భారత్‌లో 5 రోజుల సంతాప దినాలు
* మండేలా మృతికి నివాళిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతికి నివాళిగా కేంద్ర ప్రభుత్వం ఐదు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర కేబినెట్.. మండేలా మృతికి సంతాప తీర్మానం ఆమోదించినట్టు సమాచార శాఖ మంత్రి మనీష్ తివారీ తెలిపారు. మండేలా ఓ గొప్ప నాయకుడని, ఈ విషాద సమయంలో భారతజాతి మొత్తం దక్షిణాఫ్రికా ప్రజల వెన్నంటే ఉంటుందన్నారు. మరోవైపు భారత పార్లమెంటు మండేలాకు ఘనంగా నివాళులు అర్పించింది. శుక్రవారం ఉభయసభలూ ప్రారంభం కాగానే మండేలాకు నివాళులు అర్పించిన అనంతరం వాయిదా పడ్డాయి.
గొప్ప రాజనీతిజ్ఞుడు: ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రపతి
మండేలా ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రపంచ నేత. మానవజాతికి స్ఫూర్తి చిహ్నం. భారత్‌కు చాలా మంచి స్నేహితుడు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. మండేలా కుటుంబ సభ్యులకు భారత్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
పురుషుల్లో పుణ్యపురుషుడు: మన్మోహన్‌సింగ్, ప్రధాని
ఇక్కడ, అక్కడ.. ఇప్పుడు, అప్పుడు.. దేవుడు పురుషుల్లో పుణ్యపురుషులను సృష్టించాడు. మండేలా అలాంటి పుణ్యపురుషుడు. అంతేకాదు.. అణగారిన, అన్యాయానికి గురవుతున్న ప్రజలకు ఓ ఆశాకిరణం. జాతివివక్షకు వ్యతిరేకంగా అంకితభావంతో పోరాడిన గొప్ప నాయకుడు. ఆయన మృతి దక్షిణాఫ్రికాకే కాదు.. భారత్‌కు, ప్రపంచానికి కూడా తీరని లోటు.
ధైర్యానికి, త్యాగానికి ప్రతీక: సోనియాగాంధీ, యూపీఏ అధ్యక్షురాలు
ధైర్యానికి, త్యాగానికి, క్షమాగుణానికి మండేలా ప్రతీక. దక్షిణాఫ్రికా మహాత్మాగాంధీ వంటి ఆయన.. మొత్తం మానవజాతికి చెందిన మహా నాయకుడు. దక్షిణాఫ్రికా ప్రజలు ఆయన్ను అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకున్నా.. స్వచ్ఛందంగా పదవి వీడిన త్యాగశీలి. మండేలా మరణం ప్రియమైన తండ్రిని కోల్పోవడంలాంటిది.
మండేలా అడుగుజాడలు శాశ్వతం: సుష్మాస్వరాజ్, లోక్‌సభలో విపక్షనేత
మండేలా అడుగుజాడలు కాలగర్భంలో ఎన్నటికీ కలిసిపోవు. ఈ ప్రపంచంలోకి ఎందరో వ్యక్తులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ మండేలా మాత్రం శాశ్వతంగా నిలిచే ఉంటారు.
కలచి వేసింది: చంద్రబాబు నాయుడు, టీడీపీ అధ్యక్షుడు
మండేలా మరణం తీవ్రంగా కలచి వేసింది. మండేలా నుంచి స్ఫూర్తి పొందిన వారిలో నేనూ ఒకడిని. ప్రపంచవ్యాప్తంగా పీడనకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో పాల్గొనే వారికి ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు నిరంతరం స్ఫూర్తినిస్తాయి.
మహోన్నత మానవుడు: వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు
21వ శతాబ్దంలో మానవాళికి ప్రత్యక్షంగా తెలిసిన మహోన్నత మానవుడు నెల్సన్ మండేలా. జాతుల మధ్య వైరానికి స్వస్తి పలికి దక్షిణాఫ్రికా చరిత్రలో మాత్రమే కాకుండా మొత్తం మానవజాతిలోనే నలుపు-తెలుపు అన్న వర్ణ వివక్షను రూపుమాపి మానవులంతా ఒకటేనని మండేలా చాటారు.