నిరసన ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ తదితరులు
గన్‌ఫౌండ్రి/కవాడిగూడ (హైదరాబాద్): దేశప్రధాని నరేంద్రమోదీపై పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో చేసిన అనుచిత వాఖ్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తక్షణమే స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీనిపై కేసీఆర్ స్పందించకపోతే పాకిస్తాన్‌కు ఆయన సహకరిస్తున్నట్లే నని బండి ధ్వజమెత్తారు. ఎంఐఎంను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకనే పాకిస్తాన్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసినా కేసీఆర్ మౌనంగా ఉన్నారని ఆరో పించారు.
ప్రధాని మోదీపై బిలావల్ భుట్టో అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్‌లోని బాబూజగ్జీవన్‌రాం విగ్రహం నుంచి లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తొలుత బాబుజగ్జీవన్‌రాం విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం యువమోర్చా కార్యకర్తలు బిలావల్ భుట్టో దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... ప్రధానిపై పాకిస్తాన్ విమర్శలు చేస్తే ప్రతిఒక్కరూ స్పందించాలని లేదంటే వారు దేశద్రోహులనేనని పేర్కొన్నారు. విశ్వ గురువుగా ఎదుగుతున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేక పాకిస్తాన్ తన కుటిలబుద్ధిని బయటపెడుతోందన్నారు. భారత్ శాంతి సామరస్య దేశమని, పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని ధ్వజమెత్తారు. బిలావల్ భుట్టో ప్రధాని మోదీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment