నాగారంలో గ్రామంలో శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...
సాక్షి, హైదరాబాద్/ మహేశ్వరం: దేశంలో ఎక్కడా పనికిరాని, చెల్లని కాసుల్లాంటి నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులివ్వాలని అడుగుతున్న ప్రజా ప్రతినిధులను బీఆర్‌ఎస్‌లో చేరితేనే నిధులిస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
‘రాష్ట్రంలోని పంచాయతీల అభివృద్ధికి నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమే. మీ లెక్కన (బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి) బీజేపీలో చేరితేనే పంచాయతీలకు నిధులిస్తామని మోదీ చెబితే బీఆర్‌ఎస్‌లో ఒక్కరైనా మిగిలేవారా?’ అంటూ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేటలో బుధవారం రాత్రి పొద్దుపోయాక నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
మహేశ్వరంలో యధేచ్చగా భూకబ్జాలు
‘మహేశ్వరంలో టీఆర్‌ఎస్ నేతల భూ కబ్జాలకు అంతు లేకుండా పోయింది. ప్రజా సమస్యలను గాలి కొదిలేశారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి 2.4 లక్షల ఇళ్లకు నిధులిస్తే..కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టకుండా నిధులను దారి మళ్లించింది..’ అని సంజయ్ విమర్శించారు. ‘ఎంఐఎం నేతలవి బ్లాక్ మెయిల్ రాజకీయాలు. బీఆర్‌ఎస్ నేతలతో కలిసి వక్ఫ్ భూములను కబ్జా చేస్తూ భూదందా చేస్తూ వందల కోట్లు సంపాదిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారు. ఎంఐఎం నేతలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోకపోతే మహేశ్వరం నియోజకవర్గంలో పోటీ చేయాలి. అలాగే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలి..’ అని సవాల్ చేశారు.
బీజేపీ వస్తే తండాల అభివృద్ధికి ‘ప్రత్యేక కార్పొరేషన్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తండాల సమగ్రాభివృద్ధికి ‘ప్రత్యేక అభివృద్ధి కార్పొరేషన్’ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. సేవాలాల్ నడయాడిన బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ మందిరాన్ని నిర్మించి ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా బీజేపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వేడుకల్లో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. మోదీ మంత్రి వర్గంలో ఎనిమిది మంది గిరిజనులకు స్థానం కల్పించారని అన్నారు. రాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ గిరిజనులను మోసం చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment