అమరావతి నిర్మాణం పేరిట రూ.లక్ష కోట్ల స్కాం జరిగిందని నాతో కొంతమంది ఎన్నారైలు అన్నారు. అప్పట్లో వారు అతిగా చెబుతున్నారనుకున్నా.. కానీ ఇప్పుడు చూస్తే లక్ష కోట్లు కాదు.. ఇంకా ఎక్కువే స్కాం జరిగిందనిపిస్తోంది. ఆర్బీఐకి స్థలం ఎకరానికి రూ.4 కోట్లకి ఇచ్చారు. ప్రైవేట్ విద్యా సంస్థలు, ఆస్పత్రులకు రూ.50 లక్షలకే ఇస్తున్నారు. మిగతా మూడున్నర కోట్లు ఎక్కడకు పోతోందో?
– జస్టిస్ లక్ష్మణరెడ్డి
కొన్నాళ్ల క్రితం వరకు ఎమ్మెల్యేలు చెప్పినట్టే చేయాలనే వారు.. ఇప్పుడు ఏకంగా కార్యకర్తలకూ ప్రాధాన్యం ఇవ్వాలం టున్నారు. నియోజకవర్గ నిధులను అధికార పార్టీ ఎమ్మెల్యేలకే కాకుండా ఆ పార్టీ నేతలకూ ఇస్తున్నారు. ప్రజాస్వామ్యం ఇలా ఉంటే ఏమనుకోవాలి?.. ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమవుతోంది.
సాక్షి, విశాఖపట్నం: రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో రూ.లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని దుయ్యబట్టారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను అనర్హులను చేయకపోవడం అన్యాయమన్నారు. ఇలాంటి వారిని ఆయా నియోజకవర్గాల ప్రజలు నిలదీయాలని కోరారు. ఆదివారం విశాఖలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే...
‘‘పాలక పార్టీలో ప్రజాస్వామ్యం లేదు. వాస్తవ పరిస్థితులు చెప్పేవారు లేరు. ఎన్నికలయ్యాక రాజకీయాలు మరచిపోయి అందరికీ సమ న్యాయం చేయాల్సిన బాధ్యత పాలక పార్టీలపై ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆ విషయం మరచిపోయి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచింది. పరిపాలన గురించి మాట్లాడాల్సిన కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో టీడీపీ కార్యకర్తలకు సహకరించాలని సీఎం మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించింది. కొన్నాళ్ల క్రితం వరకు ఎమ్మెల్యేలు చెప్పినట్టే చేయాలనే వారు.. ఇప్పుడు ఏకంగా కార్యకర్తలకూ ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. నియోజకవర్గ నిధులను అధికార పార్టీ ఎమ్మెల్యేలకే కాకుండా ఆ పార్టీ నేతలకూ ఇస్తున్నారు. ప్రజాస్వామ్యం ఇలా ఉంటే ఏమనుకోవాలి?.. ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమవుతోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి స్కాం రూ.లక్ష కోట్లకు పైనే..
‘‘అమరావతి నిర్మాణం పేరిట రూ.లక్ష కోట్ల స్కాం జరిగిందని గతంలో నాతో కొంతమంది ఎన్నారైలు అన్నారు. అప్పట్లో వారు అతిగా చెబుతున్నారనుకున్నా.. కానీ ఇప్పుడు చూస్తే లక్ష కోట్లు కాదు.. ఇంకా ఎక్కువే స్కాం జరిగిందనిపిస్తోంది. ఆర్బీఐకి స్థలం కావలసి వస్తే ఎకరానికి రూ. 4 కోట్లు వసూలు చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు, ఆస్పత్రులకు రూ.50 లక్షలకే ఇస్తున్నారు. మిగతా మూడున్నర కోట్లు ఎక్కడకు పోతుందో అర్థం చేసుకోవచ్చు’’. ఇదంతా లెక్కలేస్తే లక్ష కోట్లు దాటిపోతోంది. అమరావతిలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ప్రభుత్వానికి ఈ దళారీ పని ఎందుకు? అన్నారు.
వాళ్లు నిజాలు చెబుతుంటే కళ్లు తిరిగాయి..: ఉండవల్లి
మాజీ చీఫ్ సెక్రటరీలు ఐవైఆర్ కృష్ణారావు, అజేయకల్లంలు చెబుతున్న నిజాలు వింటుంటే కళ్లు తిరిగాయని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘నా రాజకీయ జీవితంలో ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు. 1996లో వచ్చిన తుపాను సహాయక చర్యల్లో ముందుగా పాల్గొన్నందుకు అప్పటి సీఎం చంద్రబాబు కలెక్టర్ రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని సస్పెండ్ చేశారు. పనిచేస్తే విపత్తు వస్తుందన్న పరిస్థితి అధికారుల్లో ఉంది. ఏం చేస్తే అధికార పార్టీ నేతల్లో మార్పు వస్తుందో ప్రజలు కూడా ఆలోచించాలి. మీ ప్రాంతంలో జరిగే అవినీతిపైనా స్పందించాలి.’ అని పేర్కొన్నారు. ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు పంచాయితీరాజ్ వ్యవస్థను ఖూనీ చేశాయని ఆరోపించారు. చంద్రన్న పేరిట వివిధ కార్డులపై సీఎం ఫోటోలు ముద్రిస్తున్నారని, ఈ ప్రభుత్వం మారిపోతే మళ్లీ కొత్తకార్డులు ముద్రిస్తారని, ఆ ఖర్చు ప్రజలపైనే పడుతుందని చెప్పారు. ప్రచారం సీఎంకి, భారం ప్రజలకా? అని ప్రశ్నించారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ అమరావతి పేరిట అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకరిస్తూ ఇతర ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. యూపీఎస్సీ మాజీ ఇన్‌చార్జి చైర్మన్ కేఎస్ చలం మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పాలకులు వివక్ష చూపుతున్నారని, విశాఖను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. సదస్సులో ఏయూ మాజీ వీసీ కెవీ రమణ, ఏయూ ప్రొఫెసర్లు పీవీ ప్రసాదరెడ్డి, పద్దయ్య, డాక్టర్ పి.వి.రమణమూర్తి, ఏపీ నిరుద్యోగ సమితి జేఏసీ చైర్మన్ సమయం హేమంత్‌కుమార్, విశ్లేషకులు సురేష్, రవికుమార్ తదితరులు మాట్లాడారు.
ఆ ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హులను చేయరు?
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి మారితే ఆటోమేటిక్‌గా అనర్హులవుతాన్నారు. ఏదైనా వివాదం వచ్చినప్పుడు మాత్రమే స్పీకర్‌కు రిఫర్ చేయాలని చట్టం చెబుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వివాదం ఏమీ లేదు. పబ్లిగ్గా పార్టీలు మారుతున్నట్టు చెప్పారు. స్వయంగా సీఎం వారికి కండువాలు కప్పారు. ఇందులో వివాదానికే తావులేదు. అయినా స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హులను చేయరు? ఇలాంటి ఫిరాయింపులపై ప్రజల్లో చైతన్యం వచ్చి నిలదీయాలని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment