విజయాల హోరు–విలువల బేజారు | tricoloumn by ramachandra moorthy | Sakshi
Sakshi News home page

విజయాల హోరు–విలువల బేజారు

Published Sun, Jul 30 2017 1:01 AM | Last Updated on Tue, Sep 5 2017 5:10 PM

విజయాల హోరు–విలువల బేజారు

విజయాల హోరు–విలువల బేజారు

త్రికాలమ్‌
దేశంలోని వివిధ రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధీనంలోకి వస్తున్నాయి. ప్రతిపక్ష రాజకీయ నాయకులు బీజేపీకి వరుసకట్టి విధేయత ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకులలో సమర్థులుగా, జనాదరణ ఉన్నవారుగా గుర్తింపు పొందినవారు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడి అధికార బీజేపీలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్రమోదీకి దీటైన ప్రత్యర్థిగా, ప్రతిపక్షాల అభ్యర్థిగా రంగంలో నిలిచి 2019 ఎన్నికలలో  పోరాటం చేస్తారని అనుకున్న బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఆర్‌జేడీ నేత లాలూప్రసాద్‌తో తెగ తెంపులు చేసుకొని మహాఘటబంధన్‌ నుంచి నిష్క్రమించి ఎన్‌డీఏ శిబిరంలోకి అత్యంత లాఘవంగా గెంతేశారు. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ను నిర్మిస్తానంటూ నరేంద్రమోదీ 2014 ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రతిజ్ఞను అక్షరాలా పాటిస్తున్నారంటూ జాతీయ మీడియా ప్రశంసిస్తోంది. కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ తన పార్టీ నుంచి బీజేపీకి వలసలు ఆపలేక సమస్యల సుడిగుండంలో చిక్కుకొని దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టా డుతున్నట్టు మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చాకచక్యాన్నీ, చాణక్యాన్నీ, చమత్కారాన్నీ మనస్ఫూర్తిగా అభి నందిస్తున్నాయి. అధికార రంధిలో రాజకీయ నాయకులు అనైతిక విన్యా సాలు చేయడాన్ని సామాన్య మానవులు ఎట్లా పరిగణిస్తున్నారు? ఏ తీరానికి ఈ ప్రస్థానం?

మూడేళ్ళ కిందట ఎన్నికలలో అనూహ్యమైన ఆధిక్యంతో, అట్ట హాసంగా గెలిచిన బీజేపీ నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ(టీడీపీ), తెలం గాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అధికారంలోకి వచ్చాయి. పరిపాలనలో హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఎవరి శైలిలో వారు పరిపాలిస్తు న్నారు. కానీ ప్రభుత్వాల పనితీరు రాజ్యాంగసమ్మతంగా ఉన్నదా? ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకోవడానికి దోహదం చేస్తుందా? రాజకీయాల పట్ల ప్రజలలో విశ్వాసం పెంపొందిస్తుందా?

నిరర్థక రాజకీయం
అన్ని రకాలా భ్రష్టుపట్టిన యూపీఏ–2 ప్రభుత్వం పోయి నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్‌డీఏ–2 ప్రభుత్వం రావడం దేశ ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చిన సన్నివేశం. మూడేళ్ల పాలనలో మోదీ సమర్థమైన ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. అవినీతి ఆరోపణలు లేని ప్రభుత్వంగా ఎన్‌డీఏ–2 సర్కార్‌ను ప్రజలు పరిగణిస్తున్నారు. వివిధ దేశాలలో పర్యటించి దౌత్యరంగంలో భారత్‌ను కొత్తపుంతలు తొక్కించిన ఘనత మోదీదే. కాంగ్రెస్‌ సంస్కృతికి భిన్నంగా, వాజపేయి వ్యవహారశైలికి సైతం దూరంగా తనదంటూ ప్రత్యేక బాణిని రూపొందించుకొని సమర్థ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీ, బిహార్, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలలో అపజయాలను మినహాయిస్తే ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలోనూ విజయశంఖం పూరించిన మోదీ–షా ద్వయం అజేయమైన జట్టుగా నిలిచి జాతిని అబ్బురపరుస్తున్నారు. వీరిని ఎదిరించి గెలవగల ధీరులు ప్రతి పక్షాలలో ఎవ్వరూ లేరనే అభిప్రాయం ప్రజలలో బలపడుతోంది. గెలుపే ప్రధానంగా, మార్గం కంటే లక్ష్యం ప్రధానమనే ధోరణిలో అధికార పక్షాలు వ్యవహరిస్తున్నాయి. ఇది ముమ్మాటికీ నిరర్థకమైన,ఆత్మహత్యాసదృశమైన రాజకీయం.

దేశంలో ఈ రోజున అత్యంత అధికంగా ప్రజాదరణ కలిగిన నాయకుడు మోదీ అనడంలో ఎవ్వరికీ సందేహం లేదు. ప్రతిపక్ష నాయకులు కూడా అంగీకరించవలసిన వాస్తవం ఇది. కానీ మోదీ వచ్చినప్పటి నుంచీ వివిధ రాష్ట్రాలలో అధికార పార్టీలు, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో అవసరం ఉన్నా లేకపోయినా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కిన తీరు ముమ్మాటికి ఆక్షేపణీయం, ప్రమాదకరం. ఇది కొత్తగా వచ్చిన జాడ్యం కాదు. ఇందిరాగాంధీ కాలంలో వివిధ రాష్ట్రాలలోని ప్రతిపక్షాలను అస్థిరపరచిన సందర్భాలు అనేకం. కాంగ్రెస్‌ చేసింది కనుక బీజేపీ కూడా అదే తప్పు చేయడాన్ని సమర్థిస్తామంటే కాంగ్రెస్‌ కంటే బీజేపీ ఏ విధంగా భిన్నమైనది? కాంగ్రెస్‌ కంటే టీడీపీ కానీ టీఆర్‌ఎస్‌ కానీ ఎట్లా నైతికంగా ఉన్న తమైనవి? కాంగ్రెస్‌ చేసిన రాజ్యాంగ వ్యతిరేక చర్యలను పరిహరిస్తే, రాజ్యాం గబద్ధంగా మాత్రమే వ్యవహరిస్తే కాంగ్రెస్‌ కంటే బీజేపీ ఉన్నతమైన పార్టీగా స్థాపితం అవుతుంది. ఇతర పార్టీ నేతలను బీజేపీ శిబిరం లోకి ఆహ్వానించడం ఫిరాయింపులను ప్రోత్సహించడం కాక ఏమవుతుంది? వాజపేయి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి పకడ్బందీగా రూపొందించిన ఫిరాయింపుల నిరోధక చట్టంలోనూ కంతలు వెతికి భ్రష్టరాజకీయాలకు తెరలేపడం రాజకీయ విలువలకూ, నైతిక విలువలకూ పాతర వేయడం కాదా?

రాజ్యాంగస్ఫూర్తికి తూట్లు
ఆశ్చర్యం ఏమంటే రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నామనే సంకోచం కానీ బెరుకు కానీ నేతలలో కనిపించడం లేదు. విక్టరీ సంకేతం చూపిస్తూ బోర విరిచి సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతిపక్షంలో పలుకున్న నేతల ఫిరా యింపులను ప్రోత్సహించి, వారికి బీజేపీ టిక్కెట్టు ఇచ్చి ఎన్నికలలో నిలపడం అనైతికమనే భావన అధికారపక్షంలో బొత్తిగా లేదు. ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా రాజ్యాంగ పదవులలో ఉన్నవారు ఎవ్వరూ ఉలకడం లేదు. పల కడం లేదు. కాంగ్రెస్‌లో అతిముఖ్యమైన నేతలలో మూడవ స్థానంలో ఉన్న అహ్మద్‌పటేల్‌కు రాజ్యసభ స్థానం దక్కకుండా చేసేందుకు అమిత్‌షా అత్యంత లాఘవంగా పావులు కదపడంలో భాగంగా గుజరాత్‌లో ఆరుగురు కాంగ్రెస్‌ శాసనసభ్యులు బీజేపీ వైపు ఫిరాయించారు.

ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో అన్ని పదవులూ అనుభవించిన శంకర్‌సిన్హ్‌ వఘేలా నాయకత్వంలో మరో పది మంది ఫిరాయింపునకు సిద్ధంగా ఉన్నారంటూ వఘేలా తనయుడు వెల్లడించారు. విజయానికి అవసరమైన 44 ఓట్లు అహ్మద్‌పటేల్‌కు రాబోవని అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. మిగిలినవారినైనా రక్షించుకునేందుకు నలభై మంది ఎంఎల్‌ఏలను కర్ణాటకకు తరలించారు. కోట్ల రూపాయలు ఎర చూపుతున్నారనీ, పోలీసులను ప్రయోగించి ఒత్తిడి చేస్తున్నారనీ కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎంఎల్‌ఏ లను రక్షించుకునే తెలివితేటలూ, సామర్థ్యం సోనియాగాంధీకి లేవా అంటూ మీడియా ప్రతినిధులు ఎద్దేవా చేస్తున్నారు కానీ ఇటువంటి నీతిమాలిన పనులను ప్రశ్నించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష శాసనసభ్యులను కబళించి వారిలో కొందరిని మంత్రులుగా నియమించినా రాజ్యాంగ పరిపోషకులు అభ్యంతరం చెప్పలేదు. తెలంగాణలో డిటో. ఇటీవల తమిళనాడులో శశికళ వర్గం శాసనసభ్యులను రక్షించుకునేందుకు క్యాంపు రాజకీయాలు నిర్వహించింది. ఇప్పుడు కాంగ్రెస్‌కూ అదే గతి పట్టింది. అయినా ఫలితం దక్కేది అనుమానమే.

నవజోత్‌సిద్ధూ ఒక్కరే బీజేపీని కాదని కాంగ్రెస్‌ శిబిరంలోకి నడిచారు. తక్కిన ఫిరాయింపు  నాయకులందరూ ప్రతిపక్షాల నుంచి అధికార పక్షం వైపు జంప్‌ చేసిన జిలానీలే. ఇందుకు బీజేపీ నాయకుల ప్రోత్సాహం ఉంది. రాజ్యాంగం పట్ల బేపర్వా ఉంది. నీతినియమాల పట్ల పట్టింపు లేదు. గుజరాత్‌లో నడుస్తున్న అడ్డగోలు రాజకీయంలో భాగంగానే కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన రాజ్‌పూత్‌ను పార్టీ మారిన వెంటనే రాజ్యసభ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. అస్సాంలో, అరుణాచల్‌లో, గోవాలో, మణిపూర్‌లో, ఉత్తర ప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ నుంచీ, ఇతర ప్రతిపక్షాల నుంచీ బలమైన నాయకులు బీజేపీలోకి ఫిరాయించడం రాజకీయ వ్యవస్థకు కానీ, న్యాయవ్యవస్థకు కానీ అభ్యంతరకరమైన అంశంగా కనిపించకపోవడం ఆశ్చర్యం, ఆవేదన కలిగిస్తున్నది. బహుశా యూపీఏ–2 హయాంలో పెచ్చరిల్లిన అవినీతిని చూసి రోసిన ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని బేషరతుగా సమర్థిస్తున్నారు కాబోలు. బలహీనపడుతున్నదీ, దారీతెన్నూ తెలియక అయోమయావస్థలో పడి కొట్టుకుంటున్నదీ ఒక్క కాంగ్రెస్‌ మాత్రమే కాదు. ఇతర ప్రతిపక్షాలు కూడా ఆత్మాహుతి బాటలోనే ఉన్నాయి. పట్నాలో నితీశ్‌కుమార్‌ నాటకీయ రాజ కీయం నడుస్తుంటే ఢిల్లీలో మార్క్సిస్టు పార్టీ వేదికపైన మరో రకమైన నిశ్శబ్ద యుద్ధం జరిగింది.

ఏచూరికి చుక్కెదురు
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం రాజ్యసభ సభ్యత్వం ముగిం పునకు వచ్చింది. మూడో విడత ఆయనను పశ్చిమబెంగాల్‌ నుంచి అభ్యర్థిగా నిర్ణయిస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్‌ నాయకత్వం ప్రకటించింది. కానీ సీపీఎం పొలిట్‌బ్యూరో పోయిన ఆదివారం జరిగిన సమావేశంలో ఏచూరి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. సీపీఎం అగ్రనాయకులు ఏచూరి, ప్రకాశ్‌ కరత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాజకీయాలతో ఎదిగి పార్టీలో ఉన్నతస్థాయికి చేరినవారు. వారు ఇద్దరూ రాజ్యసభలో ఉంటే పార్టీకీ, సమాజానికీ ఎంతో కొంత మేలు జరిగేది. ఇప్పుడు ఏచూరి గెలుపొందితే తర్వాత కేరళ నుంచి కరత్‌ రాజ్యసభలో ప్రవేశించవచ్చు. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాలలోని సీపీఎం నాయకులు ఏచూరిని సమర్థిస్తున్నట్టూ, కరత్‌కు కేరళ నాయకత్వం మద్దతు సంపూర్ణంగా ఉన్నట్టూ సమాచారం.

పశ్చిమబెంగాల్‌ కామ్రేడ్లు ఏచూరి అభ్యర్థిత్వంపైన పట్టుపట్టి సెంట్రల్‌ కమిటీ సమావేశంలో చర్చకు పెట్టి చివరికి ఓటింగ్‌దాగా లాగారు. ఏచూరి ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆయనకు అనుకూలంగా 30 ఓట్లూ, వ్యతిరేకంగా 50 ఓట్లూ రావడంతో మూడో విడత రాజ్యసభలో ఏచూరి ప్రవేశానికి అవకాశం లేకుండా పోయింది. కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కరత్‌కు బాసటగా నిలిచాయి. కాంగ్రెస్‌కూ, బీజేపీకీ సమాన దూరం పాటించాలన్న పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా కాంగ్రెస్‌ మద్దతు స్వీకరించే ప్రశ్న లేదని సీపీఎం అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ భావించింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు చట్టసభలలో ప్రవేశించి కాలక్షేపం చేయకుండా పార్టీ నిర్మాణంలో నిమగ్నం కావాలన్న వాదన కూడా ఉన్నది.

కరత్‌ మితవాది.  సీపీఎం అగ్రనేత  జ్యోతిబసుకు 1996లో ప్రధాని పదవి దక్కే అవకాశం వచ్చినప్పుడు కాదూ కూడదూ అంటూ పార్టీ తీర్మా నించింది కరత్‌ ధోరణి వల్లనే. తాను రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్నది సీపీఏం సెంట్రల్‌ కమిటీయేనని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడూ, లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ వారంరోజుల కిందట బెంగాలీ దినపత్రిక ‘ఆజ్‌ కల్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కరత్‌కు భిన్నంగా ఏచూరి కాస్త ఉదారవాది. మాజీ ప్రధాన కార్యదర్శి హర్‌కిషన్‌సింగ్‌ సూర్జిత్‌ మార్గం ఏచూరిది. ప్రతిపక్ష శిబిరంలో ఎప్పుడు వివాదం వచ్చినా తీర్పరిగా  సూర్జిత్‌ వ్యవహరించేవారు. కాంగ్రెస్‌కు దగ్గరగా, బీజేపీకి దూరంగా ఉండేవారు.  సీపీఎం సెంట్రల్‌ కమిటీలో తెలుగు రాష్ట్రాల సభ్యులలో అత్యధికులు ప్రకాశ్‌ కరత్‌ అనుయాయులు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి బివి రాఘవులు, పి మధు, ఎంఏ గఫూర్, పాటూరు రామయ్య, పుణ్యవతి సభ్యులు కాగా తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, ఎస్‌ వీరయ్య, సిహెచ్‌ సీతారాములు సభ్యులు. మల్లు స్వరాజ్యం శాశ్వత ఆహ్వానితురాలు. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో వీరిలో అత్యధికులు ఏచూరికి వ్యతిరేకంగా ఓటు చేయడం విశేషం. ఎడతెగని విభేదాల కారణంగా సీపీఎం మరింత బలహీనమయ్యే ప్రమాదం ఉన్నది. రాహుల్‌గాంధీకి నాయకత్వ లక్షణాలు లేని కారణంగా కాంగ్రెస్, నితీశ్‌కుమార్‌ అధికారవాద రాజకీయాల వల్ల జేడీ(యూ), అధినేత అవదులు మీరిన ఆత్మవిశ్వాసంతో తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ చీలిక రాజ కీయాల వల్ల బీఎస్‌పీ, అధికార కుటుంబంలో కలహాల వల్ల సమాజ్‌వాదీ పార్టీ, అనైక్యత కారణంగా వామపక్షాలు నానాటికీ క్షీణిస్తుంటే తన కత్తికి ఎదురు లేకుండా బీజేపీ జైత్రయాత్ర సాగిస్తున్నది. అవకాశవాదానికీ, అవినీతికీ, పార్టీ ఫిరాయింపులకూ ఒడిగట్టకుండా రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ బీజేపీ కానీ దాని మిత్రపక్షాలు కానీ ఎన్నేళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ అభ్యంతరం లేదు. కానీ ప్రతిపక్షాలను బలహీనం చేసే క్రమంలో రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీలు దేశాన్ని అవాంఛనీయమైన, అప్రజాస్వామికమైన మార్గంలో నడి పిస్తున్నాయనీ, విలువలు లేని రాజకీయాలకు పట్టం కడుతున్నాయనీ గ్రహించాలి.

కె. రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement