పెట్టారు. జైలు, గృహ నిర్బంధాలు, కేసులు, దాడులు, వేధింపులతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నా కార్యకర్తలు భయపడటం లేదు.
టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం
ప్రజా సమస్యలపై పోరాడుతున్నది బీజేపీ మాత్రమే. బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రను మొదట తక్కువ అంచనా వేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. దానికి వచ్చిన ప్రజా స్పందన చూసి బెంబేలెత్తింది. టీఆర్‌ఎస్‌కు నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీనే అని దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 సీట్ల గెలుపు, హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ విజయఢంకా మోగించడం రుజువు చేశాయి. ఈ ఎన్నికల్లో చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఓటర్లు కూడా టీఆర్‌ఎస్‌పై పోరాడేది బీజేపీనే అని అండగా నిలిచే పరిస్థితి ఏర్పడింది.
దిక్కుతోచని స్థితిలో సర్కారు
రాష్ట్రం రోజురోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. రాబోయే 2, 3 నెలల్లో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దుస్థితి నుంచి ప్రజలను ఎలా కాపాడాలో సర్కారుకు దిక్కుతోచడం లేదు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రణాళికలను కేసీఆర్ చురుకుగా సిద్ధం చేస్తున్నారు. మరింత ఆలస్యమయ్యే కొద్దీ పార్టీకి రాజకీయంగా కూడా దిక్కుతోచని గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత తొందరలో ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment