నల్ల సూర్యుని అస్తమయం | Former South African President Nelson Mandela passes away | Sakshi
Sakshi News home page

నల్ల సూర్యుని అస్తమయం

Published Sat, Dec 7 2013 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM

Former South African President Nelson Mandela passes away

* దక్షిణాఫ్రికాకు వెలుగునిచ్చిన నెల్సన్ మండేలా కన్నుమూత
* సుదీర్ఘ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన శాంతిదూత
* ప్రపంచమంతటా సంతాపాలు... 15న అంత్యక్రియలు
* జాతి వివక్షపై సుదీర్ఘ పోరు.. గాంధీ బాటలో ఉద్యమం
* 27 ఏళ్లు జైలు జీవితం.. విడుదలయ్యాకా ఉద్యమ సారథ్యం
* దక్షిణాఫ్రికాలో శ్వేత జాత్యహంకార పాలనకు చరమగీతం
* ఆ దేశ తొలి నల్లజాతి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించిన నేత
* భారతరత్న... నోబెల్ బహుమతి గ్రహీత... నల్ల వజ్రం
 
జాతివివక్షపై తిరుగుబాటు చేసిన విప్లవ శిఖరం నేలకొరిగింది. అన్యాయాన్ని ధిక్కరిస్తూ నినదించిన స్వరం మూగబోయింది. దశాబ్దాల నిర్బంధంలోనూ చెక్కుచెదరని ఉక్కు గుండె ఆగిపోయింది. ఏళ్ల తరబడి శ్వేతజాత్యహంకార పాలనలో మగ్గిపోయిన నల్లజాతికి వెలుగునిచ్చిన నల్లసూరీడు అస్తమించాడు. దక్షిణాఫ్రికాకు స్వేచ్ఛాహక్కులను సంపాదించి.. మానవతా విలువల కోసం పరిశ్రమించి.. శాంతిసౌభాగ్యాల కోసం పరితపించి.. ప్రజలకు పోరాట స్ఫూర్తిని అందించి.. ప్రపంచానికి తన జ్ఞాపకాలను మిగిల్చి.. నెల్సన్ మండేలా కన్నుమూశారు. దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడు, భారతరత్న మండేలా శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న మండేలా 95 ఏళ్ల వయసులో జోహాన్నెస్‌బర్గ్‌లోని తన నివాసంలో మరణించారు.
 
 జోహాన్నెస్‌బర్గ్: నల్ల సూరీడు నెల్సన్ మండేలా అస్తమించారు. జాతివివక్షపై అలుపెరుగని పోరాటంతో.. అన్యాయంపై తిరుగుబాటుకు మారుపేరుగా నిలిచిన మండేలా 95 సంవత్సరాల వయసులో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాత్యహంకార పాలనపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి.. తొలి నల్లజాతి అధ్యక్షుడిగా చరిత్ర లిఖించిన మండేలా మరణంతో ప్రపంచ దేశాల్లో విషాదం అలముకుంది. దక్షిణాఫ్రికా ప్రజలు మండేలా మరణం పట్ల తీవ్ర విచారంలో ఉన్నప్పటికీ.. ఆయన జీవితం ఇచ్చిన స్ఫూర్తిని స్మరించుకుంటూ గానాలు, నృత్యాలు చేయటం కనిపించింది.

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన మండేలా ఈ ఏడాది ఆరంభం నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. సెప్టెంబర్‌లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రిటోరియా ఆస్పత్రిలో మూడు నెలల చికిత్స అనంతరం జోహాన్నెస్‌బర్గ్‌లోని హోటన్ ప్రాంతంలోగల మండేలా నివాసంలోనే ఆయనకు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తూ వచ్చింది. ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ‘‘మన ప్రియతమ నేత, మన ప్రజాస్వామ్య దేశ వ్యవస్థాపక అధ్యక్షుడు నెల్సన్ రోలిహాహ్లా మండేలా మనల్ని విడిచి వెళ్లిపోయారు’’ అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌జుమా శుక్రవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించారు. ‘‘మన దేశం తన గొప్ప కుమారుడిని కోల్పోయింది. మన ప్రజలు తమ గొప్ప తండ్రిని కోల్పోయారు’’ అంటూ సంతాపం తెలిపారు.

దక్షిణాఫ్రికాలో పది రోజులు అధికారిక సంతాప దినాలుగా ప్రకటించారు. మండేలాను 1990 లోనే భారతరత్న బిరుదు ఇచ్చి గౌరవం ప్రకటించిన భారతదేశం కూడా అధికారిక సంతాపం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచికగా భారత్‌తో పాటు, అమెరికా కూడా జాతీయ పతకాలను అవనతం చేశాయి. మండేలా భౌతికకాయాన్ని ప్రిటోరియాలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. మండేలా భౌతిక కాయాన్ని ఉంచిన శవపేటికపై దక్షిణాఫ్రికా జాతీయజెండాను కప్పి.. దానిని నలుపురంగు ఎస్‌యూవీ వాహనంపై ఉంచారు. వాహనానికి ఇరువైపులా సైనిక మోటార్‌సైకిల్ కాన్వాయ్‌తో సైనిక లాంఛనాలతో తీసుకెళ్లారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజధాని నగరంలోని ప్రభుత్వ భవనంలో ఉంచుతారు. ఈ నెల 15వ తేదీన ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. దక్షిణాఫ్రికాలో శుక్రవారం ఉదయం నుంచే వందలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ గుమిగూడి మండేలా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు.

 గాంధీ ఉద్యమ ప్రభావంతో...
 నెల్సన్ మండేలా అసలు పేరు రోలిహాహ్లా మండేలా. 1918 జూలై 18న దక్షిణాఫ్రికాలోని మవెజో అనే గ్రామంలో జన్మించారు. దక్షిణాఫ్రికాలో మైనారిటీలైన శ్వేతజాతీయుల పాలనలో తీవ్ర వివక్షకు గురైన నల్లజాతి ప్రజల విముక్తి కోసం.. చదువుకునే రోజుల్లోనే మండేలా పోరుబాట పట్టారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షపై మహాత్మా గాంధీ నడిపిన మహత్తర అహింసోద్యమం.. అప్పుడు యువకుడిగా ఉన్న మండేలాపై తీవ్ర ప్రభావం చూపింది. మండేలా కూడా అహింసా మార్గంలో పోరాటం మొదలుపెట్టినప్పటికీ.. ఆ తర్వాత కొంత కాలం సాయుధ పోరాటమూ సల్పారు.

1962లో మండేలాను అరెస్ట్ చేసిన దక్షిణాఫ్రికా శ్వేతజాతి ప్రభుత్వం.. 1964లో ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష విధించింది. అప్పటి నుంచి 27 సంవత్సరాల పాటు మండేలా జైలులోనే గడిపారు. ఆయన విడుదల కోసం 1980 నుంచి దశాబ్ద కాలం పాటు ఉవ్వెత్తున ప్రజా ఉద్యమం సాగింది. ఉద్యమం జోలికి వెళ్లబోనని ఒప్పుకుంటే విడిచిపెడతామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను మండేలా తిరస్కరించారు. చివరికి దిగివచ్చిన సర్కారు 1990లో ఆయనను జైలు నుంచి విడుదల చేసింది. మండేలా మళ్లీ ఉద్యమ సారథ్యం అందుకున్నారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. వర్ణ వివక్షను అంతం చేయాలని, నల్లజాతి వారికీ సమాన హక్కులు కల్పించాలని పోరాటం పునరుద్ధరించారు. ఆ ఉద్యమం ఫలించింది. 1994లో దక్షిణాఫ్రికాలో పూర్తిస్థాయి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ విజయదుందుభి మోగించగా.. దేశాధ్యక్షుడిగా మండేలా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

జాతుల సమైక్యం కోసం కృషి
దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడిగా 1999 వరకూ మండేలా సేవలందించారు. గిరిజన జాతుల రాజకీయాలతో వర్గాలుగా విడిపోయి ఉన్న దక్షిణాఫ్రికా ప్రజలను ఐక్యం చేయటానికి మండేలా అవిరళ కృషి సల్పారు. నల్లజాతి ప్రజల్లో ఉన్న ద్వేషాన్ని చల్లార్చి.. ప్రతీకారదాడుల భయంతో ఉన్న శ్వేతజాతి ప్రజలకు అభయమిచ్చేందుకు శక్తినంతా ధారపోశారు. ఒక్క దక్షిణాఫ్రికాలోనే కాదు.. ఎక్కడ అన్యాయం ఉన్నా దానిని నిరసించటానికి మండేలా ముందు వరుసలో ఉండేవారు. అందుకే.. ఆయనను మానవ హక్కుల ఉద్యమ ప్రతీకలైన అబ్రహాం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్‌లతో సమానంగా ప్రపంచం గౌరవిస్తోంది.

దక్షిణాఫ్రికా గాంధీ అని, నల్ల వజ్రం అని కూడా ఆయనను పిలుస్తుంటారు. మండేలా మూడు పర్యాయాలు వివాహం చేసుకున్నారు. మొదటి భార్య ఎవలిన్‌మేస్. వారికి నలుగురు సంతానం ఉన్నారు. రెండో భార్య విన్నీ. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమెతో విడిపోయారు. మూడో భార్య గ్రామాచెల్. ఆమె అంతకుముందు మొజాంబికన్ అధ్యక్షుడు సమోరామాచెల్ భార్య. సమోరా మరణం తర్వాత గ్రామాచెల్‌ను మండేలా వివాహమాడారు. రెండేళ్లుగా అనారోగ్యం పాలవటంతో మండేలా బయటకు కనిపించటం తగ్గిపోయింది. అయినప్పటికీ దక్షిణాఫ్రికా ప్రజలు, ప్రపంచ ప్రజల హృదయంలో ఆయనకు ప్రత్యేక స్థానం కొనసాగుతూనే ఉంది. మండేలా మృతి పట్ల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, భారత్, అమెరికా, బ్రిటన్, చైనా తదితర ప్రపంచ దేశాలు సంతాపం తెలిపాయి.
 
 ఆశయాలను కొనసాగిస్తాం: మండేలా సహచరుడు
 జోహాన్నెస్‌బర్గ్: మండేలా మృతిపై ఆయన దీర్ఘకాల సహచరుడు, జాతివివక్ష వ్యతిరేక కార్యకర్త అహ్మద్ కత్రాదా(85) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మండేలా  నిజాయితీ, ధైర్యసాహసాలు తనకు స్ఫూర్తినిచ్చాయని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఓ ప్రకటనలో నివాళి అర్పించారు. భారత సంతతికి చెందిన కత్రాదా 26 ఏళ్లు మండేలాతో కలసి జైలు శిక్ష అనుభవించారు. వీరిద్దరిది 67 ఏళ్ల స్నేహం. ఒకరినొకరు మదాలా(పెద్దాయన) అని పిలుచుకునేవారు.  
 
 భారత్‌తో అనుబంధం
* జోహాన్నెస్‌బర్గ్: మహాత్మాగాంధీ బాటలో నడిచిన మండేలాకు భారత్‌తో బలమైన అనుబంధముంది. గాంధీతో ఎన్నో పోలికలూ ఉన్నాయి. ఇద్దరూ జాతివివక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నో ఏళ్లు జైలుశిక్ష అనుభవించారు. అహింసాయుత రాజకీయ వ్యూహాలతో ఉద్యమాలను నడిపించారు.
     

* గాంధీ ప్రవచించిన సత్యం, అహింస బోధనలను మండేలా కొనియాడేవారు. మహాత్ముడే తన రాజకీయ గురువు అని, ఆయన శత్రువును సంస్కారపూరితంగా ఎదుర్కోవడం, దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలు తనకు స్ఫూర్తినిచ్చాయని అనేవారు.
     

* మండేలా పోరాటానికి, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు మద్దతిచ్చారు. ఢిల్లీలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కార్యాలయం ఏర్పాటులో ఇందిర  కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికాలో జాతివివక్షను నిర్మూలించేంతవరకు ఆ దేశాన్ని బహిష్కరిస్తామని జవహర్‌లాల్ నెహ్రూ 1946లోనే ప్రకటించారు.  
   

మండేలా 27 ఏళ్ల జైలు శిక్ష అనంతరం 1990లో విడుదలయ్యాక తొలిసారి పర్యటించిన విదేశం భారతే. 1995 నాటి పర్యటనలో ఆయన సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు.
     

* మండేలాకు నోబెల్ శాంతి బహుమతి రాకముందే 1990లోనే భారత్‌కు ఆయనకు అత్యున్నత పౌరపురస్కారమైన ‘భారతరత్న’ను ప్రకటించింది. 2001లో గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతిని ప్రదానం చేసింది.
     

* మండేలా హయాంలో దక్షిణాఫ్రికా, భారత్ సంబంధాలు బలపడ్డాయి. ఫలితంగా తర్వాత కాలంలో ఇరు దేశాలు ‘బ్రిక్స్’(బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా), ‘ఇబ్సా’(భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) వంటి అంతర్జాతీయ కూటముల ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement