అంతులేని జాప్యంతో అనర్థం | Endless delay in justice leads danger | Sakshi
Sakshi News home page

అంతులేని జాప్యంతో అనర్థం

Published Sun, Dec 24 2017 12:26 AM | Last Updated on Wed, Aug 15 2018 8:15 PM

Endless delay in justice leads danger - Sakshi

త్రికాలమ్‌
దేశ రాజకీయాలనూ, న్యాయస్థానాలు వెలువరిస్తున్న తీర్పులనూ, వాటిపైన వివిధ రాజకీయపార్టీలు చెబుతున్న భాష్యాలనూ గమనించినవారు ‘ఇదేమి రాజ్యం?’ అంటూ విస్తుపోతారు. రాజకీయపార్టీల తీరు పట్ల దిగ్భ్రాంతి చెందు తారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిర్వాకం చూసి నివ్వెరపోతారు.

రాజకీయ నాయకుడిపైన ప్రత్యర్థి ఎవరో ఒకరు  ఆరోపణ చేస్తారు. ప్రజా ప్రయోజనవ్యాజ్యం వేస్తారు. సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతారు. న్యాయస్థా నాలు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఆర్థికాంశాలకు సంబంధించిన కేసులైతే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలో ప్రవేశిస్తుంది. పని ప్రారం భించి ఏళ్ళు గడిచినప్పటికీ  సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేయదు. విచారణ ప్రారం భించిన సీబీఐ న్యాయస్థానాలు సంవత్సరాలు గడిచినా ఎటూ తేల్చవు. వాయి దాలు వేస్తూపోతాయి. తీరా సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును నిందితులు కానీ ప్రభుత్వం కానీ హైకోర్టులో సవాలు చేయడం తప్పని సరి. హైకోర్టు నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిశీలిస్తుంది. ఒక కేసును పరిష్కరించాలంటే దశాబ్దా లకాలం పడుతుంది. దిగువ న్యాయస్థానం నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకూ  కేసు ఎగబాకి వచ్చే సరికి నిందితులలో కొంతమంది మరణిస్తారు. నిజం నిగ్గు తేలుతుందన్న విశ్వాసం లేదు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత సైతం పాత ఆరోపణలనే మళ్ళీ మళ్ళీ చేస్తారు. మీడియా తిరిగి తిరగమోత పెట్టి అదే వార్తను వడ్డిస్తుంది. టీవీ సమర్పకులు (యాంకర్లు) రెచ్చిపోతారు. రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలనే అస్త్రాలుగా వినియోగించుకొని ఎన్నికలు గెలుస్తారు. ఎన్ని సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఆరోపణలపైన దర్యాప్తు పూర్తికాదు. ఈలోగా దర్యాప్తు జరిపిన అధికారులు ధర్మం, న్యాయం, విలువల గురించి దేశ విదేశాలలో ఉపన్యాసాలు ఇస్తారు. 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం జరిగిందంటూ ఉద్ఘాటించిన కాగ్‌ (వినోద్‌రాయ్‌) భువనేశ్వర్‌ నుంచి బోస్టన్‌ వరకూ ప్రసం గాలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  అభియోగాలు రుజువు కాకపోతే ఆయన పూచీ లేదు. ఘాటైన విమర్శలు చేసి పాత ప్రభుత్వానికి పాతరేసినవారికి కొత్త పాలకులు పెద్దపీట వేస్తారు. న్యాయమూర్తులు దర్యాప్తు సంస్థలపైనా, ప్రభుత్వాధినేతలపైనా ధర్మాగ్రహం వెలిబుచ్చుతారు. ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం ఆడుతున్నారో తెలియదు. అంతా అయో మయం. రాజకీయపార్టీలు వాటి ప్రయోజనాలకు అనుగుణంగానే వాదిస్తాయి. పౌరులు సైతం వారి రాజకీయ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఏ వాదన ఆమోదిం చాలో, దేనిని తిరస్కరించాలో నిర్ణయించుకుంటారు.

ఆలోచించవలసిన తీర్పులు
ఒకే వారం వచ్చిన రెండు తీర్పులను పరిశీలిద్దాం. ఒకటి, 2జీ స్పెక్ట్రమ్‌ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు. రెండు, దాణా కుంభకోణం కేసులో మరో సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం. 2జీ స్పెక్ట్రమ్‌ కేసు మన్మోహన్‌ నాయకత్వంలో యూపీ ఏ–2 ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించింది. బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్‌ క్రీడలకు సంబంధించిన కుంభకోణంతో పాటు 2జీ స్కాం కలసి కాంగ్రెస్‌ను గంగలో కలి పాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ఈ కుంభకోణాలను అత్యంత సమ ర్థంగా వినియోగించుకొని ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. డీఎంకే మంత్రి ఏ రాజా రాజీనామా చేయవలసి వచ్చింది. జైలు ఊచలు లెక్కపెట్టవలసి వచ్చింది. డీఎంకే అధినేత కరుణానిధి గారాలపట్టి  కనిమొళి కూడా జైలుకెళ్లారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2జీ కేసులో నిందితులందరినీ నిరపరాధులని నిర్ణయించ డంతో కాస్త ఊపిరిపీల్చుకోగలుగుతున్నారు. కానీ దీనిపై అప్పీలు చేస్తానని ఈడీ  ప్రకటించింది. ఇంకా అయిపోలేదని కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ కూడా హెచ్చరిస్తు న్నారు. బీజేపీ ప్రవక్తలందరూ ఇదే మాటపైన నిలబడి ఉన్నారు. ఉత్తి దుష్ప్ర చారం తప్ప వేరే ఏమీ లేదనీ, అవినీతి ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవేననీ  మన్మోహన్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ సౌధం అసత్యం అనే పునాది పైన నిలిచి ఉన్నదంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థపైన తమకు విశ్వాసం ఉన్నదని ఇరు పక్షాలు నొక్కివక్కాణిస్తు న్నాయి.

కానీ తమతమ ప్రయోజనాలకు తగినట్టు తీర్పును అన్వయిస్తున్నాయి. ప్రభుత్వ తప్పిదం వల్ల ఖజానాకు రూ. 1.78 లక్షల కోట్లు నష్టం వచ్చినట్టు నాటి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వినోద్‌రాయ్‌ అంచనా వేశారు. ఈ అంచనాను విశ్వసించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీఎస్‌ సింఘ్వీ నాయకత్వం లోని ఇద్దరు సభ్యుల బెంచి రాజా మంజూరు చేసిన కేటాయింపులన్నిటినీ రద్దు చేసింది.  ఆ కేసులో అవినీతి లేదా కుట్ర జరిగిందా లేదా అన్న అంశం తేల్చడం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బాధ్యత అనీ, తమ కర్తవ్యం విధానం అనుసరించ కుండా ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సవరించడమనీ సింఘ్వీ శుక్రవారంనాడు వ్యాఖ్యానించారు. ఆక్షన్‌ లేకుండా కేటాయింపులు సరికాదు కనుక వాటిని రద్దు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ విధానాల ఉల్లంఘనకు ఎంత శిక్ష వేయాలి, ఎవరికి వేయాలి అన్న విషయంలో స్పష్టత లేదు. న్యాయమూర్తుల వైఖరిని బట్టి శిక్ష ఉంటుంది. ఒక్క విధాన ఉల్లంఘన మాత్రమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు రూ. 1.76 లక్షల కోట్ల నష్టం వచ్చిందనే అంచనా ప్రభావం కూడా జస్టిస్‌ సింఘ్వీ పైన విధిగా ఉండి ఉంటుంది. ఆ అంచనా గాలి లెక్క మాత్రమేనని చాలామంది ప్రవీణులు వ్యాఖ్యానించారు. ఉజ్జాయింపుగా చెప్పానని కాగ్‌ అన్నారు. కానీ నష్ట మెంత అనేది ఎవ్వరూ నిర్ధారించలేరు. అటువంటి ప్రయత్నం జరగడం లేదు. అంత నష్టం వచ్చిందని కానీ, రాజా, కణిమొళి తదితరులు లబ్ధిపొందారని  కానీ సీబీఐ నిరూపించలేకపోయింది. లక్షల పేజీల నివేదికలు తయారు చేసిన సీబీఐ ఒక్క అభియోగం కూడా నిరూపించలేదనీ, చాలా బాధ్యతారహితంగా వ్యవహ రించిందనీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఓపీ సైనీ వ్యాఖ్యానించారు. తీర్పు తర్వాత డీఎంకే నేతలు ఆనందంతో లడ్డూలు పంచుకోగా, కాంగ్రెస్‌ నాయకులు సత్యమే గెలిచిందనే వ్యాఖ్యనంతో సరిపుచ్చుకున్నారు. బీజేపీ ప్రతినిధులు మాత్రం ముందున్నది ముసళ్ళ పండగ అని హెచ్చరిస్తున్నారు. ఏమీ అవినీతి, అక్రమం జరగపోతే సర్వోన్నత న్యాయస్థానం స్పెక్ట్రమ్‌ కేటాయింపులను ఎందుకు రద్దు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. పరిపాలనాపరమైన నిర్ణయంలో పొర పాటు జరగడం వేరు. కుట్రపూరితంగా నేరం చేయడం వేరు. 2జీలో కుట్ర లేదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.

దోషిగా తేలిన లాలూ
ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వాన్ని 2జీ కుంభకోణం నిర్వీర్యం చేస్తే పట్నాలో దాణా కుంభకోణం లాలూ ప్రసాద్‌ను ముఖ్యమంత్రి గద్దె మీది నుంచి దించింది. ఆయన భార్య రాబ్డీదేవిని గద్దెనెక్కించింది. దాణా కుంభకోణానికి బీజం 1985 లోనే పడింది. నాటి కాగ్‌ టీఎన్‌ చతుర్వేది హయాంలో బిహార్‌ కోశాగారం నుంచి లెక్కలు ఎప్పుడూ ఆలస్యంగా రావడాన్ని అధికారులు గమనించారు. బిహార్‌ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి దుబే చొరవతో దర్యాప్తు జరిగింది. పశు సంవ ర్థకశాఖ అధికారులు పశువుల దాణా కొనుగోలులో అక్రమాలు చేశారనీ, దొంగ బిల్లులు పెట్టారనీ తేలింది. 1993లో ఆదాయంపన్ను శాఖ అధికారులు జరిపిన దాడులలో 80 మంది అధికారుల దగ్గర అక్రమ సంపద ఉన్నట్టు తెలుసుకు న్నారు. పశుసంవర్థక శాఖకు చెందిన ఒక అధికారి దగ్గర రాంచీ విమానాశ్ర యంలో కోటి రూపాయలు పట్టుకున్నారు. 1997లో బిహార్‌ బీజేపీ నాయకుడు సుశీల్‌ మోదీ పట్నా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పుడే మొదలైనాయి లాలూ కష్టాలు. ఇందుకు సంబంధించి మొత్తం 64 కేసులు ఉన్నాయి. 56 మంది నిందితులు. మొత్తం రూ 950 కోట్ల మేరకు ప్రభుత్వ ధనం కాజేశారన్నది ప్రధాన అభి యోగం. ఈ కుంభకోణానికి ప్రధాన కారకుడైన వ్యక్తిపైన విచారణ జరిపించా లని కోరుతూ అధికారులు సమర్పించిన ఫైలును లాలూ 16 మాసాలు తొక్కిప ట్టారని ఆరోపణ. ఆరు కేసులలో లాలూ ప్రసాద్‌కు ప్రమేయం ఉన్నది. ఒక కేసులో రూ. 37.70 కోట్లను చాయ్‌బసా ట్రెజరీ నుంచి తీసుకున్నట్టు చేసిన ఆరో పణ రుజువై లాలూను దోషిగా నిర్ధారించి జైలుకు పంపారు. అప్పుడే రాబ్డీదేవి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. రెండు మాసాలు పూర్తికాక మునుపే సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో లాలూకూ, మరి 14 మంది దోషులకూ విధించే శిక్ష ఏమిటో జనవరి 3న ప్రకటిస్తారు. శనివారం రాంచీలో సాక్షుల బోనులో లాలూ, మరి 24 మంది నిలుచొని ఉండగా బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథమిశ్రానూ, మరి అయిదుగురినీ నిర్దోషులుగా ప్రకటించి వెళ్ళిపొమ్మన్నారు. లాలూనూ, ఇతరులనూ అక్కడే అరెస్టు చేశారు. ఈ కేసులో తాను చేసిన ఆరోపణలను సీబీఐ దిగువ కోర్టులో నిరూపించగలిగింది. బీజేపీ నాయకత్వం, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ కలసి చేసిన కుట్ర ఫలితమే ఈ తీర్పు అంటూ లాలూ ద్వితీయ పుత్రుడూ, రాజకీయ వారసుడూ అయిన తేజస్వి యాదవ్‌ ఆరోపించారు. ఈ తీర్పు వెలువడటానికి రెండు గంటల ముందే లాలూ కుమార్తె మిసాభారతిపైనా, ఆమె భర్త శైలేష్‌కుమార్‌పైనా ఈడీ కేసులు పెట్టింది.  అవినీతికి పాల్పడినవారు చట్టం నుంచి తప్పించుకొని పోలేరంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకరప్రసాద్‌ ఉద్ఘాటించారు.

ఆరోపణాస్త్రాలతోనే పోరాటం
సీబీఐ దర్యాప్తు పేరు మీద రాజకీయ పోరాటాలు చాలాకాలంగా సాగుతు న్నాయి. ఆరోపణలు చేసినవారికి వాటిని నిరూపించవలసిన బాధ్యత లేదు. ఆరోపణల స్థాయి దాటి సీబీఐ దర్యాప్తు మొదలైతే రాజకీయ క్రీడ ఆరంభం అవుతుంది. సీబీఐ పెట్టిన కేసులలో న్యాయస్థానం ఎదుట పరీక్ష తట్టుకొని నిలి చినవి చాలా తక్కువ. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్‌పై వచ్చిన ఆరోపణలపైన విచారణకు గవర్నర్‌ విద్యాసాగర్‌ ఇచ్చిన అనుమతి సమంజమైన దని సీబీఐ నిరూపించలేకపోయింది. ఆరుషి, పనివాడు  హత్య కేసులో ఆరోప ణలు నిరూపించడంలో సీబీఐ విఫలమెంది. రాజీవ్‌గాంధీ పదవీచ్యుతికి కారణ మైన బోఫోర్స్‌ కుంభకోణానికి సంబంధించి కూడా సీబీఐ సాక్ష్యాధారాలు సేక రించలేని కారణంగా వీగిపోయింది. ‘మిస్టర్‌ క్లీన్‌’ అని చెప్పుకున్న రాజీవ్‌ను ఈ కుంభకోణం జీవితపర్యంతం వెంటాడింది. చివరికి 2005లో ఢిల్లీ హైకోర్టు హిందూజా సోదరులతో సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తుకోసం సీబీఐ రూ. 250 కోట్లు ఖర్చు చేసిందని కూడా న్యాయమూర్తి వెల్లడించారు. రాజీవ్‌ హత్య కేసులో సైతం సీబీఐ దర్యాప్తు నిష్ఫలంగా అనం తంగా సాగుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐని న్యాయస్థానాలు చీవాట్లు పెట్టని సందర్భాలు తక్కువ. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి సీబీఐని ‘పంజరంలో చిలక’ అంటూ అభివర్ణించారు. లాలూ కానీ రాజా కానీ నేరం చేయలేదని న్యాయస్థానం చెప్పలేదు. లాలూ నేరం చేసినట్టు సీబీఐ కోర్టు నిరూ పించిందనీ, రాజా నేరానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ విఫలమైందనీ  న్యాయవేత్తలు అన్నారు. అందుకనే న్యాయస్థానాలు నిర్దోషులని నిర్ధారించిన తర్వాత కూడా రాజకీయ పార్టీలు పాత ఆరోపణలనే యథావిధిగా చేస్తున్నాయి. అందుకే అవినీతి ఎన్నికలలో నిర్ణాయకాంశం కావడం లేదు. లాలూ జైల్లో ఉన్న ప్పటికీ ఆర్‌జేడీ ప్రాబల్యానికి నష్టం లేదు. నితీశ్‌కుమార్‌కి లాభం లేదు. దీనికి ప్రధాన కారణం కేసుల పరిష్కారంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం. లాలూపైన వచ్చిన అభియోగాలపై విచారణ తొమ్మిది మాసాలలో పూర్తి చేయా లని గతమే నెలలో సీబీఐ ప్రత్యేక కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది కనుకనే ఈ మాత్రం వేగంగా విచారణ జరిగింది. అమెరికా స్టాక్‌ ఎక్చేంజిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేశారనే ఆరోపణపై రజత్‌గుప్తాను న్యాయస్థానాలలో విచారించారు. దర్యాప్తూ, నేరారోపణ, విచారణ, నేర నిర్ధారణ అన్నీ ఒకే ఒక సంవత్సరంలో పూర్తయినాయి. న్యాయం సకాలంలో జరగకపోతే అన్యాయం జరిగినట్టే అర్ధం (జస్టిస్‌ డిలేడ్‌ ఈజ్‌ జస్టిస్‌ డినైడ్‌). న్యాయపాలనలో సంస్కరణలు అమలు చేసేంతవరకూ ఈ అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఈ లొసుగును రాజ కీయవాదులు తెలివిగా వినియోగించుకుంటారు. ఇదే ధోరణి కొనసాగితే సామాన్య ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం తగ్గిపోతుంది.

కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement