మారుతిరావు ఆత్మహత్య | Maruti Rao Lost Breath In Vysya Bhavan Hyderabad | Sakshi
Sakshi News home page

మారుతిరావు ఆత్మహత్య

Published Mon, Mar 9 2020 1:50 AM | Last Updated on Mon, Mar 9 2020 9:41 AM

Maruti Rao Lost Breath In Vysya Bhavan Hyderabad - Sakshi

పంజగుట్ట/అఫ్జల్‌గంజ్‌: సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతిరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. న్యాయవాదిని కలవడానికి నగరానికి వచ్చిన ఆయన ఖైరతాబాద్‌లోని వైశ్యభవన్‌లో బసచేశారు. ఆదివారం తాను ఉంటున్న గదిలో విగతజీవిగా కనిపించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఆయన విషం తాగి ఆత్మహ త్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు. మారుతిరావు బసచేసిన గదిలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది.

న్యాయవాదిని కలుస్తానని నగరానికి.. 
మారుతిరావు న్యాయవాదిని కలిసివస్తానని కుటుంబసభ్యులకు చెప్పి శనివారం తన వాహనంలో డ్రైవర్‌ బెల్లంకొండ రాజేష్‌తో కలిసి నగరానికి వచ్చారు. ఖైరతాబాద్‌ చింతల్‌బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌కు వచ్చిన ఆయన మూడో అంతస్తులోని 306 నంబర్‌ గదిలో బస చేశారు. న్యాయవాది వస్తారని డ్రైవర్‌తో చెప్పిన మారుతిరావు, డ్రైవర్‌ను కారులోనే ఉండమన్నారు. అనంతరం డ్రైవర్‌ను పిలిచి ఎదురుగా ఉన్న మిర్చిబండి నుంచి గారెలు, కారు లో ఉన్న కాగితాలు తేవాలని చెప్పారు. అవి తీసుకున్న మారుతిరావు.. అన్నం తిని కారులోనే పడుకోవాలని డ్రైవర్‌కు చెప్పి తన గదికి వెళ్లిపోయారు. రాత్రి 9 గంటలకు గదిలో ఏసీ పని చేయట్లేదని వైశ్యభవన్‌ రిసెప్షన్‌కు ఫోన్‌ చేయడంతో సిబ్బంది మరమ్మతులు చేసి వెళ్లారు. తర్వాత ఆయన గది తలుపులు వేసుకున్నారు.

తెల్లారేసరికి విగతజీవిగా.. 
ఆదివారం ఉదయం మిర్యాలగూడ నుంచి గిరిజ తన భర్త మారుతిరావుకు ఫోన్‌చేయగా, స్పందించలేదు. దీంతో ఆమె డ్రైవర్‌కు ఫోన్‌చేసి చెప్పారు. డ్రైవర్‌.. మారుతిరావు గది వద్దకు చేరుకుని డోర్‌ కొట్టగా, తీయలేదు. అతను గిరిజకు ఫోన్‌చేసి చెప్పగా, ఆమె మరోసారి ప్రయత్నించాలని చెప్పారు. అయినా స్పందించకపోవడంతో రాజేష్‌ రిసెప్షన్‌లో ఉన్న వైశ్యభవన్‌ ఉద్యోగి మల్లికార్జున్‌కు చెప్పాడు. ఆయన సైతం విఫలయత్నం చేసి.. విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనతో సైఫాబాద్‌ పోలీసులకు తెలిపారు. పోలీసులు మారుతిరావు గది డోర్‌ను గట్టిగా నెట్టడంతో లోపలి టవర్‌ బోల్ట్‌ ఊడి, తలుపు తెరుచుకుంది. గదిలో మంచంపై విగతజీవిగా పడి ఉన్న మారుతిరావును గుర్తించారు. అప్పటికే గిరిజ కొత్త్తపేటలో ఉండే మారుతిరావు సమీప బంధువు రఘుకు సమాచారమివ్వడంతో ఆయన అక్కడకు చేరుకున్నారు. పోలీసులు 108ను పిలిపించారు. ఆ సిబ్బంది మారుతిరావు మరణించినట్లు చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మారుతిరావు మరణాన్ని ధ్రువీకరించడంతో మార్చురీకి చేర్చారు.

‘అమృతా.. అమ్మ దగ్గరకు వెళ్లు’ 
మారుతిరావు గదిలో సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. అందులో ‘గిరిజా క్షమించు.. అమృతా అమ్మ దగ్గరకు రా అమ్మా’ అని ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మారుతిరావు తీసుకున్న విషం తాలూకు ఆనవాళ్లు, డబ్బా, సీసా గదిలో లభించలేదు. దీంతో ఆయన మరో ప్రాంతంలో విషం తీసుకుని గదిలోకి వచ్చి ఉంటా రని భావిస్తున్నారు. మారుతిరావు చనిపోయే ముందు తన రెండు చేతుల్నీ మూతి వద్దకు తీసుకువెళ్లడంతో అలానే ఉండిపోయాయి. విష ప్రభావాన్ని తట్టుకోలేక ఆయన అలా చేసి ఉంటారని, గదిలో వాంతులు సైతం చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు వైశ్యభవన్‌కు వచ్చారు. పోలీసులు, క్లూస్‌టీం మారుతిరావు కారును, సెల్‌ఫోన్, బ్యాగులోని బట్టలు తదితరాలు పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.

మా కుటుంబానికి అన్యాయం జరిగింది.. 
మారుతిరావు కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నా రని, వైశ్యభవన్‌కు వచ్చిన ప్రతిసారీ తన డ్రైవర్‌కు కూడా గది తీసుకునే వారని తెలిసింది. ఈసారి అలా చేయకపోవడంతో ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, భర్త మృతదేహాన్ని చూసిన గిరిజ కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పటికే కూతురు దూరమైందని, ఇప్పడు భర్త ఆత్మహత్యతో తమకుటుంబానికి అన్యాయం జరిగిందని విలపించారు. మీడియాలో విస్తృత ప్రచారం వల్లే తమకీ దుస్థితి వచ్చిందని మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన సోదరుడు శ్రావణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయాలని, ఊహాకల్పనలతో రాయవద్దని కోరారు. చివరిసారిగా మారుతిరావుతో గత మే 17న మాట్లాడానని తెలిపారు. కేసుల విషయంలో మారుతిరావుపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఉస్మానియా మార్చురీలో మారుతిరావు మృతదేహానికి పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అక్కడి నుంచి స్వస్థలం మిర్యాలగూడకు తరలించారు. మారుతిరావు శరీరం నుంచి సేకరించిన విస్రాను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నారు. ఆ నివేదికలు వస్తేనే మారుతిరావు ఏ విషం తాగారన్నది తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

నాడేం జరిగిందంటే..
తన కుమార్తె అమృతను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నాడని 2018 సెప్టెంబర్‌ 14వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్‌ అనే యువకుడిని  మారుతిరావు కిరాయి రౌడీలతో హత్య చేయించినట్లు కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేయడంతో మారుతీరావు 7 నెలలపాటు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇటీవల మిర్యాలగూడలో మారుతిరావుకు చెందిన ఓ షెడ్డులో గుర్తుతెలియని మృతదేహం లభించడం కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లో మారుతిరావు బలవన్మరణానికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రణయ్‌ హత్య కేసులో శిక్ష తప్పదనే ఆందోళనతోపాటు తన ఆస్తుల వ్యవహారంలో కుటుంబ సభ్యులతో గొడవల వల్ల మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

చనిపోయినట్టు తెలియదు
 
తన తండ్రి మారుతిరావు చనిపోయిన విషయం తెలియదని, ఆయన కుమార్తె, ప్రణయ్‌ భార్య అమృత మీడియాకు తెలిపింది. మారుతిరావు హైదరాబాద్‌లో మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆదివారం ఉదయం మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్‌ నివాసం వద్దకు చేరుకున్నారు. దీనిపై అమృతను ప్రశ్నించగా ‘పట్టణానికి చెందిన మారుతిరావు అనే వ్యక్తి చనిపోయాడని టీవీల్లో వచ్చింది. చనిపోయింది మా నాన్న మారుతిరావే అనే విషయంలో స్పష్టత లేదు. ఒకవేళ ఆయన చనిపోతే సోమవారం నేనే మీడియా ముందుకు వస్తా’అని చెప్పింది.

రెండు కుటుంబాలు ఆగం
 
మారుతిరావు చనిపోయిన విషయం మాకు తెలియదు, ఒకవేళ ఆయన చనిపోతే మాత్రం రెండు కుటుంబాలు ఆగమైనట్లే. మారుతిరావు ఆత్మహత్యపై మాకెలాంటి సమాచారం లేదు. ఒకవైపు మా కుటుంబం, మరోవైపు ఆయన కుటుంబం ఆగమయ్యాయి. – బాలస్వామి, ప్రణయ్‌ తండ్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement