ముందు ఓటింగ్ చేపట్టాలి: లక్ష్మణ్‌రెడ్డి
సాక్షి, చిత్తూరు: ‘‘అసలు రాష్ట్ర విభజన అవసరమా? కాదా? విభజన అసెంబ్లీకి సమ్మతమేనా కాదా? అన్న దానిపై అసెంబ్లీలో మొదట చర్చ జరగాలి. ఒకవేళ విభజన చేయాలని నిర్ణయిస్తే.. ఏ రకంగా విభజన చేయాలి అన్నది ఆ తర్వాత చర్చించాలి. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2013 క్లాజ్ 1లోనే ఉంది. ఆ క్లాజ్ 1పై అసెంబ్లీలో చర్చమొదలైనప్పుడే.. ఈ అంశం చర్చకు పెట్టాలి. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా శాసనసభ వ్యవహరించాలి. అందులో మెజారిటీ సభ్యుల అభిప్రాయమే.. సభ అభిప్రాయం అవుతుంది. ఈ అభిప్రాయం తెలుసుకోవాలంటే.. తప్పకుండా ఓటింగ్ జరగాలి’’ అని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. క్లాజ్ 1పై ఓటింగ్ చేపట్టి మెజారిటీ అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత.. మిగతా క్లాజులపై చర్చించాలని చెప్పారు. గురువారం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు.
వాస్తవానికి అసెంబ్లీ తీర్మానం చేయాలి..
‘‘దేని మీదైనా చట్టం చేసేందుకు పార్లమెంటుకు అధికారం ఉన్నా కూడా.. రాష్ట్ర విభజనకు సంబంధించి చట్టం చేసే అధికారం ఇంతకుముందు పార్లమెంటుకు లేదు. అందుకోసమే ఆర్టికల్ 3 ద్వారా దానికి అధికారం కల్పించారు. ఆ అధికారం కల్పించేటపుడే పార్లమెంటుకు కొన్ని పరిమితులు పెట్టారు. వాటిలో మొదటిది.. రాష్ట్రపతి సిఫారసు లేకుండా విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి వీల్లేదు. రాష్ట్రపతి సిఫారసు చేయాలంటే.. ముందు ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాలి. ఆ అభిప్రాయాన్ని బట్టి విభజనకు సిఫారసు చేయాలా లేదా అని రాష్ట్రపతి తీర్మానించుకోవడానికి అవకాశముంటుంది. అందువల్లే ఇంతవరకు జరిగిన విభజనల విషయంలో అసెంబ్లీ అభిప్రాయం తీసుకొని.. తర్వాత విభజన బిల్లు తయారు చేసేవారు’’ అని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు.
తీర్మానం చేస్తామన్న సీఎం.. అలాచేయలేదు..
‘‘2009లో కేంద్ర మంత్రి చిదంబరం విభజన ప్రకటన చేసినప్పుడు కూడా... విభజన చేయాలంటే.. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపండి అని కోరారు. ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం పంపకుండానే.. ఒకేసారి బిల్లు పంపేశారు. కాబట్టి ఇప్పుడు మొదట చేయాల్సింది.. అసలు రాష్ట్ర విభజన అసెంబ్లీకి సమ్మతమా కాదా? అన్న దానిపై చర్చ జరగాలి. మొదటే సమైక్య తీర్మానం చేసి ఉంటే బాగుండేది. బిల్లు వచ్చినప్పుడే తీర్మానం చేస్తామన్న ముఖ్యమంత్రి తర్వాత.. అలా తీర్మానం చేయడానికి అంగీకరించలేదు. మొదట బిల్లును ప్రవేశపెట్టాలంటే.. నేను సభలో విభజన బిల్లు ప్రవేశపెట్టవచ్చా అని సభా నాయకుడు స్పీకర్‌ను అడగాలి. కానీ మన అసెంబ్లీలో విచిత్రంగా అలాంటిదేమీ లేకుండా బిల్లు పెట్టారు’’ అని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.