సాక్షి, హైదరాబాద్: మహిళా గవర్నర్‌ను అవమానించడమే పనిగా పెట్టుకున్న సీఎం కేసీఆర్, వివిధ బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదంటూ సుప్రీంకోర్టుకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉందని గురువారం ఒక ప్రకటనలో ఎద్దేవాచేశారు.
యాభై వేల జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టకుండా సమాచార హక్కు చట్టం స్ఫూర్తినే దెబ్బతీస్తున్న కేసీఆర్‌పై ఎన్ని కేసులు పెట్టాలని మండిపడ్డారు. కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలను తప్పు పడుతూ హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిందో గుర్తు చేసుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో గవర్నర్‌తో సమన్వయంతో వ్యవహరిస్తున్నట్లు నటించిన కేసీఆర్ ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కి గవర్నర్ వ్యవస్థను అప్రదిష్టపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
‘క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ఎమ్మెల్సీగా సిఫారసు చేస్తే ఆ ప్రతిపాదన తిరస్కరించడమే గవర్నర్ చేసిన నేరమా? సీఎం ప్రజలను కలవకుండా ఫాంహౌజ్, ప్రగతిభవన్‌కే పరిమితమైతే గవర్నర్‌గా ప్రజలను కలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ఆమె చేసిన తప్పా?’అని సంజయ్ ప్రశ్నించారు. గతంలో నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు వంగి వంగి పాదాభివందనాలు చేసిన కేసీఆర్.. తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ గా వచ్చాక జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment