Justice laxmana reddy
-
‘అమరావతి’లో రూ.లక్ష కోట్ల అవినీతి
అమరావతి నిర్మాణం పేరిట రూ.లక్ష కోట్ల స్కాం జరిగిందని నాతో కొంతమంది ఎన్నారైలు అన్నారు. అప్పట్లో వారు అతిగా చెబుతున్నారనుకున్నా.. కానీ ఇప్పుడు చూస్తే లక్ష కోట్లు కాదు.. ఇంకా ఎక్కువే స్కాం జరిగిందనిపిస్తోంది. ఆర్బీఐకి స్థలం ఎకరానికి రూ.4 కోట్లకి ఇచ్చారు. ప్రైవేట్ విద్యా సంస్థలు, ఆస్పత్రులకు రూ.50 లక్షలకే ఇస్తున్నారు. మిగతా మూడున్నర కోట్లు ఎక్కడకు పోతోందో? – జస్టిస్ లక్ష్మణరెడ్డి కొన్నాళ్ల క్రితం వరకు ఎమ్మెల్యేలు చెప్పినట్టే చేయాలనే వారు.. ఇప్పుడు ఏకంగా కార్యకర్తలకూ ప్రాధాన్యం ఇవ్వాలం టున్నారు. నియోజకవర్గ నిధులను అధికార పార్టీ ఎమ్మెల్యేలకే కాకుండా ఆ పార్టీ నేతలకూ ఇస్తున్నారు. ప్రజాస్వామ్యం ఇలా ఉంటే ఏమనుకోవాలి?.. ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో రూ.లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని దుయ్యబట్టారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను అనర్హులను చేయకపోవడం అన్యాయమన్నారు. ఇలాంటి వారిని ఆయా నియోజకవర్గాల ప్రజలు నిలదీయాలని కోరారు. ఆదివారం విశాఖలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే... ‘‘పాలక పార్టీలో ప్రజాస్వామ్యం లేదు. వాస్తవ పరిస్థితులు చెప్పేవారు లేరు. ఎన్నికలయ్యాక రాజకీయాలు మరచిపోయి అందరికీ సమ న్యాయం చేయాల్సిన బాధ్యత పాలక పార్టీలపై ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆ విషయం మరచిపోయి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచింది. పరిపాలన గురించి మాట్లాడాల్సిన కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో టీడీపీ కార్యకర్తలకు సహకరించాలని సీఎం మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించింది. కొన్నాళ్ల క్రితం వరకు ఎమ్మెల్యేలు చెప్పినట్టే చేయాలనే వారు.. ఇప్పుడు ఏకంగా కార్యకర్తలకూ ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. నియోజకవర్గ నిధులను అధికార పార్టీ ఎమ్మెల్యేలకే కాకుండా ఆ పార్టీ నేతలకూ ఇస్తున్నారు. ప్రజాస్వామ్యం ఇలా ఉంటే ఏమనుకోవాలి?.. ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమవుతోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి స్కాం రూ.లక్ష కోట్లకు పైనే.. ‘‘అమరావతి నిర్మాణం పేరిట రూ.లక్ష కోట్ల స్కాం జరిగిందని గతంలో నాతో కొంతమంది ఎన్నారైలు అన్నారు. అప్పట్లో వారు అతిగా చెబుతున్నారనుకున్నా.. కానీ ఇప్పుడు చూస్తే లక్ష కోట్లు కాదు.. ఇంకా ఎక్కువే స్కాం జరిగిందనిపిస్తోంది. ఆర్బీఐకి స్థలం కావలసి వస్తే ఎకరానికి రూ. 4 కోట్లు వసూలు చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు, ఆస్పత్రులకు రూ.50 లక్షలకే ఇస్తున్నారు. మిగతా మూడున్నర కోట్లు ఎక్కడకు పోతుందో అర్థం చేసుకోవచ్చు’’. ఇదంతా లెక్కలేస్తే లక్ష కోట్లు దాటిపోతోంది. అమరావతిలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ప్రభుత్వానికి ఈ దళారీ పని ఎందుకు? అన్నారు. వాళ్లు నిజాలు చెబుతుంటే కళ్లు తిరిగాయి..: ఉండవల్లి మాజీ చీఫ్ సెక్రటరీలు ఐవైఆర్ కృష్ణారావు, అజేయకల్లంలు చెబుతున్న నిజాలు వింటుంటే కళ్లు తిరిగాయని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘నా రాజకీయ జీవితంలో ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు. 1996లో వచ్చిన తుపాను సహాయక చర్యల్లో ముందుగా పాల్గొన్నందుకు అప్పటి సీఎం చంద్రబాబు కలెక్టర్ రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని సస్పెండ్ చేశారు. పనిచేస్తే విపత్తు వస్తుందన్న పరిస్థితి అధికారుల్లో ఉంది. ఏం చేస్తే అధికార పార్టీ నేతల్లో మార్పు వస్తుందో ప్రజలు కూడా ఆలోచించాలి. మీ ప్రాంతంలో జరిగే అవినీతిపైనా స్పందించాలి.’ అని పేర్కొన్నారు. ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు పంచాయితీరాజ్ వ్యవస్థను ఖూనీ చేశాయని ఆరోపించారు. చంద్రన్న పేరిట వివిధ కార్డులపై సీఎం ఫోటోలు ముద్రిస్తున్నారని, ఈ ప్రభుత్వం మారిపోతే మళ్లీ కొత్తకార్డులు ముద్రిస్తారని, ఆ ఖర్చు ప్రజలపైనే పడుతుందని చెప్పారు. ప్రచారం సీఎంకి, భారం ప్రజలకా? అని ప్రశ్నించారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ అమరావతి పేరిట అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకరిస్తూ ఇతర ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. యూపీఎస్సీ మాజీ ఇన్చార్జి చైర్మన్ కేఎస్ చలం మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పాలకులు వివక్ష చూపుతున్నారని, విశాఖను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. సదస్సులో ఏయూ మాజీ వీసీ కెవీ రమణ, ఏయూ ప్రొఫెసర్లు పీవీ ప్రసాదరెడ్డి, పద్దయ్య, డాక్టర్ పి.వి.రమణమూర్తి, ఏపీ నిరుద్యోగ సమితి జేఏసీ చైర్మన్ సమయం హేమంత్‌కుమార్, విశ్లేషకులు సురేష్, రవికుమార్ తదితరులు మాట్లాడారు. ఆ ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హులను చేయరు? ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి మారితే ఆటోమేటిక్‌గా అనర్హులవుతాన్నారు. ఏదైనా వివాదం వచ్చినప్పుడు మాత్రమే స్పీకర్‌కు రిఫర్ చేయాలని చట్టం చెబుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వివాదం ఏమీ లేదు. పబ్లిగ్గా పార్టీలు మారుతున్నట్టు చెప్పారు. స్వయంగా సీఎం వారికి కండువాలు కప్పారు. ఇందులో వివాదానికే తావులేదు. అయినా స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హులను చేయరు? ఇలాంటి ఫిరాయింపులపై ప్రజల్లో చైతన్యం వచ్చి నిలదీయాలని తెలియజేశారు. -
దళితులకు రాజ్యాధికారం రావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రణయ్ హత్యోదంతం ఒక కులానికి మాత్రమే సంబంధించింది కాదని, సమాజ సమస్య అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దళితులపై జరుగుతున్న ఇలాంటి దాడులు ఆగాలంటే అంబేడ్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుల పరిరక్షణ జరగాలని, ఆయన ఆశించినట్టు దళితులకు రాజ్యాధికారం రావాలని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యోదంతంపై జనచైతన్య వేదిక అ«ధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని నెలలుగా అమ్మాయి కుటుంబం కుట్ర పన్ని ప్రణయ్‌ను హత్య చేయించిందని పేర్కొన్నారు. అయితే దీని వెనకున్న రాజకీయ నేతలు, పెద్దలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే బాధిత కుటుంబానికే కాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందన్న నమ్మకం కలిగేదన్నారు. రాజకీయ హత్య అని ఎవరూ ఆరోపించకపోయినా పోలీసు శాఖ మాత్రం అది రాజకీయ హత్య కాదంటూ వెల్లడించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేసు దర్యాప్తు పూర్తి కాకుండానే పోలీసులు రాజకీయ హత్య కాదని చెప్పడం సమంజసం కాదని చెప్పారు. అలాగే దళితులను అణగదొక్కాలన్న ధోరణి మారాలని, ప్రణయ్ çఘటనను కుల సంఘాలు, పౌరహక్కుల సంఘాలే ఖండించడం కాకుండా యావత్ సమాజం ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రి పదవులు దళితులకు కేటాయించినప్పుడే అంబేడ్కర్ ఆశయాలు అమలైనట్లు భావించాలని పేర్కొన్నారు. అఘాతం పెరుగుతోంది: చుక్కా రామయ్య పాత పద్ధతులను తల్లిదండ్రులు పిల్లలపై రుద్దడం వల్ల ఇలాంటి కుల దురహంకారాలు, పరువు హత్యలు పెరిగిపోతున్నాయని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య పేర్కొన్నారు. సమాజంలో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య తీవ్రమైన అగాథం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కుల, మతాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రణయ్ హత్య నిందితుల అరెస్టుతో సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పదవుల్లో ఉన్న వారు ఒక్కరు కూడా ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శించకపోవడం, ఘటనను ఖండించకపోవడం పీడిత వర్గాలను మరింత అణగదొక్కే ధోరణిలా కనిపిస్తోందని విమర్శించారు. అరెస్ట్ చేయాల్సిందే: రమా మేల్కొటే ప్రణయ్ హత్యకు ముందు ఆ జంటను విడదీసేందుకు బెదిరింపులకు దిగిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలను కూడా అరెస్ట్ చేయాలని ప్రొఫెసర్ రమామేల్కొటే డిమాండ్ చేశారు. పరువు హత్యలు, కులహంకార హత్యలతో సమాజాన్ని విడదీసేలా చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాచౌక్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సంతోషాన్నిచ్చినా ప్రణయ్లాంటి ఘటనలతో ఆ సంతోషం నిమిషాల్లో ఆవిరైపోతున్నాయన్నారు. పదవుల్లో ఉన్నవాళ్లు పరామర్శించాల్సింది: ‘సాక్షి’ఈడీ రామచంద్రమూర్తి ప్రణయ్ సంఘటనను పదవుల్లో ఉన్నవారు ఖండించపోవడం, కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం విచారకరమని ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. సీఎం కానీ, దళిత ఉపముఖ్యమంత్రి కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉంటే దళితుల్లో ధైర్యం పెరిగేదన్నారు. ఇందిరాగాంధీ పదవిలో ఉన్నప్పుడు బిహార్‌లో జరిగిన ఇలాంటి ఓ హత్య సమయంలో వేగంగా స్పందించారన్నారు. ఘటనా స్థలికి వెళ్లేందుకు మార్గం లేకపోయినా ఏనుగుపై వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారన్నారు. నెహ్రూ, ఇందిర కుటుంబాలను దళితులు ఎప్పుడూ మరవలేరని చెప్పారు. ప్రణయ్ హత్యను సమాజం మొత్తం ఖండించాలని, ఇది దళిత హక్కులను కాలరాసేలా కనిపిస్తోందని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని మేధావులు, పెద్దలు ఈ ఘటనను ఖండించాలన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సురేశ్‌చంద్ర హరి, సెంటర్ ఫర్దళిత్ స్టడీస్ ప్రతినిధులు, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి: జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ఒకప్పుడు పరువు హత్యలంటే ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరిగేవని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ పరువు హత్యలు, కుల హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కులాలుండవని, అక్కడ 90 శాతం ప్రేమ వివాహాలే జరుగుతున్నట్లు చెప్పారు. సమాజ సమస్యగా మారుతున్న ప్రణయ్ హత్యలాంటి ఘటనలను నియంత్రించాలన్నా, నిరోధించాలన్నా కులాంతర వివాహాలను ప్రభుత్వాలే పోత్సహించాలని డిమాండ్ చేశారు. -
'371డి రద్దు చేస్తామనడం బాధాకరం'
హైదరాబాద్: ఆర్టికల్ 371డి రద్దు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడం బాధాకరంగా ఉందని జస్టిస్ లక్ష్మణరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఇక్కడ విశ్రాంత ఐజీ హనుమంతారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. జోనల్ వ్యవస్థ రద్దు చేస్తే రాయలసీమలో నిరుద్యోగం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రాజెక్టులన్నీ ఆంధ్ర ప్రాంతానికే పరిమితం అవుతున్నాయి. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రాజధాని కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసే బదులు.. రాయలసీమ అభివృద్ధికి యత్నించాలి. రాయలసీమకు న్యాయం చేయకుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాల్సి వస్తుంది' అని రిటైర్డ్ ఐజీ హనుమంతారెడ్డి అన్నారు. -
ముందు ఓటింగ్ చేపట్టాలి: లక్ష్మణ్‌రెడ్డి
సాక్షి, చిత్తూరు: ‘‘అసలు రాష్ట్ర విభజన అవసరమా? కాదా? విభజన అసెంబ్లీకి సమ్మతమేనా కాదా? అన్న దానిపై అసెంబ్లీలో మొదట చర్చ జరగాలి. ఒకవేళ విభజన చేయాలని నిర్ణయిస్తే.. ఏ రకంగా విభజన చేయాలి అన్నది ఆ తర్వాత చర్చించాలి. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2013 క్లాజ్ 1లోనే ఉంది. ఆ క్లాజ్ 1పై అసెంబ్లీలో చర్చమొదలైనప్పుడే.. ఈ అంశం చర్చకు పెట్టాలి. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా శాసనసభ వ్యవహరించాలి. అందులో మెజారిటీ సభ్యుల అభిప్రాయమే.. సభ అభిప్రాయం అవుతుంది. ఈ అభిప్రాయం తెలుసుకోవాలంటే.. తప్పకుండా ఓటింగ్ జరగాలి’’ అని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. క్లాజ్ 1పై ఓటింగ్ చేపట్టి మెజారిటీ అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత.. మిగతా క్లాజులపై చర్చించాలని చెప్పారు. గురువారం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. వాస్తవానికి అసెంబ్లీ తీర్మానం చేయాలి.. ‘‘దేని మీదైనా చట్టం చేసేందుకు పార్లమెంటుకు అధికారం ఉన్నా కూడా.. రాష్ట్ర విభజనకు సంబంధించి చట్టం చేసే అధికారం ఇంతకుముందు పార్లమెంటుకు లేదు. అందుకోసమే ఆర్టికల్ 3 ద్వారా దానికి అధికారం కల్పించారు. ఆ అధికారం కల్పించేటపుడే పార్లమెంటుకు కొన్ని పరిమితులు పెట్టారు. వాటిలో మొదటిది.. రాష్ట్రపతి సిఫారసు లేకుండా విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి వీల్లేదు. రాష్ట్రపతి సిఫారసు చేయాలంటే.. ముందు ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాలి. ఆ అభిప్రాయాన్ని బట్టి విభజనకు సిఫారసు చేయాలా లేదా అని రాష్ట్రపతి తీర్మానించుకోవడానికి అవకాశముంటుంది. అందువల్లే ఇంతవరకు జరిగిన విభజనల విషయంలో అసెంబ్లీ అభిప్రాయం తీసుకొని.. తర్వాత విభజన బిల్లు తయారు చేసేవారు’’ అని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. తీర్మానం చేస్తామన్న సీఎం.. అలాచేయలేదు.. ‘‘2009లో కేంద్ర మంత్రి చిదంబరం విభజన ప్రకటన చేసినప్పుడు కూడా... విభజన చేయాలంటే.. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపండి అని కోరారు. ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం పంపకుండానే.. ఒకేసారి బిల్లు పంపేశారు. కాబట్టి ఇప్పుడు మొదట చేయాల్సింది.. అసలు రాష్ట్ర విభజన అసెంబ్లీకి సమ్మతమా కాదా? అన్న దానిపై చర్చ జరగాలి. మొదటే సమైక్య తీర్మానం చేసి ఉంటే బాగుండేది. బిల్లు వచ్చినప్పుడే తీర్మానం చేస్తామన్న ముఖ్యమంత్రి తర్వాత.. అలా తీర్మానం చేయడానికి అంగీకరించలేదు. మొదట బిల్లును ప్రవేశపెట్టాలంటే.. నేను సభలో విభజన బిల్లు ప్రవేశపెట్టవచ్చా అని సభా నాయకుడు స్పీకర్‌ను అడగాలి. కానీ మన అసెంబ్లీలో విచిత్రంగా అలాంటిదేమీ లేకుండా బిల్లు పెట్టారు’’ అని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. -
రాజకీయ ప్రయోజనాల కోసమే విభజన: లక్ష్మణరెడ్డి
ధర్మవరం: రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సమైక్యత కోరుతూ శాసనసభ్యులతో ప్రమాణ పత్రం తీసుకునేందుకు ఆదివారం అనంతపురం జిల్లా ధర్మవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ తీర్మానానికి వస్తే శాసనసభ్యులు వ్యతిరేకంగా ఓటు వేసేలా ప్రమాణ పత్రం తీసుకుంటున్నామన్నారు. విభజనకు వ్యతిరేకంగా తమ సంఘం ఆధ్వర్యంలో త్వరలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఒక వేళ విభజన బిల్లు అసెంబ్లీకి రాకుండా రాష్ట్రపతి అనుమతితో పార్లమెంట్లో పెడితే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోను రాష్ట్ర విభజన జరగ దన్నారు. విభజన అంశం కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడుతున్న మైండ్‌గేమ్ లో ఒక భాగం మాత్రమేనన్నారు. రాయల తెలంగాణ ఒట్టి బూటకమన్నారు. సీమాంధ్ర మంత్రులు తమ పదవులను కాపాడుకునేందుకు ఇలా డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రాయల తెలంగాణ ఏర్పడితే అనంతపురం, కర్నూలు జిల్లాలకు తాగునీటిని ఎక్కడి నుంచి తీసుకువస్తారని ఆయన ప్రశ్నించారు. భద్రాచలం వాసులు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని కేసీఆర్ అంటున్నారని.. ప్రజల అభీష్టం ప్రకారమే నడుచుకుంటుంటే.. మరి సీమాంధ్రులు కలిసి ఉందామంటున్నారు.. అలాగే ఉండనివ్వండి... అని ఆయన అన్నారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ బదులు తెలంగాణ రాష్ర్టం అని మార్చుకోవాలని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాటకాలాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘2008లో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చాను.. ఇప్పుడు ఆ లేఖను వెనక్కి తీసుకోలేనని చెబుతున్నారు.. మరి అదే తరహాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా లేఖ ఇచ్చింది.. అయితే అధిక శాతం మంది ప్రజలు రాష్ట్ర సమైక్యతను కోరుకుంటున్నారు కనుక ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూఆ లేఖను వెనక్కి తీసుకోలేదా..?’ అని గుర్తు చేశారు.