tricoloumn
-
అంతులేని జాప్యంతో అనర్థం
త్రికాలమ్ దేశ రాజకీయాలనూ, న్యాయస్థానాలు వెలువరిస్తున్న తీర్పులనూ, వాటిపైన వివిధ రాజకీయపార్టీలు చెబుతున్న భాష్యాలనూ గమనించినవారు ‘ఇదేమి రాజ్యం?’ అంటూ విస్తుపోతారు. రాజకీయపార్టీల తీరు పట్ల దిగ్భ్రాంతి చెందు తారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిర్వాకం చూసి నివ్వెరపోతారు. రాజకీయ నాయకుడిపైన ప్రత్యర్థి ఎవరో ఒకరు ఆరోపణ చేస్తారు. ప్రజా ప్రయోజనవ్యాజ్యం వేస్తారు. సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతారు. న్యాయస్థా నాలు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఆర్థికాంశాలకు సంబంధించిన కేసులైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలో ప్రవేశిస్తుంది. పని ప్రారం భించి ఏళ్ళు గడిచినప్పటికీ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయదు. విచారణ ప్రారం భించిన సీబీఐ న్యాయస్థానాలు సంవత్సరాలు గడిచినా ఎటూ తేల్చవు. వాయి దాలు వేస్తూపోతాయి. తీరా సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును నిందితులు కానీ ప్రభుత్వం కానీ హైకోర్టులో సవాలు చేయడం తప్పని సరి. హైకోర్టు నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిశీలిస్తుంది. ఒక కేసును పరిష్కరించాలంటే దశాబ్దా లకాలం పడుతుంది. దిగువ న్యాయస్థానం నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకూ కేసు ఎగబాకి వచ్చే సరికి నిందితులలో కొంతమంది మరణిస్తారు. నిజం నిగ్గు తేలుతుందన్న విశ్వాసం లేదు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత సైతం పాత ఆరోపణలనే మళ్ళీ మళ్ళీ చేస్తారు. మీడియా తిరిగి తిరగమోత పెట్టి అదే వార్తను వడ్డిస్తుంది. టీవీ సమర్పకులు (యాంకర్లు) రెచ్చిపోతారు. రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలనే అస్త్రాలుగా వినియోగించుకొని ఎన్నికలు గెలుస్తారు. ఎన్ని సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఆరోపణలపైన దర్యాప్తు పూర్తికాదు. ఈలోగా దర్యాప్తు జరిపిన అధికారులు ధర్మం, న్యాయం, విలువల గురించి దేశ విదేశాలలో ఉపన్యాసాలు ఇస్తారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగిందంటూ ఉద్ఘాటించిన కాగ్ (వినోద్‌రాయ్) భువనేశ్వర్ నుంచి బోస్టన్ వరకూ ప్రసం గాలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభియోగాలు రుజువు కాకపోతే ఆయన పూచీ లేదు. ఘాటైన విమర్శలు చేసి పాత ప్రభుత్వానికి పాతరేసినవారికి కొత్త పాలకులు పెద్దపీట వేస్తారు. న్యాయమూర్తులు దర్యాప్తు సంస్థలపైనా, ప్రభుత్వాధినేతలపైనా ధర్మాగ్రహం వెలిబుచ్చుతారు. ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం ఆడుతున్నారో తెలియదు. అంతా అయో మయం. రాజకీయపార్టీలు వాటి ప్రయోజనాలకు అనుగుణంగానే వాదిస్తాయి. పౌరులు సైతం వారి రాజకీయ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఏ వాదన ఆమోదిం చాలో, దేనిని తిరస్కరించాలో నిర్ణయించుకుంటారు. ఆలోచించవలసిన తీర్పులు ఒకే వారం వచ్చిన రెండు తీర్పులను పరిశీలిద్దాం. ఒకటి, 2జీ స్పెక్ట్రమ్ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు. రెండు, దాణా కుంభకోణం కేసులో మరో సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం. 2జీ స్పెక్ట్రమ్ కేసు మన్మోహన్ నాయకత్వంలో యూపీ ఏ–2 ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించింది. బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన కుంభకోణంతో పాటు 2జీ స్కాం కలసి కాంగ్రెస్‌ను గంగలో కలి పాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ఈ కుంభకోణాలను అత్యంత సమ ర్థంగా వినియోగించుకొని ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. డీఎంకే మంత్రి ఏ రాజా రాజీనామా చేయవలసి వచ్చింది. జైలు ఊచలు లెక్కపెట్టవలసి వచ్చింది. డీఎంకే అధినేత కరుణానిధి గారాలపట్టి కనిమొళి కూడా జైలుకెళ్లారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2జీ కేసులో నిందితులందరినీ నిరపరాధులని నిర్ణయించ డంతో కాస్త ఊపిరిపీల్చుకోగలుగుతున్నారు. కానీ దీనిపై అప్పీలు చేస్తానని ఈడీ ప్రకటించింది. ఇంకా అయిపోలేదని కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ కూడా హెచ్చరిస్తు న్నారు. బీజేపీ ప్రవక్తలందరూ ఇదే మాటపైన నిలబడి ఉన్నారు. ఉత్తి దుష్ప్ర చారం తప్ప వేరే ఏమీ లేదనీ, అవినీతి ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవేననీ మన్మోహన్ వ్యాఖ్యానించారు. బీజేపీ సౌధం అసత్యం అనే పునాది పైన నిలిచి ఉన్నదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థపైన తమకు విశ్వాసం ఉన్నదని ఇరు పక్షాలు నొక్కివక్కాణిస్తు న్నాయి. కానీ తమతమ ప్రయోజనాలకు తగినట్టు తీర్పును అన్వయిస్తున్నాయి. ప్రభుత్వ తప్పిదం వల్ల ఖజానాకు రూ. 1.78 లక్షల కోట్లు నష్టం వచ్చినట్టు నాటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్‌రాయ్ అంచనా వేశారు. ఈ అంచనాను విశ్వసించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీఎస్ సింఘ్వీ నాయకత్వం లోని ఇద్దరు సభ్యుల బెంచి రాజా మంజూరు చేసిన కేటాయింపులన్నిటినీ రద్దు చేసింది. ఆ కేసులో అవినీతి లేదా కుట్ర జరిగిందా లేదా అన్న అంశం తేల్చడం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బాధ్యత అనీ, తమ కర్తవ్యం విధానం అనుసరించ కుండా ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సవరించడమనీ సింఘ్వీ శుక్రవారంనాడు వ్యాఖ్యానించారు. ఆక్షన్ లేకుండా కేటాయింపులు సరికాదు కనుక వాటిని రద్దు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ విధానాల ఉల్లంఘనకు ఎంత శిక్ష వేయాలి, ఎవరికి వేయాలి అన్న విషయంలో స్పష్టత లేదు. న్యాయమూర్తుల వైఖరిని బట్టి శిక్ష ఉంటుంది. ఒక్క విధాన ఉల్లంఘన మాత్రమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు రూ. 1.76 లక్షల కోట్ల నష్టం వచ్చిందనే అంచనా ప్రభావం కూడా జస్టిస్ సింఘ్వీ పైన విధిగా ఉండి ఉంటుంది. ఆ అంచనా గాలి లెక్క మాత్రమేనని చాలామంది ప్రవీణులు వ్యాఖ్యానించారు. ఉజ్జాయింపుగా చెప్పానని కాగ్ అన్నారు. కానీ నష్ట మెంత అనేది ఎవ్వరూ నిర్ధారించలేరు. అటువంటి ప్రయత్నం జరగడం లేదు. అంత నష్టం వచ్చిందని కానీ, రాజా, కణిమొళి తదితరులు లబ్ధిపొందారని కానీ సీబీఐ నిరూపించలేకపోయింది. లక్షల పేజీల నివేదికలు తయారు చేసిన సీబీఐ ఒక్క అభియోగం కూడా నిరూపించలేదనీ, చాలా బాధ్యతారహితంగా వ్యవహ రించిందనీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఓపీ సైనీ వ్యాఖ్యానించారు. తీర్పు తర్వాత డీఎంకే నేతలు ఆనందంతో లడ్డూలు పంచుకోగా, కాంగ్రెస్ నాయకులు సత్యమే గెలిచిందనే వ్యాఖ్యనంతో సరిపుచ్చుకున్నారు. బీజేపీ ప్రతినిధులు మాత్రం ముందున్నది ముసళ్ళ పండగ అని హెచ్చరిస్తున్నారు. ఏమీ అవినీతి, అక్రమం జరగపోతే సర్వోన్నత న్యాయస్థానం స్పెక్ట్రమ్ కేటాయింపులను ఎందుకు రద్దు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. పరిపాలనాపరమైన నిర్ణయంలో పొర పాటు జరగడం వేరు. కుట్రపూరితంగా నేరం చేయడం వేరు. 2జీలో కుట్ర లేదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దోషిగా తేలిన లాలూ ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వాన్ని 2జీ కుంభకోణం నిర్వీర్యం చేస్తే పట్నాలో దాణా కుంభకోణం లాలూ ప్రసాద్‌ను ముఖ్యమంత్రి గద్దె మీది నుంచి దించింది. ఆయన భార్య రాబ్డీదేవిని గద్దెనెక్కించింది. దాణా కుంభకోణానికి బీజం 1985 లోనే పడింది. నాటి కాగ్ టీఎన్ చతుర్వేది హయాంలో బిహార్ కోశాగారం నుంచి లెక్కలు ఎప్పుడూ ఆలస్యంగా రావడాన్ని అధికారులు గమనించారు. బిహార్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి దుబే చొరవతో దర్యాప్తు జరిగింది. పశు సంవ ర్థకశాఖ అధికారులు పశువుల దాణా కొనుగోలులో అక్రమాలు చేశారనీ, దొంగ బిల్లులు పెట్టారనీ తేలింది. 1993లో ఆదాయంపన్ను శాఖ అధికారులు జరిపిన దాడులలో 80 మంది అధికారుల దగ్గర అక్రమ సంపద ఉన్నట్టు తెలుసుకు న్నారు. పశుసంవర్థక శాఖకు చెందిన ఒక అధికారి దగ్గర రాంచీ విమానాశ్ర యంలో కోటి రూపాయలు పట్టుకున్నారు. 1997లో బిహార్ బీజేపీ నాయకుడు సుశీల్ మోదీ పట్నా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పుడే మొదలైనాయి లాలూ కష్టాలు. ఇందుకు సంబంధించి మొత్తం 64 కేసులు ఉన్నాయి. 56 మంది నిందితులు. మొత్తం రూ 950 కోట్ల మేరకు ప్రభుత్వ ధనం కాజేశారన్నది ప్రధాన అభి యోగం. ఈ కుంభకోణానికి ప్రధాన కారకుడైన వ్యక్తిపైన విచారణ జరిపించా లని కోరుతూ అధికారులు సమర్పించిన ఫైలును లాలూ 16 మాసాలు తొక్కిప ట్టారని ఆరోపణ. ఆరు కేసులలో లాలూ ప్రసాద్‌కు ప్రమేయం ఉన్నది. ఒక కేసులో రూ. 37.70 కోట్లను చాయ్‌బసా ట్రెజరీ నుంచి తీసుకున్నట్టు చేసిన ఆరో పణ రుజువై లాలూను దోషిగా నిర్ధారించి జైలుకు పంపారు. అప్పుడే రాబ్డీదేవి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. రెండు మాసాలు పూర్తికాక మునుపే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో లాలూకూ, మరి 14 మంది దోషులకూ విధించే శిక్ష ఏమిటో జనవరి 3న ప్రకటిస్తారు. శనివారం రాంచీలో సాక్షుల బోనులో లాలూ, మరి 24 మంది నిలుచొని ఉండగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథమిశ్రానూ, మరి అయిదుగురినీ నిర్దోషులుగా ప్రకటించి వెళ్ళిపొమ్మన్నారు. లాలూనూ, ఇతరులనూ అక్కడే అరెస్టు చేశారు. ఈ కేసులో తాను చేసిన ఆరోపణలను సీబీఐ దిగువ కోర్టులో నిరూపించగలిగింది. బీజేపీ నాయకత్వం, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కలసి చేసిన కుట్ర ఫలితమే ఈ తీర్పు అంటూ లాలూ ద్వితీయ పుత్రుడూ, రాజకీయ వారసుడూ అయిన తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈ తీర్పు వెలువడటానికి రెండు గంటల ముందే లాలూ కుమార్తె మిసాభారతిపైనా, ఆమె భర్త శైలేష్కుమార్పైనా ఈడీ కేసులు పెట్టింది. అవినీతికి పాల్పడినవారు చట్టం నుంచి తప్పించుకొని పోలేరంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకరప్రసాద్ ఉద్ఘాటించారు. ఆరోపణాస్త్రాలతోనే పోరాటం సీబీఐ దర్యాప్తు పేరు మీద రాజకీయ పోరాటాలు చాలాకాలంగా సాగుతు న్నాయి. ఆరోపణలు చేసినవారికి వాటిని నిరూపించవలసిన బాధ్యత లేదు. ఆరోపణల స్థాయి దాటి సీబీఐ దర్యాప్తు మొదలైతే రాజకీయ క్రీడ ఆరంభం అవుతుంది. సీబీఐ పెట్టిన కేసులలో న్యాయస్థానం ఎదుట పరీక్ష తట్టుకొని నిలి చినవి చాలా తక్కువ. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్చవాన్పై వచ్చిన ఆరోపణలపైన విచారణకు గవర్నర్ విద్యాసాగర్ ఇచ్చిన అనుమతి సమంజమైన దని సీబీఐ నిరూపించలేకపోయింది. ఆరుషి, పనివాడు హత్య కేసులో ఆరోప ణలు నిరూపించడంలో సీబీఐ విఫలమెంది. రాజీవ్‌గాంధీ పదవీచ్యుతికి కారణ మైన బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించి కూడా సీబీఐ సాక్ష్యాధారాలు సేక రించలేని కారణంగా వీగిపోయింది. ‘మిస్టర్ క్లీన్’ అని చెప్పుకున్న రాజీవ్‌ను ఈ కుంభకోణం జీవితపర్యంతం వెంటాడింది. చివరికి 2005లో ఢిల్లీ హైకోర్టు హిందూజా సోదరులతో సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తుకోసం సీబీఐ రూ. 250 కోట్లు ఖర్చు చేసిందని కూడా న్యాయమూర్తి వెల్లడించారు. రాజీవ్ హత్య కేసులో సైతం సీబీఐ దర్యాప్తు నిష్ఫలంగా అనం తంగా సాగుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐని న్యాయస్థానాలు చీవాట్లు పెట్టని సందర్భాలు తక్కువ. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి సీబీఐని ‘పంజరంలో చిలక’ అంటూ అభివర్ణించారు. లాలూ కానీ రాజా కానీ నేరం చేయలేదని న్యాయస్థానం చెప్పలేదు. లాలూ నేరం చేసినట్టు సీబీఐ కోర్టు నిరూ పించిందనీ, రాజా నేరానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ విఫలమైందనీ న్యాయవేత్తలు అన్నారు. అందుకనే న్యాయస్థానాలు నిర్దోషులని నిర్ధారించిన తర్వాత కూడా రాజకీయ పార్టీలు పాత ఆరోపణలనే యథావిధిగా చేస్తున్నాయి. అందుకే అవినీతి ఎన్నికలలో నిర్ణాయకాంశం కావడం లేదు. లాలూ జైల్లో ఉన్న ప్పటికీ ఆర్జేడీ ప్రాబల్యానికి నష్టం లేదు. నితీశ్‌కుమార్‌కి లాభం లేదు. దీనికి ప్రధాన కారణం కేసుల పరిష్కారంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం. లాలూపైన వచ్చిన అభియోగాలపై విచారణ తొమ్మిది మాసాలలో పూర్తి చేయా లని గతమే నెలలో సీబీఐ ప్రత్యేక కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది కనుకనే ఈ మాత్రం వేగంగా విచారణ జరిగింది. అమెరికా స్టాక్ ఎక్చేంజిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారనే ఆరోపణపై రజత్‌గుప్తాను న్యాయస్థానాలలో విచారించారు. దర్యాప్తూ, నేరారోపణ, విచారణ, నేర నిర్ధారణ అన్నీ ఒకే ఒక సంవత్సరంలో పూర్తయినాయి. న్యాయం సకాలంలో జరగకపోతే అన్యాయం జరిగినట్టే అర్ధం (జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్). న్యాయపాలనలో సంస్కరణలు అమలు చేసేంతవరకూ ఈ అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఈ లొసుగును రాజ కీయవాదులు తెలివిగా వినియోగించుకుంటారు. ఇదే ధోరణి కొనసాగితే సామాన్య ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం తగ్గిపోతుంది. కె. రామచంద్రమూర్తి -
విజయాల హోరు–విలువల బేజారు
త్రికాలమ్ దేశంలోని వివిధ రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధీనంలోకి వస్తున్నాయి. ప్రతిపక్ష రాజకీయ నాయకులు బీజేపీకి వరుసకట్టి విధేయత ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులలో సమర్థులుగా, జనాదరణ ఉన్నవారుగా గుర్తింపు పొందినవారు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడి అధికార బీజేపీలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్రమోదీకి దీటైన ప్రత్యర్థిగా, ప్రతిపక్షాల అభ్యర్థిగా రంగంలో నిలిచి 2019 ఎన్నికలలో పోరాటం చేస్తారని అనుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఆర్జేడీ నేత లాలూప్రసాద్‌తో తెగ తెంపులు చేసుకొని మహాఘటబంధన్ నుంచి నిష్క్రమించి ఎన్డీఏ శిబిరంలోకి అత్యంత లాఘవంగా గెంతేశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను నిర్మిస్తానంటూ నరేంద్రమోదీ 2014 ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రతిజ్ఞను అక్షరాలా పాటిస్తున్నారంటూ జాతీయ మీడియా ప్రశంసిస్తోంది. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ తన పార్టీ నుంచి బీజేపీకి వలసలు ఆపలేక సమస్యల సుడిగుండంలో చిక్కుకొని దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టా డుతున్నట్టు మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చాకచక్యాన్నీ, చాణక్యాన్నీ, చమత్కారాన్నీ మనస్ఫూర్తిగా అభి నందిస్తున్నాయి. అధికార రంధిలో రాజకీయ నాయకులు అనైతిక విన్యా సాలు చేయడాన్ని సామాన్య మానవులు ఎట్లా పరిగణిస్తున్నారు? ఏ తీరానికి ఈ ప్రస్థానం? మూడేళ్ళ కిందట ఎన్నికలలో అనూహ్యమైన ఆధిక్యంతో, అట్ట హాసంగా గెలిచిన బీజేపీ నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ(టీడీపీ), తెలం గాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చాయి. పరిపాలనలో హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఎవరి శైలిలో వారు పరిపాలిస్తు న్నారు. కానీ ప్రభుత్వాల పనితీరు రాజ్యాంగసమ్మతంగా ఉన్నదా? ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకోవడానికి దోహదం చేస్తుందా? రాజకీయాల పట్ల ప్రజలలో విశ్వాసం పెంపొందిస్తుందా? నిరర్థక రాజకీయం అన్ని రకాలా భ్రష్టుపట్టిన యూపీఏ–2 ప్రభుత్వం పోయి నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీఏ–2 ప్రభుత్వం రావడం దేశ ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చిన సన్నివేశం. మూడేళ్ల పాలనలో మోదీ సమర్థమైన ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. అవినీతి ఆరోపణలు లేని ప్రభుత్వంగా ఎన్డీఏ–2 సర్కార్‌ను ప్రజలు పరిగణిస్తున్నారు. వివిధ దేశాలలో పర్యటించి దౌత్యరంగంలో భారత్‌ను కొత్తపుంతలు తొక్కించిన ఘనత మోదీదే. కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా, వాజపేయి వ్యవహారశైలికి సైతం దూరంగా తనదంటూ ప్రత్యేక బాణిని రూపొందించుకొని సమర్థ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీ, బిహార్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అపజయాలను మినహాయిస్తే ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలోనూ విజయశంఖం పూరించిన మోదీ–షా ద్వయం అజేయమైన జట్టుగా నిలిచి జాతిని అబ్బురపరుస్తున్నారు. వీరిని ఎదిరించి గెలవగల ధీరులు ప్రతి పక్షాలలో ఎవ్వరూ లేరనే అభిప్రాయం ప్రజలలో బలపడుతోంది. గెలుపే ప్రధానంగా, మార్గం కంటే లక్ష్యం ప్రధానమనే ధోరణిలో అధికార పక్షాలు వ్యవహరిస్తున్నాయి. ఇది ముమ్మాటికీ నిరర్థకమైన,ఆత్మహత్యాసదృశమైన రాజకీయం. దేశంలో ఈ రోజున అత్యంత అధికంగా ప్రజాదరణ కలిగిన నాయకుడు మోదీ అనడంలో ఎవ్వరికీ సందేహం లేదు. ప్రతిపక్ష నాయకులు కూడా అంగీకరించవలసిన వాస్తవం ఇది. కానీ మోదీ వచ్చినప్పటి నుంచీ వివిధ రాష్ట్రాలలో అధికార పార్టీలు, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో అవసరం ఉన్నా లేకపోయినా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కిన తీరు ముమ్మాటికి ఆక్షేపణీయం, ప్రమాదకరం. ఇది కొత్తగా వచ్చిన జాడ్యం కాదు. ఇందిరాగాంధీ కాలంలో వివిధ రాష్ట్రాలలోని ప్రతిపక్షాలను అస్థిరపరచిన సందర్భాలు అనేకం. కాంగ్రెస్ చేసింది కనుక బీజేపీ కూడా అదే తప్పు చేయడాన్ని సమర్థిస్తామంటే కాంగ్రెస్ కంటే బీజేపీ ఏ విధంగా భిన్నమైనది? కాంగ్రెస్ కంటే టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎట్లా నైతికంగా ఉన్న తమైనవి? కాంగ్రెస్ చేసిన రాజ్యాంగ వ్యతిరేక చర్యలను పరిహరిస్తే, రాజ్యాం గబద్ధంగా మాత్రమే వ్యవహరిస్తే కాంగ్రెస్ కంటే బీజేపీ ఉన్నతమైన పార్టీగా స్థాపితం అవుతుంది. ఇతర పార్టీ నేతలను బీజేపీ శిబిరం లోకి ఆహ్వానించడం ఫిరాయింపులను ప్రోత్సహించడం కాక ఏమవుతుంది? వాజపేయి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి పకడ్బందీగా రూపొందించిన ఫిరాయింపుల నిరోధక చట్టంలోనూ కంతలు వెతికి భ్రష్టరాజకీయాలకు తెరలేపడం రాజకీయ విలువలకూ, నైతిక విలువలకూ పాతర వేయడం కాదా? రాజ్యాంగస్ఫూర్తికి తూట్లు ఆశ్చర్యం ఏమంటే రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నామనే సంకోచం కానీ బెరుకు కానీ నేతలలో కనిపించడం లేదు. విక్టరీ సంకేతం చూపిస్తూ బోర విరిచి సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతిపక్షంలో పలుకున్న నేతల ఫిరా యింపులను ప్రోత్సహించి, వారికి బీజేపీ టిక్కెట్టు ఇచ్చి ఎన్నికలలో నిలపడం అనైతికమనే భావన అధికారపక్షంలో బొత్తిగా లేదు. ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా రాజ్యాంగ పదవులలో ఉన్నవారు ఎవ్వరూ ఉలకడం లేదు. పల కడం లేదు. కాంగ్రెస్‌లో అతిముఖ్యమైన నేతలలో మూడవ స్థానంలో ఉన్న అహ్మద్‌పటేల్‌కు రాజ్యసభ స్థానం దక్కకుండా చేసేందుకు అమిత్‌షా అత్యంత లాఘవంగా పావులు కదపడంలో భాగంగా గుజరాత్లో ఆరుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు బీజేపీ వైపు ఫిరాయించారు. ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో అన్ని పదవులూ అనుభవించిన శంకర్‌సిన్హ్ వఘేలా నాయకత్వంలో మరో పది మంది ఫిరాయింపునకు సిద్ధంగా ఉన్నారంటూ వఘేలా తనయుడు వెల్లడించారు. విజయానికి అవసరమైన 44 ఓట్లు అహ్మద్‌పటేల్‌కు రాబోవని అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. మిగిలినవారినైనా రక్షించుకునేందుకు నలభై మంది ఎంఎల్ఏలను కర్ణాటకకు తరలించారు. కోట్ల రూపాయలు ఎర చూపుతున్నారనీ, పోలీసులను ప్రయోగించి ఒత్తిడి చేస్తున్నారనీ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎంఎల్ఏ లను రక్షించుకునే తెలివితేటలూ, సామర్థ్యం సోనియాగాంధీకి లేవా అంటూ మీడియా ప్రతినిధులు ఎద్దేవా చేస్తున్నారు కానీ ఇటువంటి నీతిమాలిన పనులను ప్రశ్నించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష శాసనసభ్యులను కబళించి వారిలో కొందరిని మంత్రులుగా నియమించినా రాజ్యాంగ పరిపోషకులు అభ్యంతరం చెప్పలేదు. తెలంగాణలో డిటో. ఇటీవల తమిళనాడులో శశికళ వర్గం శాసనసభ్యులను రక్షించుకునేందుకు క్యాంపు రాజకీయాలు నిర్వహించింది. ఇప్పుడు కాంగ్రెస్‌కూ అదే గతి పట్టింది. అయినా ఫలితం దక్కేది అనుమానమే. నవజోత్సిద్ధూ ఒక్కరే బీజేపీని కాదని కాంగ్రెస్ శిబిరంలోకి నడిచారు. తక్కిన ఫిరాయింపు నాయకులందరూ ప్రతిపక్షాల నుంచి అధికార పక్షం వైపు జంప్ చేసిన జిలానీలే. ఇందుకు బీజేపీ నాయకుల ప్రోత్సాహం ఉంది. రాజ్యాంగం పట్ల బేపర్వా ఉంది. నీతినియమాల పట్ల పట్టింపు లేదు. గుజరాత్లో నడుస్తున్న అడ్డగోలు రాజకీయంలో భాగంగానే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన రాజ్‌పూత్‌ను పార్టీ మారిన వెంటనే రాజ్యసభ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. అస్సాంలో, అరుణాచల్‌లో, గోవాలో, మణిపూర్‌లో, ఉత్తర ప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ నుంచీ, ఇతర ప్రతిపక్షాల నుంచీ బలమైన నాయకులు బీజేపీలోకి ఫిరాయించడం రాజకీయ వ్యవస్థకు కానీ, న్యాయవ్యవస్థకు కానీ అభ్యంతరకరమైన అంశంగా కనిపించకపోవడం ఆశ్చర్యం, ఆవేదన కలిగిస్తున్నది. బహుశా యూపీఏ–2 హయాంలో పెచ్చరిల్లిన అవినీతిని చూసి రోసిన ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని బేషరతుగా సమర్థిస్తున్నారు కాబోలు. బలహీనపడుతున్నదీ, దారీతెన్నూ తెలియక అయోమయావస్థలో పడి కొట్టుకుంటున్నదీ ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు. ఇతర ప్రతిపక్షాలు కూడా ఆత్మాహుతి బాటలోనే ఉన్నాయి. పట్నాలో నితీశ్‌కుమార్ నాటకీయ రాజ కీయం నడుస్తుంటే ఢిల్లీలో మార్క్సిస్టు పార్టీ వేదికపైన మరో రకమైన నిశ్శబ్ద యుద్ధం జరిగింది. ఏచూరికి చుక్కెదురు సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం రాజ్యసభ సభ్యత్వం ముగిం పునకు వచ్చింది. మూడో విడత ఆయనను పశ్చిమబెంగాల్ నుంచి అభ్యర్థిగా నిర్ణయిస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. కానీ సీపీఎం పొలిట్‌బ్యూరో పోయిన ఆదివారం జరిగిన సమావేశంలో ఏచూరి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. సీపీఎం అగ్రనాయకులు ఏచూరి, ప్రకాశ్ కరత్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ ఫెడరేషన్ రాజకీయాలతో ఎదిగి పార్టీలో ఉన్నతస్థాయికి చేరినవారు. వారు ఇద్దరూ రాజ్యసభలో ఉంటే పార్టీకీ, సమాజానికీ ఎంతో కొంత మేలు జరిగేది. ఇప్పుడు ఏచూరి గెలుపొందితే తర్వాత కేరళ నుంచి కరత్ రాజ్యసభలో ప్రవేశించవచ్చు. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాలలోని సీపీఎం నాయకులు ఏచూరిని సమర్థిస్తున్నట్టూ, కరత్‌కు కేరళ నాయకత్వం మద్దతు సంపూర్ణంగా ఉన్నట్టూ సమాచారం. పశ్చిమబెంగాల్ కామ్రేడ్లు ఏచూరి అభ్యర్థిత్వంపైన పట్టుపట్టి సెంట్రల్ కమిటీ సమావేశంలో చర్చకు పెట్టి చివరికి ఓటింగ్దాగా లాగారు. ఏచూరి ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆయనకు అనుకూలంగా 30 ఓట్లూ, వ్యతిరేకంగా 50 ఓట్లూ రావడంతో మూడో విడత రాజ్యసభలో ఏచూరి ప్రవేశానికి అవకాశం లేకుండా పోయింది. కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కరత్‌కు బాసటగా నిలిచాయి. కాంగ్రెస్‌కూ, బీజేపీకీ సమాన దూరం పాటించాలన్న పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా కాంగ్రెస్ మద్దతు స్వీకరించే ప్రశ్న లేదని సీపీఎం అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ భావించింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు చట్టసభలలో ప్రవేశించి కాలక్షేపం చేయకుండా పార్టీ నిర్మాణంలో నిమగ్నం కావాలన్న వాదన కూడా ఉన్నది. కరత్ మితవాది. సీపీఎం అగ్రనేత జ్యోతిబసుకు 1996లో ప్రధాని పదవి దక్కే అవకాశం వచ్చినప్పుడు కాదూ కూడదూ అంటూ పార్టీ తీర్మా నించింది కరత్ ధోరణి వల్లనే. తాను రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్నది సీపీఏం సెంట్రల్ కమిటీయేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడూ, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ వారంరోజుల కిందట బెంగాలీ దినపత్రిక ‘ఆజ్ కల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కరత్‌కు భిన్నంగా ఏచూరి కాస్త ఉదారవాది. మాజీ ప్రధాన కార్యదర్శి హర్‌కిషన్‌సింగ్ సూర్జిత్ మార్గం ఏచూరిది. ప్రతిపక్ష శిబిరంలో ఎప్పుడు వివాదం వచ్చినా తీర్పరిగా సూర్జిత్ వ్యవహరించేవారు. కాంగ్రెస్‌కు దగ్గరగా, బీజేపీకి దూరంగా ఉండేవారు. సీపీఎం సెంట్రల్ కమిటీలో తెలుగు రాష్ట్రాల సభ్యులలో అత్యధికులు ప్రకాశ్ కరత్ అనుయాయులు. ఆంధ్రప్రదేశ్ నుంచి బివి రాఘవులు, పి మధు, ఎంఏ గఫూర్, పాటూరు రామయ్య, పుణ్యవతి సభ్యులు కాగా తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, ఎస్ వీరయ్య, సిహెచ్ సీతారాములు సభ్యులు. మల్లు స్వరాజ్యం శాశ్వత ఆహ్వానితురాలు. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో వీరిలో అత్యధికులు ఏచూరికి వ్యతిరేకంగా ఓటు చేయడం విశేషం. ఎడతెగని విభేదాల కారణంగా సీపీఎం మరింత బలహీనమయ్యే ప్రమాదం ఉన్నది. రాహుల్‌గాంధీకి నాయకత్వ లక్షణాలు లేని కారణంగా కాంగ్రెస్, నితీశ్‌కుమార్ అధికారవాద రాజకీయాల వల్ల జేడీ(యూ), అధినేత అవదులు మీరిన ఆత్మవిశ్వాసంతో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ చీలిక రాజ కీయాల వల్ల బీఎస్పీ, అధికార కుటుంబంలో కలహాల వల్ల సమాజ్‌వాదీ పార్టీ, అనైక్యత కారణంగా వామపక్షాలు నానాటికీ క్షీణిస్తుంటే తన కత్తికి ఎదురు లేకుండా బీజేపీ జైత్రయాత్ర సాగిస్తున్నది. అవకాశవాదానికీ, అవినీతికీ, పార్టీ ఫిరాయింపులకూ ఒడిగట్టకుండా రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ బీజేపీ కానీ దాని మిత్రపక్షాలు కానీ ఎన్నేళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ అభ్యంతరం లేదు. కానీ ప్రతిపక్షాలను బలహీనం చేసే క్రమంలో రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీలు దేశాన్ని అవాంఛనీయమైన, అప్రజాస్వామికమైన మార్గంలో నడి పిస్తున్నాయనీ, విలువలు లేని రాజకీయాలకు పట్టం కడుతున్నాయనీ గ్రహించాలి. కె. రామచంద్రమూర్తి