రాజకీయ ప్రయోజనాల కోసమే విభజన: లక్ష్మణరెడ్డి
ధర్మవరం: రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సమైక్యత కోరుతూ శాసనసభ్యులతో ప్రమాణ పత్రం తీసుకునేందుకు ఆదివారం అనంతపురం జిల్లా ధర్మవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ తీర్మానానికి వస్తే శాసనసభ్యులు వ్యతిరేకంగా ఓటు వేసేలా ప్రమాణ పత్రం తీసుకుంటున్నామన్నారు. విభజనకు వ్యతిరేకంగా తమ సంఘం ఆధ్వర్యంలో త్వరలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఒక వేళ విభజన బిల్లు అసెంబ్లీకి రాకుండా రాష్ట్రపతి అనుమతితో పార్లమెంట్‌లో పెడితే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోను రాష్ట్ర విభజన జరగ దన్నారు. విభజన అంశం కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడుతున్న మైండ్‌గేమ్ లో ఒక భాగం మాత్రమేనన్నారు.
రాయల తెలంగాణ ఒట్టి బూటకమన్నారు. సీమాంధ్ర మంత్రులు తమ పదవులను కాపాడుకునేందుకు ఇలా డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రాయల తెలంగాణ ఏర్పడితే అనంతపురం, కర్నూలు జిల్లాలకు తాగునీటిని ఎక్కడి నుంచి తీసుకువస్తారని ఆయన ప్రశ్నించారు. భద్రాచలం వాసులు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని కేసీఆర్ అంటున్నారని.. ప్రజల అభీష్టం ప్రకారమే నడుచుకుంటుంటే.. మరి సీమాంధ్రులు కలిసి ఉందామంటున్నారు.. అలాగే ఉండనివ్వండి... అని ఆయన అన్నారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ బదులు తెలంగాణ రాష్ర్టం అని మార్చుకోవాలని సూచించారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాటకాలాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘2008లో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చాను.. ఇప్పుడు ఆ లేఖను వెనక్కి తీసుకోలేనని చెబుతున్నారు.. మరి అదే తరహాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా లేఖ ఇచ్చింది.. అయితే అధిక శాతం మంది ప్రజలు రాష్ట్ర సమైక్యతను కోరుకుంటున్నారు కనుక ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూఆ లేఖను వెనక్కి తీసుకోలేదా..?’ అని గుర్తు చేశారు.