సాక్షి, హైదరాబాద్: బీజేపీ ప్రధాని మోదీతో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’బాగా విజయవంతమైం దని బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. లక్షలాది మంది తరలిరావడం, ఏర్పాట్లు బాగా చేయడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భుజం తట్టడం, ప్రధాని సహా ఇతర నేతలంతా హుషారుగా కనిపించడంతో రాష్ట్ర పార్టీ నాయకులు సంబరపడుతున్నారు.
మరోవైపు సభ విజయవంతం కావడం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని, ఇదొక టానిక్‌లా పనిచేస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యనేతల ప్రసంగాలకు సభికులు కేరింతలు, చప్పట్లతో సభా ప్రాంగాణం మార్మోగడాన్ని గుర్తు చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో తప్ప ఒక రాజకీయ సభకు ప్రజల నుంచి ఇంతటి స్పందన రావడం విశేషమని అభిప్రాయపడుతున్నాయి.
ప్రత్యామ్నాయంగా కనిపించేలా..
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు నిజమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా బీజేపీ మారిందనే సంకేతాలు ఈ సభతో అందాయని పార్టీ నాయకులు చెప్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న జాతీయ నాయకత్వం లక్ష్యాలకు ఊతమిచ్చేలా సభ జరిగిందని, దీనిని ఇలాగే కొనసాగిస్తే మరింత బలోపేతం కావొచ్చని పేర్కొంటున్నారు. కేసీఆర్ సర్కార్, టీఆర్‌ఎస్‌లపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మల్చుకునేలా, ఎన్నికల నాటికి ఓట్లు కురిపించేలా కృషిని కొనసాగించాల్సి ఉందంటున్నారు.
కేసీఆర్‌పై విమర్శలకు భారీ స్పందన
కేసీఆర్ సర్కార్‌పై, టీఆర్‌ఎస్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి, సంజయ్, ఇతర నేతలు తీవ్ర స్థాయిలో విమర్శ లు చేశారు. ఈ సమయంలో సభికుల నుంచి భారీగా స్పందన వ్యక్తమైంది. కేరింతలు, చప్పట్లు వినిపించాయి. కేసీఆర్, టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతకు ఇది నిదర్శనమని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తప్ప దని బీజేపీ నేత ఒకరు అన్నారు. ఇక ప్రధాని మోదీ రాజకీయ విమర్శలేమీ చేయకపోయినా.. తనదైన శైలి లో ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment