సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ రాకపోతే తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. కేసీఆర్ వస్తే ప్రధానితో సన్మానం చేయిస్తామన్నారు. మోదీ చేతులతో భారీ గజమాల వేయిస్తామంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సమాజం కోసం మోదీ వస్తున్నారు: కిషన్ రెడ్డి
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని మోదీని.. అధికార పార్టీనే అడ్డుకోవడం సిగ్గుచేటని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మోదీ పర్యటనలో చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా.. కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలని అన్నారు.
సింగరేణిని ప్రైవేటీకరిస్తోంది కేంద్రం కాదని.. తెలంగాణ సర్కారే అని వ్యాఖ్యానించారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేయమని రామగుండం సభలో ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ సమాజం మెప్పు కోసం మోదీ వస్తున్నారని, కల్వకుంట్ల కుటుంబం మెప్పు కోసం రావడం లేదని, వాళ్ళ సర్టిఫికెట్ తమకు అవసరం లేదన్నారు.
కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8న తెలంగాణలో పర్యటించనున్నారు. తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఎమ్‌టీఎస్ సెకండ్ ఫేజ్‌లో భాగంగా 13 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్ సభలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
చదవండి: ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం.. కారణమిదేనా?
Comments
Please login to add a commentAdd a comment