సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కుటుంబపాలన పట్ల విసిగి వేసారి ఉన్న తెలంగాణ ప్రజలకు భరోసానిచ్చి చేదోడువాదోడుగా నిలిచేందుకే బీజేపీ జాతీయ కార్యవర్గభేటీ, బహిరంగసభను ఇక్కడ నిర్వహిస్తున్నట్టు సమావేశ ఏర్పాట్ల స్టీరింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. టీఆర్‌ఎస్ పార్టీ క్రియాశూన్యత్వంతోపాటు వివిధ అంశాలు, సమస్యలపై చేష్టలుడిగి వ్యవహరించడం, పేరుకే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడటం వంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయశూన్యాన్ని బీజేపీనే పూరిస్తుందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారని చెప్పారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంతగా కృషి చేసినా శవానికి అలంకరణ చేయడంతప్ప కాంగ్రెస్ పార్టీకి జీవం పోయడం సాధ్యంకాదని అన్నారు. బీజేపీ జాతీయ సమావేశాల నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలను ఆయన వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... కేసీఆర్ కుటుంబ, అవినీతి, అరాచకపాలనపై రాష్ట్ర ప్రజలు విసిగివేసారి ఉన్నారు. దీని నుంచి విముక్తి కల్పించడంతోపాటు మేలైన, నీతివంతమైన పాలనను బీజేపీ మాత్రమే ఇస్తుందని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు.
కర్ణాటక, పుదుచ్చేరి తర్వాత రాష్ట్రంలోనే బీజేపీ విస్తరణకు అన్ని అనుకూల పరిస్థితులున్నాయని జాతీయ నాయకత్వం విశ్వసిస్తోంది. అందువల్లే ఈ సమావేశాలకు, మోదీ విజయసంకల్ప సభకు హైదరాబాద్ వేదికైంది. వివిధ జాతీయ అంశాలతోపాటు తెలంగాణపై ప్రత్యేక చర్చ జరిగే అవకాశాలున్నాయి. 8 ఏళ్ల మోదీ పాలనను ప్రజలు ఆదరిస్తున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ‘మోదీ ఛరిష్మా’తో బీజేపీ గెలుపొందుతోంది.
ఇక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు...
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి, వారు పడుతున్న కష్టాలు, సమస్యల పరిష్కారానికి మోదీ బహిరంగ సభ ద్వారా భరోసా కల్పిస్తాం. భవిష్యత్ బీజేపీదేనని ప్రజలకు నమ్మకం కలిగించేందుకు అగ్రనేతలంతా పాల్గొనే సమావేశాలు, బహిరంగ సభ తోడ్పడతాయి. కాంగ్రెస్, ఎంఐఎంలు టీఆర్‌ఎస్‌కు వంత పాడే పార్టీలని, నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీ అనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించబోతున్నాం. దానికి జాతీయ నాయకత్వం అండదండలు ఉన్నాయని విషయాన్ని సభ ద్వారా చాటబోతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment